Tungabhadra Board
-
తుంగభద్ర డ్యాం గేట్ల మార్పునకు ఓకే
సాక్షి, అమరావతి//సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలన్న తుంగభద్ర బోర్డు ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అధికారులు అంగీకరించారు. డ్యాం భద్రత దృష్ట్యా గేట్ల ఎత్తును పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కానీ, గేట్ల ఎత్తు పెంచడంవల్ల డ్యాం నిల్వ సామర్థ్యం పెరగకుండా చూడాలని తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదనకు బోర్డు అంగీకరించింది. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర బోర్డు కార్యాలయంలో శుక్రవారం 222వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున అనంతపురం సీఈ నాగరాజు, కర్ణాటక అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇటీవల వరదలకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యాం భద్రతపై నిపుణుల కమిటీతో బోర్డు తనిఖీ చేయించింది. గేట్ల కాల పరిమితి ముగిసిందని.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని నిపుణుల కమిటీ ఇచి్చన నివేదికను బోర్డు సమావేశంలో సభ్య కార్యదర్శి ఓఆర్కే రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిని మూడు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. దశల వారీగా గేట్లను మార్చాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయంతోనే నమలి రిజర్వాయర్.. ఇక పూడికవల్ల తుంగభద్ర డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పూర్తిస్థాయిలో వాడుకోవడానికి నవలి వద్ద 30 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని కర్ణాటక సర్కారు చేసిన ప్రతిపాదనను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. మూడు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తేనే నవలి రిజర్వాయర్ నిర్మాణంపై చర్చిద్దామని బోర్డు చైర్మన్ రాయ్‌పురే స్పష్టంచేశారు. పూడికవల్ల డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వి, హెచ్చెల్సీ వాటా జలాలను తీసుకెళ్తామని.. డ్యాంలో నిల్వ ఉన్న నీటిని మిగతా ఆయకట్టుకు సరఫరా చేయడం ద్వారా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను వాడుకోవచ్చని ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్సీ వ్యతిరేకించారు. డ్యాంలో పూడికతీతకు కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ విధానాన్ని అమలుచేయాలని సూచించారు. పూడిక తీయడం ద్వారా తుంగభద్ర డ్యాం నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రతిపాదించారు. తుంగభద్రలో నీటి లభ్యత లేనప్పుడు కేసీ కెనాల్ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి కృష్ణా జలాలను వాడుకోవడానికి అనుమతివ్వాలన్న ఏపీ అధికారుల ప్రతిపాదనపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. -
‘తుంగభద్ర’ సామర్థ్యంపై కర్ణాటకాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్ వేదికగా కర్ణాటక సరికొత్త నాటకానికి తెరలేపింది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదు.. 105.78 టీఎంసీలని తుంగభద్ర బోర్డు 218వ సర్వసభ్య సమావేశంలో అంగీకరించిన కర్ణాటక 219వ సమావేశంలో అడ్డంతిరిగింది. డ్యామ్ నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు ఉండదని.. అంతకంటే తక్కువే ఉంటుందని.. మళ్లీ హైడ్రోగ్రాఫిక్ సర్వేచేసి, తేల్చాలని పట్టుబట్టింది. పూడికవల్ల డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గిందనే సాకుచూపి.. జలవిస్తరణ ప్రాంతంలో చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాలను చేపట్టి కర్ణాటక యథేచ్ఛగా జలచౌర్యానికి పాల్పడుతుండటంపై బోర్డును ఏపీ ప్రభుత్వం నిలదీసింది. దీనిపై సంయుక్త సర్వేచేసిన బోర్డు.. కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోందని తేల్చడంతో కర్ణాటకానికి చెక్‌పడింది. దీంతో డ్యామ్ నీటినిల్వ సామర్థ్యంపై ఆ రాష్ట్రం పాత పల్లవి అందుకుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. పూడికతో 33 టీఎంసీలు తగ్గిన నిల్వ కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్‌ను 1952లో 133 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పట్లో ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. దీని నిల్వ సామర్థ్యం, ఏడాదిలో వచ్చే ప్రవాహాల ఆధారంగా అక్కడ 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం–ఆర్డీఎస్) టీఎంసీల చొప్పున కేటాయించింది. పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలుగా 2008లో నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో.. నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని పంపిణీ చేస్తోంది. 133 నుంచి 105.78 టీఎంసీలకు.. తుంగభద్ర డ్యామ్‌లో నీటినిల్వ సామర్థ్యంపై ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థతో తుంగభద్ర బోర్డు 2016లో టోపోగ్రాఫికల్ సర్వేను చేయించింది. అందులో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. ఆ సర్వేను కర్ణాటక అంగీకరించకపోవడంతో ఈ అంశంపై మూడు రాష్ట్రాల అధికారులతో జాయింట్ సర్వేను ఈ ఏడాది బోర్డు చేయించింది. ఇందులో డ్యామ్ నిల్వసామర్థ్యం 105.78 టీఎంసీలుగా తేలింది. ఈ క్రమంలోనే చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాల ద్వారా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతుండటం బయటపడింది. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తిచూపడంతో గత బోర్డు సమావేశంలో డ్యామ్ నీటి సామర్థ్యాన్ని 105.78 టీఎంసీలుగా కర్ణాటక అంగీకరించింది. 2022–23లో దాన్నే పరిగణలోకి తీసుకున్న బోర్డు.. ఆ నీటిని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. -
నవలి రిజర్వాయర్ మళ్లీ తెరపైకి..
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌లో పూడికవల్ల తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు.. డ్యామ్‌కు ఎగువన నవలి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని తుంగభద్ర బోర్డుకు మరోసారి కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. నవలి రిజర్వాయర్‌ను నిర్మిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ, కర్ణాటక సర్కార్ మళ్లీ చేసిన ఆ రిజర్వాయర్ ప్రతిపాదనపై హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించనున్న 219వ సర్వసభ్య సమావేశంలో చర్చించాలని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే నిర్ణయించారు. కొత్త నీటి సంవత్సరం (2023–24)లో తుంగభద్ర డ్యామ్‌లో నీటి పంపిణీ ప్రధాన అజెండాగా తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. రాయ్‌పురే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణల ఈఎన్సీలు సి. నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొననున్నారు. దామాషా పద్ధతిలో నీటి పంపిణీ.. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్‌ను 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1953లో నిర్మించారు. డ్యామ్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఆంధ్రప్రదేశ్‌కు 72, తెలంగాణకు 6.51 టీఎంసీలను కేటాయించింది. పూడిక పేరుకుపోవడంవల్ల డ్యామ్‌లో నీటినిల్వ 105.78 టీఎంసీలకు తగ్గింది. దాంతో నీటి లభ్యత కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో డ్యామ్‌లో నీటి లభ్యత ఆధారంగా మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో జలాలను తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటా జలాలను వాడుకోవడం పేరుతో.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంవల్ల మూడు రాష్ట్రాలు ఏటా సగటున 167–175 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కార్ చెబుతోంది. పూడిక తీయడానికి రూ.12,500 కోట్లు వ్యయమవుతుందని లెక్కలువేస్తోంది. దీనికి బదులు తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన నది నుంచి వరద కాలువ తవ్వి నవలి వద్ద కొత్తగా 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని చెబుతోంది. దీంతోపాటు విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 4.52 టీఎంసీలకు, శివపుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరిస్తామని.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వఉన్న నీటితో మిగతా వాటా జలాలను వాడుకోవచ్చునని కర్ణాటక ప్రతిపాదిస్తోంది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.9,500 కోట్ల వ్యయం అవుతుందని.. దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలు భరించాలని తుంగభద్ర బోర్డు సమావేశాల్లో కోరుతూ వస్తోంది. వ్యతిరేకిస్తున్న రెండు రాష్ట్రాలు.. నవలి రిజర్వాయర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. అప్పర్ భద్ర, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే కేటాయించిన నీటికంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. నవలి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేస్తున్నాయి. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వి.. వరద రోజుల్లో వాటా (32.5 టీఎంసీలు) తరలిస్తామని.. డ్యామ్‌లో నిల్వ నీటిని మూడు రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో వాటా జలాలను వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. -
ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయించండి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న వాటా నీటిని వినియోగించుకునేలా ఆర్డీఎస్ కాల్వల ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తి చేయించాలని తెలంగాణ తుంగభద్ర బోర్డును కోరింది. తుంగభద్రలో రాష్ట్రా నికి 15.90 టీఎంసీల మేర నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ 5 టీఎంసీలకు మించి రావ డం లేదని దృష్టికి తెచ్చింది. ఈ మేరకు మంగళవారం ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు. 2020–21 ఏడాదిలో ఆర్డీఎస్కు తుంగభద్ర నుంచి 5.15 టీఎంసీల మేర నీరు కేటా యించినా తెలంగాణకు కేవలం 1.18 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని తెలిపింది. ఈ దృష్ట్యా నిర్దిష్ట వాటా మేరకు నీటి వాటాలు దక్కేలా ఆధునికీకరణపనులు చేయించాలని కోరింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం అటు తుంగభద్ర నీటిని, ఇటు శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని యథేచ్చగా వినియోగిస్తోందని దృష్టికి తెచ్చింది. -
సమాంతర కాలువ తవ్వాకే 'నవలి'పై నిర్ణయం
సాక్షి, అమరావతి, సాక్షి,బళ్లారి: తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతరంగా రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా వరద కాలువను తవ్వాక నవలి రిజర్వాయర్ నిర్మాణం అవసరమా? లేదా అనే అంశంపై తేల్చుదామని తుంగభద్ర బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్సష్టం చేసింది. నవలి రిజర్వాయర్, సమాంతర కాలువ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) ఇస్తే 3 రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నాక చర్చిద్దామని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే చేసిన సూచనకు ఏపీ, కర్ణాటక ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, లక్ష్మణబాబు పీష్వా అంగీకరించారు. తుంగభద్ర జలాశయంలో అనుమతిచ్చిన దాని కంటే అధికంగా 5.045 టీఎంసీలను ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ అంగీకరించింది. వాటిని తమ రాష్ట్ర కోటా కింద పరిగణించి కోత వేయాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది. ఫిషరీష్ డెవలప్మెంట్ బోర్డు (ఎఫ్డీసీ)లో సభ్యత్వం ఇవ్వాలన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చేసిన ప్రతిపాదనను ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తోసిపుచ్చారు. తుంగభద్ర బోర్డు నిర్వహణ వ్యయం వాటా నిధులపై ఏడేళ్లుగా తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ఆక్షేపించారు. బుధవారం విజయనగర జిల్లా టీబీ డ్యాం వద్ద బోర్డు కార్యాలయంలో చైర్మన్ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన 217వ సర్వ సభ్య సమావేశం వర్చువల్ విధానంలో వాడివేడిగా జరిగింది. నవలి అవసరమేముంది? తుంగభద్ర జలాశయం సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.85 టీఎంసీలకు తగ్గిపోవడంతో మూడు రాష్ట్రాలు నష్టపోతున్నాయని కర్ణాటక ఈఎన్సీ లక్ష్మణబాబు పీష్వా పేర్కొన్నారు. తగ్గిన సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసేందుకు తుంగభద్ర జలాశయం ఎగువన నవలి వద్ద 30 నుంచి 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని, తద్వారా మూడు రాష్ట్రాలు కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.పది వేల కోట్లను మూడు రాష్ట్రాలు దామాషా పద్దతిలో భరించాలని కోరడంపై ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నవలి రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తుంగభద్ర జలాశయానికి వరద వచ్చే రోజుల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలించేలా హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అక్రమ తరలింపును అంగీకరించిన కర్ణాటక తుంగభద్ర జలాశయంలో ఎత్తిపోతల పథకాల ద్వారా 4.34 టీఎంసీలను వాడుకోవడానికి గతంలో కర్ణాటక సర్కార్‌కు బోర్డు అనుమతిచ్చింది. కర్ణాటక సర్కార్ అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా 9.385 టీఎంసీలను తరలిస్తున్నట్లు ఇటీవల బోర్డు నియమించిన జాయింట్ కమిటీ సర్వేలో తేలింది. అనుమతి లేకుండా 5.045 టీఎంసీలను తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈమేరకు బోర్డు సమావేశంలో జాయింట్ కమిటీ నివేదికను కార్యదర్శి నాగమోహన్ ప్రవేశపెట్టారు. తాగునీటి పథకాలను కర్ణాటక సర్కార్ హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ప్రధాన కాలువలపై కాకుండా డిస్ట్రిబ్యూటరీలపై ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సూచించారు. తాగునీటి పథకాల్లో మార్పులు చేసుకోవాలని కర్ణాటక సర్కార్‌కు బోర్డు సూచించింది. టోపోగ్రాఫికల్ సర్వే ప్రకారం తుంగభద్ర జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా పరిగణించి నీటి కేటాయింపులు చేయాలని ఏపీ కోరగా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ తెలిపారు. -
నేడు తుంగభద్ర బోర్డు భేటీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) జలాశయానికి ఎగువన కర్ణాటక సర్కార్ ప్రతిపాదిస్తున్న నవలి బ్యారేజీ నిర్మాణం, అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా జలదోపిడీ అజెండాగా బుధవారం తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జలవరులశాఖల ఈఎన్సీలు పాల్గొననున్నారు. టీబీ డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.85 టీఎంసీలకు తగ్గిందని చెబుతోన్న కర్ణాటక సర్కార్, తగ్గిన సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసుకోవడానికి ఈ డ్యామ్‌కు ఎగువన నవలి వద్ద బ్యారేజీ నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ టీబీ బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించింది. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి వాటాల్లో దామాషా ఆధారంగా భరించాలని ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశాయి. ఈ అంశంపై చర్చించాలని కర్ణాటక సర్కార్ కోరిన నేపథ్యంలో దాన్ని బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే అజెండాలో చేర్చారు. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదని, 105 టీఎంసీలని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైందని టీబీ బోర్డు పేర్కొంది. కానీ దీన్ని కర్ణాటక సర్కార్ తోసిపుచ్చుతోంది. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యంపై రీ సర్వే చేయాలని కోరింది. కర్ణాటక ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యాన్ని 105 టీఎంసీలుగా పరిగణించి నీటి కేటాయింపులు చేయాలని ఇప్పటికే బోర్డును కోరారు. బోర్డు సమావేశంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించనున్నాయి. టీబీ డ్యామ్‌లో ఎత్తిపోతల ద్వారా రెండు టీఎంసీలను తరలించడానికి మాత్రమే గతంలో బోర్డు నుంచి కర్ణాటక సర్కార్ అనుమతి తీసుకుంది. కానీ అక్రమ ఎత్తిపోతల ద్వారా అదనంగా 7.38 టీఎంసీలు తరలిస్తున్నట్లు బోర్డు జాయింట్ కమిటీ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో తేల్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్‌పై చర్యలు తీసుకుని ఆ రాష్ట్ర వాటాలో కోత వేసేలా బోర్డుపై ఒత్తిడి చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. -
ఎల్లెల్సీ ఆధునికీకరణతోనే జలచౌర్యానికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: కాలువలను ఆధునికీకరించడం ద్వారా జలచౌర్యానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసే దిశగా తుంగభద్ర బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటికే హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) రాష్ట్ర సరిహద్దు వరకూ కర్ణాటక పరిధిలో 105.435 కి.మీ. పొడవునా ఆధునికీకరణ పనులను పూర్తి చేసింది. దీంతో ఏపీ సరిహద్దుకు హెచ్చెల్సీ ద్వారా 2,200 క్యూసెక్కులను సరఫరా చేసేలా కాలువ ప్రవాహ సామర్థ్యం పెరిగింది. సిమెంటు లైనింగ్ చేయడం వల్ల హెచ్చెల్సీలో జలచౌర్యానికి అడ్డుకట్ట పడింది. ఇదే తరహాలో ఎల్లెల్సీ (దిగువ కాలువ)ను ఆధునికీకరించడం ద్వారా జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. ఈ సీజన్లో కర్ణాటక పరిధిలో 115 కి.మీ. వరకూ ఆధునికీకరించే పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2021–22, 2022–23లో 115 కి.మీ. నుంచి ఏపీ సరిహద్దు వరకూ 250.58 కి.మీ. వరకూ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రచించింది. తద్వారా రాష్ట్ర సరిహద్దుకు ప్రస్తుత డిజైన్ ప్రకారం 725 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తుంగభద్ర బోర్డు ఆమోదించింది. దీంతో కర్నూలు జిల్లాలో 1,51,134 ఎకరాలకు నీటిని అందించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జలచౌర్యంతో ఆయకట్టుకు కష్టాలు.. తుంగభద్ర జలాశయం దిగువ కాలువకు 43 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఇందులో కర్ణాటక వాటా 19 టీఎంసీలు.. ఏపీ వాటా 24 టీఎంసీలు. తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ కాలువ 250.58 కి.మీ. వరకూ కర్ణాటక పరిధిలో ఉండగా 250.58 కి.మీ. నుంచి 324 కి.మీ. వరకూ రాష్ట్ర పరిధిలో ఉంది. కర్ణాటక వాటాపోనూ రాష్ట్ర సరిహద్దుకు 725 క్యూసెక్కులు చేరాలి. కానీ కర్ణాటక పరిధిలో రైతులు కాలువకు గండ్లు కొట్టడం, పైపింగ్ ద్వారా భారీ ఎత్తున జలచౌర్యం చేస్తుండటంతో రాష్ట్ర సరిహద్దుకు 400 నుంచి 450 క్యూసెక్కుల మేర కూడా చేరడం లేదు. దాంతో కర్నూలు జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. -
నీటి లెక్కలు తేల్చిన తుంగభద్ర బోర్డు
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయం(టీబీ డ్యామ్)లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను టీబీ బోర్డు తేల్చింది. ఈ నీటి సంవత్సరంలో బోర్డు అంచనా వేసిన లభ్యత కంటే 7.80 టీఎంసీలు డ్యామ్‌లో అధికంగా లభించాయి. డ్యామ్‌లోని నీటిని దామాషా పద్ధతిలో దక్కిన కోటాలో ఏపీ 52.831, తెలంగాణ 5.253, కర్ణాటక 111.673 టీఎంసీలను వినియోగించుకున్నాయి. ఖరీఫ్ సీజన్లో డ్యామ్‌లోకి భారీ ఎత్తున ప్రవాహ జలాలు వచ్చినా.. రబీలో నిలిచిపోవడంపై బోర్డు వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎగువన కర్ణాటక సర్కార్ అక్రమంగా భారీగా ఎత్తిపోతల పథకాలను చేపట్టడం వల్లే వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి చేరడం లేదని.. ఇది ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేస్తున్నాయి. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన టీబీ డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో 8 టీఎంసీలు పోను హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల ద్వారా కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది. దామాషా పద్ధతిలో.. నీటి సంవత్సరం ఏటా జూన్ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభంలో జూన్ 9, 2020న డ్యామ్‌లో 163 టీఎంసీల లభ్యత ఉంటుందని బోర్డు అంచనా వేసింది. ఆ తర్వాత నవంబర్ 11న 168 టీఎంసీలు, డిసెంబర్ 20న 170.80 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. ఈ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు.. దామాషా పద్ధతిలో కర్ణాటకకు 111.979, ఏపీకి 53.576, తెలంగాణకు 5.245 టీఎంసీలను కేటాయించింది. ఇందులో మూడు రాష్ట్రాలు 169.757 టీఎంసీలు వాడుకున్నాయి. రబీలో డీలా.. మే 30 2020 నాటికి డ్యామ్‌లో 1,584.56 అడుగుల్లో 6.35 టీఎంసీలు నిల్వ ఉండేవి. జూన్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకూ ఖరీఫ్ సీజన్లో డ్యామ్‌లోకి 288.477 టీఎంసీల ప్రవాహం వచ్చింది. మూడు రాష్ట్రాలు 92.661 టీఎంసీలు వాడుకున్నాయి. డ్యామ్ నిండటంతో గేట్లు ఎత్తేసి 92.443 టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 3.913, 2.597 వృథా అయ్యాయి. రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి.. అంటే అక్టోబర్ 1 నాటికి 1,627.90 అడుగుల్లో 82.425 టీఎంసీలు నిల్వ ఉండేవి. అక్టోబర్ 1, 2020 నుంచి ఏప్రిల్ 4, 2021 వరకూ డ్యామ్‌లోకి కేవలం 3.982 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి భారీగా వచ్చేది. కానీ.. కర్ణాటక ఎగువన భారీగా అక్రమ ఎత్తిపోతల చేపట్టి.. నీటిని తోడేస్తుండటం వల్ల రబీలో డ్యామ్‌లోకి ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోయింది. రబీలో మూడు రాష్ట్రాలు 77.096 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 2.412, 1.999 టీఎంసీలు వృథా అయ్యాయి. ఈ నెల 10 నాటికి డ్యామ్‌లో 4.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. -
కేసీ కెనాల్ కోటా నీటి దోపిడీ!
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో కేసీ కెనాల్ కోటా కింద దక్కాల్సిన జలాలు మన రాష్ట్ర సరిహద్దు చేరకుండా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోంది. నదిలో వరద తగ్గాక దామాషా పద్ధతిలో టీబీ డ్యామ్ నుంచి కేటాయింపుల ప్రకారం కేసీ కెనాల్‌కు విడుదల కావాల్సిన నీటిని చౌర్యం చేస్తోంది. ఈ నీటిని తుంగభద్రపై బళ్లారి జిల్లా సిరిగుప్ప తాలుకా సుగూరు వద్ద బొరుకా పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) 4.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం వద్ద నిల్వ చేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రానికి ఎగువన అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల ద్వారా కర్ణాటక సర్కార్ చౌర్యం చేస్తుండటం తాజాగా తుంగభద్ర బోర్డు, కేసీ కెనాల్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో బీపీసీఎల్‌కు నోటీసులు ఇచ్చారు. నిబంధనల మేరకు నదిలో వరద ప్రవాహం ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని, వరద లేనప్పుడు ఎలా విద్యుదుత్పత్తి చేస్తారంటూ నిలదీశారు. కర్ణాటక అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల్లో నీటి తరలింపును ఆపివేశారు. బీపీసీఎల్ వద్ద నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేయించారు. వరద లేనప్పుడు విద్యుదుత్పత్తి చేస్తే విద్యుత్కేంద్రం అనుమతులను రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించింది. కర్ణాటక ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయడంతో ఎట్టకేలకు కేసీ కెనాల్‌కు వాటా జలాలు చేరాయి. 2.65 లక్షల ఎకరాలకు జీవనాడి.. కేసీ కెనాల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ కెనాల్‌పై ఆధారపడి కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్రలో సుంకేసుల వద్ద 29.9 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కకట్టిన బచావత్ ట్రిబ్యునల్ మిగిలిన పది టీఎంసీలను వరద తగ్గాక టీబీ డ్యామ్ నుంచి విడుదల చేయాలని పేర్కొంది. టీబీ డ్యామ్‌లో నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో ఈ ఏడాది కేసీ కెనాల్‌కు 8 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఇందులో హెచ్చెల్సీ ద్వారా రెండు టీఎంసీలను విడుదల చేసింది. తుంగభద్ర పుష్కరాల సమయంలో నది ద్వారా 2.3 టీఎంసీలను విడుదల చేసింది. మిగతా 3.7 టీఎంసీల కోటాను మార్చి 25 నుంచి రోజుకు 2,500 క్యూసెక్కుల చొప్పున టీబీ డ్యామ్ నుంచి బోర్డు విడుదల చేసింది. అయితే ఈ నీటిని బీపీసీఎల్ వద్ద నిల్వ చేయించిన కర్ణాటక సర్కార్ ఎగువన ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. దీంతో టీబీ డ్యామ్ నుంచి విడుదల చేసిన జలాలు కేసీ కెనాల్‌కు చేరడం లేదు. ఈ నేపథ్యంలో టీబీ బోర్డు అధికారులు, కేసీ కెనాల్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయడంతో కర్ణాటక జలచౌర్యం బహిర్గతమైంది. -
‘అప్పర్ భద్ర’కు జాతీయ హోదా?
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు ‘అప్పర్’ గండం ముంచుకొస్తోంది..! అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండా.. కనీసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తుంగభద్ర బోర్డుకు సమాచారం ఇవ్వకుండా కర్ణాటక సర్కారు చేపట్టిన ‘అప్పర్ భద్ర’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీ 2018 – 19 ధరల ప్రకారం అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో అనుమతి ఇచ్చింది. తాజా ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.21,450 కోట్లుగా ఉంది. అప్పర్ భద్రకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ కమిటీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన మరుక్షణమే అప్పర్ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కుతుంది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రమే అందజేస్తుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోకుండానే అప్పర్ భద్రకు ఇప్పటికే సాంకేతిక అనుమతి ఇచ్చిన కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి జాతీయ హోదా కల్పించే ప్రక్రియను వేగవంతం చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం.. కృష్ణా పరీవాహక ప్రాంతంలో తుంగభద్ర సబ్ బేసిన్(కే–8)లో కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) కేటాయించిన 295 టీఎంసీల కంటే కర్ణాటక ఇప్పటికే అధికంగా వాడుకుంటోంది. కర్ణాటకకు టీబీ డ్యామ్ (తుంగభద్ర జలాశయం)కు ఎగువన 151.74 టీఎంసీలు కేటాయిస్తే 176.96 టీఎంసీలను వాడుకుంటున్నట్లు కేడబ్ల్యూడీటీ – 2 సైతం తేల్చి చెప్పింది. అప్పర్ భద్ర ద్వారా 29.40 టీఎంసీలను ఎత్తిపోసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని కర్ణాటక చెబుతున్నా ఆ స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించాలంటే కనీసం 55 టీఎంసీలు అవసరమని, అదే స్థాయిలో నీటిని తరలించేలా కర్ణాటక ప్రాజెక్టును చేపట్టిందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సీజన్లో భద్ర డ్యామ్‌లో నిల్వ చేసిన నీటితో కలుపుకొంటే కర్ణాటక వంద టీఎంసీలకు పైగా వినియోగించుకుందని సీడబ్ల్యూసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కర్ణాటక జలదోపిడీ వల్ల ఇప్పటికే టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గిందని, ఇక అప్పర్ భద్ర పూర్తయితే ఏపీలో దుర్భిక్ష రాయలసీమలో హెచ్చెల్సీ (ఎగువ కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ), కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువతోపాటు తెలంగాణలో ఆర్డీఎస్ కింద వెరసి 6.52 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తుంగభద్ర నుంచి వరద తగ్గడం శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఆగమేఘాలపై అప్పర్ భద్ర.. అప్పర్ భద్ర ప్రాజెక్టును 2014లో చేపట్టిన కర్ణాటక జాతీయ హోదాకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను 2015లోనే సాధించింది. ఈ అనుమతులతో సంబంధం లేకుండానే పనులు చేపట్టి 2019 మే నాటికే రూ.4,830 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. ఆ తర్వాత సాంకేతిక అనుమతి కోసం కేంద్ర జల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. 2020 ఆగస్టు 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే ఆమోదముద్ర వేసింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన అప్పర్ భద్ర స్వరూపం ఇదీ.. ► తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజూ 1,342 క్యూసెక్కుల చొప్పున 17.4 టీఎంసీలను 80 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి 11.263 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా భద్ర జలాశయంలోకి తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజుకు 2,308 క్యూసెక్కుల చొప్పున 29.90 టీఎంసీలను ఎత్తిపోసి 47.50 కి.మీ. (అజాంపుర వద్ద 6.9 కి.మీ. సొరంగంతో సహా) పొడవున తవ్వే కెనాల్ ద్వారా తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి తవ్వే ప్రధాన కాలువ 47.5 కి.మీ. వద్ద రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రదుర్గ, జగల్పూర్, తుమకూర్ బ్రాంచ్ కెనాల్లోకి నీటిని ఎత్తిపోసి చిక్మగళూర్, చిక్బళాç్ల³Nర్, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్ల (5,57,247 ఎకరాలకు) ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 367 చెరువులను నింపి ఆయకట్టును స్థిరీకరిస్తారు. లెక్కలు.... కాకి లెక్కలే! ‘కేడబ్ల్యూడీటీ – 1 కేటాయించిన నీటిలో పది టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల 6.25 వెరసి 23 టీఎంసీలు మిగిలాయి. ఇక కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటా 2.40 టీఎంసీలు, మిగులు జలాలు ఆరు టీఎంసీలు వెరసి 31.4 టీఎంసీలు కాగా ప్రవాహ నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటాం’ అని కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీకి అందచేసిన డీపీఆర్‌లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అయితే తుంగ, భద్ర, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని తుంగభద్ర బోర్డు అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటి కంటే కర్ణాటక అధికంగా వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 కూడా పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు నీటి లభ్యతపై కర్ణాటక చెప్పేవన్నీ కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. -
భద్రంగా కట్టుకోండి!
కర్ణాటక జలదోపిడీకి సంపూర్ణ సహకారం ఇచ్చేలా కేంద్రం నిర్ణయాలు చేస్తోంది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించి, అభ్యంతరాలను పట్టించుకోకుండా... ఏకపక్షంగా కొమ్ముకాస్తోంది. కేటాయింపులకు మించి నీటి వాడకాన్ని ప్రతిపాదిస్తూ కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో కర్ణాటక ఎడాపెడా నీటిని తోడేస్తే... దిగువనున్న తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలున్నాయి. సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాల గరిష్ట నీటి వినియోగమే లక్ష్యంగా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ చేసిన నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్– 2 అవార్డు నోటిఫై కాకముందే, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వడ మే తప్పుగా పరిగణిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా జా తీయ హోదాకు సిఫారసు చేయడం తెలుగు రా ష్ట్రాలకు మింగుడు పడని అంశంగా మారింది. ప్ర ధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది ఆమోదంతో జాతీయ హోదా దక్క నుంది. ఈ లాంఛనం పూర్తయితే ప్రాజెక్టు వ్యయా న్ని కేంద్రమే భరిస్తుంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే దిగువ తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, దీన్ని కేం ద్రం విస్మరించడం, ఏకపక్షంగా నిర్ణయాలు చేయడంపై గట్టిగా నిలదీయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తన అభ్యంతరాలతో త్వరలోనే కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాయనుంది. ఎగువనే నీటిని అడ్డుకునేలా... కర్ణాటక ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ సామర్థ్యం తగ్గిందని చెబుతూ, ఆ నష్టాన్ని పూడ్చేలా 31.15 టీఎంసీల సామర్థ్యంతో నవాలి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. తుంగభద్ర కు భారీ వరద ఉన్నప్పుడు ఆ నీటిని వరద కాల్వ ద్వారా కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల ని ల్వ సామర్థ్యాలను పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద కలిపి మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో దిగువకు వరద ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయ ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కర్ణాటక విన డం లేదు. దీనిపై రాష్ట్రం.. కేంద్రానికి సైతం ఫిర్యా దు చేసింది. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తి శాఖ జాతీయ హోదాను ఇవ్వడం తెలంగాణకు మరింత మింగుడుపడని అంశంగా మారింది. ఎడాపెడా ఎత్తిపోతలు... నిజానికి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక సర్కార్ 2014లోనే రూ.16,125.28 కోట్లతో శ్రీకారం చు ట్టింది. తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి 17.4 టీఎంసీలను భద్ర జలాశయంలోకి ఎత్తిపోస్తారు. ఆపై భద్ర నుంచి 29.90 టీఎంసీలను ఎత్తిపోస్తూ.. చిక్మగళూర్, చిత్రదుర్గ, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో సూక్ష్మ నీటిపారుదల (బిందు సేద్యం) విధానంలో 2,25,515 హెక్టార్లకు నీళ్లందిస్తారు. ఇందులో తుంగ నుంచి నీటిని ఎత్తిపోసే పనులను రూ.324 కోట్లతో, భద్ర జలాశయం నుంచి నీటిని తరలించే పనులను రూ.1,032 కోట్ల తో పూ ర్తిచేసింది. మొత్తంగా రూ.4,800 కోట్ల మేర వ్య యం చేశాక 2018లో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అను మతి కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది. అయి తే దీనిపై తెలంగాణ అప్పట్లోనే కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–2లో అప్పర్ తుంగకు 11 టీఎంసీ, అప్పర్‌భద్ర కు 9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. అయి తే ఈ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కానందున ఈ నీటి వినియోగానికి కర్ణాటకకు అవకాశం లేదు. అదీగాక తీర్పులో పేర్కొన్న దానికన్నా అధికంగా నీటిని వినియోగించేలా అప్పర్ భద్రను చేపట్టింది. దీనికితోడు ఒక నదిలో నీటి వినియోగంతో దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగితే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం మేరకు పరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే సీడబ్ల్యూసీ అనుమతించింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఎగువన కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు కూడా పూర్తయితే, తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ఆయకట్టు... 87,500 ఎకరాలు ప్రమాదంలో పడుతుంది. ఏపీలోని హెచ్చెల్సీ, కేసీ కెనాల్ల కింది ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడుతుం గభద్ర జలాశయానికి వరద వచ్చే అవకాశమే ఉండ దు. అదే జరిగితే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్‌కు వచ్చే వరద కూడా తగ్గనుంది. కాగా కాళేశ్వరం ప్రా జెక్టుకు జాతీయ హోదా అడిగినప్పుడల్లా ఆ విధానాన్నే పక్కనబెట్టామని చెబుతూ వస్తున్న కేంద్రం అప్పర్ భద్రకు హోదా ఇవ్వడంపై రాష్ట్ర నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ, తెలంగాణపై.. ‘అప్పర్ భద్ర’ బండ!
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఆర్డబ్ల్యూడీ)–1956 నిబంధనలకు విరుద్ధంగా.. పరీ వాహక ప్రాంతం (బేసిన్)లోని దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండా తుంగభద్ర నుంచి అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా 29.90 టీఎంసీలను తరలించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతివ్వడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుపడుతున్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ అయిన తుంగభద్ర బోర్డుకూ సమాచారం ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. తుంగభద్ర సబ్ బేసిన్ (కే–8)లో కేటాయించిన 295 టీఎంసీల కంటే అధికంగా కర్ణాటక వినియోగిస్తోంది. తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన.. ఆ సబ్ బేసిన్లో 151.74 టీఎంసీలను ఆ రాష్ట్రం వినియోగించుకోవాల్సి ఉండగా.. 2000–01లో 176.96 టీఎంసీలు వాడుకుందని సాక్షాత్తూ కేడబ్ల్యూడీటీ (కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్)–2 స్పష్టంచేసింది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండానే.. డిసెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) రూ.16,125.48 కోట్లతో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీచేసింది. తెలుగు రాష్ట్రాలకు దెబ్బే ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఎగువన కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే, తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం కనిష్ఠ స్థాయికి తగ్గుతుంది. దీనివల్ల తుంగభద్ర జలాశయం పరిధిలో రాయలసీమలో హెచ్చెల్సీ (ఎగువ కాలువ) కింద 1,90,035, ఎల్ఎల్సీ (దిగువ కాలువ), కేసీ (కర్నూల్–కడప) కాలువ కింద 2,65,628, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కింద 87,500 వెరసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు తుంగభద్ర జలాశయానికి వరద వచ్చే అవకాశమే ఉండదు. అప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు.. రాయలసీమ జిల్లాల్లో తాగునీటికీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వచ్చే వరద ప్రవాహం కూడా తగ్గుతుంది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లోని ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అప్పర్ భద్రకు 2014లోనే శ్రీకారం నిజానికి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక సర్కార్ 2014లోనే రూ.16,125.28 కోట్లతో శ్రీకారం చుట్టింది. ఆ ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. ► తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి జూన్–అక్టోబర్ మధ్య రోజూ 1,342 క్యూసెక్కుల చొప్పున 17.4 టీఎంసీలను 80 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి.. ఆ నీటిని 11.263 కి.మీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, భద్ర జలాశయంలోకి పోస్తారు. ► భద్ర జలాశయం నుంచి జూన్–అక్టోబర్ మధ్య రోజుకు 2,308 క్యూసెక్కుల చొప్పున 29.90 టీఎంసీలను ఎత్తిపోసి.. ఆ నీటిని 47.50 కి.మీల (ఇందులో అజాంపుర వద్ద 6.9 కి.మీల పొడవున సొరంగంతో సహా) పొడవున తవ్వే కెనాల్ ద్వారా తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి తవ్వే ప్రధాన కాలువ 47.5 కి.మీ వద్ద రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రదుర్గ, జగల్పూర్, తుమకూర్ బ్రాంచ్ కెనాల్లోకి నీటిని ఎత్తిపోసి.. చిక్‌మంగుళూర్, చిక్‌బళాపూర్, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో సూక్ష్మ నీటిపారుదల విధానంలో 2,25,515 హెక్టార్ల (6,31,390 ఎకరాలు) ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 367 చెరువులను నింపి.. వాటి కింద ఆయకట్టును స్థిరీకరిస్తారు. ► ఇందులో తుంగ నుంచి నీటిని ఎత్తిపోసే పనులను రూ.324 కోట్లతో.. భద్ర జలాశయం నుంచి నీటిని తరలించే పనులను రూ.1,032 కోట్లతో.. అజాంపుర వద్ద సొరంగం పనులను రూ.223.96 కోట్లతో మే, 2019 నాటికే పూర్తిచేసింది. ► మే, 2019 నాటికే పనులు, భూసేకరణ నిమిత్తం ఈ ప్రాజెక్టుకు రూ.4,830 కోట్లను ఖర్చుచేసిన కర్ణాటక సర్కార్.. 2018లో ఈ ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది. ► నిబంధనలకు విరుద్ధంగా అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపడుతున్నా ఏపీలో అప్పటి తెలుగుదేశం సర్కార్ నోరెత్తలేదు. ఇక ప్రాజెక్టు పనులకు రూ.4,830 కోట్లను ఖర్చు చేశాక.. అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని సీడబ్ల్యూసీ కూడా తప్పు పట్టకపోవడం గమనార్హం. కర్ణాటక కాకిలెక్కలు.. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటిలో పది టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునికీకరణవల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణవల్ల 0.5, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణవల్ల 6.25 వెరసి 13 టీఎంసీలు మిగిలాయని.. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటాలో 2.40 టీఎంసీలు, మిగులు జలాలు ఆరు టీఎంసీలు.. ప్రవాహ నష్టాలుపోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటామని సీడబ్ల్యూసీకి కర్ణాటక సర్కార్ ఇచ్చిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో పేర్కొంది. కానీ, తుంగ, భద్ర, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణవల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని తుంగభద్ర బోర్డు అధికార వర్గాలే స్పష్టంచేస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటి కంటే కర్ణాటక అధికంగా వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. అప్పర్ భద్రకు నీటి లభ్యతపై కర్ణాటక సర్కార్ కాకిలెక్కలు చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. కర్ణాటక సర్కార్ డీపీఆర్‌లో పేర్కొన్న అంశాలపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేయకుండా.. అప్పర్ భద్ర ప్రాజెక్టువల్ల ప్రతికూల ప్రభావం పడుతుందా లేదా అన్న అంశంపై దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండా.. కనీసం తుంగభద్ర బోర్డుకు సమాచారం ఇవ్వకుండా ఆ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతివ్వడంపై నీటి పారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. ఒక్క భద్ర జలాశయం ద్వారా గతేడాది వంద టీఎంసీలను కర్ణాటక వినియోగించుకుందని.. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే.. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం వచ్చే రోజులు గణనీయంగా తగ్గుతాయని.. అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు చుక్క నీరు కూడా తుంగభద్ర జలాశయానికి వచ్చే అవకాశం ఉండదని.. ఇది కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీడబ్ల్యూసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
సీమ రైతుల ఆశలు చిగురించేలా..
సాక్షి, అమరావతి: రాయలసీమ రైతుల నాలుగు దశాబ్దాల నాటి స్వప్నమైన తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తుంగభద్ర జలాశయం ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని సరఫరా చేయాలంటే ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీకి) సమాంతరంగా వరద కాలువ తవ్వడం ఒక్కటే మార్గమని ఈనెల 15న తుంగభద్ర బోర్డుకు స్పష్టం చేసింది. చరిత్రలో తొలిసారిగా సమాంతర కాలువ నిర్మాణ ప్రతిపాదనపై బోర్డు సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. బోర్డు ఆమోద ముద్ర వేస్తే.. యుద్ధప్రాతిపదికన కాలువ తవ్వకం పనులు పూర్తి చేసి తుంగభద్ర వరద జలాలను ఒడిసి పట్టడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. నిండా నీళ్లున్నా దుర్భిక్షమే.. తుంగభద్ర జలాశయం వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 132.473 టీఎంసీలు. కానీ.. పూడిక పేరుకుపోవడంతో నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలకు తగ్గిపోయిందని బోర్డు చెబుతోంది. జలాశయం నుంచి 4 వేల క్యూసెక్కులు విడుదల చేసేలా హెచ్చెల్సీ (హై లెవెల్ కెనాల్), 1800 క్యూసెక్కులు విడుదల చేసేలా ఎల్లెల్సీ (లో లెవెల్ కెనాల్)ని తవ్వారు. - అనంతపురం జిల్లా వద్దకు వచ్చేసరికి హెచ్చెల్సీ సామర్థ్యం 1,500, ఎల్లెల్సీ సామర్థ్యం కర్నూలు జిల్లా సరిహద్దులో 725 క్యూసెక్కులకు పరిమితం అవుతోంది. దీనివల్ల వరద ప్రవాహం వచ్చినప్పుడు, ఆ మేరకు జలాలను తరలించలేని దుస్థితి నెలకొంది. - గత 50 ఏళ్లలో తుంగభద్ర జలాశయంలోకి ఏటా సగటున 320 టీఎంసీల ప్రవాహం వస్తోంది. కానీ.. కాలువల సామర్థ్యం ఆ మేరకు లేకపోవడం వల్ల కేటాయించిన నీటిని వినియోగించుకోలేని దుస్థితి. జలాశయం చరిత్రలో ఇప్పటిదాకా ఏ ఒక్క ఏడాదీ బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు 230 టీఎంసీలు వినియోగించుకున్న దాఖలా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. - హెచ్చెల్సీకి సమాంతరంగా రోజుకు ఒక టీఎంసీ (11,574 క్యూసెక్కులు) తరలించేలా వరద కాలువ తవ్వి, నదికి వరద వచ్చినప్పుడు జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకున్నాక.. సమాంతర కాలువ ద్వారా వరద నీటిని ఒడిసి పట్టి తరలించాలన్న డిమాండ్ నాలుగు దశాబ్దాలుగా ఉంది. వాటిని పీఏబీఆర్(పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్), మిడ్ పెన్నార్, చాగల్లు, పెండేకల్లు, మైలవరం, సీబీఆర్ (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లలో నిల్వ చేయవచ్చు. తుంగభద్ర జలాశయంలోకి వచ్చే వరద పూర్తిగా తగ్గిపోయాక సమాంతర కాలువ ద్వారా తరలించిన నీటిని హెచ్చెల్సీ కోటాలో మినహాయించి.. మిగతా నీటిని జలాశయం నుంచి విడుదల చేయవచ్చు. దీనివల్ల తుంగభద్ర జలాశయంలో ఉన్న జలాలతో పూర్తి ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందించవచ్చు. సమాంతర కాలువ వల్ల అటు కర్ణాటక.. ఇటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు సమ న్యాయం చేకూరుతుంది. తద్వారా దుర్భిక్ష పరిస్థితులను అధిగమించవచ్చు. జలాల కేటాయింపు ఇలా.. తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. అందులో కర్ణాటక రాష్ట్రానికి 151.49, ఉమ్మడి ఏపీకి 78.51 టీఎంసీలు (ఆర్డీఎస్ వాటాగా తెలంగాణకు 6.51 టీఎంసీలు) కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన 72 టీఎంసీల్లో హెచ్చెల్సీకి 32.5, ఎల్లెల్సీకి 29.5, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీల వాటా ఉంది. హెచ్చెల్సీ కింద అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో 1,90,035, ఎల్లెల్సీ కింద కర్నూలు జిల్లాలో 1,57,062, కేసీ కెనాల్ కింద కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 2.78 లక్షల ఎకరాలు వెరసి 6,25,097 ఎకరాల ఆయకట్టు విస్తరించింది. కర్ణాటక పరిధిలో వివిధ కాలువల కింద 9,26,914 ఎకరాల ఆయకట్టు ఉంది. హెచ్చెల్సీ కింద 1,99,920, ఎల్లెల్సీ కింద 92,670 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సమాంతర కాలువ తవ్వకానికి అనుమతి ఇవ్వాలని 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తుంగభద్ర బోర్డుకు, కర్ణాటక ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అప్పట్లో కర్ణాటక వ్యతిరేకించడంతో తుంగభద్ర బోర్డు సమాంతర కాలువ ప్రతిపాదనను తోసిపుచ్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక సమాంతర కాలువ ప్రతిపాదనను తిరిగి తెరపైకి తెచ్చారు. గత ఏడాది ఆగస్టు 17న బెంగళూరులో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో సమాంతర కాలువకు అనుమతి కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న విజయవాడలో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో అదే అంశాన్ని ప్రస్తావించింది. ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందించాలంటే సమాంతర కాలువ ఒక్కటే శరణ్యమని ప్రతిపాదించింది. దీంతో ఏకీభవించిన తుంగభద్ర బోర్డు ఛైర్మన్ రంగారెడ్డి దీనిపై అధ్యయనం చేయించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
సమాంతర కాలువే ప్రత్యామ్నాయం
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయంలోకి సోమవారం వరకూ 396.71 టీఎంసీల ప్రవాహం వచ్చింది. పుష్కరకాలం తర్వాత తుంగభద్ర జలాశయంలోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే. ఇప్పటికీ జలాశయంలో 100.855 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసింది కేవలం 20.26 టీఎంసీలే. ఇందులో హెచ్చెల్సీకి(ఎగువ కాలువ) 14.5 టీఎంసీలు, ఎల్లెల్సీకి(దిగువ కాలువ) 5.66 టీఎంసీలు విడుదల చేశారు. కరువు పీడిత ప్రాంతాలకు మేలు బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేసినా.. ఏడాదికి సగటున 150 టీఎంసీలకు మించి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకున్న దాఖలాలు లేవు. కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉండటం.. ఆధునీకరించకపోవడం వల్ల గండ్లు పడటంతో వరద నీటిని ఒడిసిపట్టలేని దుస్థితి నెలకొంది. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను ఆధునీకరించడంతోపాటు హెచ్చెల్సీకి సమాంతరంగా కనీసం 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం గల వరద కాలువ తవ్వితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రయోజనకరంగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు దశాబ్దాలుగా సూచిస్తున్నారు. ఈ సమాంతర కాలువ ద్వారా కర్ణాటకలో బళ్లారి జిల్లా, ఏపీలో అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఆధునికీకరణ అసంపూర్ణం పూడిక పేరుకుపోవడం వల్ల తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం క్రమేణ తగ్గుతూ ప్రస్తుతం 100.855 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నుంచి 4,000 క్యూసెక్కులు విడుదల చేసేలా హెచ్చెల్సీ, 1,800 క్యూసెక్కులు విడుదల చేసేలా ఎల్లెల్సీని తవ్వారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు వచ్చేసరికి హెచ్చెల్సీ సామర్థ్యం 1500, ఎల్లెల్సీ సామర్థ్యం 725 క్యూసెక్కులకు పరిమితం చేశారు. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలో మిగిలిన ఆధునీకరణ పనులను గత ఐదేళ్లుగా పూర్తి చేయకపోవడం వల్ల కాలువలకు ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయి. దీనివల్ల సామర్థ్యం మేరకు కూడా నీటిని తరలించలేకపోతున్నారు. ఉభయ రాష్ట్రాలకూ లాభమే.. హెచ్చెల్సీ ప్రధాన కాలువ కర్ణాటకలో 104.587 కిలోమీటర్ల పొడవున ప్రయాణిస్తుంది. ఈ కాలువకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పీఏబీఆర్(పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్), మధ్య పెన్నార్, చాగల్లు, పెండేకళ్లు, వైఎస్సార్ జిల్లాలో చిత్రావతి, మైలవరం రిజర్వాయర్లను నిర్మించారు. ఈ జలాశయాల సామర్థ్యం 38 టీఎంసీలు. తుంగభద్ర జలాశయానికి ఏడాదికి సగటున 70 నుంచి 80 రోజులపాటు వరద ఉంటుంది. హెచ్చెల్సీకి సమాంతరంగా 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వి, వరద రోజుల్లో నీటిని తరలిస్తే ఈ జలాశయాలను నింపవచ్చు. వరద ప్రవాహం నిలిచిపోయాక తుంగభద్ర జలాశయం నీటిని పీఏబీఆర్‌కు ఎగువన ఉన్న ఆయకట్టుకు.. ఎల్లెల్సీ, కర్ణాటక పరిధిలోని ఇతర ఆయకట్టుకు అందించవచ్చు. దీనివల్ల కర్ణాటక, ఏపీ, తెలంగాణలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. హెచ్చె ల్సీకి సమాంతరంగా కాలువ తవ్వడంతోపాటు ఎల్లెల్సీని పూర్తిగా ఆధునీకరించి ప్రవాహ సామర్థ్యం పెంచాలంటూ ఏపీ ఇప్పటికే ప్రతిపాదించింది. కర్ణాటక ఆమోదముద్ర వేస్తే.. ఉభయ రాష్ట్రాలకూ ప్రయోజనకరమైన రీతిలో తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోవడా నికి సిద్ధంగా ఉందని అధికారులంటున్నారు. -
‘ఆర్డీఎస్’ ఈసారీ అంతే!
- ఈ ఏడాదీ జరగని ఆధునీకరణ పనులు.. కాల్వల ఎత్తు పెంపునకు ఏపీ ససేమిరా - వచ్చే ఏడాది వరకు రైతులకు తప్పని నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగలనుంది. మూడే ళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాదీ మూలన పడ్డాయి. పనుల పూర్తికి కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చినా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలతో కాల్వల ఎత్తు పెంపు సాధ్యం కాలేదు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా పాత పాలమూరు జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర నీరు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావట్లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ కాల్వలకు మరమ్మతులు చేసి ఎత్తు పెంచాలని నిర్ణయించగా ఇందుకు కర్ణాటక సర్కారు అంగీకరించింది. దీంతో కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు తెలంగాణ ప్రభుత్వం రూ. 72 కోట్ల నిధులను డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు మూడేళ్లుగా అడ్డుపడుతున్నారు. గతేడాది దీనిపై మంత్రి హరీశ్‌రావు స్వయంగా కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అక్కడ సానుకూలత వచ్చింది. ప్యాకేజీ–1లో ని హెడ్‌వర్క్స్ అంచనాను రూ. 13 కోట్లకు పెంచగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ సర్కారు మోకాలడ్డు... తుంగభద్ర బోర్డు సమావేశంలో ఆర్డీఎస్ కాల్వల్లో పూడికతీత, కాల్వల మరమ్మతులకు అంగీకరించిన ఏపీ.. కట్ట ఎత్తు పెంచుకునేం దుకు మాత్రం అంగీకరించలేదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏపీకి తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించిన దృష్ట్యా ఆ నీటిని ఆర్డీఎస్ కుడి కాల్వ ద్వారా తీసుకో వచ్చని తెలంగాణ చెప్పినా కూడా ఏపీ సర్కారు వినిపించుకోలేదు. ఈ అంశంపై మరోసారి చర్చల్లో ఏపీని ఒప్పించి పనులు మొదలుపెడదామన్నా వర్షాకాలం మొదలు కావడంతో తుంగభద్ర కాల్వల్లో నీరు చేరే పరిస్థితులున్నాయి. -
తుంగభద్ర బోర్డు ముందుకు ఆర్డీఎస్
నేడు బెంగళూరులో భేటీ కానున్న బోర్డు, హాజరుకానున్న రాష్ట్ర అధికారులు సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఆధునీకరణ పనుల అంశం మళ్లీ తుంగభద్ర బోర్డు ముందు చర్చకు రానుంది. సోమవారం బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర అధికారులు హాజరై, ఆధునీకరణ పనుల వేగిరంపై చర్చించనున్నారు. ఇప్పటికే కెనాల్ పనులకు సంబంధించి సవరించిన అంచనాలకు ఓకే చెప్పడం,హెడ్ వర్క్స్ పనుల అంచనాల పెంపునకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో పనులకు కర్ణాటక, ఏపీల సహకారం కోరను న్నారు. వాస్తవానికి ఆర్డీఎస్ కింద రాష్ట్రానికి 15.9 టీఎంసీల నీటి కేటాయింపులుండగా, పాత మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర నీరు లభ్యమవుతోం ది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవ డంతో ఆశించిన మేరకు నీరు రావడం లేదు. ఈ కాల్వల ఆధునికీకరణ పనులకోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72 కోట్ల మేర చెల్లించింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీ కరణ పనులకు అడ్డు తగులుతుండటంతో 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. ఈ విషయాన్ని గతంలో తుంగభద్ర బోర్డు ముందు ప్రస్తావించగా, నిర్ణీత నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకు అభ్యం తరం లేదని, ఇందుకు తాము సహకరిస్తా మని ఏపీ స్పష్టం చేసింది. ఈ హామీ మేరకు గత ఏడాది పనులు ఆరంభించగా, కర్నూలు జిల్లా అధికారులు, నేతలు అడ్డుతగిలారు. శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో కర్ణాటక పనులు నిలిపివేసింది. అప్పటి నుంచి పనులు ముందుకు కదల్లేదు. దీంతో మరో మారు ఈ అంశాన్ని బోర్డు ముందు పెట్టి పనులు మొదలు పెట్టించాలనే ఆలోచనలో రాష్ట్రం ఉంది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ సైతం కొత్తగా ఏపీకి తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించిన దృష్ట్యా, ఆ నీటిని ఆర్డీఎస్ కుడి కాల్వ ద్వారా తీసుకోవచ్చని రాష్ట్రం చెబుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా పనులకు సహకరించాలని కోరనుంది. -
బోర్డు పరిధిలోకి తుంగభద్ర-ఆర్డీఎస్ ప్రధాన కాల్వ
తీసుకురావాలని తుంగభద్ర బోర్డుకు రాష్ట్రం వినతి విడిగా సమావేశం ఏర్పాటు చేస్తామన్న బోర్డు సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర నుంచి రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు నీటిని సరఫరా చేసే ప్రధాన కాల్వను బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర బోర్డును కోరింది. అలా అయితేనే ప్రధాన కాల్వల పనులను వేగిరం చేయొచ్చని అభిప్రాయపడింది. గురువారమిక్కడి కేంద్ర జల సంఘం కార్యాలయంలో తుంగభద్ర బోర్డు సమావేశం జరిగింది. ఇందులో చైర్మన్ ఆర్కే గుప్తాతోపాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులు పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి కేవలం ఆర్డీఎస్ ఆధునీకరణ అంశమొక్కటి మాత్రమే ఎజెండాలో ఉండటంతో దానిపై సమావేశం చివర్లో చర్చించారు. రాష్ట్రం తరఫున హాజరైన ఈఎన్సీ మురళీధర్.. ఆధునీకరణ అంశాన్ని ప్రస్తావించి నీటి కేటాయింపులు, గడిచిన పదేళ్లుగా తెలంగాణకు దక్కుతున్న వాటాలపై వివరించారు. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా అందులో 4-5 టీఎంసీలకు మించి దక్కడం లేదన్నారు. దీంతో 87,500 ఎకరాల వాస్తవ ఆయకట్టుకుగాను 30 వేల ఎకరాలకు మించి నీరందడం లేదని తెలిపారు. దీంతోపాటే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వ పూడికతో నిండినందున 850 క్యూసెక్కులుగా ఉండాల్సిన ప్రవాహం 100కి పడిపోయిందని వివరించారు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించి, ఇప్పటికే అందుకు సంబంధించి రూ.72 కోట్లను కర్ణాటక వద్ద జమ చేసినా పనులు మాత్రం జరగడం లేదని తెలిపారు. గత రెండేళ్లలో రెండుమార్లు పనులు చేసేందుకు కర్ణాటక ముందుకొచ్చినా, ఏపీకి చెందిన కర్నూలు రైతులు అడ్డుపడుతున్నారని, వీరిని నిలువరించకుండా ఏపీ చోద్యం చూస్తోందని చెప్పినట్లు తెలిసింది. దీనిపై బోర్డు స్పందిస్తూ, రెండు, మూడు వారాల్లో తెలంగాణ, కర్ణాటకలతో విడిగా సమావేశం నిర్వహించి అన్ని అంశాలు చర్చిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఏపీ హైలెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్‌లపై చర్చించినట్లు సమాచారం. -
తుంగభద్ర బోర్డు సమావేశం వాయిదా
గద్వాల: బెంగళూరులో శుక్రవారం జరగాల్సిన తుంగభద్ర బోర్డు సమావేశాన్ని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ తెలిపారు. ఈనెల 13న తుంగభద్ర ప్రాజెక్టు వద్ద జరిగిన ఇంజనీర్ల సమావేశంలో ఈనెల 21వ తేదీన బెంగళూరులో చైర్మన్ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిపేందుకు నిర్ణయించారన్నారు. చివరి నిమిషంలో బెంగళూరులో జరిగే సమావేశాన్ని 29వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన వివరించారు. -
యథేచ్ఛగా కర్ణాటక జలచౌర్యం
కర్నూలు రూరల్: తుంగభద్ర బోర్డు అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. నీటి వాటా కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. కృష్ణా ట్రిబ్యూనల్-1 అవార్డు ప్రకారం సమన్యాయాన్ని పాటించడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి 1.85 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు పోటెత్తడంతో గత నెల 24వ తేదీ నుంచి 690 క్యూసెక్కులను ఎల్లెల్సీకి వదులుతున్నారు. అయితే అవి ఆంధ్ర సరిహద్దుకు వచ్చేటప్పటికి 329 క్యూసెక్కులకు పరిమితమవుతున్నాయి. కర్ణాటక రైతులు యథేచ్ఛగా జల చౌర్యానికి పాల్పడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా వాటా ప్రకారం కర్ణాటక రాష్ట్ర ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వీటితోపాటు అనుమతులు లేకుండా మరో ఆరు వేల క్యూసెక్కులను అక్రమంగా తరలిస్తున్నారు. తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పాదన పేరుతో మరో రెండు వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకుంటున్నారు. కర్ణాటక రైతులు ప్రస్తుతం నారుమళ్లు సాగుచేసుకుంటున్నారు. అక్కడి నేతల ఒత్తిళ్ల మేరకే టీబీ డ్యాం అధికారులు క్రమంగా నీటి విడుదలను పెంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలా విడుదల చేసిన నీరు లెక్కలోకి వచ్చే అవకాశం లేదని.. దామాషా ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయించే కోటాలోకి పరిగణించబోరని జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేటాయింపులు ఇలా.. కృష్ణా ట్రిబ్యూనల్-1 అవార్డు ప్రకారం..తుంగభద్ర జలాశయం నుంచి కర్ణాటక రాష్ట్రానికి 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 73.010 టీఎంసీలు కలుపుకుని మొత్తం 212 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కర్ణాటకలోని పవర్ కెనాల్, దిగువ కాల్వ(కుడిగట్టు), ఎగువ కాల్వ(కుడిగట్టు), రాయ బసవ చానల్స్, రివర్ అసిస్టెన్స్ టు వీఎన్‌సీ అండ్ ఆర్డీఎస్, లెఫ్ట్ బ్యాంక్ మెయిన్ కెనాల్+ ఎగువ కాల్వ(ఎడమ గట్టు)లకు మొత్తం 138.99 టీఎంసీలు సరఫరా చేస్తున్నారు. మన రాష్ట్రంలోని దిగువ కాల్వ(కుడిగట్టు), ఎగువ కాల్వ(కుడిగట్టు), రివర్ అసిస్టెన్స్ టు ఆర్డీఎస్+కేసీ కెనాల్లకు కలుపుకుని మొత్తం 73.010 టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉంది. అయితే పూడికతో జలాశయం నిల్వ సామర్థ్యం 104 టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ ఏడాది ఎగువ ప్రాంతంలో వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో నీటి లభ్యత 144 టీఎంసీలకు పెరగవచ్చని టీబీ బోర్డు అధికారులు అంచనా వేశారు. ఇందుకు లెక్కగట్టి ఇరు రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే కర్ణాటక నేతల ఒత్తిళ్లకు తలొగ్గి టీబీ బోర్డు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. అనుమతులు లేకుండానే నీటిని విడుదల చేస్తున్నారు. -
త్వరలో తుంగభద్ర బోర్డు రద్దు
గద్వాల, న్యూస్‌లైన్: బచావత్ ట్రిబ్యునల్ అవార్డుతో ఏర్పాటైన తుంగభద్ర బోర్డును త్వరలోనే రద్దుచేసి కృష్ణానదీ జలాల పంపిణీ, కేటాయింపుల పర్యవేక్షణకు కృష్ణా వాటర్ అథారిటీ కార్యాలయాలను కర్ణాటకలోని ఆల్మట్టి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో కృష్ణానదీ జలాల సమస్యలను పరిష్కరించేందుకు, నీటి కేటాయింపులను పర్యవేక్షించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆల్మట్టి వద్ద, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేస్తారు. అక్కడ వీలుకాని పక్షంలో శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని ఈగలపెంట వద్ద ఈ కార్యాలయాలను వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 1966లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల సమస్య పరిష్కారానికి కేటాయింపులను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు జడ్జి బచావత్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. ఆ తీర్పు మేరకు మూడు రాష్ట్రాలకు నదీ జలాలను పంపిణీ చేయడంతోపాటు, రెండు రాష్ట్రాల పరిధిలో సాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టు నీటి విడుదలను పర్యవేక్షించేందుకు తుంగభద్ర ప్రాజెక్టు వద్ద బోర్డును ఏర్పాటుచేశారు. 1970లో ఏర్పాటైన ఈ బోర్డులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అధికారులు సభ్యులుగా ఉన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కాలం 2000 సంవత్సరంతో ముగియడంతో, కేంద్రం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ గతేడాది నదీజలాల వివాదాన్ని పరిష్కరిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పులో కృష్ణా వాటర్ అథారిటీ కార్యాలయాల ఏర్పాటు ఉంది. కృష్ణానది నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఆల్మట్టి, గద్వాల వద్ద అథారిటీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తుంగభద్ర బోర్డు అధికారుల ద్వారా తెలిసింది. -
కోటాకు టాటా!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : తుంగభద్రమ్మ కరుణించినా తుంగభద్ర బోర్డు మాత్రం వరమివ్వడం లేదు. నీటి లభ్యతపై టీబీ బోర్డు అంచనాలను తుంగభద్రమ్మ తలకిందులు చేసింది. మూడు నెలలుగా టీబీ డ్యాం పొంగిపొర్లుతోంది. నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ) కోటాను పెంచడంలో బోర్డు దాటవేత వైఖరి అనుసరిస్తోంది. కనీసం కేటాయించిన మేరకైనా నీటిని విడుదల చేస్తున్నారా అంటే అదీ లేదు.. కర్ణాటక రైతులు అడగడుగునా జలచౌర్యం చేస్తోండటంతో మన జిల్లా సరిహద్దులకు ఆ మేరకు జలాలు చేరడం లేదు. దాంతో.. ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీబీ డ్యామ్‌లో ఈ ఏడాది 150 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కలు కట్టిన టీబీ బోర్డు దామాషా పద్ధతిలో హెచ్చెల్సీకి 22.995 టీఎంసీలను కేటాయిస్తున్నట్లు జూన్ 24న ప్రకటించింది. తాగునీటికి 5.715 టీఎంసీలు, నీటి ప్రవాహ, ఆవిరి రూపంలో 7.535 టీఎంసీల జలాలు వృథా అవుతాయని లెక్కకట్టిన హెచ్చెల్సీ అధికారులు 9.745 టీఎంసీలతో 90 వేల ఎకరాలకు నీళ్లందించాలని ఈనెల 8న కలెక్టర్ లోకేష్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఐఏబీ సమావేశంలో ప్రతిపాదించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు తాగునీటికి కేటాయించిన జలాలను నిల్వ చేసుకున్న తర్వాతే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఐఏబీలో నిర్ణయించారు. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా ఎగువ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు ఆగస్టు 15న నీటిని విడుదల చేసి.. ఎంపీఆర్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు రబీ పంటలకు నీటిని అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు నీటిని విడుదల చేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు ప్రథమార్థానికి నిండాల్సిన టీబీ డ్యామ్.. ఈ ఏడాది జూన్ ఆఖరునాటికే పొంగిపొర్లింది. తుంగభద్రమ్మ గత మూడు నెలలుగా పోటెత్తుండటంతో గేట్లెత్తి వరద నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. నీటి లభ్యత పెరిగినా.. టీబీ డ్యామ్ పూర్థిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా.. గురువారం డ్యామ్‌లో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గురువారం డ్యామ్‌లోకి 20,188 క్యూసెక్కుల నీళ్లు వచ్చి చేరగా.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయచూరు కాలువలకు నీటిని విడుదల చేయడంతోపాటూ నదిలోకి 17,962 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అక్టోబరు ఆఖరు వరకూ డ్యామ్‌లోకి ఇదే స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుందని నీటి పారుదలశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత కనీసం 40 నుంచి 50 టీఎంసీలు పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు హెచ్చెల్సీకి కనీసం ఐదు టీఎంసీల జలాలను అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. కానీ.. అదనపు కేటాయింపులపై టీబీ బోర్డు స్పందించడం లేదు. బోర్డులో మన రాష్ట్రం తరపున ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎస్ఈ శ్రీనివాసరెడ్డి అదనపు కేటాయింపులపై నోరు మెదపడం లేదు. సర్కారు పట్టించుకోవడం లేదు. హెచ్చెల్సీ అధికారులు సమ్మెలో వెళ్లడంతో అదనపు నీటి కేటాయింపులపై సందిగ్ధం నెలకొంది. కేటాయించిన మేరకైనా.. టీబీ బోర్డు ఈ ఏడాది హెచ్చెల్సీకి కేటాయించిన నీటిలో గురువారం వరకూ మన జిల్లా సరిహద్దుకు కేవలం తొమ్మిది టీఎంసీల జలాలు మాత్రమే చేరాయి. బుధవారం టీబీ డ్యామ్ వద్ద హెచ్చెల్సీకి 1,627 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. గురువారం మన జిల్లా సరిహద్దుకు కేవలం 1400 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే చేరాయి. అంటే.. 227 క్యూసెక్కుల నీటిని కర్ణాటక పరిధిలోని రైతులు చౌర్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జల చౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ వేస్తామన్న టీబీ బోర్డు హామీ కాగితాలకే పరిమితమైంది. కేటాయించిన మేరకు కూడా నీటిని విడుదల చేయకపోవడం వల్ల ఆయకట్టు రైతులకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. టీబీ డ్యామ్‌లో పూడిక పేరుకుపోయి.. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, వరద జలాలు టీబీ డ్యామ్ నుంచి శ్రీశైలం డ్యామ్‌కు చేరుతోన్న విషయం విదితమే. వీటిని పరిగణనలోకి తీసుకున్న దివంగత సీఎం వైఎస్ టీబీ డ్యామ్‌లో కేసీ కెనాల్ కోటా అయిన పది టీఎంసీలను రివర్స్ డైవర్షన్ పద్ధతిలో పీఏబీఆర్‌కు కేటాయించారు. దివంగత సీఎం వైఎస్ జారీ చేసిన ఉత్తర్వులు 2010 వరకూ సజావుగా అమలయ్యాయి. కానీ.. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఆ ఉత్తర్వుల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీబీ డ్యామ్, శ్రీశైలం డ్యామ్‌లో నీటి లభ్యత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదైనా పీఏబీఆర్ కోటా నీటిని విడుదల చేస్తుందా లేదా అన్న అంశంపై సర్కారు స్పష్టత ఇవ్వడం లేదు. పీఏబీఆర్ కోటా నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు భారీ ఎత్తున ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నాయి.