సర్కారు ‘భూ’తంపై పోరు
భూ సమీకరణపై ‘రాజధాని గ్రామాల’ రైతుల్లో భయాందోళనలు
* ‘రియల్’ దందా చేసే ప్రణాళికపై ఆగ్రహావేశాలు
* సంఘటితమవుతున్న రైతులు.. న్యాయపోరాటానికి సన్నద్ధం
* భూ సమీకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల్లో రైతుల తీర్మానాలు
* కార్యాచరణపై ఈ నెల 8 లేదా 9 తేదీల్లో విజయవాడలో సదస్సు
* 14 గ్రామాల రైతులతో రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ఏర్పాట్లు
* గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల పర్యటనలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ‘భూ సమీకరణ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 17 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల వ్యవసాయ భూములను ‘సమీకరించాల’ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
బంగారం పండే పంట భూములను పైసా ధర చెల్లించకుండా స్వాధీనం చేసుకుని అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించి.. ఆ తర్వాత రైతులకు ఎకరాకు 1,000 గజాల భూమిని తిరిగి ఇచ్చి.. మిగతా భూమిని అటు రియల్టర్లు, ఇటు ప్రభుత్వం పంచుకునే దిశగా చేస్తున్న కసరత్తుపై ఆయా గ్రామాలు, వాటి సమీప గ్రామాల్లో ఆం దోళనకర వాతావరణం నెలకొంది. దీంతో రైతులు తమ భూములను కాపాడుకోవటం కోసం పోరుబాట పడుతున్నారు.
న్యాయ పోరాటానికి రైతులు సన్నద్ధం...
రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల రైతులను భూ సమీకరణకు వ్యతిరేకంగా సంఘటిత పరచడానికి ముఖ్య నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 17 గ్రా మాల్లో 21,000 మంది పట్టాదారు రైతులు, సు మారు 3,000 మంది అసైన్డ్ భూముల రైతులు ఉంటే.. మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరులో ప్రభుత్వ అతిథిగృహానికి వంద మందిని పిలిపించుకుని మాట్లాడి.. భూ సమీకరణకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని ఎలా ప్రకటిస్తారని ఆయా గ్రామాల రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ‘‘ప్రభుత్వం మన భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వారితో అభివృద్ధి చేయించి మిగిలిన భూమిలో మూడు వాటాలు వేస్తుందట. ఇదేం న్యాయం?’’ అంటూ తుళ్లూరు మండలంలోని 14 గ్రామాల రైతులను సంఘటితం చేయడానికి రైతు సంఘాల నేతలు నడుం బిగించారు. ఈ మండలంలోని దాదాపు 5,000 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి సమాలోచనలు జరుపుతున్నారు.
ప్రధాని, రాష్ట్రపతులకు తీర్మానాలు...
ఇప్పటికే పలు గ్రామాల రైతులు, రైతు సంఘా లు భూ సమీకరణకు తాము వ్యతిరేకమని తీర్మానాలు చేశాయి. మిగిలిన గ్రామాల్లో కూడా ఈ తీర్మానాలు చేయించి వీటిని హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి పంపాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు. గ్రా మాల్లో పంటలు పండని భూముల సర్వే నంబర్లు, వాటి వివరాలనూ వీరందరికి సమర్పించి.. ఆ భూముల్లో రాజధాని నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈ నెల 8 లేదా 9వ తేదీన విజయవాడలో 14 గ్రామాల రైతులతో సదస్సు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అవసరమైతే బలవంతంగా భూ సేకరణ చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు వామపక్ష పార్టీలు ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించా యి. రైతాంగం నుంచి భూమిని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారితో మైండ్ గేమ్ ఆడుతుండటాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయడానికి సైతం బీజేపీ వర్గాలు సిద్ధమవుతున్నారు. కాగా వెంకటయపాలెం గ్రామంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన 800 ఎక రాలు ఉన్నందునే దాన్ని సేకరణనుంచి మినహా యించారని రైతు సంఘాలు ఆరోపించాయి.
మా గ్రామాలే త్యాగం చేయాలా?
రాజధాని నిర్మాణం కోసం మా 17 గ్రామాలో లేక ఈ ప్రాంతంలోని మూడు, నాలుగు మండలాల రైతులు మాత్రమే త్యాగం చేయాలా? అంత అవసరమైతే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ పెద్దలు వారి కుటుంబ సభ్యులు, వారి బినామీల పేర్ల మీద ఉన్న భూములను రాజధాని కోసం త్యాగం చేయాలని చెప్పండి. రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. 25,000 ఇస్తే కౌలు రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాలు ఎలా బతకాలి?
- మల్లెల హరీంద్రచౌదరి,
(మాజీ ఎంపీపీ, తుళ్లూరు మండలం)
హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం
‘‘రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రైతులను బెదిరించి భూములు లాక్కోవడం చేయడం మంచిది కాదు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అవగాహన సదస్సుకు హా జరైనట్లు పుస్తకంలో సంతకం పెట్టాలని చెప్పి న అధికారులు రైతులంతా అంగీకరించారని ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. మంత్రి పుల్లారావు తనకు కావాల్సిన వారితో మాత్రమే మాట్లాడి రైతులతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అవసరమైతే పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తాం.
- కొమ్మినేని సత్యనారాయణ (గుంటూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు, బీజేపీ)