Irrigation water supply
-
అవసరాలకే కేటాయించాలి.. అత్యాశకు కాదు!
సాక్షి, హైదరాబాద్: అవసరాలు తీర్చడానికి నీళ్లు కేటాయించాలి కానీ అత్యాశ తీర్చడానికి కాదని తెలంగాణ పేర్కొంది. ఏపీలో కృష్ణా పరీవాహకం పరిధిలోని ప్రాంతాలకు సాగునీటి సరఫరాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే తెలంగాణ పరీవాహకం పరిధిలోని ప్రాంతాలు కనీసం ఒక ఆరుతడి పంటకు సైతం సాగునీటికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. రైతులు నీళ్లు లభించక గోస పడుతున్నారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఏపీలోని పరీవాహకం వెలుపలి ప్రాంతాలు కృష్ణా నీళ్లు వాడుకోవడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుపుతున్న జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట.. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ బుధవారం వాదనలు వినించారు. శాస్త్రీయ విధానంలో విశ్లేషించాలి కృష్ణా నదీ పరీవాహకం వెలుపలి ప్రాంతాలకు ఏపీ 323 టీఎంసీల కృష్ణా నికర జలాలను తరలించుకుంటోందని వైద్యనాథన్ ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఏపీలోని పరీవాహకం వెలుపలి ప్రాంతాలకు పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీలు, చింతలపుడి ఎత్తిపోతల ద్వారా 27 టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుని అవసరాలు తీర్చుకోవడానికి అవకాశముందని తెలిపారు. ఏపీ కృష్ణా జలాలను తరలిస్తున్న ఇతర నదుల పరీవాహక ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న నీటి లభ్యతను వివరించారు. పెన్నా పరీవాహకంలో 75 శాతం లభ్యత ఆధారంగా 98 టీఎంసీలు, సగటు లభ్యత ఆధారంగా 195 టీఎంసీల లభ్యత ఉందని తెలిపారు. గుండ్లకమ్మ వంటి నదుల కింద సైతం నీటి లభ్యత ఉందన్నారు. సమర్థ నీటి వినియోగాన్ని శాస్త్రీయ విధానంలో విశ్లేషిస్తే నీటి అవసరాలు తగ్గుతాయని, దీంతో మిగిలే జలాలను పరీవాహక ప్రాంతం లోపలి ప్రాజెక్టులకు కేటాయించాలని సూచించారు. గ్రావిటీ ద్వారా నీళ్లొచ్చే అవకాశం పోయింది.. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నిర్మించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల కింద రాష్ట్రంలో సాగునీరు సరఫరా చేస్తున్న, సరఫరా చేసేందుకు ప్రతిపాదించిన ప్రాంతాలకు.. వాస్తవానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్, కృష్ణా ప్రాజెక్టు కాల్వలు, భీమా ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. 1956లో తెలంగాణ, ఆంధ్రను కలిపి ఉమ్మడి ఏపీగా ఏర్పాటు చేయడంతో రాష్ట్ర సరిహద్దులు మారిపోవడంతో గ్రావిటీ ద్వారా నీళ్లను పొందే అవకాశాన్ని తాము కోల్పోయామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు జరపాలి రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల కింద నీటి వినియోగం చాలా తక్కువ అని, నిర్మాణంలోని ప్రాజెక్టులకు జరిపే నికర జలాల కేటాయింపులతో కృష్ణా పరీవాహకంలోని 25 లక్షల కుటుంబాలకు చెందిన 80 లక్షల మందికి జీవోనోపాధి లభించనుందని వైద్య నాథన్ ట్రిబ్యునల్‌కు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1956 తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాజధాని ప్రాంత అభివృద్ధితో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కింద తగ్గిన నీటి వినియోగాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఏపీలోని వాగుల ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్‌కు సరఫరా అవుతున్న 75 టీఎంసీల జలాలను లెక్కించలేదని, వాటిని సైతం లెక్కించాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాలను న్యాయోచితంగా వాడుకోవాలని పేర్కొంటున్న జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాలను వైద్యనాథన్ వివరించారు. గురువారం ఏపీ వాదనలు వినిపించనుండగా, శుక్రవారం రెండు రాష్ట్రాలు ప్రతివాదనలు వినిపించనున్నాయి. -
చివరి ఆయకట్టుకూ నీరందాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్, నిజాంసాగర్ల కింద ప్రస్తుత యాసంగిలో చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరాను క్రమబద్ధం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం జలసౌధలో ఈ మూడు ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగు నీటి సరఫరాపై మంత్రి సమీక్షించారు. కాల్వల వెంట చీఫ్ ఇంజనీర్ సహా ఇతర సిబ్బంది నిరంతరం తిరగాలని, సాగు నీటి సరఫరా తీరును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ల సహకారంతో పాటు రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చుక్క నీరు వృథా కాకుండా, అత్యంత పొదుపుగా వాడాలని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లదే బాధ్యత.. సాగునీటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లదే బాధ్యత అని, వారిపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడబోదని హరీశ్ హెచ్చరించారు. నీటిని వదిలినప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాత్రింబవళ్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో యాసంగి ఆయకట్టును కాపాడాల్సి ఉందని, ప్రధాన కాలువలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగు నీటిని సరఫరా చేస్తున్నందున దిగువనున్న రైతులకు నీరందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమీక్షలో ఈఎన్సీ మురళీధరరావు, సీఈలు శంకర్, సునీల్, మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు. -
‘గొలుసుకట్టు’.. తీసికట్టు
ఏలూరు:సాగునీటి సరఫరాకు కీలకమైన గొలుసుకట్టు చెరువుల పరిస్థితి జిల్లాలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వాల పట్టింపులేమి.. నిధుల కొరతతో చెరువులు కబ్జాకోరల్లో చిక్కిశల్యమవుతున్నాయి. వాటి అభివృద్ధికి పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడంతో ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల అనుచరులు ఈ చెరువులను పూడ్చేసి యధేచ్ఛగా పంటలు సాగుచేస్తూ కాసుల వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. చింతలపూడి నియోజకవర్గంలోనే దాదాపుగా 500కు పైగా చెరువులున్నట్టు అంచనా. రాఘవాపురంలోని 90 ఎకరాలున్న చెరువు సగంపైనే ఆక్రమణలకు గుైరైంది. ఇందులో వరి సాగు చేస్తున్నారు. సాధారణంగా చెరువుల్లో నీటిని నిల్వ ఉంచడం వల్ల భూగర్భజలాలు వృద్ధి చెందుతారుు. దానికి భిన్నంగా చెరువులలో నీరు లేకుండా చేయడం వల్ల మెట్ట మండలాల్లో చాలాచోట్ల 300 అడుగుల లోతుకు తవ్వితేగాని నీటి చుక్క పడని దుస్థితి నెలకొంది. ఈ కారణంగా కూడా ఇక్కడ బోర్ల మంజూరుపై నిషేధం అమలవుతోంది. 60 శాతం బక్కచిక్కిన చెరువులే జిల్లాలో 1406 మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి. వీటి కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక గ్రామంలోని చెరువులతో పాటు పక్క గ్రామంలోని చెరువులకు నీటి సరఫరాను అనుసంధానం చేసే వాటినే గొలుసుకట్టు చెరువులంటారు. గ్రామాల్లో ఉన్న పంటకాల్వల నుంచి పారే నీటిని నిల్వ చేసుకునేందుకు ఇవి ఉపయుక్తంగా ఉండాల్సి ఉంది. జిల్లాలో దాదాపుగా 60 శాతానికి పైగా చెరువులు ఆక్రమణలకు గురై ఎందుకూ పనికిరాకుండా ఉన్నాయి. వీటిని ప్రతి ఏటా పూడికలు తీయించాల్సినా అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెరువులను పూడికతీయడానికి అవకాశం ఉన్నా డ్వామా అధికారులు వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. పైపైనే ఈ పనులు చేయించడం వల్ల పనివారికి కూలీ ఇవ్వడం తప్ప చెరువులకు మాత్రం మోక్షం కలగ లేదు. ఉపాధి హామీ పనుల్లో ఏడేళ్లుగా జిల్లాలో బాగు చేసిన చెరువులను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఆదుకోని వాటర్ కన్జర్వేషన్ మిషన్ టీడీపీ సర్కార్ కొలువుతీరిన వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెరువుల స్థితిగతులపై సర్వే చేపట్టారు. వాటర్ కన్జర్వేషన్ మిషన్ కింద 1406 చెరువులను అభివృద్ధి చేయడానికి రూ.160 కోట్ల వ్యయంతో కూడిన ప్రతిపాదనలను ఇరిగేషన్ అధికారులు పంపారు. దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు. కాంగ్రెస్ హయాంలో అప్పటి చిన్ననీటి పారుదలశాఖ మంత్రి మాగంటి బాబు ఆధ్వర్యంలో 500 చెరువులను అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువుల అభివృద్ధికి ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయాలి మెట్టలో చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. చెరువుల్లోనే సాగు చేస్తున్నారు. చెరువు ఆక్రమణలకు అధికారుల అండదండలున్నాయి. అధికారులు చిత్తశుధ్ధితో వ్యవహరించి ఆక్రమణలను తొలగించాలి. చెరువులలో పూడిక తీయించాలి. - బోడ వజ్రం, రాఘవాపురం, చింతలపూడి మండలం.