Edi Nijam
-
ఏది నిజం ?: పెత్తందార్లు.. మీరు, మీ బాబే రామోజీ
పేదరికం నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ డీబీటీ రూపంలో 50 నెలల్లో పేదల ఖాతాల్లో రూ.2,31,123.28 కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.2,33,915.92 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు రూ.4,65,039.20 కోట్ల లబ్ధి కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఈ రీతిన ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న పేదలను చూసి ఓర్చుకోలేక.. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దబాయించిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన తానా అంటే తందానా అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారంటూ తప్పుడు రాతలతో పుంఖానుపుంఖాలుగా కథనాలు అచ్చేసిన మీరు పెత్తందార్ల పక్షం కాదా రామోజీ? రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ.. 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670.05 కోట్ల విలువైన ఇంటి స్థలాలను సీఎం వైఎస్ జగన్ పంపిణీ చేశారు. సెంటు భూమి శవాన్ని పూడ్చటానికి మాత్రమే సరిపోతుందంటూ పేదల సొంతింటి స్వప్నంపై అవహేళన చేస్తూ మాట్లాడటం ద్వారా తాను పెత్తందారుడినని చంద్రబాబు చాటుకున్నారు. కోర్టుల్లో కేసులు వేయించి పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి మోకాలడ్డిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయనకు వంతపాడుతున్న మీది పెత్తందారీ పోకడ కాదా రామోజీ? నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెడితే.. దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం కాదా? ఇందుకు మద్దతిస్తూ అక్షరోద్యమం నడిపిన మీరూ ఆ బాపతే కదా రామోజీ? అమరావతి రాజధాని ప్రాంతంలో 50 వేల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. దాన్ని నిరసిస్తూ హైకోర్టులో కేసులు వేయించి.. వారికి ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని వాదించేలా చక్రం తిప్పిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన్ను సమర్థిస్తూ వరుస కథనాలు వండివార్చిన మిమ్మల్ని పెత్తందారు అనక ఇంకేమనాలి రామోజీ? సీఎం వైఎస్ జగన్.. ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయ పడుతూ, వారి అభ్యున్నతి కోసం నాలుగేళ్లుగా పరితపిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా వారికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. అన్ని పదవుల్లోనూ సింహ భాగం కేటాయిస్తున్నారు. ఇది పెత్తందారీతనమా? లేక ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?’ అని చంద్రబాబు వారిని అవమానించడం పెత్తందారీతనమా? తేల్చి చెప్పే ధైర్యముందా రామోజీ? ‘ఈ రోజు రాష్ట్రంలో జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్.. పేదలు ఒక వైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాళ్లు మరో వైపు. వచ్చే ఎన్నికల్లో పొరపాటు జరిగితే పేదలు రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు’ అంటూ రాష్ట్రంలో చంద్రబాబు, ఎల్లో మీడియా పోకడలపై సీఎం వైఎస్ జగన్ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం.. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాలను కట్టబెట్టడం.. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జాతీయ సంస్థల సర్వేలు నొక్కివక్కాణిస్తుండటం.. వీటన్నింటితో ఇక చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లడం ఖాయమని మీరు తీవ్రంగా ఆందోళన చెందుతుండటం నిజం కాదా రామోజీ? విషం చిమ్ముతున్నది అందుకే కదా? కార్పొరేట్‌కు కొమ్ము కాసింది బాబే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయకుండా.. ప్రైవేట్, కార్పొరేట్ వైద్య కళాశాలలకే పట్టంకట్టారు. టీడీపీ నాయకులు, సానుభూతిపరులకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చి.. వారి జేబులు నింపారు. ఇదంతా అప్పుడు రామోజీ కళ్లకు పచ్చగా కనిపించింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించడం కోసం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే.. దేశంలో ఎక్కడా లేనట్టుగా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి 2017 నుంచి రాజస్తాన్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పాత 12 వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు కొత్త విధానాన్ని అమలు చేయకుండా కేవలం కొత్తగా ఏర్పాటైన కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా పోగా.. మిగిలిన సీట్లలో 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. మరో 50 శాతం సీట్లలో 35 శాతం ‘బీ’, 15 శాతం సీట్లను ‘సీ’ కేటగిరిలో భర్తీ చేయనున్నారు. ఈ సీట్లకు ఫీజుల రూపంలో వచ్చే నిధులను ఆయా కళాశాలల అభివృద్ధికే ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి కాబట్టే నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం కోసం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా ఏకంగా 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో 15 శాతం ఆల్ ఇండియా కోటా పోగా మిగిలిన సీట్లలో 50 శాతం రిజిర్వేషన్ వర్గాలకు కేటాయిస్తున్నారు. అంటే 300కు పైగా సీట్లు కన్వీనర్ కోటాలో ఈ ఏడాది నుంచి పెరిగాయి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు మేలు చేయడం కాదా? ఇంటిపై హక్కులు కల్పిస్తే తప్పా? గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలకు మేలు చేకూర్చేలా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది/రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించింది. దీంతో 22–ఏ జాబితాలో ఉండే స్థలాలపై పేదలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభించాయి. పేదలు తమ కాళ్లపై తాము నిలబడాలి.. ఇళ్లలో నివసించే హక్కు స్థానంలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి యాజమాన్య హక్కులను కల్పించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను అమలు చేసి రుణాల నుంచి విముక్తి కల్పించాలని.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల నుంచి విజ్ఞప్తులు వచ్చినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వం పేదల మొర ఆలకించడం లేదంటూ రామోజీరావు ఒక్క రాత కూడా రాసిన పాపానపోలేదు. ఇప్పుడు పేదలపై మితిమీరిన భారం లేకుండా రూ.10వేలు, ఒక వేళ అంతకంటే తక్కువ రుణం ఉంటే అదే మొత్తం చెల్లించిన వారికి, రుణాలు తీసుకోని వారికైతే రూ.10 వంటి నామ మాత్రపు ఫీజులతో ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పించారు. రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించారు. ఇది పేదలకు మేలు చేయడం కాదా? ఉన్నతంగా విదేశీ విద్య జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా రాష్ట్రానికి చెందిన అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు.. నోబెల్ గ్రహీతలైన టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ వంటి గొప్ప వ్యక్తులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ పథకం కింద గత ఏడాది 290, ఈ ఏడాది 67 మందికి కలిపి రూ.142.71 కోట్లు మంజూరు చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫిబ్రవరిలో లబ్దిపొందిన 290 మందిలో ఎస్సీ విద్యార్థులు 27 మంది, బీసీ 64, క్రిస్టియన్ నలుగురు, ముస్లింలు 20, ఈబీసీలు 175 మంది ఉన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఫాల్ సీజన్ కింద ఎంపికైన వారు 67 మంది ఉండగా, వీరిలో ఎస్సీ విద్యార్థులు ఐదుగురు, ఎస్టీ ఒక్కరు, బీసీ 13, క్రిస్టియన్ నలుగురు, ముస్లింలు ఎనిమిది మంది, ఈబీసీలు 36 మంది ఉన్నారు. 2022–23 బ్యాచ్‌కు చెందిన 290 మంది విద్యార్థులకు రెండో విడత వాయిదా ఫీజు, వీసా చార్జీలు, విమాన ఖర్చులతో సహా రూ.35.40 కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ కార్డు రాగానే ఒకసారి, మొదటి సెమిస్టర్ పూర్తవగానే రెండోసారి ఫీజు చెల్లించి వదిలేసేది. ఆ తర్వాత విద్యార్థి ఏమయ్యాడో పట్టించుకునే వారు కాదు. గత ప్రభుత్వం విదేశాల్లో చదువుకునేందుకు 2014–19 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.15 లక్షల చొప్పున, ఓసీలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం నూరు శాతం ఫీజు చెల్లిస్తోంది. ఓసీలకు రూ.కోటి, ఇతర వర్గాలకు రూ.1.25 కోట్ల వరకు వెచ్చిస్తోంది. పైగా చంద్రబాబు 2016–17, 2018–19 సంవత్సరాల్లో 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను పెట్టారు. ఇప్పుడు నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా విద్యార్థి సెమిస్టర్/టర్మ్ పత్రాలు సమర్పించగానే ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం పొందేలా 21 కోర్సులకు సంబంధించి ప్రతి కోర్సుకు టాప్ 50లో ఉన్న విద్యా సంస్థలను నిర్ణయించింది. దీంతో మొత్తం విద్యా సంస్థల సంఖ్య 320కి పెరిగింది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్న పరిమితిని తొలగించింది. దీనికి కూడా వక్రభాష్యం చెప్పడం రామోజీకే చెల్లింది. సామాన్యునికి అందుబాటులో సినీ వినోదం టీడీపీ ప్రభుత్వ హయాంలో సినీ సిండికెట్ సినిమా టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. టికెట్ల గణాంకాలు ఎక్కడా ఉండేవి కావు. ఈ పరిస్థితిలో వెఎస్సార్సీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయాల విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలను అందుబాటులోకి తీసుకువస్తూ విధాన నిర్ణయం తీసుకుంది. అలా చేస్తే తమ దందాకు చెక్ పడుతుందని భావించిన టీడీపీ అనుకూల సిండికేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా మరోవైపు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల కేటగిరీల్లో సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ 2021 ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది. దీనిపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో హోమ్, సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సినీ రంగానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఓ విధానాన్ని రూపొందించింది. ఆ మేరకు సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ 2022 మార్చి 7న జీవో 13 జారీ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలను తొలి వారం రోజులపాటు పెంచుకునేందుకు నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించింది. హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషకాలు కాకుండా సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటితే.. సినిమాలో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేస్తే... టికెట్ల ధరలను తొలి పది రోజులపాటు పెంచుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల యావత్ సినీ పరిశ్రమతోపాటు సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై కూడా దిగజారుడు రాతలేనా రామోజీ? మద్యం వ్యసనానికి దూరమవుతున్న పేదలు మద్యం ధరలు షాక్ కొట్టేలా చేస్తాం.. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేస్తాం.. అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు విస్పష్టంగా ప్రకటించారు. అదే విధానాన్ని సమర్థంగా అమలు చేస్తుంటే ఈనాడు రామోజీరావుకు కంటగింపుగా మారింది. రాష్ట్రంలో 2014–19 మధ్య మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల ప్రైవేటు సిండికేట్ గుప్పిట్లో ఉండేవి. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ పేదలను కొల్లగొట్టేవారు. నిర్ణీత వేళలను పాటించకుండా విక్రయాలు సాగించేవి. ఇప్పుడు ఆ దందాకు చెక్ పెట్టారు. 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. గత సర్కార్ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కొత్త బార్లకు లైసెన్స్‌లు ఇవ్వలేదు. 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఉన్నాయి. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. తద్వారా పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోవడమే అందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వంలో 2018– 19లో రాష్ట్రంలో 384.31 లక్షల మద్యం కేసులు, 277.1 లక్షల బీర్ కేసులు విక్రయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో మద్యం కేసులు 308.49 లక్షలు, బీరు 212.91లక్షల కేసులే విక్రయించారు. 2020–21లో మద్యం కేసులు 187.55 లక్షలు, బీరు కేసులు 56.97 లక్షలతో విక్రయాలు తగ్గిపోయాయి. 2021–22లో మద్యం కేసులు 266.08 లక్షలు, బీరు కేసులు 81.67 లక్షలు, 2022–23లో మద్యం కేసులు 335.98 లక్షలు, బీరు కేసులు 116.76 లక్షల కేసులు విక్రయించారు. అయినా సరే చంద్రబాబు కోసం ఈనాడు దు్రష్పచారం చేస్తోంది. నేతన్నకు తోడుగా.. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. వరుసగా ఐదేళ్లు నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ వారి జీవితాలను మెరుగుపర్చుకున్నారు. నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇచ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఈ మూడు పథకాలకు రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. చేనేత వ్రస్తాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. చేనేతకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తూ ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక శిక్షణ, క్లస్టర్ ట్రైనింగ్ వంటి గట్టి ప్రయత్నాలతో చేనేత కుటుంబాలకు నైపుణ్యాన్ని మెరుగుపరిచే కృషి చేస్తోంది. శిక్షణతో వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ అందించి మగ్గాలు, షెడ్లు తదితర సామగ్రిని సమకూర్చారు. మిల్లు వస్త్రాలకు దీటుగా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్ కల్పించడం, ఆప్కో షోరూమ్‌లను విస్తరించి సొసైటీల వద్ద వ్రస్తాలు కొనుగోలు చేసి విక్రయించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఏపీ చేనేత వ్రస్తాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి(ఓడీఓపీ) కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఏకంగా 36 చేనేత వ్రస్తాల ఉత్పత్తిని గుర్తించి వాటికి జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ సాధించేలా కృషి చేస్తోంది. ‘పచ్చ’పొరలు కమ్మిన మీకు ఇవేవి కన్పించట్లేదా రామోజీ? ఓట్ల కోసం చంద్రబాబు డ్రామా చంద్రబాబు హయాంలో 2014 జూన్ నుంచి 2016 అక్టోబర్ వరకు కందిపప్పు పంపిణీయే చేయలేదు. 2016 నవంబర్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో 2018 మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.63 ఉంటే రూ.23 మాత్రమే సబ్సిడీ భరించి రూ.40కు పంపిణీ చేశారు. మార్కెట్ ఒడిదుడుకులు, కోవిడ్ సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో ప్రస్తుత మార్కెట్లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.160కు చేరింది. ప్రభుత్వం రెండు, మూడు నెలల ముందు వరకు రూ.120కిపైగా కంది పప్పు ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే ఇచ్చింది. నెలకు రూ.56 కోట్లు సబ్సిడీ ఖర్చు అయ్యేది. ఇప్పుడు పెద్ద ఎత్తున బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో నాఫెడ్ నుంచి కందులు కొనుగోలు చేసి వాటిని మర ఆడించి సబ్సిడీపై లబ్దిదారులకు పంపిణీ చేసేలా కసరత్తు చేస్తోంది. దీనితో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద హోల్‌సేల్ వ్యాపారులతో మాట్లాడి తక్కువ ధరకు కందిపప్పు, బియ్యాన్ని విక్రయించే స్టాల్స్ ఏర్పాటు చేసింది. నాణ్యమైన పంచదారను సైతం ప్రతి నెలా అర కిలో చొప్పున క్రమం తప్పకుండా అందిస్తోంది. అన్నింటికీ మించి పేదలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచింది. అదే చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో సొంత కాంట్రాక్టుదారులకు నాసిరకం సరుకులు సరఫరా చేసే బాధ్యతను అప్పగించి దోచుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా తొలుత రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. అన్ని మున్సిపాల్టీల్లో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేస్తోంది. నాడు చీకట్లు.. నేడు వెలుగులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలతో పాటు, ట్రూ అప్, ఎఫ్‌ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు వినియోగదారుల రాయితీ మొత్తం రూ.74.43 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి వుండగా, 0–100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల విద్యుత్ సర్వీసులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేసేవారు. ఆ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 0–200కు పెంచింది. దీంతో సర్వీసులు పెరిగాయి. సబ్సిడీ పెరిగింది. 2017–18లో సబ్సిడీ రూ.52.04 కోట్లు ఉండగా, 2022–23కి రూ.189.17 కోట్లకు పెరిగింది. ఇదంతా పేదలకు మేలు చేయడం కాదా రామోజీ? టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి దివాలా తీయించిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ ఎరుగనట్టు మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఏపీఈఆర్సీకి సమర్పించలేదు. దానికి తోడు డిస్కంలపై ఒత్తిడి తెచ్చి, 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేయించారు. పవన విద్యుత్ యూనిట్ రూ.2.44 ఉన్నప్పుడు రూ.5.94తో ఒప్పందం చేసుకున్నారు. సౌర విద్యుత్ యూనిట్ రూ 2.44కు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి అయితే రూ. 3.54) రూ.8.09తో ఒప్పందాలపై సంతకాలు చేశారు. చంద్రబాబు హయాంలో స్లాబుల పేరుతో విద్యుత్ చార్జీల దోపిడీ జరిగేది. ఇవన్నీ మరచిపోయి ఎవరి కోసం విషం కక్కుతున్నారు రామోజీ? -
ఏది నిజం?: చట్టం మీ ‘బాబు’ చుట్టమా రామోజీ?
వాహనాల్లో తుపాకులు... చేతుల్లో కర్రలు, రాళ్లు, తాగి ఖాళీ చేసిన బీరు బాటిళ్లు... ఇవన్నీ పట్టుకుని ప్రాజెక్టులు చూడటానికి ‘యాత్ర’గా వెళ్లారంటే నమ్మగలమా? వీళ్లు ఎలాంటి యాత్రకు ప్లాన్ చేస్తున్నారో తెలియటం లేదా? గుంపును నడిపించే నాయకుడు ఆవేశంతో... ‘‘తరమండిరా నా కొడుకుల్ని’’ అంటూ ఎదుటివాళ్లను కొట్టమని రెచ్చగొడుతుంటే దాన్నేమనుకోవాలి? పైపెచ్చు... ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండ్రా నా కొడకల్లారా..’’ అని తన బావమరిది సినిమాల్లో రెచ్చిపోయినట్లుగా 73 ఏళ్ల చంద్రబాబు నాయుడు రెచ్చిపోయాడంటే ఏమనుకోవాలి? ఆయన మాటలతో రెచ్చిపోయి పరుగులు తీస్తూ ఎదుటి వ్యక్తులపై రాళ్ల దాడికి తెగబడ్డ తెలుగుదేశం రౌడీ మూకలు ఏం యాత్ర చేస్తున్నట్లు? నిరసన తెలపటానికి నల్ల జెండాలతో వచ్చిన 20 మంది కూడా లేని వైఎస్సార్ సీపీ కార్యకర్తలను తరమటంతో పాటు పోలీసులను రాళ్లు విసిరి గాయపరిచిన వారిపై కేసు పెట్టడం తప్పా? అన్నమయ్య జిల్లా ‘అంగళ్లు’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరు ఎవరిపై హత్యాయత్నం చేశారో తెలియటం లేదా? మరి ఈ ఘటనలో కెమెరాల సాక్షిగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి విధ్వంసానికి పాల్పడిన చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టడం తప్పెలా అవుతుంది? దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ కోణంలోనే చూసి... ‘వైకాపా జులుం’ అంటూ రాసిన మీ కలానికి జోహార్లు రామోజీరావు గారూ!!. మీ పాత్రికేయానికి 50 ఏళ్లు నిండుతున్న తరుణంలో మీరు కొత్త లోతులకు దిగజారిపోతున్నారని అర్థం కావటం లేదా? పుంగనూరులో మరీ దారుణం. అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా లేరు. ఉన్నదల్లా పోలీసులే. వారు కూడా బందోబస్తు కోసం పుంగనూరు ఊళ్లోకి వెళ్లే రోడ్లకు బారికేడ్లు పెట్టి... ఆ బారికేడ్ల వెనక నిలుచున్నారు. ఇక చంద్రబాబు నాయుడి మూకకు ఆ ఊళ్లోకి వెళ్లాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్లు అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్‌లో... పుంగనూరు బైపాస్ మీదుగా వెళ్లిపోవాలి తప్ప పుంగనూరు ఊళ్లోకి వెళ్లటమనేది లేదు. అందుకే పోలీసులు అక్కడ బందోబస్తుగా నిలుచున్నారు. అలాంటి చోట వెళుతూనే... దూరం నుంచే పోలీసులపైకి రాళ్లు, బీరు బాటిళ్లు విసురుతూ వారిని గాయపరిచిందెవరు? ఉద్దేశ పూర్వకంగా దాడి చేసి... ఏకంగా 47 మంది పోలీసుల్ని రక్తం వచ్చేలా రాళ్లతో కొట్టిందెవరు? ఒక కానిస్టేబుల్ కంటి చూపు కూడా పోయింది కదా!!. ఇది హత్యాయత్నం కాక మరేమిటి? చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఉసిగొల్పడం వల్లే కదా... వారంతా పోలీసుల పైకి రాళ్లతో విరుచుకుపడ్డారు!!. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేయటంతో... టీడీపీ మూకలు కూడా తాము తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగాయి. చంద్రబాబు నాయుడు దాడులకు ప్రేరేపించటంతో పాటు... దగ్గరుండి రెచ్చగొడుతూ దాడులు చేయించటం... ఆయన సమక్షంలోనే మొత్తం దాడులు జరగటం... ఇదంతా కుట్ర కాక మరేంటి? చంద్రబాబుపై కేసు పెడితే తప్పేంటి రామోజీరావు గారూ? అసలు ముందే దాడులు చేయాలన్న ప్రణాళిక లేకుంటే తెలుగుదేశం నేతల వాహనాల్లో తుపాకులు ఎందుకున్నాయి? కర్రలు, రాడ్లు ఎందుకు వెంట తెచ్చుకున్నారు? చేతుల్లో రాళ్లు సిద్ధంగా ఉన్నాయంటే అర్థమేంటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి రామోజీరావు గారూ? చంద్రబాబు టీడీపీ గుండాలను ఉసిగొల్పిన వీడియోలు వైరల్... డీఎస్పీని ఉద్దేశించి ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు చంద్రబాబు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు కూడా. ఇంకా.. ‘దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్ఎస్జి రక్షణలో ఉన్నా. ఏయ్ పోలీస్... బట్టలిప్పు. రోషం లేని జీవితం. మీ పతనం చూసేవరకు వెంటపడతా’ అంటూ పుంగనూరులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఆడియో, వీడియో సాక్షాలతో సహా బయటపడ్డాయి. చంద్రబాబు వైఖరిని చూసి జనం ఛీకొట్టడమే కాదు... ఆయన అడ్డంగా దొరికిపోయాడు కనక పోలీసులు తననే ఏ–1గా పెట్టి కేసు నమోదు చేశారు. అంతటా తనకు ప్రతికూలత పెరుగుతుండటంతో... సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. తనపైనే హత్యాయత్నం జరిగిందని, అలాంటిది తనపైనే కేసు పెట్టడం ఏంటని కొత్త రాగం అందుకున్నారు. అందుకే.. రామోజీరావు సైతం తన బాబుకు మద్దతుగా సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత... అంతా వైఎస్సార్ సీపీ కార్యకర్తలే చేశారని, ఎదురు కేసులు పెడుతున్నారని కొత్త కథనం అందుకున్నారు. ఇదంతా చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌లో భాగమేనని అర్థం కావటానికి ఇంకా ఏం కావాలి? అయినా సాక్ష్యాలతో దొరికిపోవడం చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓట్ల కోసం కోట్లు లంచాలిచ్చిన కేసులో చంద్రబాబు ఇలానే ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యవహారం ఎవరికీ తెలియంది కాదు. ఇక అంగళ్లు, పుంగనూరులో బహిరంగంగానే పోలీసులపై దాడులు చేయాలని ఆయన తమ కార్యకర్తలను ఆదేశించారు. మరి హత్యాయత్నానికి ప్రేరేపించిన వ్యక్తిపై కేసు పెట్టరా? చట్ట ప్రకారం పోలీసులు కేసు పెడితే అంతగా పెడబొబ్బలు పెడితే ఎలా...! చంద్రబాబు మీకు ఎక్కువ కావచ్చు. కానీ చట్టానికి అతీతుడు కాదు. పుంగనూరు వద్ద ఈ నెల 4న పోలీసు వాహనానికి నిప్పుపెడుతున్న టీడీపీ శ్రేణులు పోలీసులను రక్తమోడేలా కొట్టారు... ఒకరి కన్నుపోగొట్టారు చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ రౌడీ మూకలు అంగళ్లులో సృష్టించిన విధ్వంస కాండా అంతా ఇంతా కాదు. ఏకంగా ముందస్తు కుట్రతోనే తెచ్చుకున్న రాళ్లూ, కర్రలు, బీర్ సీసాలతో పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఈ పెనుదాడిలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లంతా రక్తమోడుతూ కుప్పకూలిపోయారు. టీడీపీ అల్లరి మూకల రాళ్లవర్షంతో గాయపడిన మహిళా పోలీసులు హాహాకారాలు చేయడం అక్కడున్న అందరినీ కలచివేసింది. చాలా మంది ఖాకీ దుస్తులు రక్తంతో తడిసి ఎర్రబారటం దాడి తీవ్రతకు నిదర్శనం. టీడీపీ రౌడీల రాళ్ల దాడితో రణ«దీర్ అనే కానిస్టేబుల్ కన్ను పోయింది. మరో కంటికి ఆపరేషన్ చేస్తేగానీ ఏమీ చెప్పలేమన్నది వైద్యుల మాట. ఇవన్నీ వీడియోలు, ఫొటోలతో సహా బయటపడినా... ‘ఈనాడు’ మాత్రం ఎవరిపై దాడి చేశారు...? ఎవరు గాయపడ్డారు?...అంటూ నంగనాచి కబుర్లు చెప్పడం పాత్రికేయానికి పట్టిన ఖర్మ కాక మరేంటి? అంతా చంద్రబాబు పన్నాగమే... రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కరువవుతున్న టీడీపీకి... లేని సానుభూతి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రపన్నారన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సాగునీటి ప్రాజెక్టుల పేరిట తాను చేపట్టే యాత్రలో విధ్వంసం సృష్టించాలనేది ఆయన పన్నాగం. ముందుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంగళ్లు సర్కిల్‌కు వద్దకు చంద్రబాబు చేరుకోగానే టీడీపీ మూకలు కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డాయి. దాంతో పోలీసులతో సహా పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో చంద్రబాబు శాంతించ లేదు. తన వాహనం నుంచే ప్రసంగిస్తూ ‘పుంగనూరులో ఓ పుడింగి ఉన్నాడు.. పదండి అక్కడ తేల్చుకుందాం’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలతో అన్నాడు. పుంగనూరులో విధ్వంసానికి అప్పటికే ‘అన్నీ’ సిద్దం చేసుకునే ఆయన ఆ మాటన్నారు. 2 వేలమందికిపైగా టీడీపీ రౌడీలు మాటువేశారు. అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును గట్టిగా విసిరే బాధ్యత కొందరికి అప్పగించారు. ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్వాలేదు... పోలీసులు అనివార్యంగా కాల్పులు జరిపే పరిస్థితిని క్రియేట్ చేయాలన్నది బాబు లక్ష్యం. పోలీసు కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలించాలన్నది అసలు పన్నాగం. అందుకే రూట్ మ్యాప్‌లో లేకపోయినా సరే పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని పట్టుబట్టారు. ఎన్ఎస్జీ కమాండోల భద్రతలో ఉండే చంద్రబాబు పర్యటన రూట్‌ను ముందే ఖరారు చేస్తారు. ఆ మేరకు ఆ రూట్‌ను భద్రతా బలగాలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తాయి. అదే రీతిలో టీడీపీ నేతలు ముందుగా ఇచ్చిన దరఖాస్తు మేరకు పుంగనూరు బైపాస్ నుంచి యాత్రకు అనుమతినిచ్చారు. ఆ విషయాన్ని ఎన్ఎస్జీ కార్యాలయానికి కూడా తెలిపారు. కానీ చివరి నిముషంలో ఆ రూట్ కాకుండా పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని చంద్రబాబు ఎందుకు పట్టుబట్టారు? అదీ తనకు భద్రత విధుల్లో ఉండే ఎన్ఎస్జీ కమాండోలకు ఎలాంటి సమాచారం లేకుండా? ఎందుకంటే పుంగనూరులో అయితే యథేచ్ఛగా విధ్వంస కాండ సృష్టించవచ్చనేది కుతంత్రం. ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నిఖార్సైన నిజాలు. పోలీసులు సంయమనం పాటించి కాల్పులు జరపకపోవటం వల్లే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కానీ ‘ఈనాడు’కు ఇవేవీ పట్టవు. ఎందుకంటే దానికి నిజాలతో పనిలేదు. బాబు కోసం పనిచేస్తే చాలు. -
ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు
సాక్షి, అమరావతి: ప్రతి ఊర్లో ఒకడుంటాడు. ఊరికి ఏదైనా మంచి జరిగితే భరించలేడు. వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒకరున్నారు! అధికారంలో ఉండగా రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా బుద్ధి వంకరే. తనకు అలవాటైన రీతిలో కుట్రలకు పదును పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన భజన మీడియా ద్వారా కట్టు కథలను ప్రచారంలోకి తెస్తారు. ఒకపక్క భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం.. మరోపక్క అమరావతిలో భూ దందాలపై సిట్ దర్యాప్తు కొనసాగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించడంతో బెంబేలెత్తి టీడీపీ కరపత్రిక ఈనాడు, ఇతర ఎల్లో మీడియాను రంగంలోకి దించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అఫిడవిట్ పేరిట ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిరాధార అభియోగాలతో బురద చల్లేందుకు బరి తెగించారు. అయితే సీబీఐ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేస్తూ ఎంపీ అవినాశ్‌రెడ్డి పూర్తి ఆధారాలతో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, ఆయన బృందం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది. ఎంపీ అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదంటూ అభియోగం మోపడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 19 నుంచి 25వరకు అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరై ఏకంగా 210 ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పారు. ఆ ప్రశ్నలన్నీ గతంలో విచారణలో అడిగినవే అయినా సరే ఓపిగ్గా సమాధానాలిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా చేశారు. అయినా సరే ఎంపీ అవినాశ్ దర్యాప్తునకు సహకరించడం లేదనడం వెనుక దురుద్దేశాలున్నట్లు స్పష్టమవుతోంది. కౌంటర్ అఫిడవిట్లో ఎంపీ అవినాశ్‌రెడ్డి పేర్కొన్న ఇతర అంశాలు సంక్షిప్తంగా ఇవీ... ఎమ్మెల్సీ ఎన్నికలపై అదే దుష్ప్రచారం ఎన్నిసార్లు వాస్తవాలను వెల్లడించినా పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తేవడం ఎల్లో మీడియా కుట్రలకు నిదర్శనంగా నిలుస్తోంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై వక్రీకరణే అందుకు తార్కాణం. 2017లో కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ వివేకాను చంద్రబాబు కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని బరిలో నిలిపారు. నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారిలో బీటెక్ రవిని గెలిపించారు. అయితే వైఎస్ వివేకాకు వ్యతిరేకంగా వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి పని చేసి బీటెక్ రవిని గెలిపించారంటూ సీబీఐ అవాస్తవాలను తన అఫిడవిట్లో పదే పదే ప్రస్తావిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి అందుకే ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ నిరాధార అభియోగాలు మోపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎవరినైనా సీబీఐ విచారించిందా ? జిల్లాలో అన్ని ఓట్లను కలిపి ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది. మరి పులివెందులలో ఓట్లు క్రాస్ అయ్యాయని సీబీఐ ఎలా చెబుతుంది? ఇక డి.శివశంకర్‌రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించాలని అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి భావించారని సీబీఐ ఎలా నిర్ధారణకు వచ్చింది? వాటిలో ఒక్కదానికైనా సీబీఐ సమాధానం చెబుతుందా అంటే అదీ లేదు. కేవలం దురుద్దేశాలతో అభియోగాలు మోపడం మినహా నిరూపించే ఉద్దేశమే సీబీఐకి లేదన్నది స్పష్టమవుతోంది. బీటెక్ రవితో జట్టుకట్టిన సునీత దంపతులు ఈనాడు సహా ఇతర ఎల్లో సిండికేట్ కట్టు కథలకు తాజా పరిణామాలే నిదర్శనం. వైఎస్ వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి ఇప్పుడు ఆయన కుమార్తె సునీత, అల్లుడు– చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ఆ విషయాన్ని బీటెక్ రవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆరోపణలు కూడా చేశారు. అంటే 2017ఎన్నికల్లో వివేకాకు వ్యతిరేకంగా అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పని చేయలేదని స్పష్టమవుతోంది. సీఐబీ అభియోగాలు నిజమైతే బీటెక్ రవి, అవినాశ్‌రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలు ఉండాలి కదా? బీటెక్ రవితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి రోజూ ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నారనేది సందేహాస్పదంగా మారుతోంది. అవినాశ్‌కు ఖరారైన ఎంపీ టిక్కెట్‌పై సీబీఐ వక్రీకరణ కడప ఎంపీ టికెట్‌పై లేని సందిగ్దతను ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ను సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డికే పార్టీ ఖరారు చేసింది. ఆయన్ని గెలిపించే బాధ్యతను వైఎస్ వివేకానందరెడ్డికి అప్పగిస్తూ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించింది. అప్పటికే అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఆయన గెలుపు కోసం వివేకా కూడా విస్తృతంగా పర్యటించారు. హత్యకు గురికావడానికి కొన్ని గంటల ముందు కూడా అంటే 2019 మార్చి 14న అవినాశ్‌రెడ్డికి అనుకూలంగా వివేకానందరెడ్డి మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 300 ఇళ్లకు వెళ్లి ఇంటింటి ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సిట్టింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ విషయాన్ని రఘురామిరెడ్డిని అడిగినా, వివేకా ఎన్నికల ప్రచారం నిర్వహించిన 300 ఇళ్లలోని వారిని అడిగినా వాస్తవం తెలుస్తుంది. సీబీఐ ఆ ప్రయత్నమే చేయకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు అవినాశ్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ శ్రమించారని వివేకా కుమార్తె సునీత స్వయంగా 2019 మార్చి 27న మీడియాతో చెప్పారు. ఎంపీ టికెట్ కోసం వివేకానందరెడ్డిని హత్య చేశారన్న సీబీఐ అభియోగాలు పూర్తి నిరాధారం. అభ్యర్థులు ముందే ఖరారు.. వివేకా హత్య తరువాతే అవినాశ్‌రెడ్డికి టికెట్‌ను ఖరారు చేస్తూ పార్టీ ప్రకటించిందన్న సీబీఐ అభియోగం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను 2019 మార్చి 17న పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏ పార్టీ కూడా ఒక్క రోజులో 200 మంది అభ్యర్థులను ఖరారు చేయదు. ముందే ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను నామినేషన్ల ముందు ప్రకటించడం అన్నది కేవలం ఒక తంతే. అదే విధంగా 200 మంది వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అప్పటికే ఖరారు చేశారు. వారంతా అప్పటికే ప్రచారంలో సైతం నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనానికి భిన్నంగా సీబీఐ అఫిడవిట్ సీబీఐ ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను విస్మరించి నిరాధార అభియోగాలను మోపుతున్నట్లు మరోసారి నిరూపితమైంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్నట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి చెప్పింది తప్పని సీబీఐ తన కౌంటర్లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. ఆ రోజు అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతుండగా వివేకా చనిపోయిన విషయాన్ని ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. దీంతో అవినాశ్‌రెడ్డి వెనక్కి మళ్లి వివేకా నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు చల్లా మల్లి, బండి కేశవ్, బండి రాఘవరెడ్డి, వెంకట రమణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి ఇదే విషయాన్ని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. వారి సాక్ష్యాన్ని సీబీఐ రికార్డు కూడా చేసింది. కానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అసలు ఆ రోజు ఉదయం అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు వెళ్లడం లేదని సీబీఐ కౌంటర్లో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోకుండా సీబీఐ కట్టు కథలు అల్లుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యక్ష సాక్షులా... గూగుల్ టేక్ అవుటా? వాస్తవాలను వక్రీకరించడంలో పచ్చ ముఠా మరో అడుగు ముందుకేసింది. సాంకేతికంగా కచ్చితంగానీ, న్యాయపరంగా ఏమాత్రం చెల్లుబాటుగాని గూగుల్ టేక్ అవుట్ పేరిట దుష్ప్రచారం చేస్తోంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంట్లోనే గడిపి మూడో వ్యక్తి ఫోన్ కోసం ఎదురు చూశారని అఫిడవిట్లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. వివేకా హత్య విషయాన్ని ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డే ఎంపీ అవినాశ్‌కు తెలిపారు. శివప్రకాశ్‌రెడ్డి మూడో వ్యక్తి అవుతారా? మరి ఆయన్ని ఆ కోణంలో సీబీఐ ఎందుకు విచారించడం లేదు? గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ చెబుతున్న అంశాలు, ప్రత్యక్ష సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు తీరు అహేతుకంగా ఉందనేందుకు ఇదో నిదర్శనం. సీబీఐ ఏమాత్రం శాస్త్రీయంగానీ గూగుల్ టేక్ అవుట్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? ఐదుగురు సాక్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటుందా? ఒకవేళ గూగుల్ టేక్ అవుట్నే పరిగణలోకి తీసుకుంటే ఐదుగురు సాక్షులే కాదు.. మొత్తం 248 మంది సాక్షులు చెప్పింది తప్పని అంగీకరిస్తుందా? చిత్ర పటాలంటూ.. విచిత్ర వాదన ఫోన్ కాల్స్ మ్యాప్ అంటూ మరో ఊహాజనితమైన కథను తెరపైకి తెచ్చారు. వివేకా హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 15 ఉదయం 8 గంటల వరకు ఫోన్ సంభాషణల క్రమాన్ని వివరించే మ్యాప్ అంటూ అఫిడవిట్లో పేర్కొంది. ఒక ఊహాజనిత కుట్ర చిత్రాన్ని గీశారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశం ఏమిటంటే ఎర్ర గంగిరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడం కుట్రలో భాగంగా చూపించడం హాస్యాస్పదంగా ఉంది. ఇక తండ్రీ కుమారులైన వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి పరస్పరం మాట్లాడుకోవడం కూడా కుట్రలో భాగంగా చూపించడం అంటే సీబీఐ ఈ కేసు దర్యాప్తులో ఎంతగా దారి తప్పిందో స్పష్టమవుతోంది. నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఉదయ్‌కుమార్‌రెడ్డికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. యూసీఐఎల్ ఉద్యోగి అయిన ఆయన అవినాశ్‌రెడ్డిని సాధారణంగా తరచూ కలిసేవారు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్ కూడా కుట్రలో భాగంగా చూపించడం విడ్డూరంగా ఉంది. దర్యాప్తు ఇంత డొల్లతనంగా ఉండటం సీబీఐ ప్రమాణాలను దిగజారుస్తోంది. వారి ఫోన్ కాల్స్ మ్యాప్ ఎందుకు గీయలేదు? ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆ నలుగురు ఆయన అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితులన్నది పులివెందులలో అందరికీ తెలిసిన విషయమే. మరి ఎర్ర గంగిరెడ్డి– నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి– నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి మధ్య ఫోన్ కాల్స్‌పై సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారి మధ్య కాల్స్‌ను అనుమానాస్పదంగా పరిగణించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నా సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? వారి మధ్య ఫోన్ కాల్స్ మ్యాప్‌ల ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదో సీఐబీనే సమాధానం చెప్పాలి. వివేకా హత్య తరువాత సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కలుసుకున్నారు. ఆ ములాఖత్ కచ్చితంగా అనుమానాస్పదమే. ఇక వివేకాను నరికి చంపానని అంగీకరించిన దస్తగిరి బెయిల్ పిటీషన్‌ను సునీత వ్యతిరేకించకపోవడం కీలకంగా మారింది. డి.శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం ఆమె వ్యతిరేకించడం వెనుక దురుద్దేశం ఉందని స్పష్టమవుతోంది. దస్తగిరి బెయిల్‌ను వ్యతిరేకించని సునీత డి.శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆధారాలు ధ్వంసం చేయించింది వివేకా బావమరుదులే వివేకా హత్యా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేయించారంటూ అవినాశ్‌రెడ్డిపై సీబీఐ మోపిన అభియోగాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వివేకా చనిపోయారని, వెంటనే అక్కడికి వెళ్లమని ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి చెబితేనే అవినాశ్ వెళ్లారు. అప్పటికే వివేకా రాసిన లేఖ గురించి శివప్రకాశ్‌రెడ్డికి తెలిసినా అవినాశ్‌కు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఇక వివేకా నివాసంలో రక్తపు మరకలు, ఫ్లోర్‌ను శుభ్రం చేయించింది ఎర్ర గంగిరెడ్డి. శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఆయన అలా చేశారు. ఎందుకంటే వారిద్దరూ అత్యంత సన్నిహితులు కాబట్టి. అంటే ఆధారాలను ధ్వంసం చేయించింది శివప్రకాశ్‌రెడ్డి అని స్పష్టమవుతూనే ఉంది. మరి ఈ విషయంలో శివప్రకాశ్‌రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అవినాశ్ ఆధారాలను ధ్వంసం చేయించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందా? అలాంటిది ఏదీ లేనప్పుడు సీబీఐ ఏ ఆధారాలతో ఈ అభియోగాలను మోపుతోంది? వివేకా లేఖ, సెల్‌ఫోన్‌ను గోప్యంగా ఉంచిన ఆయన అల్లుడు, పెద్ద బావమరిదిని విచారించాలని అవినాశ్ ఎప్పటి నుంచో కోరుతునే ఉన్నారు. ఇన్నాళ్లకు మేలుకున్న సీబీఐ నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కొద్ది రోజుల క్రితం ఎట్టకేలకు విచారించింది. పది రోజుల క్రితమే సీబీఐ అఫిడవిట్ దాఖలు.. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, విశాఖలో అదాని డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే అద్భుతమైన ఆ రెండు ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు సర్కారు భూదోపిడీ, ఇతర అవినీతి బాగోతాలపై సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు బుధవారమే తీర్పునిచ్చింది. ఆ రెండు అంశాలు గురువారం మీడియాలో ప్రముఖంగా ప్రచురితమవుతాయని తెలుసు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ, పచ్చ మీడియా వేసిన పన్నాగమే సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌ను హఠాత్తుగా తెరపైకి తేవడం. వాస్తవానికి సీబీఐ పది రోజుల క్రితమే న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే రోజు అది అన్ని పత్రికలకు అందుబాటులోకి వచ్చింది. సీబీఐ కౌంటర్‌కు సమాధానంగా ఎంపీ అవినాశ్‌రెడ్డి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ రెండింటి ఆధారంగా న్యాయస్థానంలో వాద ప్రతివాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. అవన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తాజాగా భోగాపురం విమానాశ్రయం, అదాని డేటా సెంటర్‌కు శంకుస్థాపన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఆదేశాలతో ఈనాడు, ఎల్లో మీడియా సీబీఐ అఫిడవిట్ అంశాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి.