సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడమే పనిగా పెట్టుకున్న రామోజీ కుక్క తోకలా తన బుద్ధి కూడా వంకరేనని రామోజీరావు ఎప్పటికప్పుడు తన రాతల ద్వారా నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే.. కృష్ణాడెల్టా చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో 2019, 2020, 2021, 2022లలో ఖరీఫ్‌కే కాదు.. అధికారికంగా రబీ పంటకు వైఎస్ జగన్ ప్రభుత్వం సమృద్ధిగా నీళ్లందించి రైతులకు దన్నుగా నిలిచింది.
ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల కృష్ణా బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లోనే కాదు.. కృష్ణా డెల్టాలోనూ తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటలను రక్షించి.. రైతులకు దన్నుగా నిలవడానికి జలవనరుల శాఖాధికారులతో సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సమర్థవంతంగా నీళ్లందించేలా దిశానిర్దేశం చేస్తున్నారు.
పైగా.. పులిచింతల నీటికి గోదావరి (పట్టిసీమ) జలాలను జతచేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా కృష్ణా డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందిస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులను వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమిస్తూ.. సమర్థవంతంగా నీళ్లందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తుంటే రామోజీరావు అది చూసి క్షణం కూడా ఓర్చుకోలేకపోతున్నారు.
నిజాలను దాచేసి.. అభూతకల్పనలు, పచ్చి అబద్ధాలను వల్లెవేస్తూ.. ‘కృష్ణా డెల్టాను ఎండబెట్టేశారు’ అంటూ పెడబొబ్బలు పెడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే తన విషపుత్రిక ఈనాడులో రామోజీ విషం చిమ్మారు. ఇందులోని ప్రతి అక్షరంలో ఆయన అక్కసు తప్ప వీసమెత్తు నిజంలేదు.
కృష్ణా డెల్టాకు 85.81 టీఎంసీలు సరఫరా..
ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2023–2024 ఖరీఫ్ పంటలకు జూన్ 7న ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఆయకట్టులో 9.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటివరకూ 85.81 టీఎంసీల నీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు లేకపోవడంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి 35.93 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా 29.88 టీఎంసీల గోదావరి జలాలు.. మున్నేరు, పాలేరు, కట్టలేరు, కీసర వాగుల ద్వారా వచ్చిన 20 టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణాడెల్టాకు అందించింది.
ముందస్తు ప్రణాళికతో..
నిజానికి.. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతోపాటు రాష్ట్రంలోనూ తక్కువగా వర్షాలు కురిశాయి. కృష్ణా డెల్టాలోనూ అదే పరిస్థితి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తగినంత నీటి ప్రవాహం రాకపోవడంతో వాటి నుంచి కృష్ణాడెల్టాకు నీటిని విడుదలచేసే పరిస్థితి ఈ ఏడాది లేదు. దీనిని ముందే గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తూ.. కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రణాళిక రూపొందించారు.
ఇందులో భాగంగా.. ఈ సీజన్ ప్రారంభంలో పులిచింతల ప్రాజెక్టులో 38 టీఎంసీలు ఉండగా.. గోదావరిలో వరద ప్రవాహం రానంతవరకూ కృష్ణా డెల్టాలో పంటలకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో పట్టిసీమ పంపులను జూలై 21న ఆన్‌చేసి గోదావరి జలాలను ఎత్తిపోశారు. వాటికి పులిచింతల నీటిని జతచేసి.. కృష్ణా డెల్టాకు నీళ్లందించింది.
ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ఈ ప్రణాళికను అమలుచేయడంవల్లే తెలంగాణలో కురిసిన వర్షాలకు మూసీ నది ద్వారా పులిచింతలలో తిరిగి 19 టీఎంసీలను నిల్వచేయగలిగింది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు ప్రణాళికాబద్ధంగా అందిస్తోంది. అదే పులిచింతల ప్రాజెక్టులో నీటిని ముందుగా వినియోగించుకోకపోయి ఉంటే.. మూసీ ద్వారా వచ్చిన వరద సముద్రం పాలయ్యేది.
ప్రతికూల పరిస్థితుల్లోనూ పంటలు పచ్చగా..
► ఇక కృష్ణా బేసిన్‌లోనే కాదు.. కృష్ణా డెల్టాలో కూడా ఆగస్టు, అక్టోబరు నెలల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. ఇటువంటి పరిస్థితులు అరుదు. ప్రకృతి సహకరించకపోయినా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వారబందీ విధానంలో ప్రణాళికాబద్ధంగా నీటిని అందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు బాసటగా నిలబడుతోంది. ఇదీ వాస్తవం. కానీ, నీళ్లందకపోవడంవల్ల తూర్పు, పశ్చిమ డెల్టాల్లో కన్నీటి ప్రవాహం అంటూ ప్రభుత్వంపై రామోజీ ఎప్పటిలాగే తన అక్కసు వెళ్లగక్కారు.
► అలాగే, దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పంటలను రక్షించేందుకు వారబందీ విధానాన్ని అమలుచేస్తూ.. ఒక వారంపాటు సగం నిర్ధేశిత ప్రాంతాలకు.. మరో వారం మిగతా సగం నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ విధానంలో నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నప్పుడు మిగతా నిర్దేశిత ప్రాంతాల్లోని కాలువల్లో ప్రవాహం ఉండదు. అప్పుడు చివరి భూములకు రైతులు ఆయిల్ ఇంజన్లతో కాలువల్లో నిలిచి ఉన్న నీటిని తోడిపోసుకుని పంటలు కాపాడుకోవడం అక్కడక్కడ జరుగుతుంది. దీన్నే భూతద్దంలో చూపించి వేలాది ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయని ‘ఈనాడు’ గగ్గోలు పెట్టింది.
► అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ ఒకేఒక్క పంటకు అరకొరగా నీళ్లందించారు. ఆ సమయంలో కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినా.. రైతులు నష్టపోయినా రామోజీరావు పెన్నెత్తి మాట అనలేదు. ఎందుకంటే.. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు కాబట్టి.
కృష్ణా తూర్పునకు 52.69.. పశ్చిమానికి 33.12 టీఎంసీలు..
కృష్ణా తూర్పు డెల్టాలో 7,36,953 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 5,30,136 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటివరకూ 52.69 టీఎంసీలను సరఫరా చేశారు. వారబందీ విధానాన్ని అమలుచేస్తూ ఆయకట్టుకు నీటిని సమర్థవంతంగా సరఫరా చేస్తున్నారు. ఏలూరు కెనాల్‌కు రోజూ 800 క్యూసెక్కుల నుంచి 1,200 క్యూసెక్కులు ఇప్పటివరకూ సరఫరా చేశారు. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు ప్రభుత్వం ఇలా అన్ని చర్యలు తీసుకుంటోంది. అలాగే..
► కృష్ణా పశ్చిమ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలు ఆయకట్టు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉండగా.. పూర్తి ఆయకట్టులో రైతులు పంటలు సాగుచేశారు. వాటికి ఇప్పటివరకూ 33.12 టీఎంసీలు అందించారు.
► పశ్చిమ డెల్టాకు శనివారం 4,808 క్యూసెక్కులను విడుదల చేశారు. పొన్నూరు మండలం జడవల్లి గ్రామంలో టీఎస్ ఛానల్ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు శనివారం నుంచి వారబందీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు.
► అలాగే, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని ఏఎం ఛానల్ పరిధిలోని ఆయకట్టుకు, బాపట్ల జిల్లాలో బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెంలోని ఆయకట్టుకు సోమవారం నుంచి వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తారు.
► మరోవైపు.. సీఎం జగన్, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సమక్షంలో సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారబందీ విధానంలో నీళ్లందిస్తూ పంటలను రక్షించేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు.
► ఇక పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీలు నిల్వఉన్నాయి. గోదావరిలో ప్రవాహాలు ఉన్నంత వరకూ పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోసి.. మరీ అవసరమైతే పోలవరం ప్రాజెక్టు రివర్ స్లూయిస్ ద్వారా నీరువదిలి.. వాటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టింది.
పులిచింతలతో కృష్ణా డెల్టా సుభిక్షం..
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌కు ముందస్తుగా నీళ్లందించాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పులిచింతల ప్రాజెక్టును చేపట్టి.. 2009 నాటికే దానిని చాలావరకూ పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం అప్పటి నుంచి నీటిని నిల్వచేస్తున్నారు. 2014లో పూర్తి గరిష్ఠ స్థాయి సామర్థ్యం అయిన 45.77 టీఎంసీలను నిల్వచేయవచ్చు.
కానీ, అప్పటి సీఎం చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, తెలంగాణలో ఎత్తిపోతలకు పరిహారం చెల్లించకపోవడంవల్ల ప్రాజెక్టులో అరకొరగా నీటిని నిల్వచేసి.. తక్కువ నీటిని సరఫరా చేసి.. లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెట్టి కృష్ణాడెల్టా రైతుల కడుపుకొట్టారు.
కానీ, వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, తెలంగాణకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించి 2019లోనే పూర్తిస్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వచేశారు. 2020, 2021, 2022లోనూ అదే స్థాయిలో నీటిని నిల్వచేసి.. నాలుగేళ్లుగా డెల్టాలో ఏటా రెండు పంటలకు నీళ్లందించారు. అలాగే, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు సమర్థవంతంగా నీళ్లందిస్తుండటానికి ప్రధాన కారణం పులిచింతల ప్రాజెక్టే.
Comments
Please login to add a commentAdd a comment