ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డికి వైఎస్సార్ సీపీ తరఫున టిక్కెట్టిచ్చింది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. గెలిచేంత మెజారిటీ ఉన్నా సరే... కుట్రపూరితంగా ఆయన్ని ఓడించి.. టీడీపీ తరఫున బీటెక్ రవిని గెలిపించింది చంద్రబాబు నాయుడు. ఆయన ఉంటే జిల్లాలో తాము రాజకీయంగా ఏమాత్రం ఎదగలేమని భావించింది టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి. ఆయన్ని ఏకంగా గొడ్డలితో నరికి నేను హత్య చేశాను అని దర్యాప్తు సంస్థల ఎదుటే సాక్ష్యం ఇచ్చిన దస్తగిరి. వీళ్లంతా ఎవరు? వివేకానందరెడ్డిని వ్యక్తిగతంగా, రాజకీయంగా అంతం చేసిన ముఠా సభ్యులు. మరి వీళ్లంటే వివేకానందరెడ్డి కుటుంబానికి సహజంగానే తీవ్ర ఆగ్రహం ఉండాలి కదా?
కానీ ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, దస్తగిరి... బాబు కోసం పనిచేసే ‘ఈనాడు’.. దాని తోకలు.. వీళ్లంతా ఇపుడు వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితులైపోయారు. అంతా కలిసే కోర్టులకెళుతున్నారు. ‘నేనే నరికి చంపా’ అన్న దస్తగిరి బెయిలుకోసం దరఖాస్తు చేస్తే వ్యతిరేకించ లేదు. దర్జాగా బయటే తిరుగుతున్నాడతను.
ఎల్లో మీడియాకు పతాక స్థాయి ఇంటర్వ్యూలిస్తున్నాడు. వంకర మాటల ఓపెన్‌హార్టులో బీటెక్ రవి ప్రవచనాలు చెప్తున్నాడు. వీళ్లంతా కలిసి హంతకుడిని కూడా వదిలేసి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దీంట్లో ఇరికించడానికి వెంటాడుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఎవరికి అర్థం కానిది ఈ నాటకం? వివేకానందరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ఈ ఎల్లో మాఫియాను ఛేదిస్తే తప్ప హత్య వెనక ఉన్న వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు.
2017లో వివేకాపై చంద్రబాబు రాజకీయ కుట్ర.. మెజార్టీ సభ్యులు ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి
వైఎస్ వివేకానందరెడ్డిని రాజకీయంగా అంతం చేయడమే కాదు భౌతికంగానూ లేకుండా చేయాల్సిన అవసరం కచ్చితంగా టీడీపీకే ఉందన్నది బహిరంగ రహస్యం. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ బలోపేతానికి ఆయనే అడ్డంకిగా నిలబడ్డారు. అందుకే 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాను కుట్రపూరితంగా ఓడించారు చంద్రబాబు. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి చెందినవారే ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు.
వివేకాను ఓడిస్తే.. నాటి విపక్ష నేత జగన్‌ను ఓడించినట్లేనని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలు పెట్టి తమ వైపు లాక్కున్నారు. దీనికి నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి పూర్తిగా సహకరించారు. ఎందుకంటే వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నీతిబాహ్యంగా టీడీపీకి అమ్ముడుపోయి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ భారీగా డబ్బులు వెదజల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి దొడ్డిదారిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారు.
2019... వివేకా భౌతికంగా అంతం
2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబులో మళ్లీ గుబులు మొదలైంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలిచిన టీడీపీకి ఈ సారి అది కూడా కష్టమేనని అర్థమైంది. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ లోక్‌సభ స్థానానికి పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా అప్పటికే వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు.
పార్టీ గెలుపు కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ...అందర్నీ కలుపుకుంటూ వెళ్లారు వివేకా. దాంతో చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ను కూడా ఆదినారాయణ రెడ్డి కొడుక్కి ఇచ్చారు. వివేకా ఉంటే ఎప్పటికీ తాము రాజకీయంగా పైచేయి సాధించలేమన్నది బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు గురయ్యారు.
మరి ఇది టీడీపీ కుట్ర కాదా? వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలతో కొందరి రహస్య సమావేశాలు... ఆయన హత్య తరువాత టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి ఊతమిస్తోంది. హత్య అనంతరం... అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పదేపదే కడప ఎస్పీకి ఫోన్ చెయ్యడం... బీటెక్ రవితో కూడా నేరుగా సంభాషించటం... ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారాలను నాటి సీఎం చంద్రబాబుకు అప్‌డేట్ చెయ్యటం.. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. అంటే... అంతా తాము అనుకున్నట్లే జరుగుతోందా? లేదా.. అన్నది బాబుకు ఏబీ అప్‌డేట్ చేశారన్నది నిపుణుల మాట.
హత్యకు ముందు... వివేకా అనుచరుడితో బీటెక్ రవి భేటీ ఎందుకో...!
తనకు దీర్ఘకాలంగా అనుచరుడిగా ఉన్న కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో వివేకాకు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు వచ్చాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని పులివెందుల నియోజకవర్గంలో వివేకా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నేత బీటెక్ రవితో చేతులు కలిపాడు. వివేకా హత్యకు అప్పటికే పన్నాగం సిద్ధం కావడంతో... ముందుగా పరమేశ్వరరెడ్డి ఎలిబీ సృష్టించుకోవడానికి వివేకా హత్యకు కేవలం రెండు రోజుల ముందే అంటే 2019 మార్చి 13న అనారోగ్యం సాకుతో కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రి ఐసీయూలో చేరాడు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్‌లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి... ఆ తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది.
‘గుండె పోటు’ కథకుడు శివప్రకాశ్ రెడ్డి...
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయటమే కాదు. ఆ హత్యలో ఇతరుల్ని ఇరికించడానికి కూడా ఎల్లో గ్యాంగ్ పకడ్బందీ కుట్ర పన్నిందని చెప్పొచ్చు. ఎందుకంటే వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. శివప్రకాశ్‌రెడ్డి మొదట ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. ‘‘సిగరెట్లు ఎక్కువుగా తాగుతారు కదా! అందుకే ఇలా జరిగి ఉండొచ్చు’’ అని ఆదినారాయణరెడ్డి ఆయనతో చెప్పారు. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి స్వయంగా టీవీ ఛానెళ్ల ఎదుట వెల్లడించారు. అంతేకాదు. ఆదినారాయణరెడ్డికి చెప్పిన శివప్రకాశ్ రెడ్డే... ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉదయాన్నే జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి కూడా వివేకా గుండెపోటు విషయం చెప్పారు. దాంతో అక్కడి నుంచే వెనుదిరిగి... అవినాశ్ రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు పలువురు ఉన్నారు. ఇలా శివప్రకాశ్ రెడ్డి చెప్పిన గుండెపోటు విషయమే... టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చింది. ఆయన హత్యకు గురయ్యారనే నిజం బయటపడేలోపే ఈ తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారు. మరి శివప్రకాశ్‌రెడ్డి, ఆది నారాయణరెడ్డి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేశారు? దీన్ని ఛేదిస్తే హత్య కేసులో అసలు కుట్ర బయటపడుతుంది.
రక్తపు మరకల లేఖ.. గోప్యంగా ఉంచమన్న కుమార్తె, అల్లుడు..
వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి పక్కా ప్లాన్‌తోనే వ్యవహరించారు. అదెలాగంటే... వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు.
ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా... వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే... తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని కృష్ణారెడ్డితో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు.
ఆ తరవాతే అసలు పన్నాగానికి తెరలేచింది. శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాశ్‌రెడ్డికి చెప్పించారు. అవినాశ్ రెడ్డి కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. అంటే... అన్నీ పథకం ప్రకారమే చేశారు.
వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. కనీసం అక్కడకు చేరుకున్న అవినాశ్‌కు చూపించినా హత్య సంగతి అర్థమయ్యేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. బహుశా! అంతా తామనుకున్నట్టే జరిగిందనో ఏమో!! ఆ రోజు నుంచీ ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు ఈ హత్య గురించి ఎక్కడ మాట్లాడినా... మృతదేహానికి బ్యాండేజీ ఎవరు కట్టారు? రక్తపు మరకలు ఎవరు తుడిచారు? అనే ప్రశ్నలే వేస్తున్నారు. మొత్తం టీడీపీ, ఎల్లో మీడియా.. అందరూ ఇదే విషయమై దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప అసలు గుండెపోటు అని చెప్పిందెవరు? వారికెలా తెలిసింది? అసలు లేఖను ఎందుకు గోప్యంగా ఉంచారు? అలా ఎందుకు ఉంచమన్నారు? అనే విషయాలను మాత్రం ప్రచారంలోకి రానివ్వటం లేదు. ఇదీ.. కుట్ర వెనక అసలు కథ. ఆ రోజు మధ్యాహ్నం 1గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ... వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం.
చంద్రబాబు మంత్రాంగం...
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితోను, బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోకపోవటం గమనార్హం.
వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం... ! ఆయన రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు
వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి లాభం అన్నది ఈ కేసులో కీలకం. దాంతో అన్ని వేళ్లూ వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలపైకే వెళ్తున్నాయి. తాను రెండో వివాహం చేసుకున్న షమీమ్ అనే మహిళకు పుట్టిన కుమారుడికి ఆస్తిలో భాగం ఇవ్వాలని ఆయన భావించారు. తన రాజకీయ వారసుడిగా చేస్తానన్నది ఆ జిల్లాలో అందరికీ తెలుసు. అందుకే ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి.
వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావగారు శివ ప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, వైఎస్ సునీత పరస్పరం దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది.
షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివించాలని అనుకుంటున్నా...అవ్వడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ లాభమన్నది గమనించాల్సిన అంశం. ఆస్తితో పాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్నది వారి ఉద్దేశంగా తెలుస్తుంది.
హంతకుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చింది ఎవరు...!?
వైఎస్ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. అతన్ని అప్రూవర్‌గా మార్చింది ఎవరనే అంశమూ ఇక్కడ కీలకం. దస్తగిరి తరచు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో భేటీ అవుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సన్నిహితంగా ఉంటున్నారు.
ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మార్చినట్టు స్పష్టమవుతోంది. అప్పటివరకు పేదరికంలో కొట్టుమిట్టాడిన దస్తగిరి.. అప్రూవర్‌గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. కారు, బంగ్లా, డ్రైవర్... అన్నీ వచ్చేశాయి. మరి వీటిని ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సీబీఐ అధికారులు దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం నమోదు చేశారు. అందులో వాస్తవం ఎంతన్నది పట్టించుకోకుండా ఆ వాంగ్మూలం ఆధారంగానే ఏకపక్షంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హంతకుడు ఎల్లో గ్యాంగ్ హీరోనా...!
వివేకాను హత్య చేసిన దస్తగిరిని అటు టీడీపీ ఇటు టీడీపీ అనుకూల పచ్చ మీడియా హీరోగా చూపించేందుకు బరితెగించి వ్యవహరిస్తున్నాయి. ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 చానళ్లు దస్తగిరిని ఇంటర్వ్యూలు చేస్తూ అతన్ని ఓ సెలబ్రిటీగా చూపిస్తున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై అక్కసుతో పాత్రికేయ విలువలను దిగజారుస్తూ ఓ హంతకుడిని హీరోగా చూపించేందుకు పడరానిపాట్లు పడుతున్నాయి. తన తండ్రి హంతకుడిని ఓ సంఘ సంస్కర్తగా టీడీపీ, ఎల్లో మీడియా చూపిస్తూ ఉంటే సునీత కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవటమే ఇక్కడ దారుణం.
ఇదే బాబు మార్కు పన్నాగం...
చంద్రబాబు ఎవరినైనా అడ్డుతొలగించుకోవాలంటే తనదైన శైలిలో పన్నాగం పన్నుతారు. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సొంతం కుటుంబంలోనే చిచ్చుపెట్టి సొంతవారితోనే కథ నడిపిస్తారని ఎన్టీఆర్ విషయంలో రుజువైంది. ఎన్టీ రామారావును ఆయన సొంత పిల్లలతోనే ఛీకొట్టించి మరీ పదవి నుంచి దించేసి తాను అడ్డదారిలో సీఎం అయ్యారు. అదే రీతిలో వివేకానందరెడ్డికి ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతోనే పొగ పెట్టించారు. టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిల సహకారంతో కుటుంబ సభ్యులే పాత్రధారులుగా గుట్టుచప్పుడు కాకుండా కథ ముగించారు.
కీలక అంశాలను విస్మరిస్తున్న సీబీఐ
సున్నితమైన వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఆది నుంచీ దారి తప్పింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు...ఆయన లైంగిక అక్రమ సంబంధాలతో ఆయనపై కక్ష పెంచుకున్నవారు... వివేకాను సెటిల్‌మెంట్లకు వాడుకున్న స్నేహితులు, అనుచరులు...వివేకాను అడ్డుతొలగించుకుంటేనే రాజకీయంగా మనుగడ అని భావించిన చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవి... ఇలా ఈ కేసులో పచ్చ కుట్రను స్పష్టం చేస్తున్న అనేక కోణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ సీబీఐ మాత్రం హంతకుడిని ఎవరో వ్యూహాత్మకంగా అప్రూవర్‌గా మారిస్తే... ఆ వాంగ్మూలం పట్టుకునే ఈ కేసు దర్యాప్తు గోదారిని ఈదేందుకు యత్నిస్తుండటం సీబీఐ తీరునే ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment