
‘గొలుసుకట్టు’.. తీసికట్టు
ఏలూరు:సాగునీటి సరఫరాకు కీలకమైన గొలుసుకట్టు చెరువుల పరిస్థితి జిల్లాలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వాల పట్టింపులేమి.. నిధుల కొరతతో చెరువులు కబ్జాకోరల్లో చిక్కిశల్యమవుతున్నాయి. వాటి అభివృద్ధికి పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడంతో ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల అనుచరులు ఈ చెరువులను పూడ్చేసి యధేచ్ఛగా పంటలు సాగుచేస్తూ కాసుల వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. చింతలపూడి నియోజకవర్గంలోనే దాదాపుగా 500కు పైగా చెరువులున్నట్టు అంచనా. రాఘవాపురంలోని 90 ఎకరాలున్న చెరువు సగంపైనే ఆక్రమణలకు గుైరైంది. ఇందులో వరి సాగు చేస్తున్నారు. సాధారణంగా చెరువుల్లో నీటిని నిల్వ ఉంచడం వల్ల భూగర్భజలాలు వృద్ధి చెందుతారుు. దానికి భిన్నంగా చెరువులలో నీరు లేకుండా చేయడం వల్ల మెట్ట మండలాల్లో చాలాచోట్ల 300 అడుగుల లోతుకు తవ్వితేగాని నీటి చుక్క పడని దుస్థితి నెలకొంది. ఈ కారణంగా కూడా ఇక్కడ బోర్ల మంజూరుపై నిషేధం అమలవుతోంది.
60 శాతం బక్కచిక్కిన చెరువులే
జిల్లాలో 1406 మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి. వీటి కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక గ్రామంలోని చెరువులతో పాటు పక్క గ్రామంలోని చెరువులకు నీటి సరఫరాను అనుసంధానం చేసే వాటినే గొలుసుకట్టు చెరువులంటారు. గ్రామాల్లో ఉన్న పంటకాల్వల నుంచి పారే నీటిని నిల్వ చేసుకునేందుకు ఇవి ఉపయుక్తంగా ఉండాల్సి ఉంది. జిల్లాలో దాదాపుగా 60 శాతానికి పైగా చెరువులు ఆక్రమణలకు గురై ఎందుకూ పనికిరాకుండా ఉన్నాయి. వీటిని ప్రతి ఏటా పూడికలు తీయించాల్సినా అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెరువులను పూడికతీయడానికి అవకాశం ఉన్నా డ్వామా అధికారులు వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. పైపైనే ఈ పనులు చేయించడం వల్ల పనివారికి కూలీ ఇవ్వడం తప్ప చెరువులకు మాత్రం మోక్షం కలగ లేదు. ఉపాధి హామీ పనుల్లో ఏడేళ్లుగా జిల్లాలో బాగు చేసిన చెరువులను వేళ్లపై లెక్కపెట్టవచ్చు.
ఆదుకోని వాటర్ కన్జర్వేషన్ మిషన్
టీడీపీ సర్కార్ కొలువుతీరిన వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెరువుల స్థితిగతులపై సర్వే చేపట్టారు. వాటర్ కన్జర్వేషన్ మిషన్ కింద 1406 చెరువులను అభివృద్ధి చేయడానికి రూ.160 కోట్ల వ్యయంతో కూడిన ప్రతిపాదనలను ఇరిగేషన్ అధికారులు పంపారు. దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు. కాంగ్రెస్ హయాంలో అప్పటి చిన్ననీటి పారుదలశాఖ మంత్రి మాగంటి బాబు ఆధ్వర్యంలో 500 చెరువులను అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువుల అభివృద్ధికి ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నిధులు రాలేదు.
ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయాలి
మెట్టలో చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. చెరువుల్లోనే సాగు చేస్తున్నారు. చెరువు ఆక్రమణలకు అధికారుల అండదండలున్నాయి. అధికారులు చిత్తశుధ్ధితో వ్యవహరించి ఆక్రమణలను తొలగించాలి. చెరువులలో పూడిక తీయించాలి.
- బోడ వజ్రం,
రాఘవాపురం, చింతలపూడి మండలం.