సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌లో పూడికవల్ల తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు.. డ్యామ్‌కు ఎగువన నవలి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని తుంగభద్ర బోర్డుకు మరోసారి కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. నవలి రిజర్వాయర్‌ను నిర్మిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చాయి.
కానీ, కర్ణాటక సర్కార్ మళ్లీ చేసిన ఆ రిజర్వాయర్ ప్రతిపాదనపై హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించనున్న 219వ సర్వసభ్య సమావేశంలో చర్చించాలని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే నిర్ణయించారు. కొత్త నీటి సంవత్సరం (2023–24)లో తుంగభద్ర డ్యామ్‌లో నీటి పంపిణీ ప్రధాన అజెండాగా తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. రాయ్‌పురే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణల ఈఎన్‌సీలు సి. నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొననున్నారు.
దామాషా పద్ధతిలో నీటి పంపిణీ..
అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్‌ను 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1953లో నిర్మించారు. డ్యామ్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఆంధ్రప్రదేశ్‌కు 72, తెలంగాణకు 6.51 టీఎంసీలను కేటాయించింది. పూడిక పేరుకుపోవడంవల్ల డ్యామ్‌లో నీటినిల్వ 105.78 టీఎంసీలకు తగ్గింది. దాంతో నీటి లభ్యత కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో డ్యామ్‌లో నీటి లభ్యత ఆధారంగా మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో జలాలను తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది.
వాటా జలాలను వాడుకోవడం పేరుతో..
డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంవల్ల మూడు రాష్ట్రాలు ఏటా సగటున 167–175 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కార్ చెబుతోంది. పూడిక తీయడానికి రూ.12,500 కోట్లు వ్యయమవుతుందని లెక్కలువేస్తోంది. దీనికి బదులు తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన నది నుంచి వరద కాలువ తవ్వి నవలి వద్ద కొత్తగా 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని చెబుతోంది.
దీంతోపాటు విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 4.52 టీఎంసీలకు, శివపుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరిస్తామని.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వఉన్న నీటితో మిగతా వాటా జలాలను వాడుకోవచ్చునని కర్ణాటక ప్రతిపాదిస్తోంది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.9,500 కోట్ల వ్యయం అవుతుందని.. దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలు భరించాలని తుంగభద్ర బోర్డు సమావేశాల్లో కోరుతూ వస్తోంది.
వ్యతిరేకిస్తున్న రెండు రాష్ట్రాలు..
నవలి రిజర్వాయర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. అప్పర్ భద్ర, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే కేటాయించిన నీటికంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. నవలి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేస్తున్నాయి. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వి.. వరద రోజుల్లో వాటా (32.5 టీఎంసీలు) తరలిస్తామని.. డ్యామ్‌లో నిల్వ నీటిని మూడు రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో వాటా జలాలను వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment