
సాక్షి, వైఎస్సార్: సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్టు చేసి, వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వివేకా హత్య ఉదంతం టీవీ సీరియల్‌ను తలపిస్తోందన్నారు. ఆయన కేసులో.. అసలు రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వివేకా హత్య ఉదంతం జరిగి ఐదేళ్లు గడుస్తున్నా నిన్న కాక మొన్న జరిగినట్లే పచ్చ పత్రికలు రాస్తున్నాయి. వాళ్ళకి వివేకాపై ప్రేమ లేనే లేదు.. ప్రజాస్వామ్యం కోసం అంటే అదీ కాదు. సొంత తమ్ముడు రాంమూర్తినాయిడిపైనే చంద్రబాబుకు ప్రేమ లేదు. అయినా మీరు వండి వారుస్తూనే ఉన్నారు. ఒకే ఒక కారణం.. వివేకా రక్తాన్ని జగన్ చొక్కాకి రాయాలని చూస్తున్నారు. రక్తం మాదే.. చొక్కా మాదే.. వీళ్ళ రాతలకు అడ్డే లేదు
మా ఎంపీ అవినాష్ రెడ్డిని బలిపశువును చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఐదు ఏళ్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, పచ్చ మీడియా.. వారి కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేసి మానసిక వేదనకు గురిచేశారు. అవినాష్ రెడ్డికి హత్యలో ఏమాత్రం సంబంధం లేదని మేము ఎన్నో సార్లు చెప్పాం. ప్రజలని నమ్మించి..వారిపై ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం పచ్చ పత్రికల నుంచి వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు.
హత్య అనే సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ కూడా వస్తే దాంట్లో ఒక సన్నివేశాన్ని షేర్ చేసిన వారిపై కేసు. నేను ఎన్టీఆర్ సినిమా క్లిప్ పెట్టినా చంద్రబాబుకు తప్పుగా కనిపిస్తుంది. సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్టు చేసి కొట్టే వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది.పెన్ను,పేపర్ ఉందని.. ఒక బాధితుడు వైఎస్ జగన్‌ను కలిస్తే దానిపై కూడా గూడు పుటానీ అని రాస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి సునీల్ ఫిర్యాదు చేస్తే పవన్‌ను అరెస్టు చేశారు. సునీల్ కుమార్ యాదవ్ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు.. ఇదెక్కడి న్యాయం?. ఈ నిందితులు కోట్లకు పడగలెత్తారంటే.. ఆ డబ్బు సునీత ఇచ్చిందా..? చంద్రబాబు ఇచ్చాడా?.

దస్తగిరి తరపు వాదించే లాయర్ సిద్ధార్థ లూథ్రా.. గంటకు 2 లక్షలు తీసుకునే లాయర్. చంద్రబాబు వ్యక్తిగత లాయరే.. దస్తగిరి, సునీల్‌కి లాయర్‌గా ఉన్నారు. దీని వెనుక సునీత, చంద్రబాబు ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు, లైంగిక దాడుల గురించి ఈ పత్రికలు మాట్లాడవు. నిత్యం జగన్ జగన్ అంటున్నారు. అయ్యన్నపాత్రుడు చెప్పింది నిజం చేయాలని చూస్తున్నారు. జగన్ ఓడిపోయాడు మరణించలేదు అని అయ్యన్నపాత్రుడు అన్నాడు.
పీఏ కృష్ణారెడ్డి నిన్న అన్నీ విషయాలు వివరిస్తే దాన్ని రాయరు. అసలు రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరు?. ఆయన కొడుకు అని చెప్తున్న వాళ్లకు డీఎన్ఏ టెస్ట్ చేశారా?. ఇవన్నీ ఎవ్వరూ మాట్లాడారు. జగన్‌ను చూస్తే మీకు వెన్నులో వణుకు.. అందుకే మీరు ఇలాంటివి చేస్తున్నారు. వివేకాను పాశవికంగా హత్య చేసిన వ్యక్తులతో సునీత, చంద్రబాబు అంటకాగుతున్నారు. ఇంతటి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్న మీది ఒక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment