సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాలకు సమర్థంగా నీరందించడంతో పాటు.. డెల్టా పరిరక్షణే లక్ష్యంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సముద్రంలో కలుస్తున్న కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం–రామచంద్రాపురం మధ్య రూ.1,215 కోట్లతో, బండికొల్లంక–రావిఅనంతవరం మధ్య రూ.1,350 కోట్లతో బ్యారేజీల నిర్మాణానికి ఇప్పటికే సర్కార్ ఉత్తర్వులిచ్చింది. కృష్ణా డెల్టాలో సకాలంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరందించేందుకు దివంగత సీఎం వైఎస్సార్ 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. డెల్టాకు మరింత సమర్థంగా నీరందించేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,235.27 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.
► కృష్ణా నదిపై 1,323 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీల దిగువున 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించనున్నారు. తొలి దశలో బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు, భూసేకరణ కోసం రూ.102.17 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది.
► కృష్ణా నదిపై 1,373 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 62 కి.మీ దిగువన 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. సర్వే, ఇన్వెస్టిగేషన్ తదితర పనులు, భూసేకరణ కోసం రూ.102.20 కోట్లను ఇప్పటికే సర్కార్ మంజూరు చేసింది.
జల, ఉపరితల రవాణాకు ఊతం..
కృష్ణా నదిపై మూడు బ్యారేజీల నిర్మాణం అంతర్గత జల రవాణా, ఉపరితల రవాణాలకు ఊతం ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన బ్యారేజీలను నిర్మించడం వల్ల ఆ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. కొత్తగా నిర్మించే బ్యారేజీల వల్ల పులిచింతల నుంచి హంసలదీవి వరకూ నదిలో నీరు నిల్వ ఉంటుందని.. ఇది జలరవాణాకు ఊతమిస్తుందంటున్నారు.
డెల్టా పరిరక్షణ
భూగర్భ జలమట్టం తగ్గడం వల్ల భూమి పొరల్లోకి సముద్ర జలాలు చొచ్చుకురావడం, కృష్ణా నది వెంబడి సముద్రపు జలాలు పైకి ఎగదన్నడం వల్ల కృష్ణా డెల్టా చౌడు బారుతోంది. పంటల దిగుబడులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగునీటికీ ఇబ్బందులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టా పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భూగర్భ జలమట్టం తగ్గకుండా కాపాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment