కదం తొక్కారు
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు కదం తొక్కారు. సబ్ కలెక్టరేట్ ఎదుట గురువారం భారీ ధర్నా నిర్వహించారు. పార్టీ నేతలు సారథి, ఉదయభాను, గౌతంరెడ్డి, జోగి రమేష్, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప్, కొడాలి నాని, రక్షణనిధి, కల్పన, సింహాద్రి రమేష్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
- ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
- రైతులను విస్మరించిన సీఎం
- ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఏ-1 నిందితుడిగా చేర్చాలి
- వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్
- పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
సాక్షి, విజయవాడ : ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు కదం తొక్కారు. స్థానిక సబ్‌కలెక్టరేట్ వద్ద గురువారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, పాలనను పూర్తిగా విస్మరించిన బాబుకు పాలించే నైతిక అర్హత లేదని విమర్శించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మొదలైన ధర్నా మధ్యాహ్నం వరకు కొనసాగింది.
కృష్ణా డెల్టా ప్రయోజనాలకు విఘాతం...
పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అక్కడి ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని, దీనివల్ల కృష్ణా డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని చెప్పారు. జిల్లాలో సుబాబుల్ రైతులకు పలు కంపెనీలు రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. చెరుకు రైతులకు కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబును ఏ-1 నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు.
బాబుకు ఇంకా జ్ఞానోదయం కాలేదు
పార్టీ ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అవినీతికి పాల్పడి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన చంద్రబాబు.. ఇక్కడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే ముడుపుల వ్యవహారం మళ్లీ మొదలుపెట్టడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు బలవంతంగా భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని, మంత్రులు కూడా ఇదే పని చేస్తూ పాలనను విస్మరించటం సరికాదని చెప్పారు.
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పర్యటనలతో కాలక్షేపం...
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలవారూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోకుండా పనికిమాలిన పర్యటనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. డెల్టా ఆధునికీకరణ మొదలుకొని బందరు పోర్టు వరకు అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ కాల్వకట్టలపై ఉన్న ఇళ్లను ప్రభుత్వం ఇష్టానుసారంగా తొలగించి వారిని నిర్వాసితులను చేయటం సరికాదన్నారు. ఈ వ్యవసాయ సీజన్‌కు 50 శాతం సబ్సిడీతో రైతులకు వితన్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో సహా బాబు పాత్ర బయటపడిందని, ఆయనకు నైతికత ఉంటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకుండా రైతులకు పూర్తిగా అన్యాయం చేశారని, కొత్త పంటలకు రుణాలు కూడా రాని పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా పడకేసిందన్నారు. గత 25 రోజులుగా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు అందరూ చంద్రబాబును రక్షించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ధర్నాలో పార్టీ సమన్వయకర్తలు సామినేని ఉదయభాను, జోగి రమేష్, డాక్టర్ పూనూరి గౌతంరెడ్డి, సింహాద్రి రమేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, దుట్టా రామచంద్రరావు, ఉప్పాల రాంప్రసాద్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్ కుమార్, పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లి రాజశేఖర్, నగరపాలక సంస్థ పార్టీ ఫ్లోర్‌లీడర్ వీఎన్ పుణ్యశీల, కార్పొరేటర్లు వీరమాచినేని లతిత, సీహెచ్ సుజాత, అవుతు శ్రీశైలజ, సంధ్యారాణి, డి.మల్లేశ్వరి, పి.ఝూన్సీలక్ష్మి, కరీమున్నీసా, పి.రవి, బి.విజయ్, బొప్పన భవకుమార్, దామోదర్ బి.బహుదూర్ పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ విజయబాబుకు వినతి పత్రం అందజేశారు.