సాక్షి, అమరావతి: ప్రతి ఊర్లో ఒకడుంటాడు. ఊరికి ఏదైనా మంచి జరిగితే భరించలేడు. వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒకరున్నారు! అధికారంలో ఉండగా రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా బుద్ధి వంకరే. తనకు అలవాటైన రీతిలో కుట్రలకు పదును పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన భజన మీడియా ద్వారా కట్టు కథలను ప్రచారంలోకి తెస్తారు.
ఒకపక్క భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం.. మరోపక్క అమరావతిలో భూ దందాలపై సిట్ దర్యాప్తు కొనసాగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించడంతో బెంబేలెత్తి టీడీపీ కరపత్రిక ఈనాడు, ఇతర ఎల్లో మీడియాను రంగంలోకి దించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అఫిడవిట్ పేరిట ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిరాధార అభియోగాలతో బురద చల్లేందుకు బరి తెగించారు.
అయితే సీబీఐ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేస్తూ ఎంపీ అవినాశ్‌రెడ్డి పూర్తి ఆధారాలతో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, ఆయన బృందం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది. ఎంపీ అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదంటూ అభియోగం మోపడం విడ్డూరంగా ఉంది.
ఎందుకంటే ఏప్రిల్ 19 నుంచి 25వరకు అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరై ఏకంగా 210 ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పారు. ఆ ప్రశ్నలన్నీ గతంలో విచారణలో అడిగినవే అయినా సరే ఓపిగ్గా సమాధానాలిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా చేశారు. అయినా సరే ఎంపీ అవినాశ్ దర్యాప్తునకు సహకరించడం లేదనడం వెనుక దురుద్దేశాలున్నట్లు స్పష్టమవుతోంది. కౌంటర్ అఫిడవిట్‌లో ఎంపీ అవినాశ్‌రెడ్డి పేర్కొన్న ఇతర అంశాలు సంక్షిప్తంగా ఇవీ...
ఎమ్మెల్సీ ఎన్నికలపై అదే దుష్ప్రచారం
ఎన్నిసార్లు వాస్తవాలను వెల్లడించినా పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తేవడం ఎల్లో మీడియా కుట్రలకు నిదర్శనంగా నిలుస్తోంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై వక్రీకరణే అందుకు తార్కాణం. 2017లో కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ వివేకాను చంద్రబాబు కుట్రపూరితంగా ఓడించారు.
వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని బరిలో నిలిపారు. నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి ద్వారా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారిలో బీటెక్ రవిని గెలిపించారు. అయితే వైఎస్ వివేకాకు వ్యతిరేకంగా వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి పని చేసి బీటెక్ రవిని గెలిపించారంటూ సీబీఐ అవాస్తవాలను తన అఫిడవిట్‌లో పదే పదే ప్రస్తావిస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి అందుకే ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ నిరాధార అభియోగాలు మోపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎవరినైనా సీబీఐ విచారించిందా ? జిల్లాలో అన్ని ఓట్లను కలిపి ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది.
మరి పులివెందులలో ఓట్లు క్రాస్ అయ్యాయని సీబీఐ ఎలా చెబుతుంది? ఇక డి.శివశంకర్‌రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించాలని అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి భావించారని సీబీఐ ఎలా నిర్ధారణకు వచ్చింది? వాటిలో ఒక్కదానికైనా సీబీఐ సమాధానం చెబుతుందా అంటే అదీ లేదు. కేవలం దురుద్దేశాలతో అభియోగాలు మోపడం మినహా నిరూపించే ఉద్దేశమే సీబీఐకి లేదన్నది స్పష్టమవుతోంది.
బీటెక్ రవితో జట్టుకట్టిన సునీత దంపతులు
ఈనాడు సహా ఇతర ఎల్లో సిండికేట్ కట్టు కథలకు తాజా పరిణామాలే నిదర్శనం. వైఎస్ వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి ఇప్పుడు ఆయన కుమార్తె సునీత, అల్లుడు– చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ఆ విషయాన్ని బీటెక్ రవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు.
అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆరోపణలు కూడా చేశారు. అంటే 2017ఎన్నికల్లో వివేకాకు వ్యతిరేకంగా అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పని చేయలేదని స్పష్టమవుతోంది. సీఐబీ అభియోగాలు నిజమైతే బీటెక్ రవి, అవినాశ్‌రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలు ఉండాలి కదా? బీటెక్ రవితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి రోజూ ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నారనేది సందేహాస్పదంగా మారుతోంది.
అవినాశ్‌కు ఖరారైన ఎంపీ టిక్కెట్‌పై సీబీఐ వక్రీకరణ
కడప ఎంపీ టికెట్‌పై లేని సందిగ్దతను ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ను సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డికే పార్టీ ఖరారు చేసింది. ఆయన్ని గెలిపించే బాధ్యతను వైఎస్ వివేకానందరెడ్డికి అప్పగిస్తూ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది. అప్పటికే అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఆయన గెలుపు కోసం వివేకా కూడా విస్తృతంగా పర్యటించారు.
హత్యకు గురికావడానికి కొన్ని గంటల ముందు కూడా అంటే 2019 మార్చి 14న అవినాశ్‌రెడ్డికి అనుకూలంగా వివేకానందరెడ్డి మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 300 ఇళ్లకు వెళ్లి ఇంటింటి ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సిట్టింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ విషయాన్ని రఘురామిరెడ్డిని అడిగినా, వివేకా ఎన్నికల ప్రచారం నిర్వహించిన 300 ఇళ్లలోని వారిని అడిగినా వాస్తవం తెలుస్తుంది.
సీబీఐ ఆ ప్రయత్నమే చేయకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు అవినాశ్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ శ్రమించారని వివేకా కుమార్తె సునీత స్వయంగా 2019 మార్చి 27న మీడియాతో చెప్పారు. ఎంపీ టికెట్ కోసం వివేకానందరెడ్డిని హత్య చేశారన్న సీబీఐ అభియోగాలు పూర్తి నిరాధారం.
అభ్యర్థులు ముందే ఖరారు..
వివేకా హత్య తరువాతే అవినాశ్‌రెడ్డికి టికెట్‌ను ఖరారు చేస్తూ పార్టీ ప్రకటించిందన్న సీబీఐ అభియోగం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను 2019 మార్చి 17న పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏ పార్టీ కూడా ఒక్క రోజులో 200 మంది అభ్యర్థులను ఖరారు చేయదు. ముందే ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను నామినేషన్ల ముందు ప్రకటించడం అన్నది కేవలం ఒక తంతే. అదే విధంగా 200 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అప్పటికే ఖరారు చేశారు. వారంతా అప్పటికే ప్రచారంలో సైతం నిమగ్నమయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల కథనానికి భిన్నంగా సీబీఐ అఫిడవిట్
సీబీఐ ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను విస్మరించి నిరాధార అభియోగాలను మోపుతున్నట్లు మరోసారి నిరూపితమైంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్నట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి చెప్పింది తప్పని సీబీఐ తన కౌంటర్‌లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. ఆ రోజు అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతుండగా వివేకా చనిపోయిన విషయాన్ని ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. దీంతో అవినాశ్‌రెడ్డి వెనక్కి మళ్లి వివేకా నివాసానికి చేరుకున్నారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు చల్లా మల్లి, బండి కేశవ్, బండి రాఘవరెడ్డి, వెంకట రమణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి ఇదే విషయాన్ని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. వారి సాక్ష్యాన్ని సీబీఐ రికార్డు కూడా చేసింది. కానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అసలు ఆ రోజు ఉదయం అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు వెళ్లడం లేదని సీబీఐ కౌంటర్‌లో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోకుండా సీబీఐ కట్టు కథలు అల్లుతున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రత్యక్ష సాక్షులా... గూగుల్ టేక్ అవుటా?
వాస్తవాలను వక్రీకరించడంలో పచ్చ ముఠా మరో అడుగు ముందుకేసింది. సాంకేతికంగా కచ్చితంగానీ, న్యాయపరంగా ఏమాత్రం చెల్లుబాటుగాని గూగుల్ టేక్ అవుట్ పేరిట దుష్ప్రచారం చేస్తోంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంట్లోనే గడిపి మూడో వ్యక్తి ఫోన్ కోసం ఎదురు చూశారని అఫిడవిట్‌లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. వివేకా హత్య విషయాన్ని ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డే ఎంపీ అవినాశ్‌కు తెలిపారు.
శివప్రకాశ్‌రెడ్డి మూడో వ్యక్తి అవుతారా? మరి ఆయన్ని ఆ కోణంలో సీబీఐ ఎందుకు విచారించడం లేదు? గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ చెబుతున్న అంశాలు, ప్రత్యక్ష సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు తీరు అహేతుకంగా ఉందనేందుకు ఇదో నిదర్శనం. సీబీఐ ఏమాత్రం శాస్త్రీయంగానీ గూగుల్ టేక్ అవుట్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? ఐదుగురు సాక్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటుందా? ఒకవేళ గూగుల్ టేక్ అవుట్‌నే పరిగణలోకి తీసుకుంటే ఐదుగురు సాక్షులే కాదు.. మొత్తం 248 మంది సాక్షులు చెప్పింది తప్పని అంగీకరిస్తుందా?
చిత్ర పటాలంటూ.. విచిత్ర వాదన
ఫోన్ కాల్స్ మ్యాప్ అంటూ మరో ఊహాజనితమైన కథను తెరపైకి తెచ్చారు. వివేకా హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 15 ఉదయం 8 గంటల వరకు ఫోన్ సంభాషణల క్రమాన్ని వివరించే మ్యాప్ అంటూ అఫిడవిట్‌లో పేర్కొంది. ఒక ఊహాజనిత కుట్ర చిత్రాన్ని గీశారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశం ఏమిటంటే ఎర్ర గంగిరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడం కుట్రలో భాగంగా చూపించడం హాస్యాస్పదంగా ఉంది.
ఇక తండ్రీ కుమారులైన వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి పరస్పరం మాట్లాడుకోవడం కూడా కుట్రలో భాగంగా చూపించడం అంటే సీబీఐ ఈ కేసు దర్యాప్తులో ఎంతగా దారి తప్పిందో స్పష్టమవుతోంది. నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఉదయ్‌కుమార్‌రెడ్డికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. యూసీఐఎల్ ఉద్యోగి అయిన ఆయన అవినాశ్‌రెడ్డిని సాధారణంగా తరచూ కలిసేవారు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్ కూడా కుట్రలో భాగంగా చూపించడం విడ్డూరంగా ఉంది. దర్యాప్తు ఇంత డొల్లతనంగా ఉండటం సీబీఐ ప్రమాణాలను దిగజారుస్తోంది.
వారి ఫోన్ కాల్స్ మ్యాప్ ఎందుకు గీయలేదు?
ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆ నలుగురు ఆయన అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితులన్నది పులివెందులలో అందరికీ తెలిసిన విషయమే. మరి ఎర్ర గంగిరెడ్డి– నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి– నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి మధ్య ఫోన్ కాల్స్‌పై సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
వారి మధ్య కాల్స్‌ను అనుమానాస్పదంగా పరిగణించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నా సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? వారి మధ్య ఫోన్ కాల్స్ మ్యాప్‌ల ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదో సీఐబీనే సమాధానం చెప్పాలి. వివేకా హత్య తరువాత సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కలుసుకున్నారు. ఆ ములాఖత్ కచ్చితంగా అనుమానాస్పదమే.
ఇక వివేకాను నరికి చంపానని అంగీకరించిన దస్తగిరి బెయిల్ పిటీషన్‌ను సునీత వ్యతిరేకించకపోవడం కీలకంగా మారింది. డి.శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం ఆమె వ్యతిరేకించడం వెనుక దురుద్దేశం ఉందని స్పష్టమవుతోంది. దస్తగిరి బెయిల్‌ను వ్యతిరేకించని సునీత డి.శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆధారాలు ధ్వంసం చేయించింది వివేకా బావమరుదులే
వివేకా హత్యా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేయించారంటూ అవినాశ్‌రెడ్డిపై సీబీఐ మోపిన అభియోగాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వివేకా చనిపోయారని, వెంటనే అక్కడికి వెళ్లమని ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి చెబితేనే అవినాశ్ వెళ్లారు. అప్పటికే వివేకా రాసిన లేఖ గురించి శివప్రకాశ్‌రెడ్డికి తెలిసినా అవినాశ్‌కు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఇక వివేకా నివాసంలో రక్తపు మరకలు, ఫ్లోర్‌ను శుభ్రం చేయించింది ఎర్ర గంగిరెడ్డి. శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఆయన అలా చేశారు.
ఎందుకంటే వారిద్దరూ అత్యంత సన్నిహితులు కాబట్టి. అంటే ఆధారాలను ధ్వంసం చేయించింది శివప్రకాశ్‌రెడ్డి అని స్పష్టమవుతూనే ఉంది. మరి ఈ విషయంలో శివప్రకాశ్‌రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అవినాశ్ ఆధారాలను ధ్వంసం చేయించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందా? అలాంటిది ఏదీ లేనప్పుడు సీబీఐ ఏ ఆధారాలతో ఈ అభియోగాలను మోపుతోంది? వివేకా లేఖ, సెల్‌ఫోన్‌ను గోప్యంగా ఉంచిన ఆయన అల్లుడు, పెద్ద బావమరిదిని విచారించాలని అవినాశ్ ఎప్పటి నుంచో కోరుతునే ఉన్నారు. ఇన్నాళ్లకు మేలుకున్న సీబీఐ నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కొద్ది రోజుల క్రితం ఎట్టకేలకు విచారించింది.
పది రోజుల క్రితమే సీబీఐ అఫిడవిట్ దాఖలు..
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, విశాఖలో అదాని డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే అద్భుతమైన ఆ రెండు ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు సర్కారు భూదోపిడీ, ఇతర అవినీతి బాగోతాలపై సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు బుధవారమే తీర్పునిచ్చింది. ఆ రెండు అంశాలు గురువారం మీడియాలో ప్రముఖంగా ప్రచురితమవుతాయని తెలుసు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ, పచ్చ మీడియా వేసిన పన్నాగమే సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌ను హఠాత్తుగా తెరపైకి తేవడం.
వాస్తవానికి సీబీఐ పది రోజుల క్రితమే న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే రోజు అది అన్ని పత్రికలకు అందుబాటులోకి వచ్చింది. సీబీఐ కౌంటర్‌కు సమాధానంగా ఎంపీ అవినాశ్‌రెడ్డి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ రెండింటి ఆధారంగా న్యాయస్థానంలో వాద ప్రతివాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. అవన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తాజాగా భోగాపురం విమానాశ్రయం, అదాని డేటా సెంటర్‌కు శంకుస్థాపన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఆదేశాలతో ఈనాడు, ఎల్లో మీడియా సీబీఐ అఫిడవిట్ అంశాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment