సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు మరింత జల భద్రత చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 23 కి.మీ. ఎగువన ఇబ్రహీంపట్నం మండలం దామలూరు వద్ద కృష్ణా నదిపై పది టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. 2020–21 ధరల ప్రకారం ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ బ్యారేజీ ద్వారా మున్నేరు, కట్టలేరు, పాలేరు వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు అమరావతి, తుళ్లూరు తదితర మండలాల ప్రజలకు తాగునీటి అవసరాలను ఈ బ్యారేజీ ద్వారా తీర్చాలని నిర్ణయించింది.. ఈ బ్యారేజీ కమ్ రోడ్డు బ్రిడ్జి ద్వారా గుంటూరు–హైదరాబాద్‌ల మధ్య 45 కి.మీ.ల దూరం తగ్గుతుంది. దామలూరు బ్యారేజీ జలరవాణాకు, పర్యాటక రంగానికి మరింత ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
దామలూరు బ్యారేజీ ఎందుకంటే..
కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. అయితే దీని తరువాత కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి వరకూ దాదాపు 163 కి.మీల పొడవున నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు లేదు. ప్రకాశం బ్యారేజీ నీటినిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీటిని మళ్లించడంతోపాటు గుంటూరు, విజయవాడ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ బ్యారేజీపైనే ఆధారపడుతున్నారు. పులిచింతలకు దిగువన మున్నేరు, పాలేరు, కట్టలేరు వాగులు కృష్ణాలో కలుస్తాయి. ఇవి తరచూ ఉప్పొంగి ప్రవహిస్తాయి. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఈ వరద జలాలు కడలిపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదను ఒడిసి పట్టడం కోసం దామలూరు వద్ద పది టీఎంసీలతో బ్యారేజీ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది.
బ్యారేజీ కమ్ రోడ్ బ్రిడ్జి..
కృష్ణా నదిపై దామలూరు వద్ద 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,245 మీటర్ల పొడవున స్పిల్‌వేతో బ్యారేజీని నిర్మించేలా జలవనరుల శాఖ అధికారులు డిజైన్ రూపొందించారు. ఎడమ వైపు 1,695 మీటర్లు, కుడి వైపున 122.14 మీటర్ల పొడవున బ్యారేజీకి అనుబంధంగా మట్టికట్ట నిర్మిస్తారు. బ్యారేజీలో గరిష్టంగా 27 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేస్తారు. బ్యారేజీలోనే జలరవాణాకు వీలుగా నావిగేషన్ లాక్‌లను ఏర్పాటు చేస్తారు. బ్యారేజీ బ్రిడ్జిపై రెండు వరుసలతో రహదారి నిర్మించి గుంటూరు–హైదరాబాద్ హైవేతో అనుసంధానం చేస్తారు. బ్యారేజీ సివిల్ పనులకు రూ.738.463 కోట్లు, మెకానికల్(గేట్లు, హైడ్రాలిక్ హాయిస్ట్‌లు) పనులకు రూ.204.363 కోట్లు, నిర్వహణకు రూ.5.473 కోట్లు వెరసి దాదాపు రూ.948.30 కోట్లు వ్యయం అవుతుంది. జీఎస్టీ రూపంలో రూ.136.81 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ముంపునకు గురయ్యే 10,673 ఎకరాల భూసేకరణకు రూ.1,069.58కోట్లు, ఇతర పనులకు రూ.14.31 కోట్లు వెరసి సుమారు రూ.2,169 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి అంచనాలను రూపొందించారు. ఆర్థిక శాఖ ఆమోదముద్ర లభించగానే పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment