అన్నం పెట్టే రైతుకే అన్యాయం చేస్తారా? | Avinash Reddy Support to the Farmers | Sakshi
Sakshi News home page

అన్నం పెట్టే రైతుకే అన్యాయం చేస్తారా?

Published Wed, Jul 4 2018 4:02 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Avinash Reddy Support to the Farmers - Sakshi

రాజేశ్వరి సింగ్‌తో చర్చిస్తున్న మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి

హైదరాబాద్‌: ‘భార్య మెడలోని పుస్తెల్ని తాకట్టు పెట్టి మరీ పంటకు పెట్టుబడి పెట్టాం. కానీ వివిధ కారణాల వల్ల చేతికొచ్చిన పంటను కూడా నష్టపోయాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని మా పంటకు నష్టపరిహారం చెల్లిస్తుందని ఏళ్ల తరబడి ఎదురు చూస్తునే ఉన్నాం. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు. అన్నం పెట్టే రైతుకే ఇలా అన్యాయం చేస్తారా? ఇక మాకు చావే దిక్కు. అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ బిల్డింగ్‌ పైకి ఎక్కి దూకి చస్తాం..’ అంటూ వైఎస్సార్‌ జిల్లాకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పంట బీమా బకాయిలు వెంటనే చెల్లించాలంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో రైతులు మంగళవారం హైదరాబాద్‌లోని అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ముందు ఆందోళనకు దిగారు. తమ బతుకులతో ప్రభుత్వం, ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆడుకుంటున్నాయని వాపోయారు. అనంతరం ఇన్సూరెన్స్‌ కంపెనీ సౌత్‌ ఇండియా ఇన్‌చార్జి ఎం.రాజేశ్వరి సింగ్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ మంత్రి ఇదే కార్యాలయంలో కూర్చొని వాళ్ల రాష్ట్రానికి చెందిన రైతుల బకాయిలు వెంటనే బ్యాంకుల్లో పడేలా చర్యలు తీసుకున్నారని.. తమను మాత్రం పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే తమను హైదరాబాద్‌ చుట్టూ తిప్పంచడం దారుణమన్నారు. 

రైతులతో కలసి ఆందోళన చేస్తాం..: మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. 2011–12 రబీ, 2013 ఖరీఫ్, 2014 రబీ పంటలకు సంబంధించిన బీమా సొమ్ము ఇప్పటికి కూడా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయలేకపోయారని మండిపడ్డారు. 2015–16కు సంబంధించిన పంటల బీమా కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా చెల్లించిన రైతు ఒకవేళ పంట నష్టపోతే ఆరు నెలల్లోగా అతనికి బీమా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ ఐదారేళ్లు అవుతున్నా.. ఇంకా బీమా సొమ్ము ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు చెల్లించకపోవడం వల్లే తాము రైతులకు బకాయిలు చెల్లించలేకపోతున్నట్లు రాజేశ్వరీ సింగ్‌ తెలిపారని వివరించారు. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు.

2012కు సంబంధించి దాదాపు 20 వేల మంది రైతుల అప్లికేషన్లను చిన్న చిన్న తప్పిదాలతో తిరస్కరించారని మండిపడ్డారు. 2016 ఏప్రిల్‌లో లయబులిటీ షేర్‌ కింద వీరి గురించి రివ్యూ తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరిందని చెప్పారు. కానీ.. ఈరోజుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. కేంద్రం అడిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఉంటే వారికి న్యాయం జరిగేదన్నారు. ఇక నాన్‌ ఫార్మర్మ్‌కు సంబంధించిన రూ.14 కోట్లు బీమా సొమ్ము కూడా చెల్లించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజేశ్వరీ సింగ్‌ను ప్రశ్నిస్తే.. ‘రాష్ట్రం నుంచి రూ.7 కోట్లు రావాలి. కేంద్రం నుంచి మరో రూ.7 కోట్లు రావాలి. వాళ్లు ఇస్తే గానీ రైతులకు సొమ్ము చెల్లించలేం’ అంటూ జవాబిచ్చారన్నారు. తక్షణమే రైతులకు తగిన న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ప్రసాద్‌రెడ్డి, గురజాల కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, శేఖర్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement