
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్, నిజాంసాగర్‌ల కింద ప్రస్తుత యాసంగిలో చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరాను క్రమబద్ధం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం జలసౌధలో ఈ మూడు ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగు నీటి సరఫరాపై మంత్రి సమీక్షించారు. కాల్వల వెంట చీఫ్ ఇంజనీర్ సహా ఇతర సిబ్బంది నిరంతరం తిరగాలని, సాగు నీటి సరఫరా తీరును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ల సహకారంతో పాటు రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చుక్క నీరు వృథా కాకుండా, అత్యంత పొదుపుగా వాడాలని చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లదే బాధ్యత..
సాగునీటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లదే బాధ్యత అని, వారిపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడబోదని హరీశ్ హెచ్చరించారు. నీటిని వదిలినప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాత్రింబవళ్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో యాసంగి ఆయకట్టును కాపాడాల్సి ఉందని, ప్రధాన కాలువలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగు నీటిని సరఫరా చేస్తున్నందున దిగువనున్న రైతులకు నీరందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమీక్షలో ఈఎన్‌సీ మురళీధరరావు, సీఈలు శంకర్, సునీల్, మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment