విజయవాడ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న నేతలు మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని, ఏపీలో ఉన్న 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేత పైలా సోమినాయుడితో కలిసి సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఉద్యమంలో టీడీపీ కూడా భాగస్వామి కావాలని అన్నారు.
వైఎస్సార్‌సీపీ రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేశారని వ్యాఖ్యానించారు. మోదీ పార్లమెంట్ సాక్షిగా హోదా విషయంలో విషయంలో మోసం చేశారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే మొదటి నుంచి చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు.
అవిశ్వాసం సందర్భంగా టీడీపీ, బీజేపీ చేసిన ద్రోహానికి నిరసనగా రేపు(ఈ నెల 24) బంద్‌కు జగన్ పిలుపునిచ్చారని, టీడీపీ, బీజేపీ చేసిన అన్యాయానికి నిరసనగా అందరూ బంద్‌లో పాల్గొనాలని కోరారు. వైఎస్సార్ హయాంలో విద్యా విప్లవం వచ్చిందని.. సామాన్యులను డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. అలా చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావాలంటే హోదా రావాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా తాము మద్ధతిచ్చామని, అలాగే భవిష్యత్‌లో కూడా మద్ధతు ఇస్తామని తెలిపారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్ధతు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment