కేసీ కెనాల్‌ కోటా నీటి దోపిడీ! | Karnataka administrations exposed during Tungabhadra board inspections | Sakshi
Sakshi News home page

కేసీ కెనాల్‌ కోటా నీటి దోపిడీ!

Published Mon, Apr 12 2021 3:30 AM | Last Updated on Mon, Apr 12 2021 3:30 AM

Karnataka administrations exposed during Tungabhadra board inspections - Sakshi

సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో కేసీ కెనాల్‌ కోటా కింద దక్కాల్సిన జలాలు మన రాష్ట్ర సరిహద్దు చేరకుండా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోంది. నదిలో వరద తగ్గాక దామాషా పద్ధతిలో టీబీ డ్యామ్‌ నుంచి కేటాయింపుల ప్రకారం కేసీ కెనాల్‌కు విడుదల కావాల్సిన నీటిని చౌర్యం చేస్తోంది. ఈ నీటిని తుంగభద్రపై బళ్లారి జిల్లా సిరిగుప్ప తాలుకా సుగూరు వద్ద బొరుకా పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) 4.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం వద్ద నిల్వ చేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రానికి ఎగువన అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల ద్వారా కర్ణాటక సర్కార్‌ చౌర్యం చేస్తుండటం తాజాగా తుంగభద్ర బోర్డు, కేసీ కెనాల్‌ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో బీపీసీఎల్‌కు నోటీసులు ఇచ్చారు. నిబంధనల మేరకు నదిలో వరద ప్రవాహం ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని, వరద లేనప్పుడు ఎలా విద్యుదుత్పత్తి చేస్తారంటూ నిలదీశారు. కర్ణాటక అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల్లో నీటి తరలింపును ఆపివేశారు. బీపీసీఎల్‌ వద్ద నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేయించారు. వరద లేనప్పుడు విద్యుదుత్పత్తి చేస్తే విద్యుత్కేంద్రం అనుమతులను రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించింది. కర్ణాటక ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయడంతో ఎట్టకేలకు కేసీ కెనాల్‌కు వాటా జలాలు చేరాయి. 

2.65 లక్షల ఎకరాలకు జీవనాడి.. కేసీ కెనాల్‌ 
కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. ఈ కెనాల్‌పై ఆధారపడి కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్రలో సుంకేసుల వద్ద 29.9 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కకట్టిన బచావత్‌ ట్రిబ్యునల్‌ మిగిలిన పది టీఎంసీలను వరద తగ్గాక టీబీ డ్యామ్‌ నుంచి విడుదల చేయాలని పేర్కొంది. టీబీ డ్యామ్‌లో నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో ఈ ఏడాది కేసీ కెనాల్‌కు 8 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఇందులో హెచ్చెల్సీ ద్వారా రెండు టీఎంసీలను విడుదల చేసింది. తుంగభద్ర పుష్కరాల సమయంలో నది ద్వారా 2.3 టీఎంసీలను విడుదల చేసింది. మిగతా 3.7 టీఎంసీల కోటాను మార్చి 25 నుంచి రోజుకు 2,500 క్యూసెక్కుల చొప్పున టీబీ డ్యామ్‌ నుంచి బోర్డు విడుదల చేసింది. అయితే ఈ నీటిని బీపీసీఎల్‌ వద్ద నిల్వ చేయించిన కర్ణాటక సర్కార్‌ ఎగువన ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. దీంతో టీబీ డ్యామ్‌ నుంచి విడుదల చేసిన జలాలు కేసీ కెనాల్‌కు చేరడం లేదు. ఈ నేపథ్యంలో టీబీ బోర్డు అధికారులు, కేసీ కెనాల్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయడంతో కర్ణాటక జలచౌర్యం బహిర్గతమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement