సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు ‘అప్పర్’ గండం ముంచుకొస్తోంది..! అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండా.. కనీసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తుంగభద్ర బోర్డుకు సమాచారం ఇవ్వకుండా కర్ణాటక సర్కారు చేపట్టిన ‘అప్పర్ భద్ర’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కమిటీ 2018 – 19 ధరల ప్రకారం అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో అనుమతి ఇచ్చింది. తాజా ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.21,450 కోట్లుగా ఉంది.
అప్పర్ భద్రకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ కమిటీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన మరుక్షణమే అప్పర్ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కుతుంది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రమే అందజేస్తుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోకుండానే అప్పర్ భద్రకు ఇప్పటికే సాంకేతిక అనుమతి ఇచ్చిన కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చి జాతీయ హోదా కల్పించే ప్రక్రియను వేగవంతం చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం..
కృష్ణా పరీవాహక ప్రాంతంలో తుంగభద్ర సబ్ బేసిన్(కే–8)లో కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) కేటాయించిన 295 టీఎంసీల కంటే కర్ణాటక ఇప్పటికే అధికంగా వాడుకుంటోంది. కర్ణాటకకు టీబీ డ్యామ్ (తుంగభద్ర జలాశయం)కు ఎగువన 151.74 టీఎంసీలు కేటాయిస్తే 176.96 టీఎంసీలను వాడుకుంటున్నట్లు కేడబ్ల్యూడీటీ – 2 సైతం తేల్చి చెప్పింది. అప్పర్ భద్ర ద్వారా 29.40 టీఎంసీలను ఎత్తిపోసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని కర్ణాటక చెబుతున్నా ఆ స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించాలంటే కనీసం 55 టీఎంసీలు అవసరమని, అదే స్థాయిలో నీటిని తరలించేలా కర్ణాటక ప్రాజెక్టును చేపట్టిందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ సీజన్‌లో భద్ర డ్యామ్‌లో నిల్వ చేసిన నీటితో కలుపుకొంటే కర్ణాటక వంద టీఎంసీలకు పైగా వినియోగించుకుందని సీడబ్ల్యూసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కర్ణాటక జలదోపిడీ వల్ల ఇప్పటికే టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గిందని, ఇక అప్పర్ భద్ర పూర్తయితే ఏపీలో దుర్భిక్ష రాయలసీమలో హెచ్చెల్సీ (ఎగువ కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ), కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువతోపాటు తెలంగాణలో ఆర్డీఎస్ కింద వెరసి 6.52 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తుంగభద్ర నుంచి వరద తగ్గడం శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
ఆగమేఘాలపై అప్పర్ భద్ర..
అప్పర్ భద్ర ప్రాజెక్టును 2014లో చేపట్టిన కర్ణాటక జాతీయ హోదాకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను 2015లోనే సాధించింది. ఈ అనుమతులతో సంబంధం లేకుండానే పనులు చేపట్టి 2019 మే నాటికే రూ.4,830 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. ఆ తర్వాత సాంకేతిక అనుమతి కోసం కేంద్ర జల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. 2020 ఆగస్టు 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే ఆమోదముద్ర వేసింది.
సీడబ్ల్యూసీ ఆమోదించిన అప్పర్ భద్ర స్వరూపం ఇదీ..
► తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజూ 1,342 క్యూసెక్కుల చొప్పున 17.4 టీఎంసీలను 80 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి 11.263 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా భద్ర జలాశయంలోకి తరలిస్తారు.
► భద్ర జలాశయం నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజుకు 2,308 క్యూసెక్కుల చొప్పున 29.90 టీఎంసీలను ఎత్తిపోసి 47.50 కి.మీ. (అజాంపుర వద్ద 6.9 కి.మీ. సొరంగంతో సహా) పొడవున తవ్వే కెనాల్ ద్వారా తరలిస్తారు.
► భద్ర జలాశయం నుంచి తవ్వే ప్రధాన కాలువ 47.5 కి.మీ. వద్ద రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రదుర్గ, జగల్‌పూర్, తుమకూర్ బ్రాంచ్ కెనాల్‌లోకి నీటిని ఎత్తిపోసి చిక్‌మగళూర్, చిక్‌బళాç్ల³Nర్, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్ల (5,57,247 ఎకరాలకు) ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 367 చెరువులను నింపి ఆయకట్టును స్థిరీకరిస్తారు.
లెక్కలు.... కాకి లెక్కలే!
‘కేడబ్ల్యూడీటీ – 1 కేటాయించిన నీటిలో పది టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల 6.25 వెరసి 23 టీఎంసీలు మిగిలాయి. ఇక కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటా 2.40 టీఎంసీలు, మిగులు జలాలు ఆరు టీఎంసీలు వెరసి 31.4 టీఎంసీలు కాగా ప్రవాహ నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటాం’ అని కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీకి అందచేసిన డీపీఆర్‌లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అయితే తుంగ, భద్ర, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని తుంగభద్ర బోర్డు అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటి కంటే కర్ణాటక అధికంగా వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 కూడా పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు నీటి లభ్యతపై కర్ణాటక చెప్పేవన్నీ కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment