TS: స్వరాష్ట్రంలోనే అన్యాయం! | Uttam Kumar Reddy Comments On BRS Govt About Krishna Water | Sakshi
Sakshi News home page

తెలంగాణ: స్వరాష్ట్రంలోనే అన్యాయం!

Published Tue, Feb 13 2024 1:00 AM | Last Updated on Tue, Feb 13 2024 6:44 AM

Uttam Kumar Reddy Comments On BRS Govt About Krishna Water - Sakshi

కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ ప్రజెంటేషన్‌.. దానిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదంతో సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది. కృష్ణా నీటిని ఏపీ సీఎం జగన్‌ ఆ రాష్ట్రానికి తరలించుకుపోతుంటే కేసీఆర్‌ సహకరించారని అంటూ అధికారపక్షం విమర్శలు గుప్పించగా.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్‌ సర్కారు ప్రయత్నిస్తోందని, ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై ఆరోపణలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ దీటుగా ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్‌ సర్కారు తీరును వివరించేందుకు తాము నల్లగొండలో బహిరంగ సభ చేపడితే.. దృష్టి మళ్లించేందుకు సభలో తీర్మానం పెట్టారని మండిపడింది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పాపాల భైరవుడు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్‌ను కొడతారంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలపడంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్‌ ప్రకటించారు. 

సాక్షి, హైదరాబాద్‌:  నదీ జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాకే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. జలాల్లో ఏపీకి ఎక్కువ వాటా ఇచ్చినా, ఆ రాష్ట్రం భారీగా తరలించుకుపోతున్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్‌ సర్కారు కుమ్మక్కైందని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించినది గత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఉత్తమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీపీ) ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నం చేసినా.. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ జోక్యం చేసుకొని మంత్రిని మాట్లాడనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘2020లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 92,500 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోవడానికి ఏపీలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 203 తెచ్చినా కేసీఆర్‌ సర్కార్‌ అడ్డుకోలేదు. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. కృష్ణా నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినా పట్టించుకోలేదు. పోతిరెడ్డిపాడు ద్వారా 1983లో 11,150 క్యూసెక్కుల నీరు తరలిస్తే.. 2005లో వైఎస్సార్‌ ప్రభుత్వం దానిని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచింది. జగన్‌ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 92,500 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు ద్వారా 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలను తీసుకెళ్తే.. 2014 నుంచి 2024 వరకు ఏకంగా 1,201 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయింది. 

ఏనాడూ అభ్యంతరం తెలపలేదు 
2014లో కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాల్లో నీటి వాటాను తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా నిర్ణయిస్తే.. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి 299 టీఎంసీలకు ఒప్పుకొని.. కృష్ణా జలాల్లో తెలంగాణకు శాశ్వత నష్టం చేకూర్చారు. 2015 నుంచి 2023 వరకు ఏటా ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్, హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలేమీ తెలపలేదు. అప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల కోసం 299 టీఎంసీలకు ఒప్పుకొన్నవాళ్లు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన 225 టీఎంసీల గురించి గానీ, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన 206 టీఎంసీల గురించి గానీ ఏనాడూ అడగలేదు. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డిలకు అవసరమైన నీటి గురించి కేంద్రాన్ని నిలదీయలేదు.  

అపెక్స్‌ కమిటీ సమావేశంలో కేసీఆర్‌ సైతం.. 
2016 సెపె్టంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన తొలి అపెక్స్‌ కమిటీ సమావేశానికి అధికారులతో పాటు అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు హాజరయ్యారు. అప్పుడు కూడా కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొని వచ్చారు. నీటి వాటాలపై ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చేదాకా పాత ఒప్పందమే కొనసాగించాలంటూ రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో కూడా కేసీఆర్‌ అంగీకరించడం రాష్ట్రానికి తీరని ద్రోహమే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతి, అన్యాయం స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇంతా చేసి తెలంగాణ ప్రజానీకంలో అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వాస్తవాలతో ప్రజెంటేషన్‌ ఇస్తున్నాం. కృష్ణానీటి వాటాలో అన్యాయంపై మేం పోరాడుతాం. 

ఏపీ ప్రయోజనం కలిగేలా చేశారు 
ఏపీ సీఎం జగన్, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ గంటల కొద్దీ ఏకాంత చర్చలు చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ముగిసేదాకా కేసీఆర్‌ అపెక్స్‌ కమిటీ సమావేశానికి హాజరుకాకుండా ఏపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారు. కేసీఆర్‌ తెలంగాణ నీళ్లను ఏపీకి ఇస్తున్నారంటూ జగన్‌ ఆ రాష్ట్ర అసెంబ్లీలో పొగడటం నిజం కాదా? అసెంబ్లీ ఎన్నికల చివరిరోజున నాగార్జునసాగర్‌ను ఏపీ ప్రభుత్వం అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక రాజకీయం లేదా? కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని తరలించుకోవడం వాస్తవం కాదా? ఈ ఘటనపై కేసీఆర్‌ ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కృష్ణాబోర్డుకు నాగార్జునసాగర్‌ను అప్పగించేందుకు సిద్ధమన్న రీతిలో అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ కేంద్రానికి లేఖ రాయడం మరింత నష్టం కలిగించింది. మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకమని కేంద్రానికి స్పష్టం చేశాం. ఇందుకు సంబంధించిన సమావేశం మినిట్స్‌ మార్చాలని కోరాం. అయినా ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదు..’’ అని ఉత్తమ్‌ పేర్కొన్నారు. 
 
కేసీఆర్‌ సభకు వస్తే.. తేలుస్తాం: రేవంత్‌రెడ్డి 
పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్‌ అని.. కృష్ణా నదిజలాలపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే ఆయన సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ చర్చలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులకు, వారి మాటలకూ ఏమాత్రం విలువ లేదు. గత పదేళ్ల పాపాలకు కేసీఆరే బాధ్యుడు. ఆ పాపాల భైరవుడు సభలోకి వచ్చి చర్చ చేస్తే మేం సమాధానం చెప్తాం. బీఆర్‌ఎస్‌ అధినేత ఇక్కడికొచ్చి మాట్లాడాలి. ఆయనకు ఎంతసేపైనా మైక్‌ ఇచ్చేందుకు సిద్ధం. తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో తేలుస్తాం..’’ అని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. 
 
కేసీఆర్‌ క్షమాపణ చెప్పాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
గత ఎన్నికల్లో కేసీఆర్‌కు నల్గొండ జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చెప్పుతో కొట్టినట్టుగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కనీసం మంచినీళ్లు కూడా అందని విధంగా నాశనం చేశారని ఆరోపించారు. ఇంత అన్యాయం చేసిన కేసీఆర్‌ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకురాసి తప్పు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. 
 
కోవర్టులున్నారు.. సాగనంపుతాం: భట్టి 

ఉత్తమ్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్న సమయంలో హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. కృష్ణా జలాలపై అప్పటి ఈఎన్సీ మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈఎన్సీ బీఆర్‌ఎస్‌ వ్యక్తిగా పనిచేశారని, అందుకే సాగనంపామని పేర్కొన్నారు. ఇలాంటి కోవర్టులు ఇంకా ఉన్నారని, వారిని కూడా పంపేస్తామని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement