Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt - Sakshi
Sakshi News home page

ఏది నిజం ?: పెత్తందార్లు.. మీరు, మీ బాబే రామోజీ

Published Fri, Aug 18 2023 4:30 AM | Last Updated on Fri, Aug 18 2023 5:39 PM

Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt - Sakshi

పేదరికం నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ డీబీటీ రూపంలో 50 నెలల్లో పేదల ఖాతాల్లో రూ.2,31,123.28 కోట్లు జమ చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో రూ.2,33,915.92 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి పేదలకు రూ.4,65,039.20 కోట్ల లబ్ధి కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఈ రీతిన ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న పేదలను చూసి ఓర్చుకోలేక.. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దబాయించిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన తానా అంటే తందానా అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారంటూ తప్పుడు రాతలతో పుంఖానుపుంఖాలుగా కథనాలు అచ్చేసిన మీరు పెత్తందార్ల పక్షం కాదా రామోజీ? 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ.. 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670.05 కోట్ల విలువైన ఇంటి స్థలాలను సీఎం వైఎస్‌ జగన్‌ పంపిణీ చేశారు. సెంటు భూమి శవాన్ని పూడ్చటానికి మాత్రమే సరిపోతుందంటూ పేదల సొంతింటి స్వప్నంపై అవహేళన చేస్తూ మాట్లాడటం ద్వారా తాను పెత్తందారుడినని చంద్రబాబు చాటుకున్నారు. కోర్టుల్లో కేసులు వేయించి పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి మోకాలడ్డిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయనకు వంతపాడుతున్న మీది పెత్తందారీ పోకడ కాదా రామోజీ? 
 
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. పేద పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రవేశపెడితే.. దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం కాదా? ఇందుకు మద్దతిస్తూ అక్షరోద్యమం నడిపిన మీరూ ఆ బాపతే కదా రామోజీ?   
 
అమరావతి రాజధాని ప్రాంతంలో 50 వేల మంది పేదలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. దాన్ని నిరసిస్తూ హైకోర్టులో కేసులు వేయించి.. వారికి ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని వాదించేలా చక్రం తిప్పిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన్ను సమర్థిస్తూ వరుస కథనాలు వండివార్చిన మిమ్మల్ని పెత్తందారు అనక ఇంకేమనాలి రామోజీ?  

సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయ పడుతూ, వారి అభ్యున్నతి కోసం నాలుగేళ్లుగా పరితపిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా వారికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. అన్ని పదవుల్లోనూ సింహ భాగం కేటాయిస్తున్నారు. ఇది పెత్తందారీతనమా? లేక ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?’ అని చంద్రబాబు వారిని అవమానించడం పెత్తందారీతనమా? తేల్చి చెప్పే ధైర్యముందా రామోజీ?  

‘ఈ రోజు రాష్ట్రంలో జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌.. పేదలు ఒక వైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాళ్లు మరో వైపు. వచ్చే ఎన్నికల్లో పొరపాటు జరిగితే పేదలు రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు’ అంటూ రాష్ట్రంలో చంద్రబాబు, ఎల్లో మీడియా పోకడలపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం.. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్‌సీపీకి ప్రజలు చారిత్రక విజయాలను కట్టబెట్టడం.. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జాతీయ సంస్థల సర్వేలు నొక్కివక్కాణిస్తుండటం.. వీటన్నింటితో ఇక చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లడం ఖాయమని మీరు తీవ్రంగా ఆందోళన చెందుతుండటం నిజం కాదా రామోజీ? విషం చిమ్ముతున్నది అందుకే కదా?  

కార్పొరేట్‌కు కొమ్ము కాసింది బాబే  
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయకుండా.. ప్రైవేట్, కార్పొరేట్‌ వైద్య కళాశాలలకే పట్టంకట్టారు. టీడీపీ నాయకులు, సానుభూతిపరులకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చి.. వారి జేబులు నింపారు. ఇదంతా అప్పుడు రామోజీ కళ్లకు పచ్చగా కనిపించింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించడం కోసం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే.. దేశంలో ఎక్కడా లేనట్టుగా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు.

వాస్తవానికి 2017 నుంచి రాజస్తాన్, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పాత 12 వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లకు కొత్త విధానాన్ని అమలు చేయకుండా కేవలం కొత్తగా ఏర్పాటైన కళాశాలల్లో ఆల్‌ ఇండియా కోటా పోగా.. మిగిలిన సీట్లలో 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు. మరో 50 శాతం సీట్లలో 35 శాతం ‘బీ’, 15 శాతం సీట్లను ‘సీ’ కేటగిరిలో భర్తీ చేయనున్నారు. ఈ సీట్లకు ఫీజుల రూపంలో వచ్చే నిధులను ఆయా కళాశాలల అభివృద్ధికే ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

సీఎం వైఎస్‌ జగన్‌ పేదల పక్షపాతి కాబట్టే నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం కోసం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా ఏకంగా 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో 15 శాతం ఆల్‌ ఇండియా కోటా పోగా మిగిలిన సీట్లలో 50 శాతం రిజిర్వేషన్‌ వర్గాలకు కేటాయిస్తున్నారు. అంటే 300కు పైగా సీట్లు కన్వీనర్‌ కోటాలో ఈ ఏడాది నుంచి పెరిగాయి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు మేలు చేయడం కాదా?  

ఇంటిపై హక్కులు కల్పిస్తే తప్పా? 
గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలకు మేలు చేకూర్చేలా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని  ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది/రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించింది. దీంతో 22–ఏ జాబితాలో ఉండే స్థలాలపై పేదలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభించాయి. పేదలు తమ కాళ్లపై తాము నిలబడాలి.. ఇళ్లలో నివసించే హక్కు స్థానంలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి యాజమాన్య హక్కులను కల్పించారు.

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)ను అమలు చేసి రుణాల నుంచి విముక్తి కల్పించాలని.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల నుంచి విజ్ఞప్తులు వచ్చినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వం పేదల మొర ఆలకించడం లేదంటూ రామోజీరావు ఒక్క రాత కూడా రాసిన పాపానపోలేదు. ఇప్పుడు పేదలపై మితిమీరిన భారం లేకుండా రూ.10వేలు, ఒక వేళ అంతకంటే తక్కువ రుణం ఉంటే అదే మొత్తం చెల్లించిన వారికి, రుణాలు తీసుకోని వారికైతే రూ.10 వంటి నామ మాత్రపు ఫీజులతో ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజులను మినహాయించారు. ఇది పేదలకు మేలు చేయడం కాదా? 

ఉన్నతంగా విదేశీ విద్య 
జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా రాష్ట్రానికి చెందిన అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు.. నోబెల్‌ గ్రహీతలైన టిమ్‌ కుక్, స్టీవ్‌ జాబ్స్‌ వంటి గొప్ప వ్యక్తులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ పథకం కింద గత ఏడాది 290, ఈ ఏడాది 67 మందికి కలిపి రూ.142.71 కోట్లు మంజూరు చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫిబ్రవరిలో లబ్దిపొందిన 290 మందిలో ఎస్సీ విద్యార్థులు 27 మంది, బీసీ 64, క్రిస్టియన్‌ నలుగురు, ముస్లింలు 20, ఈబీసీలు 175 మంది ఉన్నారు.

2023–24 విద్యా సంవత్సరంలో ఫాల్‌ సీజన్‌ కింద ఎంపికైన వారు 67 మంది ఉండగా, వీరిలో ఎస్సీ విద్యార్థులు ఐదుగురు, ఎస్టీ ఒక్కరు, బీసీ 13, క్రిస్టియన్‌ నలుగురు, ముస్లింలు ఎనిమిది మంది, ఈబీసీలు 36 మంది ఉన్నారు. 2022–23 బ్యాచ్‌కు చెందిన 290 మంది విద్యార్థులకు రెండో విడత వాయిదా ఫీజు, వీసా చార్జీలు, విమాన ఖర్చులతో సహా రూ.35.40 కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్‌ కార్డు రాగానే ఒకసారి, మొదటి సెమిస్టర్‌ పూర్తవగానే రెండోసారి ఫీజు చెల్లించి వదిలేసేది.

ఆ తర్వాత విద్యార్థి ఏమయ్యాడో పట్టించుకునే వారు కాదు. గత ప్రభుత్వం విదేశాల్లో చదువుకునేందుకు 2014–19 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.15 లక్షల చొప్పున, ఓసీలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం నూరు శాతం ఫీజు చెల్లిస్తోంది. ఓసీలకు రూ.కోటి, ఇతర వర్గాలకు రూ.1.25 కోట్ల వరకు వెచ్చిస్తోంది. పైగా చంద్రబాబు 2016–17, 2018–19 సంవత్సరాల్లో 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను పెట్టారు.  

ఇప్పుడు నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా విద్యార్థి సెమిస్టర్‌/టర్మ్‌ పత్రాలు సమర్పించగానే ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది.  ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం పొందేలా 21 కోర్సులకు సంబంధించి ప్రతి కోర్సుకు టాప్‌ 50లో ఉన్న విద్యా సంస్థలను నిర్ణయించింది. దీంతో మొత్తం విద్యా సంస్థల సంఖ్య 320కి పెరిగింది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్న పరిమితిని తొలగించింది. దీనికి కూడా వక్రభాష్యం చెప్పడం రామోజీకే చెల్లింది. 

సామాన్యునికి అందుబాటులో సినీ వినోదం 
టీడీపీ ప్రభుత్వ హయాంలో సినీ సిండికెట్‌ సినిమా టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. టికెట్ల గణాంకాలు ఎక్కడా ఉండేవి కావు. ఈ పరిస్థితిలో వెఎస్సార్‌సీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయాల విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలను అందుబాటులోకి తీసుకువస్తూ విధాన నిర్ణయం తీసుకుంది. అలా చేస్తే తమ దందాకు చెక్‌ పడుతుందని భావించిన టీడీపీ అనుకూల సిండికేట్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

కాగా మరోవైపు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల కేటగిరీల్లో సినిమా టికెట్‌ ధరలను నిర్ణయిస్తూ 2021 ఏప్రిల్‌ 8న జీవో 35 జారీ చేసింది. దీనిపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో హోమ్, సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సినీ రంగానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఓ విధానాన్ని రూపొందించింది. ఆ మేరకు సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ 2022 మార్చి 7న జీవో 13 జారీ చేసింది.

భారీ బడ్జెట్‌ సినిమాలకు టికెట్ల ధరలను తొలి వారం రోజులపాటు పెంచుకునేందుకు నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించింది. హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషకాలు కాకుండా సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటితే.. సినిమాలో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌ చేస్తే... టికెట్ల ధరలను తొలి పది రోజులపాటు పెంచుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల యావత్‌ సినీ పరిశ్రమతోపాటు సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై కూడా దిగజారుడు రాతలేనా రామోజీ? 

మద్యం వ్యసనానికి దూరమవుతున్న పేదలు  
మద్యం ధరలు షాక్‌ కొట్టేలా చేస్తాం.. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేస్తాం.. అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు విస్పష్టంగా ప్రకటించారు. అదే విధానాన్ని సమర్థంగా అమలు చేస్తుంటే ఈనాడు రామోజీరావుకు కంటగింపుగా మారింది. రాష్ట్రంలో 2014–19 మధ్య మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల ప్రైవేటు సిండికేట్‌ గుప్పిట్లో ఉండేవి. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ పేదలను కొల్లగొట్టేవారు. నిర్ణీత వేళలను పాటించకుండా విక్రయాలు సాగించేవి. ఇప్పుడు ఆ దందాకు చెక్‌ పెట్టారు. 43 వేల బెల్ట్‌ దుకాణాలను తొలగించారు.

గత సర్కార్‌ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కొత్త బార్లకు లైసెన్స్‌లు ఇవ్వలేదు. 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఉన్నాయి. అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఏఆర్‌ఈటీ) పన్నూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. తద్వారా పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోవడమే అందుకు నిదర్శనం.

టీడీపీ ప్రభుత్వంలో 2018– 19లో రాష్ట్రంలో 384.31 లక్షల మద్యం కేసులు, 277.1 లక్షల బీర్‌ కేసులు విక్రయించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో మద్యం కేసులు 308.49 లక్షలు, బీరు 212.91లక్షల కేసులే విక్రయించారు. 2020–21లో మద్యం కేసులు 187.55 లక్షలు, బీరు కేసులు 56.97 లక్షలతో విక్రయాలు తగ్గిపోయాయి. 2021–22లో మద్యం కేసులు 266.08 లక్షలు, బీరు కేసులు 81.67 లక్షలు, 2022–23లో మద్యం కేసులు 335.98 లక్షలు, బీరు కేసులు 116.76 లక్షల కేసులు  విక్రయించారు. అయినా సరే చంద్రబాబు కోసం ఈనాడు దు్రష్పచారం చేస్తోంది. 

నేతన్నకు తోడుగా.. 
గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం.   వరుసగా ఐదేళ్లు నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్‌ జాకార్డ్, జాకార్డ్‌ లిఫ్టింగ్‌ మెషిన్‌ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ వారి జీవితాలను మెరుగుపర్చుకున్నారు. నేతన్నల పెన్షన్‌ కోసం రూ.1,396.45 కోట్లు ఇచ్చింది.

చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఈ మూడు పథకాలకు రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. చేనేత వ్రస్తాలకు ఆన్‌లైన్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. చేనేతకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తూ ఆర్గానిక్‌ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రోత్సహిస్తోంది.

ప్రత్యేక శిక్షణ, క్లస్టర్‌ ట్రైనింగ్‌ వంటి గట్టి ప్రయత్నాలతో చేనేత కుటుంబాలకు నైపుణ్యాన్ని మెరుగుపరిచే కృషి చేస్తోంది. శిక్షణతో వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ అందించి మగ్గాలు, షెడ్లు తదితర సామగ్రిని సమకూర్చారు. మిల్లు వస్త్రాలకు దీటుగా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్‌ కల్పించడం, ఆప్కో షోరూమ్‌లను విస్తరించి సొసైటీల వద్ద వ్రస్తాలు కొనుగోలు చేసి విక్రయించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.

కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఏపీ చేనేత వ్రస్తాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి(ఓడీఓపీ) కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఏకంగా 36 చేనేత వ్రస్తాల ఉత్పత్తిని గుర్తించి వాటికి జాతీయ స్థాయిలో బ్రాండ్‌ ఇమేజ్‌ సాధించేలా కృషి చేస్తోంది. ‘పచ్చ’పొరలు కమ్మిన మీకు ఇవేవి కన్పించట్లేదా రామోజీ? 

ఓట్ల కోసం చంద్రబాబు డ్రామా  
చంద్రబాబు హయాంలో 2014 జూన్‌ నుంచి 2016 అక్టోబర్‌ వరకు కందిపప్పు  పంపిణీయే చేయలేదు. 2016 నవంబర్‌ నుంచి 2018 ఫిబ్రవరి వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో 2018 మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.63 ఉంటే రూ.23 మాత్రమే సబ్సిడీ భరించి రూ.40కు పంపిణీ చేశారు.

మార్కెట్‌ ఒడిదుడుకులు, కోవిడ్‌ సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో ప్రస్తుత మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.160కు చేరింది. ప్రభుత్వం రెండు, మూడు నెలల ముందు వరకు రూ.120కిపైగా కంది పప్పు ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే ఇచ్చింది. నెలకు రూ.56 కోట్లు సబ్సిడీ ఖర్చు అయ్యేది. ఇప్పుడు పెద్ద ఎత్తున బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కొనుగోలు చేయలేని పరిస్థితి.

ఇలాంటి తరుణంలో నాఫెడ్‌ నుంచి కందులు కొనుగోలు చేసి వాటిని మర ఆడించి సబ్సిడీపై లబ్దిదారులకు పంపిణీ చేసేలా కసరత్తు చేస్తోంది. దీనితో పాటు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద హోల్‌సేల్‌ వ్యాపారులతో మాట్లాడి తక్కువ ధరకు కందిపప్పు, బియ్యాన్ని విక్రయించే స్టాల్స్‌ ఏర్పాటు చేసింది. నాణ్యమైన పంచదారను సైతం ప్రతి నెలా అర కిలో చొప్పున క్రమం తప్పకుండా అందిస్తోంది.

అన్నింటికీ మించి పేదలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచింది. అదే చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో సొంత కాంట్రాక్టుదారులకు నాసిరకం సరుకులు సరఫరా చేసే బాధ్యతను అప్పగించి దోచుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా తొలుత రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. అన్ని మున్సిపాల్టీల్లో ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండిని పంపిణీ చేస్తోంది. 

నాడు చీకట్లు.. నేడు వెలుగులు  
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలతో పాటు, ట్రూ అప్, ఎఫ్‌ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు వినియోగదారుల రాయితీ మొత్తం రూ.74.43 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి వుండగా, 0–100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల విద్యుత్‌ సర్వీసులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేసేవారు.

ఆ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 0–200కు పెంచింది. దీంతో సర్వీసులు పెరిగాయి. సబ్సిడీ పెరిగింది. 2017–18లో సబ్సిడీ రూ.52.04 కోట్లు ఉండగా, 2022–23కి రూ.189.17 కోట్లకు పెరిగింది. ఇదంతా పేదలకు మేలు చేయడం కాదా రామోజీ?  టీడీపీ హయాంలో విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి దివాలా తీయించిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ ఎరుగనట్టు మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో పెరిగిన విద్యుత్‌ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఏపీఈఆర్సీకి సమర్పించలేదు.

దానికి తోడు డిస్కంలపై ఒత్తిడి తెచ్చి, 25 ఏళ్లకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేయించారు. పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.2.44 ఉన్నప్పుడు రూ.5.94తో ఒప్పందం చేసుకున్నారు. సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ 2.44కు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్‌ చార్జీలతో కలిపి అయితే రూ. 3.54) రూ.8.09తో ఒప్పందాలపై సంతకాలు చేశారు. చంద్రబాబు హయాంలో స్లాబుల పేరుతో విద్యుత్‌ చార్జీల దోపిడీ జరిగేది. ఇవన్నీ మరచిపోయి ఎవరి కోసం విషం కక్కుతున్నారు రామోజీ?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement