Eenadu Ramoji Rao Fake News On YSRCP Over Chandrababu Naidu Punganur Case - Sakshi
Sakshi News home page

ఏది నిజం?: చట్టం మీ ‘బాబు’ చుట్టమా రామోజీ? 

Published Fri, Aug 11 2023 4:25 AM | Last Updated on Fri, Aug 11 2023 3:44 PM

Eenadu Ramojirao Fake News On YSRCP Chandrababu Punganur Case - Sakshi

వాహనాల్లో తుపాకులు... చేతుల్లో కర్రలు, రాళ్లు, తాగి ఖాళీ చేసిన బీరు బాటిళ్లు... ఇవన్నీ పట్టుకుని ప్రాజెక్టులు చూడటానికి ‘యాత్ర’గా వెళ్లారంటే నమ్మగలమా? వీళ్లు ఎలాంటి యాత్రకు ప్లాన్‌ చేస్తున్నారో తెలియటం లేదా? గుంపును నడిపించే నాయకుడు ఆవేశంతో... ‘‘తరమండిరా నా కొడుకుల్ని’’ అంటూ ఎదుటివాళ్లను కొట్టమని రెచ్చగొడుతుంటే దాన్నేమనుకోవాలి? పైపెచ్చు... ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది.

తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండ్రా నా కొడకల్లారా..’’ అని తన బావమరిది సినిమాల్లో రెచ్చిపోయినట్లుగా 73 ఏళ్ల చంద్రబాబు నాయుడు రెచ్చిపోయాడంటే ఏమనుకోవాలి? ఆయన మాటలతో రెచ్చిపోయి పరుగులు తీస్తూ ఎదుటి వ్యక్తులపై రాళ్ల దాడికి తెగబడ్డ తెలుగుదేశం రౌడీ మూకలు ఏం యాత్ర చేస్తున్నట్లు? నిరసన తెలపటానికి నల్ల జెండాలతో వచ్చిన 20 మంది కూడా లేని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను తరమటంతో పాటు పోలీసులను రాళ్లు విసిరి గాయపరిచిన వారిపై కేసు పెట్టడం తప్పా? అన్నమయ్య జిల్లా ‘అంగళ్లు’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరు ఎవరిపై హత్యాయత్నం చేశారో తెలియటం లేదా? మరి ఈ ఘటనలో కెమెరాల సాక్షిగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి విధ్వంసానికి పాల్పడిన చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టడం తప్పెలా అవుతుంది? దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ కోణంలోనే చూసి... ‘వైకాపా జులుం’ అంటూ రాసిన మీ కలానికి జోహార్లు రామోజీరావు గారూ!!. మీ పాత్రికేయానికి 50 ఏళ్లు నిండుతున్న తరుణంలో మీరు కొత్త లోతులకు దిగజారిపోతున్నారని అర్థం కావటం లేదా?  

పుంగనూరులో మరీ దారుణం. అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా లేరు. ఉన్నదల్లా పోలీసులే. వారు కూడా బందోబస్తు కోసం పుంగనూరు ఊళ్లోకి వెళ్లే రోడ్లకు బారికేడ్లు పెట్టి... ఆ బారికేడ్ల వెనక నిలుచున్నారు. ఇక చంద్రబాబు నాయుడి మూకకు ఆ ఊళ్లోకి వెళ్లాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్లు అనుమతి తీసుకున్న రూట్‌ మ్యాప్‌లో... పుంగనూరు బైపాస్‌ మీదుగా వెళ్లిపోవాలి తప్ప పుంగనూరు ఊళ్లోకి వెళ్లటమనేది లేదు. అందుకే పోలీసులు అక్కడ బందోబస్తుగా నిలుచున్నారు.

అలాంటి చోట వెళుతూనే... దూరం నుంచే పోలీసులపైకి రాళ్లు, బీరు బాటిళ్లు విసురుతూ వారిని గాయపరిచిందెవరు? ఉద్దేశ పూర్వకంగా దాడి చేసి... ఏకంగా 47 మంది పోలీసుల్ని రక్తం వచ్చేలా రాళ్లతో కొట్టిందెవరు? ఒక కానిస్టేబుల్‌ కంటి చూపు కూడా పోయింది కదా!!. ఇది హత్యాయత్నం కాక మరేమిటి? చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఉసిగొల్పడం వల్లే కదా... వారంతా పోలీసుల పైకి రాళ్లతో విరుచుకుపడ్డారు!!. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేయటంతో... టీడీపీ మూకలు కూడా తాము తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగాయి.

చంద్రబాబు నాయుడు దాడులకు ప్రేరేపించటంతో పాటు... దగ్గరుండి రెచ్చగొడుతూ దాడులు చేయించటం... ఆయన సమక్షంలోనే మొత్తం దాడులు జరగటం... ఇదంతా కుట్ర కాక మరేంటి? చంద్రబాబుపై కేసు పెడితే తప్పేంటి రామోజీరావు గారూ? అసలు ముందే దాడులు చేయాలన్న ప్రణాళిక లేకుంటే తెలుగుదేశం నేతల వాహనాల్లో తుపాకులు ఎందుకున్నాయి? కర్రలు, రాడ్లు ఎందుకు వెంట తెచ్చుకున్నారు? చేతుల్లో రాళ్లు సిద్ధంగా ఉన్నాయంటే అర్థమేంటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి రామోజీరావు గారూ? 



చంద్రబాబు టీడీపీ గుండాలను ఉసిగొల్పిన వీడియోలు వైరల్‌... 
డీఎస్పీని ఉద్దేశించి  ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్‌ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు చంద్రబాబు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు కూడా. ఇంకా.. ‘దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్‌ఎస్‌జి రక్షణలో ఉన్నా. ఏయ్‌ పోలీస్‌... బట్టలిప్పు. రోషం లేని జీవితం. మీ పతనం చూసేవరకు వెంటపడతా’ అంటూ పుంగనూరులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఆడియో, వీడియో సాక్షాలతో సహా బయటపడ్డాయి.

చంద్రబాబు వైఖరిని చూసి జనం ఛీకొట్టడమే కాదు... ఆయన అడ్డంగా దొరికిపోయాడు కనక పోలీసులు తననే ఏ–1గా పెట్టి కేసు నమోదు చేశారు. అంతటా తనకు ప్రతికూలత పెరుగుతుండటంతో... సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. తనపైనే హత్యా­యత్నం జరిగిందని, అలాంటిది తనపైనే కేసు పెట్టడం ఏంటని కొత్త రాగం అందుకున్నారు. అందుకే.. రామోజీరావు సైతం తన బాబుకు మద్దతుగా సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత... అంతా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలే చేశారని, ఎదురు కేసులు పెడుతున్నారని కొత్త కథనం అందుకున్నారు. ఇదంతా చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌లో భాగమేనని అర్థం కావటానికి ఇంకా ఏం కావాలి?  

అయినా సాక్ష్యాలతో దొరికిపోవడం చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓట్ల కోసం కోట్లు లంచాలిచ్చిన కేసులో చంద్రబాబు ఇలానే ‘మా వాళ్లు బ్రీఫ్డ్‌ మీ’ అంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యవహారం ఎవరికీ తెలియంది కాదు. ఇక అంగళ్లు, పుంగనూరులో బహిరంగంగానే పోలీసులపై దాడులు చేయాలని ఆయన తమ కార్యకర్తలను ఆదేశించారు. మరి హత్యాయత్నానికి ప్రేరేపించిన వ్యక్తిపై కేసు పెట్టరా? చట్ట ప్రకారం పోలీసులు కేసు పెడితే అంతగా పెడబొబ్బలు పెడితే ఎలా...! చంద్రబాబు మీకు ఎక్కువ కావచ్చు. కానీ చట్టానికి అతీతుడు కాదు. 
పుంగనూరు వద్ద ఈ నెల 4న పోలీసు వాహనానికి నిప్పుపెడుతున్న టీడీపీ శ్రేణులు 

పోలీసులను రక్తమోడేలా కొట్టారు... ఒకరి కన్నుపోగొట్టారు 
చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ రౌడీ మూకలు అంగళ్లులో సృష్టించిన విధ్వంస కాండా అంతా ఇంతా కాదు. ఏకంగా ముందస్తు కుట్రతోనే తెచ్చుకున్న రాళ్లూ, కర్రలు, బీర్‌ సీసాలతో పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఈ పెనుదాడిలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లంతా రక్తమోడుతూ కుప్పకూలిపోయారు. టీడీపీ అల్లరి మూకల రాళ్లవర్షంతో గాయపడిన మహిళా పోలీసులు హాహాకారాలు చేయడం అక్కడున్న అందరినీ కలచివేసింది.

చాలా మంది ఖాకీ దుస్తులు రక్తంతో తడిసి ఎర్రబారటం దాడి తీవ్రతకు నిదర్శనం. టీడీపీ రౌడీల రాళ్ల దాడితో రణ«దీర్‌ అనే కానిస్టేబుల్‌ కన్ను పోయింది. మరో కంటికి ఆపరేషన్‌ చేస్తేగానీ ఏమీ చెప్పలేమన్నది వైద్యుల మాట. ఇవన్నీ వీడియోలు, ఫొటోలతో సహా బయటపడినా... ‘ఈనాడు’ మాత్రం  ఎవరిపై దాడి చేశారు...? ఎవరు గాయపడ్డారు?...అంటూ నంగనాచి కబుర్లు చెప్పడం పాత్రికేయానికి పట్టిన ఖర్మ కాక మరేంటి? 

అంతా చంద్రబాబు పన్నాగమే... 
రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కరువవుతున్న టీడీపీకి... లేని సాను­భూతి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రపన్నారన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సాగునీటి ప్రాజెక్టుల పేరిట తాను చేపట్టే యాత్రలో విధ్వంసం సృష్టించాలనేది ఆయన పన్నాగం. ముందుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంగళ్లు సర్కిల్‌కు వద్దకు చంద్రబాబు చేరుకోగానే టీడీపీ మూకలు కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డాయి. దాంతో పోలీసులతో సహా పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో చంద్రబాబు శాంతించ లేదు.

తన వాహనం నుంచే ప్రసంగిస్తూ ‘పుంగనూరులో ఓ పుడింగి ఉన్నాడు.. పదండి అక్కడ తేల్చుకుందాం’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలతో అన్నాడు. పుంగనూరులో విధ్వంసానికి అప్పటికే ‘అన్నీ’ సిద్దం చేసుకునే ఆయన ఆ మాటన్నారు. 2 వేలమందికిపైగా టీడీపీ రౌడీలు మాటువేశారు. అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును గట్టిగా విసిరే బాధ్యత కొందరికి అప్పగించారు.

ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్వాలేదు... పోలీసులు అనివార్యంగా కాల్పులు జరిపే పరిస్థితిని క్రియేట్‌ చేయాలన్నది బాబు లక్ష్యం. పోలీసు కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలించాలన్నది అసలు పన్నాగం. అందుకే రూట్‌ మ్యాప్‌లో లేకపోయినా సరే పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని పట్టుబట్టారు. ఎన్‌ఎస్‌జీ కమాండోల భద్రతలో ఉండే చంద్రబాబు పర్యటన రూట్‌ను ముందే  ఖరారు చేస్తారు. ఆ మేరకు ఆ రూట్‌ను భద్రతా బలగాలు పరిశీలించి క్లియరెన్స్‌ ఇస్తాయి.

అదే రీతిలో టీడీపీ నేతలు ముందుగా ఇచ్చిన దరఖాస్తు మేరకు పుంగనూరు బైపాస్‌ నుంచి యాత్రకు అనుమతినిచ్చారు. ఆ విషయాన్ని ఎన్‌ఎస్‌జీ కార్యాలయానికి కూడా తెలిపారు. కానీ చివరి నిముషంలో ఆ రూట్‌ కాకుండా పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని చంద్రబాబు ఎందుకు పట్టుబట్టా­రు? అదీ తనకు భద్రత విధుల్లో ఉండే ఎన్‌ఎస్‌జీ కమాండోలకు ఎలాంటి సమాచారం లేకుండా? ఎందుకంటే పుంగనూరులో అయితే యథేచ్ఛగా విధ్వంస కాండ సృష్టించవచ్చనేది కుతంత్రం. ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నిఖార్సైన నిజాలు. పోలీసులు సంయమనం పా­టిం­చి కాల్పులు జరపకపోవటం వల్లే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కానీ ‘ఈనాడు’కు ఇవేవీ పట్టవు. ఎందుకంటే దానికి నిజాలతో పనిలేదు. బాబు కోసం పనిచేస్తే చాలు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement