సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్ వేదికగా కర్ణాటక సరికొత్త నాటకానికి తెరలేపింది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదు.. 105.78 టీఎంసీలని తుంగభద్ర బోర్డు 218వ సర్వసభ్య సమావేశంలో అంగీకరించిన కర్ణాటక 219వ సమావేశంలో అడ్డంతిరిగింది. డ్యామ్ నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు ఉండదని.. అంతకంటే తక్కువే ఉంటుందని.. మళ్లీ హైడ్రోగ్రాఫిక్ సర్వేచేసి, తేల్చాలని పట్టుబట్టింది.
పూడికవల్ల డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గిందనే సాకుచూపి.. జలవిస్తరణ ప్రాంతంలో చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాలను చేపట్టి కర్ణాటక యథేచ్ఛగా జలచౌర్యానికి పాల్పడుతుండటంపై బోర్డును ఏపీ ప్రభుత్వం నిలదీసింది. దీనిపై సంయుక్త సర్వేచేసిన బోర్డు.. కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోందని తేల్చడంతో కర్ణాటకానికి చెక్‌పడింది. దీంతో డ్యామ్ నీటినిల్వ సామర్థ్యంపై ఆ రాష్ట్రం పాత పల్లవి అందుకుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
పూడికతో 33 టీఎంసీలు తగ్గిన నిల్వ
కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్‌ను 1952లో 133 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పట్లో ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. దీని నిల్వ సామర్థ్యం, ఏడాదిలో వచ్చే ప్రవాహాల ఆధారంగా అక్కడ 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం–ఆర్డీఎస్) టీఎంసీల చొప్పున కేటాయించింది.
పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలుగా 2008లో నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో.. నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని పంపిణీ చేస్తోంది.
133 నుంచి 105.78 టీఎంసీలకు..
తుంగభద్ర డ్యామ్‌లో నీటినిల్వ సామర్థ్యంపై ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థతో తుంగభద్ర బోర్డు 2016లో టోపోగ్రాఫికల్ సర్వేను చేయించింది. అందులో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. ఆ సర్వేను కర్ణాటక అంగీకరించకపోవడంతో ఈ అంశంపై మూడు రాష్ట్రాల అధికారులతో జాయింట్ సర్వేను ఈ ఏడాది బోర్డు చేయించింది. ఇందులో డ్యామ్ నిల్వసామర్థ్యం 105.78 టీఎంసీలుగా తేలింది.
ఈ క్రమంలోనే చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాల ద్వారా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతుండటం బయటపడింది. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తిచూపడంతో గత బోర్డు సమావేశంలో డ్యామ్ నీటి సామర్థ్యాన్ని 105.78 టీఎంసీలుగా కర్ణాటక అంగీకరించింది. 2022–23లో దాన్నే పరిగణలోకి తీసుకున్న బోర్డు.. ఆ నీటిని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment