krishna delta
-
ఆ 45 టీఎంసీలూ ఏపీవే
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి మళ్లించే 80 టీఎంసీలకుగాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగిలే 45 టీఎంసీల కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతాయని కేడబ్ల్యూడీటీ–2కు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ డైరెక్టర్ అనిల్ కుమార్ (ఏకే) గోయల్ స్పష్టం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు ఆ 45 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని చెప్పారు. జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 విచారణ శుక్రవారం కొనసాగింది. ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి ఏకే గోయల్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తున్నందున నాగార్జున సాగర్ నుంచి ఆ మేరకు కృష్ణా డెల్టాకు విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చు కదా అంటూ తెలంగాణ న్యాయవాది అడిగిన ప్రశ్నలకు తగ్గించుకోవచ్చునని గోయల్ చెప్పారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించిన సంవత్సరంలో మాత్రమే.. సాగర్ నుంచి విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చునని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించే ఒప్పందం 1978 ఆగస్టు 4న ఉమ్మడి రాష్ట్రంలోనే బేసిన్‌లోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిందన్నారు. గోదావరి జలాలను మళ్లించే ప్రాంతం, మళ్లించిన జలాలను వినియోగించుకునే ప్రదేశం రెండూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నందున.. మళ్లించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కే దక్కాలని తేల్చిచెప్పారు. గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా బేసిన్లో 45 టీఎంసీల లభ్యత అదనంగా ఉందన్నది వాస్తవమేనా అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా.. ఆ అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చాలని గోయల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)లను గుర్తించలేదని తెలిపారు. ఎస్సెల్బీసీ పూర్తయ్యేంత వరకూ ఏఎమ్మార్పీ ద్వారా నీటిని వాడుకోవచ్చునని, ఎస్సెల్బీసీ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు.మీరు రూపొందించిన ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిలో విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులను చేర్చారని, కానీ నెట్టెంపాడు ఎత్తిపోతలను ఎందుకు చేర్చలేదని తెలంగాణ న్యాయవాది అడగ్గా.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌కు మాత్రమే ఆ నియమావళిని రూపొందించానని గోయల్ చెప్పారు. జూరాల ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తరలిస్తారని ఎత్తిచూపారు. సాక్షిగా మీరు స్వతంత్రంగా వాంగ్మూలం ఇస్తున్నట్లు లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు సాక్షిగా పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారు కదా అన్న తెలంగాణ న్యాయవాది వాదనను గోయల్ తోసిపుచ్చారు.ముగిసిన సాక్షుల విచారణఏపీ ప్రభుత్వం తరఫు సాక్షిని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్, మౌఖిక వాంగ్మూలం ముగిసినట్లు ట్రిబ్యునల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకరించింది. తదుపరి విచారణను జనవరి 16, 17కు వాయిదా వేసింది. -
పోలవరం ఇక ఉత్త బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఆ ప్రాజెక్టు చుక్కాని అయిన పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి. ఈ డిజైన్ ప్రకారమే స్పిల్ వేను 55 మీటర్ల ఎత్తుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాంను పూర్తి స్థాయిలో నిర్మించి, నిర్వాసితులకు పునరావాసం కల్పించి 194.6 టీఎంసీలను నిల్వ చేయాలి.కానీ.. ప్రాజెక్టు నీటిని నిల్వ చేసే మట్టాన్ని 41.15 మీటర్లకే తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేవలం 115.44 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడిది ధవళేశ్వరం బ్యారేజి తరహాలోనే మారిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలు. గోదావరిలో ప్రవాహం ఉంటేనే గోదావరి డెల్టా ఆయకట్టుకు ఈ బ్యారేజ్ ద్వారా నీటిని మళ్లిస్తారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుంది.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కలే..పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి 63.20 టీఎంసీలను తరలించి ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారు. అందుకే పోలవరం ఎడమ కాలువను 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారు. కానీ.. పోలవరం ప్రాజెక్టును కుదించడం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నీళ్లందించడం కూటమి ప్రభుత్వం కలగా మార్చేసిందని నిపుణులు మండిపడుతున్నారు. గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకంపోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కుడి కాలువ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పోలవరం జలాశయాన్ని కుడి కాలువతో అనుసంధానం చేసే జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతి కోరుతూ 2022, మే 4న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించింది. కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్‌కు తరలించే గోదావరి జలాల్లో రెండు టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్ (వెలిగొండ) మీదుగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నీటిని సోమశిల మీదుగా కావేరికి తరలించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడంతో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమైంది. తాగు నీటికి, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బందేకమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో.. నీటి పారుదల విభాగానికి అయ్యే నిధులిస్తే చాలని 2016 సెప్టెంబరు 7న అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. దాంతో తాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సాగు నీటితోపాటే తాగునీటినీ తీసుకెళ్తాం కాబట్టి తాగు నీటి విభాగానికి అయ్యే నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 28.50 లక్షల మంది దాహార్తి తీర్చడంతోపాటు విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీల సరఫరాకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు కుదించడంతో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొందని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నీరుగారిపోనున్న ప్రాజెక్టు లక్ష్యాలుపోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించడం ద్వారా 41.15 మీటర్లలో 115.44 టీఎంసీలు నీరే నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలే నీరుగారిపోతాయి.» నీటి మట్టం 41.15 మీటర్లకంటే ఎగువన ఉంటేనే కుడి, ఎడమ కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ రెండు కాలువల ద్వారా నీరందక 7.20 లక్షల ఎకరాలకు నీరందని దుస్థితి.» కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. ఇందుకు 80.09 టీఎంసీలు అవసరం. ఇదే కాలువ ద్వారా కృష్ణా డెల్టాలో 13.18 లక్షల ఎకరాల స్థిరీకరణకు 84.70 టీఎంసీలు మళ్లించాలి. అంటే.. కుడి కాలువ ద్వారానే 164.79 టీఎంసీలు మళ్లించాలి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి 84.80 టీఎంసీలు అవసరం. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు మళ్లించాలి. అంటే ఎడమ కాలువకు 108.24 టీఎంసీలు అవసరం. » కుడి, ఎడమ కాలువల ద్వారా పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీళ్లందిస్తున్న 2.98 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అంటే.. ప్రాజెక్టు కింద నిర్దేశించిన మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు, గోదావరి డెల్టాలో రెండో పంటకు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం. » పోలవరానికి ఎగువన తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోస్తారు. గోదావరి ఉప నదులపై ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరానికి వరద వచ్చే రోజులు కూడా తగ్గనున్నాయి. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును తగ్గించడంతో ఆయకట్టుకు నీళ్లందించం సవాలే అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.నాగార్జున సాగర్‌లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్‌వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.మిడతపాట్లు వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి.. -
కృష్ణాడెల్టాకు సమర్థంగా నీళ్లు అందిస్తున్న విషం చిమ్మిన రామోజీ
-
Fact Check: కృష్ణాడెల్టాను ఎండబెట్టింది మీ చంద్రబాబే
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడమే పనిగా పెట్టుకున్న రామోజీ కుక్క తోకలా తన బుద్ధి కూడా వంకరేనని రామోజీరావు ఎప్పటికప్పుడు తన రాతల ద్వారా నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే.. కృష్ణాడెల్టా చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో 2019, 2020, 2021, 2022లలో ఖరీఫ్‌కే కాదు.. అధికారికంగా రబీ పంటకు వైఎస్ జగన్ ప్రభుత్వం సమృద్ధిగా నీళ్లందించి రైతులకు దన్నుగా నిలిచింది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల కృష్ణా బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లోనే కాదు.. కృష్ణా డెల్టాలోనూ తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటలను రక్షించి.. రైతులకు దన్నుగా నిలవడానికి జలవనరుల శాఖాధికారులతో సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సమర్థవంతంగా నీళ్లందించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. పైగా.. పులిచింతల నీటికి గోదావరి (పట్టిసీమ) జలాలను జతచేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా కృష్ణా డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందిస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులను వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమిస్తూ.. సమర్థవంతంగా నీళ్లందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తుంటే రామోజీరావు అది చూసి క్షణం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. నిజాలను దాచేసి.. అభూతకల్పనలు, పచ్చి అబద్ధాలను వల్లెవేస్తూ.. ‘కృష్ణా డెల్టాను ఎండబెట్టేశారు’ అంటూ పెడబొబ్బలు పెడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే తన విషపుత్రిక ఈనాడులో రామోజీ విషం చిమ్మారు. ఇందులోని ప్రతి అక్షరంలో ఆయన అక్కసు తప్ప వీసమెత్తు నిజంలేదు. కృష్ణా డెల్టాకు 85.81 టీఎంసీలు సరఫరా.. ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2023–2024 ఖరీఫ్ పంటలకు జూన్ 7న ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఆయకట్టులో 9.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటివరకూ 85.81 టీఎంసీల నీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు లేకపోవడంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి 35.93 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా 29.88 టీఎంసీల గోదావరి జలాలు.. మున్నేరు, పాలేరు, కట్టలేరు, కీసర వాగుల ద్వారా వచ్చిన 20 టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణాడెల్టాకు అందించింది. ముందస్తు ప్రణాళికతో.. నిజానికి.. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతోపాటు రాష్ట్రంలోనూ తక్కువగా వర్షాలు కురిశాయి. కృష్ణా డెల్టాలోనూ అదే పరిస్థితి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తగినంత నీటి ప్రవాహం రాకపోవడంతో వాటి నుంచి కృష్ణాడెల్టాకు నీటిని విడుదలచేసే పరిస్థితి ఈ ఏడాది లేదు. దీనిని ముందే గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తూ.. కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా.. ఈ సీజన్ ప్రారంభంలో పులిచింతల ప్రాజెక్టులో 38 టీఎంసీలు ఉండగా.. గోదావరిలో వరద ప్రవాహం రానంతవరకూ కృష్ణా డెల్టాలో పంటలకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో పట్టిసీమ పంపులను జూలై 21న ఆన్‌చేసి గోదావరి జలాలను ఎత్తిపోశారు. వాటికి పులిచింతల నీటిని జతచేసి.. కృష్ణా డెల్టాకు నీళ్లందించింది. ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ఈ ప్రణాళికను అమలుచేయడంవల్లే తెలంగాణలో కురిసిన వర్షాలకు మూసీ నది ద్వారా పులిచింతలలో తిరిగి 19 టీఎంసీలను నిల్వచేయగలిగింది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు ప్రణాళికాబద్ధంగా అందిస్తోంది. అదే పులిచింతల ప్రాజెక్టులో నీటిని ముందుగా వినియోగించుకోకపోయి ఉంటే.. మూసీ ద్వారా వచ్చిన వరద సముద్రం పాలయ్యేది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పంటలు పచ్చగా.. ► ఇక కృష్ణా బేసిన్లోనే కాదు.. కృష్ణా డెల్టాలో కూడా ఆగస్టు, అక్టోబరు నెలల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. ఇటువంటి పరిస్థితులు అరుదు. ప్రకృతి సహకరించకపోయినా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వారబందీ విధానంలో ప్రణాళికాబద్ధంగా నీటిని అందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు బాసటగా నిలబడుతోంది. ఇదీ వాస్తవం. కానీ, నీళ్లందకపోవడంవల్ల తూర్పు, పశ్చిమ డెల్టాల్లో కన్నీటి ప్రవాహం అంటూ ప్రభుత్వంపై రామోజీ ఎప్పటిలాగే తన అక్కసు వెళ్లగక్కారు. ► అలాగే, దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పంటలను రక్షించేందుకు వారబందీ విధానాన్ని అమలుచేస్తూ.. ఒక వారంపాటు సగం నిర్ధేశిత ప్రాంతాలకు.. మరో వారం మిగతా సగం నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ విధానంలో నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నప్పుడు మిగతా నిర్దేశిత ప్రాంతాల్లోని కాలువల్లో ప్రవాహం ఉండదు. అప్పుడు చివరి భూములకు రైతులు ఆయిల్ ఇంజన్లతో కాలువల్లో నిలిచి ఉన్న నీటిని తోడిపోసుకుని పంటలు కాపాడుకోవడం అక్కడక్కడ జరుగుతుంది. దీన్నే భూతద్దంలో చూపించి వేలాది ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయని ‘ఈనాడు’ గగ్గోలు పెట్టింది. ► అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ ఒకేఒక్క పంటకు అరకొరగా నీళ్లందించారు. ఆ సమయంలో కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినా.. రైతులు నష్టపోయినా రామోజీరావు పెన్నెత్తి మాట అనలేదు. ఎందుకంటే.. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు కాబట్టి. కృష్ణా తూర్పునకు 52.69.. పశ్చిమానికి 33.12 టీఎంసీలు.. కృష్ణా తూర్పు డెల్టాలో 7,36,953 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 5,30,136 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటివరకూ 52.69 టీఎంసీలను సరఫరా చేశారు. వారబందీ విధానాన్ని అమలుచేస్తూ ఆయకట్టుకు నీటిని సమర్థవంతంగా సరఫరా చేస్తున్నారు. ఏలూరు కెనాల్‌కు రోజూ 800 క్యూసెక్కుల నుంచి 1,200 క్యూసెక్కులు ఇప్పటివరకూ సరఫరా చేశారు. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు ప్రభుత్వం ఇలా అన్ని చర్యలు తీసుకుంటోంది. అలాగే.. ► కృష్ణా పశ్చిమ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలు ఆయకట్టు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉండగా.. పూర్తి ఆయకట్టులో రైతులు పంటలు సాగుచేశారు. వాటికి ఇప్పటివరకూ 33.12 టీఎంసీలు అందించారు. ► పశ్చిమ డెల్టాకు శనివారం 4,808 క్యూసెక్కులను విడుదల చేశారు. పొన్నూరు మండలం జడవల్లి గ్రామంలో టీఎస్ ఛానల్ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు శనివారం నుంచి వారబందీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు. ► అలాగే, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని ఏఎం ఛానల్ పరిధిలోని ఆయకట్టుకు, బాపట్ల జిల్లాలో బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెంలోని ఆయకట్టుకు సోమవారం నుంచి వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తారు. ► మరోవైపు.. సీఎం జగన్, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సమక్షంలో సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారబందీ విధానంలో నీళ్లందిస్తూ పంటలను రక్షించేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. ► ఇక పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీలు నిల్వఉన్నాయి. గోదావరిలో ప్రవాహాలు ఉన్నంత వరకూ పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోసి.. మరీ అవసరమైతే పోలవరం ప్రాజెక్టు రివర్ స్లూయిస్ ద్వారా నీరువదిలి.. వాటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టింది. పులిచింతలతో కృష్ణా డెల్టా సుభిక్షం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌కు ముందస్తుగా నీళ్లందించాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పులిచింతల ప్రాజెక్టును చేపట్టి.. 2009 నాటికే దానిని చాలావరకూ పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం అప్పటి నుంచి నీటిని నిల్వచేస్తున్నారు. 2014లో పూర్తి గరిష్ఠ స్థాయి సామర్థ్యం అయిన 45.77 టీఎంసీలను నిల్వచేయవచ్చు. కానీ, అప్పటి సీఎం చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, తెలంగాణలో ఎత్తిపోతలకు పరిహారం చెల్లించకపోవడంవల్ల ప్రాజెక్టులో అరకొరగా నీటిని నిల్వచేసి.. తక్కువ నీటిని సరఫరా చేసి.. లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెట్టి కృష్ణాడెల్టా రైతుల కడుపుకొట్టారు. కానీ, వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, తెలంగాణకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించి 2019లోనే పూర్తిస్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వచేశారు. 2020, 2021, 2022లోనూ అదే స్థాయిలో నీటిని నిల్వచేసి.. నాలుగేళ్లుగా డెల్టాలో ఏటా రెండు పంటలకు నీళ్లందించారు. అలాగే, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు సమర్థవంతంగా నీళ్లందిస్తుండటానికి ప్రధాన కారణం పులిచింతల ప్రాజెక్టే. -
అనుసంధానం అడుగు పడేదెలా?
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి. ఇందుకు గోదావరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్లో అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబడుతున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవాల్‌గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారతదేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
పులిచింతల ప్రాజెక్టు గేటు బిగింపు పూర్తి
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు స్థానంలో కొత్త గేటును బిగించారు. జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థ బీకెమ్ ప్రతినిధులు శుక్రవారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 250 టన్నుల బరువున్న గేటును భారీ క్రేన్ల సహాయంతో అమర్చారు. స్పిల్ వే 16, 17 పియర్స్ (కాంక్రీట్ దిమ్మెలు) మధ్య గేటును దించి.. ఆర్మ్ గడ్డర్లను పియర్స్ ట్రూనియన్ బీమ్ల యాంకర్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్‌లతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత గేటును పైకి ఎత్తుతూ.. కిందకు దించుతూ పలుమార్లు పరీక్షించారు. గేటు పనితీరు ప్రమాణాల మేరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జపాన్‌లో బుష్‌ల తయారీ, దిగుమతిలో జాప్యం వల్లే నాగార్జున సాగర్ నిండిపోవడంతో 2021 ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 55,028 క్యూసెక్కులను తెలంగాణ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఆ రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 2021 ఆగస్టు 5 తెల్లవారుఝామున ఏడు గేట్లను రెండడుగులు ఎత్తారు. ఈ క్రమంలోనే 16వ గేటు ఎడమ వైపు పియర్ ట్రూనియన్ బీమ్ విరిగిపోయి గేటు ఊడిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, 48 గంటల్లోనే దాని స్థానంలో స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలాశయంలో నీటి నిల్వ తగ్గాక కొత్త గేటు బిగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 16, 17వ పియర్లకు ట్రూనియన్ బీమ్‌లను కొత్తగా నిర్మించారు. గేటును కూడా సిద్ధం చేశారు. గేటును పియర్స్ మధ్య బిగించడానికి, వాటి ఆర్మ్ గడ్డర్లను ట్రూనియన్ బీమ్లతో అనుసంధానం చేసే సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. కొత్త బుష్‌ల తయారీలో జపాన్ సంస్థ తీవ్ర జాప్యం చేసింది. దీని వల్లే గేటు బిగింపు ఆలస్యమైంది. పది రోజుల క్రితం జపాన్ సంస్థ బుష్లను పంపడంతో అదే రోజు గేటు బిగింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు శుక్రవారం పూర్తి చేశారు. కృష్ణా డెల్టాకు వరం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటకు సకాలంలో నీటిని విడుదల చేసి.. తుపానులు వచ్చేలోగా పంట కోతలు పూర్తయ్యేలా చేయడం ద్వారా రైతుకు దన్నుగా నిలవాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 నవంబర్ 18న పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 20,37,656 క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు సులభంగా విడుదల చేసేలా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. స్పిల్‌వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2019 ఆగస్టులోనే పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత నాలుగేళ్లుగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ కృష్ణా డెల్టాలో రెండు పంటలకు సకాలంలో నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. -
నీటి ఎద్దడి నివారణపై 80 దేశాల సదస్సు
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అజెండాతో నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజీ) 25వ అంతర్జాతీయ సదస్సు (ఇంటర్నేషనల్ కాంగ్రెస్) నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఐసీఐడీ ఉపాధ్యక్షుడు, 25వ కాంగ్రెస్ నిర్వాహక కార్యదర్శి కె.యల్లారెడ్డితో కలిసి మంత్రి అంబటి రాంబాబు ఐసీఐడీ 25వ కాంగ్రెస్, ఆ సంస్థ 74వ ఐఈసీ (ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రతిష్టాత్మక సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు. ఐసీఐడీలో సభ్యత్వం ఉన్న 80 దేశాలకు చెందిన సుమారు 400 నుంచి 500 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సుమారు 500 నుంచి 600 మంది సాంకేతిక నిపుణులు సైతం సదస్సులో పాల్గొంటారన్నారు. నీటి ఎద్దడిపైనే ఫోకస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నీటి ఎద్దడిని యాజమాన్య పద్ధతుల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవడమే అజెండాగా 1951లో భారత్ ప్రోద్బలంతో ఐసీఐడీ ఏర్పాటైందని మంత్రి రాంబాబు చెప్పారు. తొలుత 11 సభ్య దేశాలతో ప్రారంభమైన ఐసీఐడీ ఇప్పుడు ప్రపంచంలో నీటిపారుదల, డ్రెయినేజీ వ్యవస్థలున్న 80 దేశాలు సభ్యులుగా ఉన్నాయన్నారు. ప్రతి మూడేళ్లకు ఓసారి ఐసీఐడీ సమావేశమై నీటి యాజమాన్య పద్ధతులపై మేధోమథనం చేసి నీటిఎద్దడిని ఎదుర్కోవడంపై ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఐసీఐడీ 6వ కాంగ్రెస్ 1966లో మన దేశంలో జరిగిందని, 57 ఏళ్ల తర్వాత ఆ సంస్థ 25వ కాంగ్రెస్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తుండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, సదస్సును విజయవంతం చేయడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కృష్ణా డెల్టాకుగోదావరి జలాలు పులిచింతలలో నిల్వ చేసిన నీటితో ఇన్నాళ్లూ కృష్ణా డెల్టాకు నీళ్లందించామని మంత్రి రాంబాబు చెప్పారు. ప్రస్తుతం పులిచింతలలో నీటి నిల్వ 17.41 టీఎంసీలకు చేరుకుందని, కృష్ణాలో వరద ప్రవాహం రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పంపులను రీస్టార్ట్ చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. నాలుగేళ్లలో ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే పట్టిసీమ ఎత్తిపోతలను వాడుకున్నామని గుర్తు చేశారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువకు 5 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానించాలా? లేదంటే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారని తెలిపారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ డయా ఫ్రమ్ వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి చెప్పారు. ఐసీఐడీ 25వ కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శి కె.యల్లారెడ్డి మాట్లాడుతూ నీటి యాజమాన్యంలో మెరుగైన పద్ధతులు పాటించిన దేశాలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందచేస్తామని తెలిపారు. -
చివరికంటా.. సిరుల పంట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి కాలువలకు బుధవారం నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం విజయవాడలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో డెల్టాకు జూలై నెలలో సాగు నీరు విడుదల చేసేవారు. దీంతో పంట కోత సమయంలో తుపానుల గండంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. దీంతో పాటు రెండో పంట ఆలస్యమై గణనీయంగా దిగుబడులు తగ్గేవి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గత ఏడాది జూన్10వ తేదీన సాగు నీటిని విడుదల చేసింది. ఈ ఏడాది ఇంకా ముందుగానే సాగునీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టాకు సంబంధించి ఐదు జిల్లాల పరిధిలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కృష్ణా తూర్పు డెల్టాకు సంబంధించి కృష్ణా జిల్లా పరిధిలో 5.62 లక్షల ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 1,757 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 34.76 టీఎంసీల నీరు ఉంది. నీటి లాసెస్ పోను 29.76 టీఎంసీ నీరు అందుబాటులో ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాగు నీరు జూన్ నెలకు 6.90 టీఎంసీలు, జూలై నెలకు 27.60 టీఎంసీ అవసరం అని లెక్కించారు. గత ఏడాది నీటి వినియోగం ఇలా.. గత ఏడాది సకాలంలో వర్షాలు కురవటం, ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరటంతో ఆయకట్టుకు నీటిని పుష్కలంగా విడుదల చేశారు. గత ఏడాది ఖరీఫ్, రబీ, తాగునీటి అవసరాలకు సంబంఽధించి 194.62 టీఎంసీల నీటిని వినియోగించారు. ఇందులో కృష్ణా తూర్పు డెల్టాకు 118.21 టీఎంసీలు, పశ్చిమ డెల్టాకు 76.41 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గత ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ సముద్రంలోకి 1,331.14 టీఎంసీలు వెళ్లాయి. పనులు పూర్తి.. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టు 16వ గేటుకు సంబంధించిన రూ. 8.64 కోట్లతో చేపట్టే పనులు తుది దశకు చేరాయి. ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి అంచనాలు రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. కృష్ణానది కరకట్ట రక్షణ గోడకు సంబంధించి రెండు దశల పనులు పూర్తి అయ్యాయి. మూడో దశ పనులు పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మవారధి వరకు రూ.138.80కోట్లతో శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణా నదిలో పూడికతీత పనులు చేపట్టారు. ఇప్పటికే కాలువ మరమ్మతులు, పూడిక తీత, తుడికాడ తొలగింపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాగు సంబరం.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు సంబరంగా మారింది. గతంలో సాగునీటి కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. రెండేళ్లుగా నైరుతి కంటే ముందుగానే కాలువలకు నీటిని విడుదల చేసి సాగు పనులు ముమ్మరం అయ్యేలా, సాగునీటికి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. – కంచర్ల వెంకటరావు, రైతు, కోలవెన్ను సకాలంలో సాగునీరు.. ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తోంది. గతేడాది కూడా సాగుకు ముందుగానే కాలువలకు సాగునీరు విడుదల చేసింది. ఈ ఏడాది కూడా సాగునీరు విడుదలకు చర్యలు తీసుకున్నారు. కాలువనీటిపై ఆధారపడి సాగు అధికంగా ఉంటుంది. వ్యవసాయ పనులు ఊపందుకోవటానికి మంచి అవకాశం. – మసిముక్కు సాంబశివరావు, రైతు, దావులూరు రెండు జిల్లాల్లో ఆయకట్టు ఇలా.. ప్రధాన కాలువ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఆయకట్టు జిల్లా ఆయకట్టు (ఎకరాల్లో) (ఎకరాల్లో) బందరు కాలువ 1.51లక్షలు – కేఈబీ కాలువ 1.38లక్షలు – ఏలూరు కాలువ 0.56లక్షలు 1332 రైవస్ కాలువ 2.17లక్షలు 425 మొత్తం 5.62లక్షలు 1,757 నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో 5.62 లక్షల ఎకరాలకు పైగాఆయకట్టు గత ఏడాది 194 టీఎంసీల నీటి వినియోగం -
పులిచింతల ప్రాజెక్టు: పాత పాపాలే శాపాలు!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నిర్వాకాలు పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా డెల్టా రైతులనూ ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడా లేని రీతిలో ఆర్బిట్రేషన్ నిబంధనను ఈ కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చడం ద్వారా బొల్లినేని ఆదిలోనే ప్రజాధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు బాటలు వేశారు. డిజైన్ మారడం వల్ల చేసే పని పరిమాణం పెరిగితే.. అందుకు అదనంగా బిల్లులు చెల్లించేందుకు సర్కార్ అంగీకరించకుంటే ఆర్బిట్రేషన్ (వివాదాల పరిష్కార మండలి)కి పంపుతారు. ఈ కాంట్రాక్టు ఒప్పందంలో ఆర్బిట్రేషన్‌లో ఒక సభ్యుడిని బొల్లినేని, మరొక సభ్యుడిని జలవనరుల శాఖ, ఇంకో సభ్యుడిని ఆ ఇద్దరూ ఎన్నుకునేలా నిబంధన చేర్చడం గమనార్హం. ఈలోగా 2004 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆర్బిట్రేషన్‌ను అడ్డుపెట్టుకుని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టే వరకూ పులిచింతల ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత పనులను పరుగులు పెట్టించారు. ఆర్బిట్రేషన్‌ను అడ్డుపెట్టుకుని అదనపు బిల్లుల కోసం బొల్లినేని రామారావు చీటికిమాటికీ పేచీ పెడుతుండటంతో జలవనరుల శాఖలో చేపట్టే పనుల్లో ఆ నిబంధనను వైఎస్సార్ రద్దు చేశారు. పనుల్లో జాప్యం వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాంట్రాక్టర్ పేచీకి దిగడంతో ఆర్బిట్రేషన్ సూచనల మేరకు రూ.5.65 కోట్ల పరిహారాన్ని అప్పట్లో సర్కార్ చెల్లించింది. అయినప్పటికీ ఆర్బిట్రేషన్ నిబంధనను అడ్డుపెట్టుకుని అదనపు బిల్లుల కోసం మరోసారి పేచీ పెట్టారు. పులిచింతల స్పిల్‌వేను 500.25 మీటర్లు పెంచారని.. గేట్లను 32 నుంచి 24కు తగ్గించారని.. భూసేకరణలో జాప్యం వల్ల ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలని.. ఇలా 27 అంశాల్లో అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో బొల్లినేని కోరారు. దీన్ని పరిశీలించిన డీఏబీ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రతిపాదనలు చేశారు. మొత్తమ్మీద రూ.199.96 కోట్లను అదనంగా చెల్లించాలంటూ 2013 అక్టోబర్ 3న ప్రతిపాదించారు. డీఏబీ–2 ప్రతిపాదనలను ముగ్గురు ఐఏఎస్‌లతో నియమించిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీకి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పంపారు. కాంట్రాక్టర్‌కు గరిష్టంగా రూ.72 కోట్లను చెల్లించడానికి నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. కోర్టులో కేసును నీరుగార్చి... లోపాయికారీగా సహకరించి తన ప్రభుత్వాన్ని రక్షించిన చంద్రబాబు సూచనల మేరకు పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు నిధులు ఇవ్వాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో ఆ మేరకు చెల్లింపులు చేసేలా జలవనరుల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో న్యాయ వివాదాలు తలెత్తడంతో మచిలీపట్నం కోర్టు పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లుల చెల్లింపుపై సుదీర్ఘ విచారణ జరిపింది. కాంట్రాక్టర్ ప్రస్తావించిన 27 అంశాలను తిప్పికొట్టేలా సమర్థ వాదనలు వినిపించకుండా గత సర్కారు అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మచిలీపట్నం కోర్టు 2016 జూన్ 2న తీర్పిచ్చింది. దాని ప్రకారం రూ.199.96 కోట్లను 2013 అక్టోబర్ 3 నుంచి 15% వడ్డీతో కాంట్రాక్టర్‌కు చెల్లించాలి. వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.399.34 కోట్లకు చేరుకుంది. రూ.199.67 కోట్లు దోచిపెట్టిన చంద్రబాబు.. మచిలీపట్నం కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు అనుమతించాలంటూ 2016 జూన్ 2 నుంచి 2018 అక్టోబర్ 1 వరకూ జలవనరుల శాఖ అధికారులు పలుదఫాలు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, నాటి మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిపాదనలు పంసినా న్యాయ సలహా పేరుతో కాలయాపన చేశారు. చివరకు వ్యూహాత్మకంగా 2018 అక్టోబర్ 23న హైకోర్టును ఆశ్రయించడానికి గత సర్కార్ అనుమతి ఇచ్చింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయకుండా 766 రోజులు ఏం చేశారంటూ నాడు హైకోర్టు ప్రశ్నించింది. కేసును విచారించాలంటే కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అంటే రూ.199.67 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఈమేరకు 2019 జనవరి 1న టీడీపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తాన్ని ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు చూపకుండానే డ్రా చేసుకున్న బొల్లినేని–చంద్రబాబు ద్వయం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున వెదజల్లినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బొల్లినేని ఇలా చంద్రబాబు దన్నుతో ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్లే పులిచింతల 16వ గేటు ఊడిపోయిందని స్పష్టమవుతోంది,. -
తెలంగాణ ఏజీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సీజే
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి.. కృష్ణా డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి ఆయన తప్పుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా కేసులను విచారించే న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదిస్తారా? ప్రాంతీయ భావంతో చూస్తారా? అంటూ మండిపడ్డారు. న్యాయస్థానం ప్రథమ కోర్టు అధికారైన అడ్వొకేట్ జనరల్ న్యాయమూర్తుల నిజాయితీని అనుమానిస్తూ... ఉద్దేశాలను ఆపాదిస్తూ అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేసులను ఏ న్యాయమూర్తి విచారించినా మెరిట్స్ మీద వాదనలు వినిపించాలే తప్ప... న్యాయమూర్తులకు ఇలా నీచమైన, హీనమైన ఉద్దేశాలను ఆపాదించరాదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34 ఆధారంగా విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల ప్రాజెక్టు నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని, దీంతో తమ సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందంటూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణ ప్రసాద్, ఎం.వెంకటప్పయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో... ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని సీజే పేర్కొన్నారు. తదుపరి విచారణను రెండుమూడు రోజుల్లో తెలియజేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఏజీ అభ్యంతరం.. సీజే ఆగ్రహం మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం కేసుల విచారణ ప్రారంభించగానే అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై.. నీటిపారుదల ప్రాజెక్టుల కేసులను ఇదే(సీజే) ధర్మాసనం విచారించాలని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అభ్యంతరం వ్యక్తం చేసినా.. జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్‌ను విచారిస్తోందని చెప్పారు. అక్కడ విచారించకుండా ఇక్కడికి బదిలీ చేసేలా చూడాలని కోరారు. జస్టిస్ రామచందర్‌రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి విచారించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిందని రైతుల తరఫున సీనియర్ న్యాయవా ది వేదుల వెంకటరమణ నివేదించారు. దీంతో జస్టిస్ హిమాకోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో ఊహించుకొని నిజాయితీ, నిబద్ధత కల్గిన న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోవాలని ఎలా కోరతారంటూ ఏజీపై మండిపడ్డారు. న్యాయమూర్తికి ప్రాంతీయ భావాన్ని అంటగడుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాల ని ఆదేశించారు. న్యాయమూర్తులెవరికీ వ్యక్తిగత ఉద్దేశాలు, అభిప్రాయాలు ఉండవని, మెరిట్స్ ఆధారంగా తీర్పులిస్తారని స్పష్టం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై పిటిషన్లను తమ ధర్మాసనం, రాష్ట్ర పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందన్నారు. డెల్టా రైతుల పిటిషన్లో ఈ రెండు అంశాలు ఉన్నందున ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సందేహం తలెత్తిందని, వివరణ తీసుకునేందుకు రిజిస్ట్రీ అధికారులకు తగిన సమయం ఇవ్వాల్సిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోరం హంటింగ్ (నచ్చిన ధర్మాసనానికి బదిలీ కోసం) చేస్తున్నట్లుగానే మీరు ఆఘమేఘాల మీద విచారణ చేయాలని ఎందుకు కోరారని, రిజిస్ట్రీకి కొంత సమయం ఇవ్వాల్సిందంటూ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా విచారణ ఆపాలని కోరుతూ తన ముందు ప్రస్తావించిన విషయాన్ని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు ధర్మాసనానికి తెలియజేసి విచారణ ఆపాలని కోరాలని సూచించారు. ఈ పిటిషన్‌ను ఏ ధర్మాసనం విచారించాలన్నది తేలుస్తామన్నారు. ఈ కేసు ఫైల్‌ను తన ముందుంచాలని రిజిస్ట్రీ అధికారులను ఆదేశించారు. సీజే సూచన మేరకే విచారించాం... జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్‌పై విచారణను ప్రారంభించగానే.. సీజే ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను ఆపాలని సూచించారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘ఈ విషయంపై మాకు సమాచారం లేదు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇదే అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజిస్ట్రీ అధికారులు విషయాన్ని సీజేకు తెలియజేశారు. ఈ పిటిషన్‌పై సీజే సమాచారం ఇచ్చిన తర్వాతే విచారించాలని నిర్ణయించాం. మీ అభ్యంతరాలను తోసిపుచ్చి విచారణ ప్రారంభించాం. పిటిషన్ విచారణార్హతపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదావేశాం. ఒకసారి విచారణ ప్రారంభించిన తర్వాత మళ్లీ మరో ధర్మాసనానికి పంపాలని కోరడం ఏంటి?’అని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే విచారణను భోజన విరామం తర్వాతకు వాయిదా వేయాలని, అప్పటిలోగా సమాచారం వస్తుందని ఏజీ తెలిపారు. భోజన విరామం తర్వాత ఈ పిటిషన్‌ను రిజిస్ట్రీకి పంపాలని సీజే సూచించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణ నివేదించారు. ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని పేర్కొన్నారని తెలిపారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పేర్కొంటూ ఈ పిటిషన్‌ను రిజిస్ట్రీకి పంపాలని ఆదేశించింది. -
కృష్ణా డెల్టాకు జలభద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు మరింత జల భద్రత చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 23 కి.మీ. ఎగువన ఇబ్రహీంపట్నం మండలం దామలూరు వద్ద కృష్ణా నదిపై పది టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. 2020–21 ధరల ప్రకారం ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ బ్యారేజీ ద్వారా మున్నేరు, కట్టలేరు, పాలేరు వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు అమరావతి, తుళ్లూరు తదితర మండలాల ప్రజలకు తాగునీటి అవసరాలను ఈ బ్యారేజీ ద్వారా తీర్చాలని నిర్ణయించింది.. ఈ బ్యారేజీ కమ్ రోడ్డు బ్రిడ్జి ద్వారా గుంటూరు–హైదరాబాద్‌ల మధ్య 45 కి.మీ.ల దూరం తగ్గుతుంది. దామలూరు బ్యారేజీ జలరవాణాకు, పర్యాటక రంగానికి మరింత ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దామలూరు బ్యారేజీ ఎందుకంటే.. కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. అయితే దీని తరువాత కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి వరకూ దాదాపు 163 కి.మీల పొడవున నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు లేదు. ప్రకాశం బ్యారేజీ నీటినిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీటిని మళ్లించడంతోపాటు గుంటూరు, విజయవాడ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ బ్యారేజీపైనే ఆధారపడుతున్నారు. పులిచింతలకు దిగువన మున్నేరు, పాలేరు, కట్టలేరు వాగులు కృష్ణాలో కలుస్తాయి. ఇవి తరచూ ఉప్పొంగి ప్రవహిస్తాయి. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఈ వరద జలాలు కడలిపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదను ఒడిసి పట్టడం కోసం దామలూరు వద్ద పది టీఎంసీలతో బ్యారేజీ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. బ్యారేజీ కమ్ రోడ్ బ్రిడ్జి.. కృష్ణా నదిపై దామలూరు వద్ద 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,245 మీటర్ల పొడవున స్పిల్‌వేతో బ్యారేజీని నిర్మించేలా జలవనరుల శాఖ అధికారులు డిజైన్ రూపొందించారు. ఎడమ వైపు 1,695 మీటర్లు, కుడి వైపున 122.14 మీటర్ల పొడవున బ్యారేజీకి అనుబంధంగా మట్టికట్ట నిర్మిస్తారు. బ్యారేజీలో గరిష్టంగా 27 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేస్తారు. బ్యారేజీలోనే జలరవాణాకు వీలుగా నావిగేషన్ లాక్‌లను ఏర్పాటు చేస్తారు. బ్యారేజీ బ్రిడ్జిపై రెండు వరుసలతో రహదారి నిర్మించి గుంటూరు–హైదరాబాద్ హైవేతో అనుసంధానం చేస్తారు. బ్యారేజీ సివిల్ పనులకు రూ.738.463 కోట్లు, మెకానికల్(గేట్లు, హైడ్రాలిక్ హాయిస్ట్‌లు) పనులకు రూ.204.363 కోట్లు, నిర్వహణకు రూ.5.473 కోట్లు వెరసి దాదాపు రూ.948.30 కోట్లు వ్యయం అవుతుంది. జీఎస్టీ రూపంలో రూ.136.81 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ముంపునకు గురయ్యే 10,673 ఎకరాల భూసేకరణకు రూ.1,069.58కోట్లు, ఇతర పనులకు రూ.14.31 కోట్లు వెరసి సుమారు రూ.2,169 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి అంచనాలను రూపొందించారు. ఆర్థిక శాఖ ఆమోదముద్ర లభించగానే పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఏపీ: కొల్లేరు, కృష్ణా డెల్టాపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి ఆయకట్టుకు మళ్లించడం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా రూ.75,724 కోట్ల వ్యయంతో కొత్తగా 51 ప్రాజెక్టుల పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ప్రాజెక్టుల పనులు ప్రణాళికాయుతంగా పూర్తి చేసేందుకు ఐదు స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ)ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుల పనుల వ్యయంలో 70 శాతాన్ని జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమీకరిస్తుండగా మిగతా 30 శాతం నిధులను బడ్జెట్ ద్వారా కేటాయించి ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. శ్రీశైలానికి వరద సమయంలోనే.. కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాభావ పరిస్థితులు, ఎగువన ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద 35 నుంచి 40 రోజులకు తగ్గిపోయింది. అది కూడా ఒకేసారి గరిష్టంగా వస్తోంది. ఈ నేపథ్యంలో వరద వచ్చే రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా ఎత్తిపోతలు, కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను ప్రభుత్వం కొత్తగా చేపట్టింది. అవసరమైన చోట కొత్తగా ప్రాజెక్టుల పనులు చేపట్టింది. మొత్తమ్మీద 32 ప్రాజెక్టులను రూ.43,203 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆరీ్డఎంపీడీసీ)ను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా..: పోలవరం ఎడమ కాలువ నుంచి 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలించడం ద్వారా ఉత్తరాంధ్రలో కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాండవ–ఏలేరు అనుసంధానం ద్వారా 57,065 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పనులను చేపట్టేందుకు ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టŠస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(యూఏఐడీసీ) పేరుతో ఎస్పీవీ ఏర్పాటైంది. దీని ద్వారా రూ.8,554 కోట్ల వ్యయంతో మొత్తం నాలుగు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. దుర్భిక్ష పల్నాడుకు దన్ను..: గోదావరి, వరికపుడిశెలవాగు వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష పల్నాడును సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు, వరికపుడిశెల ఎత్తిపోతల ద్వారా వాగు వరద నీటిని తరలించడం ద్వారా పల్నాడును సుభిక్షం చేసే పనులను చేపట్టేందుకు పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఏడీఎంసీ) పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది. ఈ ఎస్పీవీ కింద ఆరు ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి రూ.8,276 కోట్లతో అనుమతి ఇచ్చింది. గోదావరి వరదతో రాష్ట్రానికి జలభద్రత.. గోదావరి వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాథమికంగా పోలవరం కుడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గోదావరి జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించే పనులను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పనులను మొత్తం మూడు విభాగాలుగా చేపట్టడానికి రూ.12,707 కోట్ల వ్యయం కానుందని అంచనా. వాటిని చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టŠస్(ఏపీఎస్‌డబ్ల్యూఎస్డీపీ) పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా డెల్టా, కొల్లేరు పరిరక్షణే ధ్యేయం..: కృష్ణా డెల్టా, కొల్లేరు సరస్సులను ఉప్పు నీటి బారిన పడకుండా చేయడం ద్వారా వాటికి జీవం పోసే పనులను అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలు, వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల, కొల్లేరు పరిరక్షణ పనులను చేపట్టేందుకు కృష్ణా–కొల్లేరు సెలైనిటి మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది. ఈ ఎస్పీవీ కింద రూ.2,989 కోట్లతో ఆరు ప్రాజెక్టులను చేపట్టనుంది. -
‘అప్పర్ భద్ర’కు జాతీయ హోదా?
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు ‘అప్పర్’ గండం ముంచుకొస్తోంది..! అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండా.. కనీసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తుంగభద్ర బోర్డుకు సమాచారం ఇవ్వకుండా కర్ణాటక సర్కారు చేపట్టిన ‘అప్పర్ భద్ర’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీ 2018 – 19 ధరల ప్రకారం అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో అనుమతి ఇచ్చింది. తాజా ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.21,450 కోట్లుగా ఉంది. అప్పర్ భద్రకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ కమిటీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన మరుక్షణమే అప్పర్ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కుతుంది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రమే అందజేస్తుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోకుండానే అప్పర్ భద్రకు ఇప్పటికే సాంకేతిక అనుమతి ఇచ్చిన కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి జాతీయ హోదా కల్పించే ప్రక్రియను వేగవంతం చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం.. కృష్ణా పరీవాహక ప్రాంతంలో తుంగభద్ర సబ్ బేసిన్(కే–8)లో కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) కేటాయించిన 295 టీఎంసీల కంటే కర్ణాటక ఇప్పటికే అధికంగా వాడుకుంటోంది. కర్ణాటకకు టీబీ డ్యామ్ (తుంగభద్ర జలాశయం)కు ఎగువన 151.74 టీఎంసీలు కేటాయిస్తే 176.96 టీఎంసీలను వాడుకుంటున్నట్లు కేడబ్ల్యూడీటీ – 2 సైతం తేల్చి చెప్పింది. అప్పర్ భద్ర ద్వారా 29.40 టీఎంసీలను ఎత్తిపోసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని కర్ణాటక చెబుతున్నా ఆ స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించాలంటే కనీసం 55 టీఎంసీలు అవసరమని, అదే స్థాయిలో నీటిని తరలించేలా కర్ణాటక ప్రాజెక్టును చేపట్టిందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సీజన్లో భద్ర డ్యామ్‌లో నిల్వ చేసిన నీటితో కలుపుకొంటే కర్ణాటక వంద టీఎంసీలకు పైగా వినియోగించుకుందని సీడబ్ల్యూసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కర్ణాటక జలదోపిడీ వల్ల ఇప్పటికే టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గిందని, ఇక అప్పర్ భద్ర పూర్తయితే ఏపీలో దుర్భిక్ష రాయలసీమలో హెచ్చెల్సీ (ఎగువ కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ), కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువతోపాటు తెలంగాణలో ఆర్డీఎస్ కింద వెరసి 6.52 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తుంగభద్ర నుంచి వరద తగ్గడం శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఆగమేఘాలపై అప్పర్ భద్ర.. అప్పర్ భద్ర ప్రాజెక్టును 2014లో చేపట్టిన కర్ణాటక జాతీయ హోదాకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను 2015లోనే సాధించింది. ఈ అనుమతులతో సంబంధం లేకుండానే పనులు చేపట్టి 2019 మే నాటికే రూ.4,830 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. ఆ తర్వాత సాంకేతిక అనుమతి కోసం కేంద్ర జల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. 2020 ఆగస్టు 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే ఆమోదముద్ర వేసింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన అప్పర్ భద్ర స్వరూపం ఇదీ.. ► తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజూ 1,342 క్యూసెక్కుల చొప్పున 17.4 టీఎంసీలను 80 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి 11.263 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా భద్ర జలాశయంలోకి తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజుకు 2,308 క్యూసెక్కుల చొప్పున 29.90 టీఎంసీలను ఎత్తిపోసి 47.50 కి.మీ. (అజాంపుర వద్ద 6.9 కి.మీ. సొరంగంతో సహా) పొడవున తవ్వే కెనాల్ ద్వారా తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి తవ్వే ప్రధాన కాలువ 47.5 కి.మీ. వద్ద రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రదుర్గ, జగల్పూర్, తుమకూర్ బ్రాంచ్ కెనాల్లోకి నీటిని ఎత్తిపోసి చిక్మగళూర్, చిక్బళాç్ల³Nర్, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్ల (5,57,247 ఎకరాలకు) ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 367 చెరువులను నింపి ఆయకట్టును స్థిరీకరిస్తారు. లెక్కలు.... కాకి లెక్కలే! ‘కేడబ్ల్యూడీటీ – 1 కేటాయించిన నీటిలో పది టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల 6.25 వెరసి 23 టీఎంసీలు మిగిలాయి. ఇక కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటా 2.40 టీఎంసీలు, మిగులు జలాలు ఆరు టీఎంసీలు వెరసి 31.4 టీఎంసీలు కాగా ప్రవాహ నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటాం’ అని కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీకి అందచేసిన డీపీఆర్‌లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అయితే తుంగ, భద్ర, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని తుంగభద్ర బోర్డు అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటి కంటే కర్ణాటక అధికంగా వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 కూడా పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు నీటి లభ్యతపై కర్ణాటక చెప్పేవన్నీ కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. -
భద్రంగా కట్టుకోండి!
కర్ణాటక జలదోపిడీకి సంపూర్ణ సహకారం ఇచ్చేలా కేంద్రం నిర్ణయాలు చేస్తోంది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించి, అభ్యంతరాలను పట్టించుకోకుండా... ఏకపక్షంగా కొమ్ముకాస్తోంది. కేటాయింపులకు మించి నీటి వాడకాన్ని ప్రతిపాదిస్తూ కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో కర్ణాటక ఎడాపెడా నీటిని తోడేస్తే... దిగువనున్న తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలున్నాయి. సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాల గరిష్ట నీటి వినియోగమే లక్ష్యంగా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ చేసిన నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్– 2 అవార్డు నోటిఫై కాకముందే, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వడ మే తప్పుగా పరిగణిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా జా తీయ హోదాకు సిఫారసు చేయడం తెలుగు రా ష్ట్రాలకు మింగుడు పడని అంశంగా మారింది. ప్ర ధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది ఆమోదంతో జాతీయ హోదా దక్క నుంది. ఈ లాంఛనం పూర్తయితే ప్రాజెక్టు వ్యయా న్ని కేంద్రమే భరిస్తుంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే దిగువ తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, దీన్ని కేం ద్రం విస్మరించడం, ఏకపక్షంగా నిర్ణయాలు చేయడంపై గట్టిగా నిలదీయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తన అభ్యంతరాలతో త్వరలోనే కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాయనుంది. ఎగువనే నీటిని అడ్డుకునేలా... కర్ణాటక ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ సామర్థ్యం తగ్గిందని చెబుతూ, ఆ నష్టాన్ని పూడ్చేలా 31.15 టీఎంసీల సామర్థ్యంతో నవాలి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. తుంగభద్ర కు భారీ వరద ఉన్నప్పుడు ఆ నీటిని వరద కాల్వ ద్వారా కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల ని ల్వ సామర్థ్యాలను పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద కలిపి మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో దిగువకు వరద ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయ ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కర్ణాటక విన డం లేదు. దీనిపై రాష్ట్రం.. కేంద్రానికి సైతం ఫిర్యా దు చేసింది. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తి శాఖ జాతీయ హోదాను ఇవ్వడం తెలంగాణకు మరింత మింగుడుపడని అంశంగా మారింది. ఎడాపెడా ఎత్తిపోతలు... నిజానికి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక సర్కార్ 2014లోనే రూ.16,125.28 కోట్లతో శ్రీకారం చు ట్టింది. తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి 17.4 టీఎంసీలను భద్ర జలాశయంలోకి ఎత్తిపోస్తారు. ఆపై భద్ర నుంచి 29.90 టీఎంసీలను ఎత్తిపోస్తూ.. చిక్మగళూర్, చిత్రదుర్గ, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో సూక్ష్మ నీటిపారుదల (బిందు సేద్యం) విధానంలో 2,25,515 హెక్టార్లకు నీళ్లందిస్తారు. ఇందులో తుంగ నుంచి నీటిని ఎత్తిపోసే పనులను రూ.324 కోట్లతో, భద్ర జలాశయం నుంచి నీటిని తరలించే పనులను రూ.1,032 కోట్ల తో పూ ర్తిచేసింది. మొత్తంగా రూ.4,800 కోట్ల మేర వ్య యం చేశాక 2018లో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అను మతి కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది. అయి తే దీనిపై తెలంగాణ అప్పట్లోనే కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–2లో అప్పర్ తుంగకు 11 టీఎంసీ, అప్పర్‌భద్ర కు 9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. అయి తే ఈ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కానందున ఈ నీటి వినియోగానికి కర్ణాటకకు అవకాశం లేదు. అదీగాక తీర్పులో పేర్కొన్న దానికన్నా అధికంగా నీటిని వినియోగించేలా అప్పర్ భద్రను చేపట్టింది. దీనికితోడు ఒక నదిలో నీటి వినియోగంతో దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగితే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం మేరకు పరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే సీడబ్ల్యూసీ అనుమతించింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఎగువన కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు కూడా పూర్తయితే, తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ఆయకట్టు... 87,500 ఎకరాలు ప్రమాదంలో పడుతుంది. ఏపీలోని హెచ్చెల్సీ, కేసీ కెనాల్ల కింది ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడుతుం గభద్ర జలాశయానికి వరద వచ్చే అవకాశమే ఉండ దు. అదే జరిగితే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్‌కు వచ్చే వరద కూడా తగ్గనుంది. కాగా కాళేశ్వరం ప్రా జెక్టుకు జాతీయ హోదా అడిగినప్పుడల్లా ఆ విధానాన్నే పక్కనబెట్టామని చెబుతూ వస్తున్న కేంద్రం అప్పర్ భద్రకు హోదా ఇవ్వడంపై రాష్ట్ర నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
‘కృష్ణా’పై 3 బ్యారేజీలు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాలకు సమర్థంగా నీరందించడంతో పాటు.. డెల్టా పరిరక్షణే లక్ష్యంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సముద్రంలో కలుస్తున్న కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం–రామచంద్రాపురం మధ్య రూ.1,215 కోట్లతో, బండికొల్లంక–రావిఅనంతవరం మధ్య రూ.1,350 కోట్లతో బ్యారేజీల నిర్మాణానికి ఇప్పటికే సర్కార్ ఉత్తర్వులిచ్చింది. కృష్ణా డెల్టాలో సకాలంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరందించేందుకు దివంగత సీఎం వైఎస్సార్ 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. డెల్టాకు మరింత సమర్థంగా నీరందించేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,235.27 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ► కృష్ణా నదిపై 1,323 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీల దిగువున 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించనున్నారు. తొలి దశలో బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు, భూసేకరణ కోసం రూ.102.17 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ► కృష్ణా నదిపై 1,373 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 62 కి.మీ దిగువన 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. సర్వే, ఇన్వెస్టిగేషన్ తదితర పనులు, భూసేకరణ కోసం రూ.102.20 కోట్లను ఇప్పటికే సర్కార్ మంజూరు చేసింది. జల, ఉపరితల రవాణాకు ఊతం.. కృష్ణా నదిపై మూడు బ్యారేజీల నిర్మాణం అంతర్గత జల రవాణా, ఉపరితల రవాణాలకు ఊతం ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన బ్యారేజీలను నిర్మించడం వల్ల ఆ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. కొత్తగా నిర్మించే బ్యారేజీల వల్ల పులిచింతల నుంచి హంసలదీవి వరకూ నదిలో నీరు నిల్వ ఉంటుందని.. ఇది జలరవాణాకు ఊతమిస్తుందంటున్నారు. డెల్టా పరిరక్షణ భూగర్భ జలమట్టం తగ్గడం వల్ల భూమి పొరల్లోకి సముద్ర జలాలు చొచ్చుకురావడం, కృష్ణా నది వెంబడి సముద్రపు జలాలు పైకి ఎగదన్నడం వల్ల కృష్ణా డెల్టా చౌడు బారుతోంది. పంటల దిగుబడులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగునీటికీ ఇబ్బందులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టా పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భూగర్భ జలమట్టం తగ్గకుండా కాపాడుకోవచ్చు. -
శతవసంతాల కల.. సాకారమైన వేళ
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా ప్రజల వందేళ్ల కల అయిన పులిచింతల ప్రాజెక్టు నేడు జలకళతో కళకళలాడుతోంది. ఆ కలను సాకారం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుడితే.. ఆ మహానేత తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ స్వప్నాన్ని పరిపూర్ణం చేశారు. తెలంగాణ సర్కార్‌తో చర్చించి, ముంపు సమస్యను పరిష్కరించారు. దీంతో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్‌లో కృష్ణా డెల్టాలో పంటలకు సమృద్ధిగా నీరు లభించడంతో పాటు, వచ్చే ఖరీఫ్‌కు కూడా సకాలంలో నీళ్లందుతాయంటూ రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1911లోనే నివేదిక కృష్ణా నదిపై బ్యారేజిని నిర్మిస్తే డెల్టాను సస్యశ్యామలం చేయవచ్చని సర్ ఆర్థర్ కాటన్ 1852లో నాటి బ్రిటిష్ సర్కార్‌కు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా 1852లో కెప్టెన్ చారీస్ రూ. రెండు కోట్ల ఖర్చుతో బ్యారేజి నిర్మించారు. అయితే 1954లో వచ్చిన వరదలకు బ్యారేజి కుంగిపోవడం వల్ల 1954–57 మధ్య ప్రకాశం బ్యారేజి నిర్మించారు. ఈ బ్యారేజి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గడం.. ఖరీఫ్ పంటలకు జూన్‌లో నీళ్లందించే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం బ్రిటిష్ అధికారి కల్నల్ ఇల్లీస్ అధ్యయనం చేశారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా కృష్ణా డెల్టాకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చని 1911లో బ్రిటిష్ సర్కార్‌కు నివేదిక ఇచ్చారు. సింహభాగం వైఎస్ హయాంలో పూర్తి దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం, ఓట్ల గండం గడిచాక దాన్ని అటకెక్కించడం రివాజుగా మార్చుకున్నారు. మే 14, 2004న ముఖ్యమంత్రిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక జలయ/æ్ఞంలో భాగంగా రూ. 1,281 కోట్ల అంచనాతో పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. ఆ ప్రాజెక్టు పనులను 2009 నాటికే సింహభాగం పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు కొంత భాగం మిగిలాయి. 2009 నుంచి ఇటీవల కాలం వరకూ పునరావాసం పనులను పూర్తి చేయలేకపోయారు. దీనివల్ల ప్రాజెక్టు పూర్తయినా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేని దుస్థితి. పులిచింతలలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల 2014–15లో 73.33, 2015–16లో 9.259, 2016–17లో 55.21, 2018–19లో 38.88 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. తెలంగాణ సర్కార్‌కు కేవలం రూ.42 కోట్ల మేర పరిహారం చెల్లించడంలో టీడీపీ సర్కార్ విఫలం కావడం వల్ల 2017లో పులిచింతలలో 30 టీఎంసీలకు మించి నిల్వ చేయలేని దుస్థితి ఏర్పడింది. పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడానికి వీలుగా తెలంగాణ సర్కార్‌కు చెల్లించాల్సిన పరిహారాన్ని విడుదల చేయించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించి.. ముంపు గ్రామాలను ఖాళీ చేయించి.. ప్రాజెక్టులో నీటి నిల్వకు సహకరించాలని కోరారు. ఇందుకు కేసీఆర్ సమ్మతించారు. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఇటు గుంటూరు.. తెలంగాణలో సూర్యాపేట జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించి ప్రాజెక్టులో తొలి సారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. దాంతో కృష్ణా డెల్టా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా చింతలు తీరినట్లే.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో ఆలస్యంగా వరి సాగు చేయడం వల్ల అక్టోబర్, నవంబర్ నాటికి పంట కోతకు వస్తుంది. ఆ సమయంలో తుపాన్ల వల్ల పంట నష్టం జరుగుతోంది. జూన్‌లోనే వరి సాగు చేస్తే తుపాన్ల బారి నుంచి పంటలను రక్షించవచ్చునని భావించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసే నీటితో కృష్ణా డెల్టాలో వరి సాగుకు జూన్‌లోనే నీళ్లందివచ్చు. ప్రస్తుత ఖరీఫ్‌లో పంటలకు సమర్థవంతంగా నీటిని సరఫరా చేయడంతోపాటు.. వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌లోనే సాగు నీటిని విడుదల చేయవచ్చు. -
నాడు కల.. నేడు నిజం
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నాలను సాకారం చేయడానికి 2004లో ముందు చూపుతో చేపట్టిన జలయజ్ఞం ఫలాలు నేడు ప్రజలకు చేరువయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రకు తోటపల్లి, వంశధారతో దన్నుగా నిలిస్తే దుర్భిక్ష రాయలసీమకు హంద్రీ–నీవా, గాలేరు–నగరితో ఊపిరి పోశారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులతో కృష్ణా, గోదావరి డెల్టాలనే కాదు.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రణాళిక రచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2004లో రూ.లక్ష కోట్ల బడ్జెట్ లేదు. కానీ.. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. వాటిని పూర్తి చేయడం ద్వారా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి పక్కాగా ప్రణాళిక రచించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి 16 ప్రాజెక్టులను పూర్తి చేశారు. మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల హంద్రీ–నీవా, గాలేరు–నగరిలను 2004లో చేపట్టి, 2009 నాటికి తొలి దశ పూర్తి చేశారు. రెండో దశ పనులను కూడా ఓ కొలిక్కి తెచ్చారు. ప్రస్తుతం గాలేరు – నగరి కాలువ ద్వారా గోరకల్లు, అవుకు, గండికోట, మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చు ముందు చూపుతోనే నేడు సాగు నీరు కృష్ణా డెల్టా ప్రజల తొమ్మిది దశాబ్దాల కల పులిచింత ప్రాజెక్టును 2009 నాటికే పూర్తి చేశారు. ప్రస్తుతం పులిచింతలో 44 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడటానికి ఆ మహానేత ముందుచూపే కారణం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వంశధార, తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల కింద భారీ ఎత్తున రైతులు పంటలు సాగు చేస్తున్నారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించి.. 2004లో పనులు ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువ పనులను సింహభాగం పూర్తి చేశారు. హెడ్ వర్క్స్‌కు అవసరమైన భూమిని అత్యధిక భాగం సేకరించారు. ఆ ప్రాజెక్టును కొలిక్కి తెచ్చే క్రమంలోనే మహానేత హఠన్మరణం చెందారు. ఆ మహానేత తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పక్కాగా ప్రణాళిక రచించారు. -
రేపు ఉదయం కృష్ణా డెల్టాకు నీటి విడుదల
సాక్షి, విజయవాడ : జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం కృష్టాజిల్లా 31వ నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పార్థసారధి, మల్లాది విష్ణు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం 9.45 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. పంట దెబ్బతినకుండా ప్రతి రైతుకు నీరు అందిస్తామన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను కొనసాగిస్తామని కొడాలి నాని పేర్కొన్నారు. సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రస్తుతం 70 శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అవసరమైతే కాలువలను పర్యవేక్షణ చేయాలని నాని కోరారు. -
ఆపదలో ‘అన్నపూర్ణ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణ’గా భాసిల్లడానికి కారణమైన గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఆకలి దప్పులు తప్పడం లేదు. ఈ రెండు డెల్టాలతోపాటు పెన్నా డెల్టాలోనూ సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ముంచుకొస్తోంది. డెల్టాలు ఉప్పునీటి కయ్యలుగా, సాగుకు పనికి రాని భూములుగా మారుతున్నాయి. ఈ కఠోర వాస్తవాన్ని సాక్షాత్తు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదిక బట్టబయలు చేసింది. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో భూములు శరవేగంగా చౌడుబారుతుండటం.. సాగుకు పనికి రాకుండా పోతుండటం.. పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుండటానికి కారణాలను అన్వేషించి.. పరిస్థితిని చక్కదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2014 జూన్ 19న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీడబ్ల్యూసీని ఆదేశించారు. నాలుగేళ్లపాటు సమగ్ర అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశానికి తూర్పు, పశ్చిమ తీర రేఖలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లతో కలిపి 7,516.6 కిలోమీటర్ల పొడవునా తీరం విస్తరించి ఉంది. దీవుల తీర రేఖను మినహాయిస్తే.. దేశానికి తూర్పు, పశ్చిమాన 5,422.6 కిలోమీటర్ల పొడవున తీర రేఖ ఉంది. దేశం నుంచి ప్రవహిస్తున్న 102కు పైగా నదులు తూర్పు, పశ్చిమ తీర రేఖల మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రానికి 973.7 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఇది విస్తరించి ఉంది. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్యన ప్రవహిస్తున్న కృష్ణా నది, ఉభయ గోదావరి జిల్లాల నడుమ ప్రవహిస్తున్న గోదావరి, నెల్లూరు మీదుగా ప్రవహించే పెన్నా, స్వర్ణముఖి, కండలేరు, శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవహించే వంశధార నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎల్‌నినో, లానినో ప్రభావం వల్ల సముద్ర మట్టం ఎత్తు కనిష్టంగా 0.6 మీటర్ల నుంచి గరిష్టంగా రెండు మీటర్ల వరకు పెరిగింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 903.2 మిల్లీమీటర్లు కురవాలి. ప్రకాశం జిల్లాలో కనిష్టంగా 757 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరిలో గరిష్టంగా 1,139 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో ప్రవాహం ఏడాది పొడవునా ఉండటం లేదు. సముద్ర మట్టం ఎత్తు పెరగడం.. నదుల్లో ఏడాది పొడవున ప్రవాహం లేకపోవడం వల్ల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోకి నదులు, డ్రెయిన్ల ముఖద్వారాల మీదుగా సముద్రపు నీరు ఎగదన్నుతోందని.. ఇది భూమిని చౌడుబారేలా చేస్తుందని సీడబ్ల్యూసీ తేల్చింది. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు.. తీర ప్రాంతంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భూగర్భ జలాలు ఉప్పు బారిపోవడం ఖాయమని, అప్పుడు డెల్టాల్లో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీరు కూడా కష్టమవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. భూమి చౌడుబారడం వల్ల సాగుకు పనికి రాకుండా పోతుందని.. పంట దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని.. దీనివల్ల ఆకలికేకలు తప్పవని అభిప్రాయపడింది. నదులు, డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లను నిర్మించి.. ఉప్పునీళ్లు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మడ అడవులను భారీ ఎత్తున పెంచి, తీరంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని పేర్కొంది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలని.. భూగర్భం నుంచి తోడేసిన నీటిని.. వర్షకాలం అయినా రీఛార్జ్ చేయాలని.. దీనివల్ల ఉప్పు నీరు పైకి ఉబికి వచ్చే అవకాశం ఉండదని నివేదికలో పేర్కొంది. నదుల్లో ఏడాది పొడవునా ప్రవాహాలు కనిష్ట స్థాయిలోనైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చేపల చెరువుల సాగును తగ్గించాలని.. రసాయన, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని కనిష్ట స్థాయికి చేర్చాలని సూచించింది. రక్షణ చర్యలు తీసుకోకపోతే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కావడం ఖాయమని స్పష్టం చేసింది. భూగర్భ జలాలు తోడేయడంతో.. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో సాగునీటితోపాటు చేపల చెరువుల సాగుకు, తాగునీటి కోసం భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోతోంది. బోరుబావుల ద్వారా తోడిన మంచినీటి స్థానంలోకి ఉప్పునీరు చేరుతోందని సీడబ్ల్యూసీ గుర్తించింది. చేపల చెరువుల ప్రభావం వల్ల భూమి శరవేగంగా చౌడుబారుతోందని తేల్చింది. 2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. మడ అడవులను నరికేయడం.. సునామీ దెబ్బకు తీర ప్రాంతం బలహీనపడటం వల్ల సముద్రపు నీరు ఉపరితలానికి బాగా ఎగదన్నింది. వీటి ప్రభావం వల్ల తీర ప్రాంతంలో 38 మండలాలు పూర్తిగానూ.. 26 మండలాల్లో భూములు పాక్షికంగానూ చౌడుబారాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది, పశ్చిమగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 13, గుంటూరులో 12, ప్రకాశంలో 13, నెల్లూరు జిల్లాలో రెండు మండలాల్లో భూములు చౌడుబారినట్టు లెక్క తేల్చారు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో 75.92 లక్షల ఎకరాల భూమి చౌడుబారిపోతే.. రాష్ట్రంలో 9.61 లక్షల ఎకరాల భూమి చౌడుబారి సాగుకు పనికి రాకుండా పోయింది. మిగతా ప్రాంతాల్లోనూ నేల చౌడు (క్షార) స్వభావం శరవేగంగా పెరుగుతోంది. ఇది కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఏటా సగటున ఐదు శాతం చొప్పున దిగుబడి తగ్గుతోందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. తీర ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం 50 శాతం అధికంగా ఉందని, ఇది నేల స్వభావం శరవేగంగా మారడానికి దారితీస్తోందని తేల్చింది. -
‘గుంటూరు చానల్’లోనూ కమీషన్ల కక్కుర్తి
సాక్షి, అమరావతి : గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులు కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు దక్కవని నిర్ధారణకు వచ్చిన ముఖ్య నేత.. జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి టెక్నికల్ బిడ్ స్థాయిలోనే టెండర్‌ను ఈ నెల 7న రద్దు చేయించారు. తాజాగా అంచనా వ్యయాన్ని మరింతగా పెంచేయించి, ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలను మార్చేసి టెండర్ నోటిఫికేషన్ ఇప్పించారు. ఫిబ్రవరి 4న టెక్నికల్ బిడ్, 8న ప్రైస్ బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేసి అనుకూల కాంట్రాక్టర్‌కు కట్టబెట్టనున్నారు. ఆ వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కమీషన్‌గా రూ.100 కోట్లు వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు చానల్‌కు నాలుగు టీఎంసీలు కేటాయించారు. బ్యారేజీ ఎగువన ప్రారంభమయ్యే ఈ కాలువ 47 కి.మీ.ల పొడవున తవ్వారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో 28,500 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. అలాగే గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాల్టీలకు మంచినీటితోపాటు కాలువ పరిసర 27 గ్రామాలకు తాగునీటి కోసం 32 చెరువులకు దీని ద్వారానే నీటిని సరఫరా చేస్తారు. 600 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్విన ఈ కాలువ పాడైపోయింది. దీంతో కాలువను విస్తరించి లైనింగ్ చేయడంతోపాటూ సుద్దపల్లి మేజర్, కోవెలమూడి మేజర్ డిస్ట్రిబ్యూటరీలను ఆధునికీకరించేందుకు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనలపై సర్కార్ 2015, మే 27న ఆమోదముద్ర వేసింది. ఆధునికీకరణ పనులకు రూ.378.25 కోట్లను మంజూరు చేస్తూ మే 27, 2015న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మూడున్నరేళ్ల తర్వాత టెండరా? ఐదేళ్లుగా గుంటూరు చానల్ కింద ఆయకట్టుకు సర్కార్ సక్రమంగా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఏటా పంటలు ఎండిపోవడం వల్ల రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. గుంటూరు చానల్‌ను ఆధునికీకరించడానికి నిధులు మంజూరు చేసిన మూడున్నరేళ్ల తర్వాత టెండర్ పిలవడానికి సర్కార్ సిద్ధమైంది. ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందిస్తామని రైతులను మభ్యపెట్టడం, ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించి భారీ ఎత్తున కమీషన్ దండుకోవడమే లక్ష్యంగా ఆ పనులు చేపట్టింది. 750 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ విస్తరణ.. ఆధునికీకరణ పనులకు కి.మీ.కు గరిష్టంగా రూ.3 కోట్లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. 47 కి.మీ. కాలువ విస్తరణ, లైనింగ్ పనులకు రూ.141 కోట్లు ఖర్చవుతుంది. కాలువపై 172 సిమెంటు కట్టడాల (అండర్ టన్నెల్స్, సూపర్‌పాసేజ్‌లు, బ్రిడ్జిలు)ను తొలగించి.. కొత్తగా నిర్మించడానికి రూ.88 కోట్లు వ్యయమవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులకు రూ.229 కోట్లకు మించి వ్యయం కాదు. కానీ అంచనా వ్యయాన్ని రూ.330 కోట్లకు పెంచేసి డిసెంబర్ 17న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 31న టెక్నికల్ బిడ్.. జనవరి 4న ప్రైస్ బిడ్ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆరుగురు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. అయితే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు దక్కవనే నెపంతో సాంకేతిక బిడ్ తెరవకుండానే ముఖ్య నేత టెండర్‌ను రద్దు చేయించారు. కాంట్రాక్టర్‌కు అనుకూలంగా నిబంధనలు తాజాగా అంచనా వ్యయాన్ని రూ.332 కోట్లకు పెంచేసి.. 24 నెలల్లో పనులు పూర్తి చేయాలనే నిబంధన పెట్టి ఈ నెల 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో పదేళ్లలో కనీసం ఒక్క ఏడాదైనా 7.70 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి, 1,33,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి ఉండాలని నిబంధన పెడితే.. తాజాగా కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మట్టి పనుల పరిమాణాన్ని 3 లక్షల క్యూబిక్ మీటర్లకు, కాంక్రీట్ పనుల పరిమాణాన్ని 1.31 లక్షలకు తగ్గించారు. పదేళ్లలో ఒక్క ఏడాదైనా కనీసం రూ.83 కోట్ల విలువైన ఇదే రకమైన పనులు పూర్తి చేసి ఉండాలని మరో నిబంధన పెట్టారు. గత ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీకన్స్ట్రక్షన్), బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్), ఎస్డీఆర్ (స్టాటజిక్ డెట్ రీకన్స్ట్రక్షన్) విధానాలు అమలు చేయని కాంట్రాక్టర్లే అర్హులని నిబంధనలు విధించారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో సిమెంటు లైనింగ్ చేసిన కాంట్రాక్టర్లే షెడ్యూలు దాఖలు చేయడానికి అర్హులని షరతు విధించారు. ఇతరులు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే.. టెక్నికల్ బిడ్‌లో అనర్హత వేటు వేయించి, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో రూ.వంద కోట్లకుపైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
డెల్టా భూముల్లో చిరుధాన్యాల దిగుబడి రెట్టింపు!
పౌష్టికాహార భద్రతను కల్పించే చిరుధాన్యాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో మెట్ట పొలాలతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా భూముల్లో కూడా వీటిని సాగు చేయడంపై రైతులు దృష్టి సారించాలని రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ డా. విలాస్ ఎ.తొనపి సూచించారు. సంక్రాంతి సందర్భంగా ‘సాక్షి సాగుబడి’తో ఆయన మాట్లాడారు. మెట్ట ప్రాంతాలతో పోల్చితే సారవంతమైన డెల్టా భూముల్లో చిరుధాన్యాల రెట్టింపు దిగుబడి పొందవచ్చన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని డెల్టా భూముల్లో ఖరీఫ్‌లోనూ చిరుధాన్యాలను సాగు చేయవచ్చన్నారు. వరి కోసిన తర్వాత రెండో పంటగా కూడా చిరుధాన్యాలను సాగు చేయవచ్చని, భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఒక రక్షక పంట ఇస్తే సరిపోతుందన్నారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా సాగు చేయాలన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, సాగు నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం కోసం చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చిరుధాన్యాల క్లస్టర్లను ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పత్తి తదితర పంటల నుంచి రైతుల దృష్టి మళ్లించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమన్నారు. కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరికలు వంటి సిరి(చిరు)ధాన్యాల ప్రాసెసింగ్‌కు యంత్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు మార్కెటింగ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడం అవసరమన్నారు. రైతులకు శిక్షణతోపాటు మేలైన విత్తనాలు అందించడానికి ఐ.ఐ.ఎం.ఆర్. సిద్ధంగా ఉందని డా. తొనపి(85018 78645) తెలిపారు. -
సీఎం ఇంటి కోసం అన్నదాతలకు అవస్థలు
పాలకులు తలచుకుంటే ప్రజలకు అద్భుత పాలనను అందించవచ్చు.. అదే పాలకులు స్వప్రయోజనాల కోసం పాకులాడితే.. జనాలకు కష్టాలు.. నష్టాలు తప్ప మిగిలేది ఏమీఉండదు. కృష్ణా తీరం వద్ద కొలువుదీరిన సీఎం ఇంటి కోసం అన్నదాతలకు అవస్థలు తెచ్చే కార్యం కొనసాగుతోంది. డెల్టాకు వరప్రదాయని ప్రకాశం బ్యారేజిలో నీటి నిల్వకు కొర్రీలు పెడుతూ కర్షకులకు కడగండ్లు తెచ్చేపనిలో పడ్డారు. సాక్షి, విజయవాడ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న చందంగా కృష్ణా నదీతీరంలో రాజధాని ఏర్పాటు.. సీఎం నివాసం.. కృష్ణా డెల్టాకు ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిస్థాయిలో సాగునీరు నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకుండాపోతోంది. 13 అడుగులకు గాను..9.5 అడుగులకే పరిమితం.. ప్రకాశం బ్యారేజీ వద్ద 13 అడుగుల వరకు నీరు నిల్వ చేసుకోవచ్చు. గతంలో 12 అడుగుల వరకు వరద నీరు నిల్వ చేసేవారు. దశాబ్దం క్రితం 12 అడుగుల గేట్లపై మరో అడుగు ఐరన్ షీట్లు వేసి గేట్లు ఎత్తు పెంచారు. దీంతో 13 అడుగుల వరకు కనీస నీటిని నిల్వ చేయవచ్చు. అయితే 13 అడుగుల నీరు నిల్వచేస్తే నదీ తీరంలో సీఎం ఇంటి సమీపంలోకి వరద నీరు వచ్చి చేరుతుందని ఇరిగేషన్ సిబ్బంది చెబుతున్నారు. దీనికితోడు కొండవీటి వాగు ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు కూడా రాదు. అదే జరిగితే రాజధాని ప్రాంతం మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న సూచనల మేరకు ప్రకాశం బ్యారేజీ వద్ద కనీసం 12 అడుగుల మేర కూడా నీటిని నిల్వ చేయడం లేదు. మంగళవారం 9.5 అడుగులకు నీటి మట్టం తగ్గించేశారు. దీనివల్ల సీఎం ఇంటికి ఇబ్బంది ఉండదని, కొండవీటి వాగులోని నీరు కూడా నదిలోకి వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టాకు ఇబ్బందే.. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి మున్నేరు, కట్టలేరు నుంచి 1,13,534 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, కిందకు 1,41,250 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 54 గేట్లను నాలుగు అడుగుల మేర, 15 గేట్లను 2 అడుగుల మేర పైకెత్తి సముద్రంలోకి వరద నీటిని వదులుతున్నారు. వారం రోజులుగా 22 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారు. పూర్తయిన వరి నాట్లు కృష్ణా తూర్పుడెల్టా కింద కృష్ణా, పశ్చిమగోదావరి, పశ్చిమ డెల్టా కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు అందుతుంది. 13.5 లక్షల ఎకరాల ఆయకట్టులో గుంటూరు జిల్లాలో 5.71 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. డెల్టా పరిధిలో చాలావరకు వరి నాట్లు పూర్తయ్యాయి. ఇటీవల నాట్లు వేసిన పొలాల్లోని పైరు డిసెంబర్ నెలాఖరు వరకు ఉంటుంది. అప్పటి వరకు పొలాలకు విడతల వారీగా నీటి తడులు పెట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వరద నీరు ఆగిపోతే కృష్ణా డెల్టాకు తిరిగి నీటి కష్టాలు ప్రారంభమవుతాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కనీసం 13 అడుగుల మేర నీరు నిల్వ చేయకపోతే, వరద తగ్గిన తరువాత కనీసం వారం రోజులకైనా పంట కాలువలకు నీరు ఇవ్వలేరు. 13 అడుగుల వరకు నీరు నిల్వ అవకాశం ఉన్నా.. కేవలం సీఎం ఇంటి భద్రత కోసం 9.5 అడుగులకు పరిమితి చేయడాన్ని రైతు సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. అన్నదాతలకు అవస్థలు తేవడం తగునా? ప్రకాశం బ్యారేజీలో నాలుగు అడుగులు తక్కువగా నీరు నిల్వ చేయడం వల్ల కనీసం ఒక టీఎంసీ నీరు తగ్గిపోతుంది. ఇప్పుడు నీటిని సముద్రం పాలుచేసి తరువాత రైతులను ఇబ్బంది పెట్టడం ఎంతమేరకు సమజసమని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది నవంబర్ నాటికే పట్టిసీమ పడకేసింది. ఈ ఏడాది పులిచింతలలోనూ ఇప్పటి వరకు 3 టీఎంసీలు మించిలేవు. దీంతో రైతులకు ఈ సీజన్లోనూ సాగునీటి కటకటలు తప్పేలా లేవు. -
కక్ష.. వివక్ష..
కడప సిటీ : కేసీ రైతుకు కన్నీరే మిగులుతోంది. మూడేళ్లుగా కరువుతో సతమతవుతున్నారు..శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది మందస్తుగానే భారీ వరదనీరు చేరడంతో వరి సాగు చేయొచ్చని ఆశపడ్డారు. వరినారు కూడా పోసుకున్నారు. తర్వాత అధికారులు నీటి విడుదలను నిలిపేశారు. కృష్ణా డెల్టాకు వదిలి..కేసీకి ఆపేసి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లారు. కృష్ణాడెల్టా రైతులపై ఎందుకంత ప్రేమ.. తమపై ఎందుకంత వివక్ష అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కడుపుమండిన రైతన్నలు ఈ నెల 8న రోడ్డెక్కారు. వైఎస్సార్సీపీ నేతలు వీరికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ప్రసుతం శ్రీశైలానికి వరదనీరు చేరుతోంది. ఇప్పటికైనా కేసీ ఆయకట్టు రైతులకు వరిసాగుకు సరిపడే నీళ్లిస్తామని స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కేసీ ఆయకట్టు రైతులు గత మూడేళ్లుగా వరిసాగుకు దూరమయ్యారు.కేవలం బోర్లకింద ఆరుతడి పంటలు వేసుకుని కాలం వెళ్లదీశారు.అయితే కర్ణాటకలో వర్షాలు అధికంగా పడడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు చేరింది.దీంతో గత నెల 29 రాజోలికి నీటిని విడుదల చేశారు.అక్కడి నుంచి మైదుకూరు, చాపాడు కేసీకెనాల్‌కు, కుందూకు వదిలారు. ఈ సమయంలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించలేదు.దీంతో కేసీ కాలువ కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. నారుమడులు పోసుకున్నారు. సత్తువ కోసం జీలుగ కూడా వేశారు. ఈ తరుణంలో అధికారులు నీటిని నిలిపివేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఆగిపోయిందని, వరిసాగు చేసేందుకు నీళ్లు ఇవ్వడం కష్టమని, ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని చెప్పారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 92వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం కేసీ కెనాల్‌కు నీటిసామర్థ్యం తగ్గిన సందర్భంలో శ్రీశైలంలో 872 అడుగుల నీటిమట్టం ఉంది. 854 అడుగులు ఉంచి మిగతా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.అయితే ఈ నీటిని కేసీకాలువకు ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు 10టీఎంసీలు మళ్లించారు. దీంతో కేసీ కాలువకు నీరు ఆగిపోయింది. 92వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మైదుకూరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలు, కడపకు సంబంధించి 30 వేల ఎకరాలు, మిగతా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉంది. మూడేళ్లుగా వరిపంటకు దూరమైన కేసీ ఆయకట్టు రైతులు ఈ ఏడాది నీళ్లు వచ్చాయని ఆనందపడి సాగుకు సిద్ధమయ్యారు. వారి ఆనందం రెండు రోజులకే ఆవిరైంది. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా రైతులపై వివక్ష చూపుతోంది.వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మొదటి నుంచి సవతిప్రేమ చూపిస్తున్నారు. కెసీ కాలువకు నీటి విడుదల విషయంలో ముఖ్యమంత్రి వక్రబుద్ధి మరోసారి బయటపడిందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి.అంజాద్‌బాషా,రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, జిల్లా రైతువిభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కేసీకి నీళ్లు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కేసీ కెనాల్‌కు రావాల్సిన నీటిని కృష్ణాడెల్టాకు తరలిస్తుంటే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయనరెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు. మన వాటా కోసం కలిసి కట్టుగా పోరాడుదామని, అందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు కేసీకాలువకు నీళ్లు రావడంతో ఈ ఏడాది 10 ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించా. నారుమడి పోశా. ఇందుకోసం రూ.2000 ఖర్చు అయింది.అధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతున్నారు.ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. – ఆంజనేయులు, రైతు, పల్లవోలు, చాపాడు మండలం నిలువునా ముంచారు మూడేళ్ల నుంచి వరిపంటకు దూరమయ్యాం.ఈ సారి కేసీకెనాల్‌కు నీళ్లు రావడంతో వరినారు వేశాం.ఇప్పుడేమే ఆరుతడి పంటలకు మాత్రమే నీళ్లు ఇస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.నారుమడి కోసం ఎకరానికి రూ.2000 ఖర్చు అయింది. పాలకులు, అధికారులు రైతులను నిలువునా ముంచారు. – సీసీ వెంకటసుబ్బారెడ్డి, తొండలదిన్నె, రాజుపాళెం మండలం చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు. కడప రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది.కెసీ కెనాల్‌కు అర్ధాంతరంగా నిలిపివేయడం దారుణం. కేసీకెనాల్‌కు నీళ్లు ఇచ్చే వరకు రైతుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. – సంబటూరు ప్రసాద్‌రెడ్డి,వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే... శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గింది.అందువల్ల వరిసాగుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. ఉన్నతాధికాల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం.ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనుమతులు ఉన్నాయి. మళ్లీ వానలు అధికమై శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటాం. - జిలానీబాషా, డీఈఈ, కేసీ కెనాల్ -
సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు