సాక్షి, అమరావతి: నిత్యం అసత్యపు వార్తలతో ప్రజల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనే లక్ష్యంగా పనిచేస్తున్న ఈనాడు రామోజీరావు.. పంటల బీమాపై విషపురాతలు రాశారు. రైతులపై పైసా భారం పడకుండా ఈక్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తూ దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంటే.. ఈనాడు పత్రిక మాత్రం బురద జల్లడమే పనిగాపెట్టుకుంది. ఒక సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని వచ్చే ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తుంటే ‘ఉచిత బీమా ఉన్నాట్టా? లేనట్టా?’ అంటూ రైతులను తప్పుదోవపట్టించేలా విషపు రాతలు రాస్తోంది.
ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరి కింద సాగైనా.. ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టడమే కాకుండా పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ సీజన్‌కు సంబంధించి జిల్లాల వారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలను పూర్తి మార్గదర్శకాలతో ఇటీవలే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిపై ఈనాడు పలు ఆరోపణలు చేసింది.
ఆరోపణ: ఖరీఫ్ ముగిసినా స్పష్టతేది?
వాస్తవం: ఎటువంటి పక్షపాత వైఖరికి తావులేకుండా వ్యవసాయ, రెవెన్యూ ఉమ్మడి అజమాయిషీలో ఈ–పంట నమోదు చేస్తున్నారు. ఖరీఫ్–23లో ఈ–క్రాప్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పట్టు, సామాజిక అటవీ సాగు పంటలను కలిపి 93 లక్షల ఎకరాలను నమోదు చేశారు. అయితే మార్గదర్శకాల మేరకు ఖరీఫ్, రబీ సీజన్ వారీగా నోటిఫై చేసిన పంటలకు మాత్రమే బీమా వర్తిస్తుందన్న విషయం రామోజీకి తెలియంది కాదు. ఖరీఫ్ 2023లో 15 పంటలను దిగుబడి ఆధారంగా, 6 పంటలను వాతావరణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలను దిగుబడి ఆధారంగా, 4 పంటలను వాతావరణ ఆధారంగా బీమా పరిధిలోకి తీసుకొచ్చి ఆమేరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది.
ఆరోపణ: కేంద్ర బీమా పోర్టల్‌లో వివరాలేవీ?
వాస్తవం: ఇతర రాష్ట్రాల్లో నేషనల్ క్రాపు ఇన్సూరెన్సు పోర్టల్ విషయానికి వస్తే.. బ్యాంకు నుంచి రుణం మంజూరైన సమయంలో ఆ బ్యాంకుల ద్వారాను, రుణం పొందని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా గడువులోగానూ ప్రీమియం చెల్లించిన వారికే బీమా వర్తింప చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ ఖరీఫ్‌లో జూలై 31 నాటికి, రబీలో డిసెంబర్ 31 నాటికి పూర్తి చేస్తారు. అర్హత పొందిన లబ్ధిదారుల వివరాలను మాత్రమే పోర్టల్‌లో పొందుపరుస్తారు. గడువులోగా ప్రీమియం చెల్లించలేని రైతులు బీమా రక్షణ అవకాశాన్ని కోల్పోతారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఈక్రాప్ డేటా ఆధారంగా క్రాప్ ఇన్సూరెన్సు పోర్టల్‌లో నేరుగా నమోదు చేసే వెసులుబాటు కల్పించారు. తద్వారా యూనివర్సల్ కవరేజీ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది.
ఆరోపణ: ఆది నుంచి జాప్యమే
వాస్తవం: కేంద్ర మార్గదర్శకాల మేరకు ఏటా అక్టోబర్ 31 నాటికి ఖరీఫ్ ఈక్రాప్ డేటా, మార్చి 31 నాటికి రబీ ఈక్రాప్ డేటా కేంద్రానికి పంపిస్తున్నారు. ఖరీఫ్ 23 సీజన్‌కు సంబంధించి ఈక్రాప్‌లో నమోదైన పంటలు, రైతుల వివరాలను కేంద్రంతో పాటు ఎంపిక చేసిన బీమా కంపెనీలకు అక్టోబర్ 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. గడువు తేదీలను నోటిఫికేషన్‌లో కూడా తెలియజేశారు.
నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో నోటిఫికేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ టెక్నికల్ బృందం ఈ క్రాప్‌లో నమోదైన రైతుల వారీ వివరాలను పరిశీలన పూర్తి చేసిన తర్వాతనే పీఎంఎఫ్‌బీవై పోర్టల్‌లో ఖరీఫ్ డేటా ప్రదర్శిస్తారు. ఇది కేవలం కేంద్రప్రభుత్వ పరిధిలోని సాంకేతికమైన అంశమే తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం కానీ, తప్పిదం కానీ ఏమాత్రం లేదన్నది సుస్పష్టం.
ఆరోపణ: బీమా ఉందో లేదో తెలిసేదెలా?
వాస్తవం: సామాజిక తనిఖీ, గ్రామ సభల అనంతరం ఈక్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. తొలుత డిజిటల్ రశీదులో రైతుకు తాను సాగు చేసిన పంట వివరాలను ఎస్‌ఎంఎస్ రూపంలో పంపిస్తున్నారు. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే భౌతిక రశీదు అందిస్తున్నారు. భౌతిక రశీదులో ఉచిత పంటల బీమా పథకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియజేస్తూ సంబంధిత సాగుదారుడి సంతకంతో అందజేస్తున్నారు.
ఆ మేరకు జారీ చేసిన భౌతిక రశీదులో ‘డా.వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం క్రింద నోటిఫై చేసిన మీ పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి తద్వారా పంట బీమా చేయబడినది’ అని స్పష్టంగా పేర్కొంటున్నారు. అలాంటప్పుడు బీమా ఉందో లేదో రైతులకు తెలియకపోవడమేమిటో ఈనాడుకే తెలియాలి.
ఆరోపణ: బీమా లేకుంటే నిండా మునగడమే
వాస్తవం: టీడీపీ ఐదేళ్ల పాలనలో 30.85 లక్షల మందికి రూ. 3,411.20 కోట్ల పరిహారం ఇస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ. 7,802.05 కోట్ల పరిహారాన్ని జమ చేసింది. పైగా గతంలో ఉండే లోటుపాట్లను సరి చేస్తూ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుంటే లేనిపోని అపోహలు సృష్టించేలా రైతులను గందరగోళ పరిచేలా విషపు రాతలు రాయడం ఈనాడుకే చెల్లింది.
Comments
Please login to add a commentAdd a comment