సాక్షి, తాడేపల్లి: వైఎస్ వివేకా హత్యపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'వివేకా హత్య కేసులో రాజకీయరంగు పులిమి విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. ఎంత బురదజల్లుతున్నా ఇంతకాలం ఓపిగ్గా ఉన్నాం. వివేకా సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణం. ఎలాంటి ఆధారలు లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్నారు. సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనిపిస్తోంది.
వివేకా హత్యపై రోజుకో ఆరోపణ చేస్తున్నారు. ఎల్లో మీడియా దిగజారుడు కథనాలు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తోంది పూర్తిగా రాజకీయ కుట్రే. ఒకరి తర్వాత ఒకరు పద్దతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. కుట్ర పూరితంగా వెనకుండి చంద్రబాబే నాటకమాడిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. కనీసం సిగ్గూ, ఎగ్గూ లేకుండా కథనాలు ప్రచారం చేస్తున్నారు. చనిపోయిన వివేకా ఆత్మక్షోభించేలా వ్యవహరిస్తున్నారు.
చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7కి వాయిదా)
అవినాష్‌రెడ్డిపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారు. మూడేళ్లుగా కుట్రలు పన్నడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నడుపుతున్న నాటకాలు బయపడుతున్నాయి. ఓ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజల్లో విషం ఎక్కించే కుట్ర జరుగుతోంది. నేరుగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వివేకా కుమార్తె అని ప్రచారంలో ఉంది. కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఆ పార్టీలోకి వెళ్లాలంటే వెళ్లొచ్చు. కానీ వ్యక్తిగత హననం సరికాదు.
రాజకీయంగా ఎదుర్కోలేక వివేకా కుమార్తె, అల్లుడిని కలుపుకుని చంద్రబాబు కుట్రకు తెరలేపుతున్నారు. సీబీఐ విచారణను ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఎన్డీఏ నుంచి బయటకు రాగానే చంద్రబాబులా సీబీఐకి నో ఎంటీ అని మేం చెప్పలేదు' అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు తీరును ఎండగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment