బోర్డు పరిధిలోకి తుంగభద్ర-ఆర్డీఎస్ ప్రధాన కాల్వ
తీసుకురావాలని తుంగభద్ర బోర్డుకు రాష్ట్రం వినతి
విడిగా సమావేశం ఏర్పాటు చేస్తామన్న బోర్డు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర నుంచి రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు నీటిని సరఫరా చేసే ప్రధాన కాల్వను బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర బోర్డును కోరింది. అలా అయితేనే ప్రధాన కాల్వల పనులను వేగిరం చేయొచ్చని అభిప్రాయపడింది. గురువారమిక్కడి కేంద్ర జల సంఘం కార్యాలయంలో తుంగభద్ర బోర్డు సమావేశం జరిగింది. ఇందులో చైర్మన్ ఆర్‌కే గుప్తాతోపాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులు పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి కేవలం ఆర్డీఎస్ ఆధునీకరణ అంశమొక్కటి మాత్రమే ఎజెండాలో ఉండటంతో దానిపై సమావేశం చివర్లో చర్చించారు. రాష్ట్రం తరఫున హాజరైన ఈఎన్‌సీ మురళీధర్.. ఆధునీకరణ అంశాన్ని ప్రస్తావించి నీటి కేటాయింపులు, గడిచిన పదేళ్లుగా తెలంగాణకు దక్కుతున్న వాటాలపై వివరించారు.
వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా అందులో 4-5 టీఎంసీలకు మించి దక్కడం లేదన్నారు. దీంతో 87,500 ఎకరాల వాస్తవ ఆయకట్టుకుగాను 30 వేల ఎకరాలకు మించి నీరందడం లేదని తెలిపారు. దీంతోపాటే కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వ పూడికతో నిండినందున 850 క్యూసెక్కులుగా ఉండాల్సిన ప్రవాహం 100కి పడిపోయిందని వివరించారు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించి, ఇప్పటికే అందుకు సంబంధించి రూ.72 కోట్లను కర్ణాటక వద్ద జమ చేసినా పనులు మాత్రం జరగడం లేదని తెలిపారు. గత రెండేళ్లలో రెండుమార్లు పనులు చేసేందుకు కర్ణాటక ముందుకొచ్చినా, ఏపీకి చెందిన కర్నూలు రైతులు అడ్డుపడుతున్నారని, వీరిని నిలువరించకుండా ఏపీ చోద్యం చూస్తోందని చెప్పినట్లు తెలిసింది. దీనిపై బోర్డు స్పందిస్తూ, రెండు, మూడు వారాల్లో తెలంగాణ, కర్ణాటకలతో విడిగా సమావేశం నిర్వహించి అన్ని అంశాలు చర్చిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఏపీ హైలెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్‌లపై చర్చించినట్లు సమాచారం.