గద్వాల, న్యూస్‌లైన్: బచావత్ ట్రిబ్యునల్ అవార్డుతో ఏర్పాటైన తుంగభద్ర బోర్డును త్వరలోనే రద్దుచేసి కృష్ణానదీ జలాల పంపిణీ, కేటాయింపుల పర్యవేక్షణకు కృష్ణా వాటర్ అథారిటీ కార్యాలయాలను కర్ణాటకలోని ఆల్మట్టి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో కృష్ణానదీ జలాల సమస్యలను పరిష్కరించేందుకు, నీటి కేటాయింపులను పర్యవేక్షించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆల్మట్టి వద్ద, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేస్తారు.
అక్కడ వీలుకాని పక్షంలో శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని ఈగలపెంట వద్ద ఈ కార్యాలయాలను వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 1966లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల సమస్య పరిష్కారానికి కేటాయింపులను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు జడ్జి బచావత్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. ఆ తీర్పు మేరకు మూడు రాష్ట్రాలకు నదీ జలాలను పంపిణీ చేయడంతోపాటు, రెండు రాష్ట్రాల పరిధిలో సాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టు నీటి విడుదలను పర్యవేక్షించేందుకు తుంగభద్ర ప్రాజెక్టు వద్ద బోర్డును ఏర్పాటుచేశారు. 1970లో ఏర్పాటైన ఈ బోర్డులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అధికారులు సభ్యులుగా ఉన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కాలం 2000 సంవత్సరంతో ముగియడంతో, కేంద్రం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ గతేడాది నదీజలాల వివాదాన్ని పరిష్కరిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పులో కృష్ణా వాటర్ అథారిటీ కార్యాలయాల ఏర్పాటు ఉంది. కృష్ణానది నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఆల్మట్టి, గద్వాల వద్ద అథారిటీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తుంగభద్ర బోర్డు అధికారుల ద్వారా తెలిసింది.
త్వరలో తుంగభద్ర బోర్డు రద్దు
Published Sun, Mar 2 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
Advertisement
Advertisement