కేంద్రమే తేల్చాలి | krishna river water dispute in centre court | Sakshi
Sakshi News home page

కేంద్రమే తేల్చాలి

Published Sat, Jan 31 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

కేంద్రమే తేల్చాలి

కేంద్రమే తేల్చాలి

కృష్ణా నీటి వివాదంపై చేతులెత్తేసిన బోర్డు

సాక్షి, హైదరాబాద్: కృష్టా నీటి కేటాయింపుల వివాదం కేంద్రం కోర్టులోకి వెళ్లింది. దీనిపై కేంద్రంలో తేలేవరకు తామేమీ చేయలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. ఈ వివాదాన్ని తేల్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విఫలమైనందున ఈ అంశాన్ని కేంద్రం తేల్చిన తర్వాతే బోర్డు సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోని క్లాజ్-15 ప్రకారం ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి విన్నవించామని, కేంద్రం స్పందించే వరకు బోర్డు భేటీ వల్ల ప్రయోజనం ఉండదని లేఖలో అభిప్రాయపడింది. ఈమేరకు బోర్డు కార్యదర్శి ఆర్.కె.గుప్తా రెండు రాష్ట్రాలకు లేఖలు రాశారు.

లేఖలో క్లాజ్-15 గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ క్లాజ్‌కు న్యాయపరమైన భాష్యం(లీగల్ ఇంటర్‌ప్రిటేషన్) తెలియజేయాలంటూ రెండు రాష్ట్రాలకు గతంలో బోర్డు లేఖలు రాసినా సమాధానం రాలేదని వివరించారు. కేటాయింపులకు మించి నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీరు విడుదల చేశామని, బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి కేటాయింపుల విధానాన్ని తేల్చే వరకు కుడి కాల్వకు నీటి విడుదల నిలిపివేస్తామంటూ తెలంగాణ రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని గుప్తా స్పష్టం చేశారు.

కాగా, ఈ వివాదంపై ఇప్పటికే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరిన తెలంగాణ ప్రభుత్వం.. అక్కడి నుంచి వచ్చే స్పందన కోసం వేచిచూస్తోంది. ఒకట్రెండు రోజుల్లో న్యాయసలహా అందుతుందని, ఆ వెంటనే తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది.

క్లాజ్-15లో ఏముందంటే..
నీటి అవసరాలను సమీక్షించి కేటాయింపుల మేరకు ఆయా సంవత్సరాల్లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యతను కృష్ణా వ్యాలీ అథారిటీకి అప్పగించినట్లు బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-15 చెబుతోంది. నీటి అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షించి.. అవసరమైన ఆదేశాలను కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలకు ఇవ్వడానికి అథారిటీకి అధికారం ఉంది. ప్రస్తుతం కృష్ణా వ్యాలీ అథారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య తలెత్తిన విభేదాలను క్లాజ్-15 ప్రకారం కేంద్రమే పరిష్కరించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది.

‘‘కేటాయింపుల మేరకు కృష్ణా బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు నీరు అందతున్న తీరును కృష్ణా వ్యాలీ అథారిటీ ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వాటర్ ఇయర్‌లో దిగువ రాష్ట్రాలకు కేటాయింపుల మేరకు నీరందని పక్షంలో.. ఎగవ రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని అథారిటీ ఆదేశాలు జారీ చేయాలి. కరువు పరిస్థితులు ఉండి దిగువ రాష్ట్రానికి అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప.. జూలై నుంచి సెప్టెంబర్ ఆఖరు వరకు నీటి విడుదలకు ఎగువ రాష్ట్రాలను ఆదేశించకూడదు’’ అని క్లాజ్-15 పేర్కొంటోంది.

లేఖలో కృష్ణా బోర్డు పేర్కొన్న అంశాలు
# సాగర్ కుడి కాల్వ కింద ఏపీకి ఉన్న 132 టీఎంసీల నీటిని ఇప్పటికే విడుదల చేశామని, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి అనుసరించాల్సిన విధానం తేలే వరకు ఇకపై కుడి కాల్వకు నీరివ్వడం సాధ్యం కాదని బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.

# ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కున్న కేటాయింపులను రెండు రాష్ట్రాల మధ్య విభజించడం.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-15కు సంబంధించిన అంశం. ఈ విషయం గురించి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలతో బోర్డు పలుమార్లు చర్చించింది. క్లాజ్-15పై వివరణ(లీగల్ ఇంటర్‌ప్రిటేషన్) ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు సూచించినా సమాధానం లేదు.

# ఇరు రాష్ట్రాలు క్లాజ్-15 మీద స్పందించని నేపథ్యంలో.. ఈ అంశం మీద స్పష్టత ఇవ్వాలని కేంద్ర జల వనరుల శాఖకు విజ్ఞప్తి చే శాం. కేంద్రం ఇచ్చే స్పష్టతపై ఆధారపడే నీటి విడుదలను నియంత్రించే అంశం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత నీటి సంవత్సరం(వాటర్ ఇయర్)లో బోర్డు తన విధులను నిర్వర్తించడానికి కేంద్రం ఇచ్చే వివరణ అత్యంత ముఖ్యమైన అంశంగా బోర్డు భావిస్తోంది.

# రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీల సమావేశం ఎలాంటి పరిష్కారం ఇవ్వలేకపోయింది. బోర్డులో వారే సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు బోర్డు భేటీ నిర్వహించినా నిర్మాణాత్మక పరిష్కారం లభిస్తుందనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో క్లాజ్-15 మీద కేంద్రం స్పష్టత ఇచ్చిన తర్వాతే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement