ఎల్లో మీడియా ఓవరాక్షన్‌  | Yellow Media Fake News On YS Avinash Reddy | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా ఓవరాక్షన్‌ 

Published Tue, May 23 2023 2:56 AM | Last Updated on Tue, May 23 2023 9:06 AM

Yellow Media Fake News On YS Avinash Reddy - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారంటూ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎల్లో మీడియా ఓవరాక్షన్‌ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తల్లి శ్రీలక్ష్మి బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌ పట్ల కనీస మానవత్వాన్ని కూడా మరిచి ఎల్లో మీడియా అమానుష ధోరణిని బయటపెట్టుకుంది. సీబీఐ అధికారులు సోమవారం కర్నూలుకు రావడంతో అదే అదనుగా రెచ్చిపోయింది.

అవినాశ్‌ను ఎలాగైనా అరెస్టు చేయించాలన్న విపరీత ధోరణి, కర్నూలు నగరంలో ఉద్రిక్తతలు సృష్టించాలన్న వ్యూహంతో క్షణక్షణం అసత్య ప్రచారంతో హోరెత్తించింది. గంట గంటకు ఎల్లో మీడియా పిచ్చి ముదిరి, మధ్యాహ్నానికి పీక్స్‌కు చేరుకొంది. స్థానిక పోలీసులు సహకరించడంలేదని, మధ్యాహ్నానికి కర్నూలుకు కేంద్ర బలగాలు వస్తున్నాయని, ఆ వెంటనే సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టు చేస్తారంటూ తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎల్లో మీడియా విపరీత ధోరణిని రాష్ట్రవ్యాప్తంగా పలువురు తప్పుపట్టారు.

తల్లి ఆరోగ్యం బాగోలేక బాధలో ఉన్న వ్యక్తిపట్ల అమానవీయంగా వ్యవహరించడాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సభ్య సమాజం ఖండించాయి. ఒక ఎంపీకి ఉండే హక్కులు, ఆయన ప్రైవసీని భంగపరిచే విధంగా పచ్చ పైత్యాన్ని వెళ్లగక్కుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలో భాగంగానే వైఎస్‌ అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా ఎల్లోమీడియా ఈ దుర్నీతికి పాల్పడుతోందని స్పష్టమవుతోంది.

అందులో భాగంగానే అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబడుతున్నారని, ఎంపీ తల్లికి అందిస్తున్న చికిత్సపై వైద్యులు సమాచారం అందిస్తున్నా, అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినాశ్‌ సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావల్సి ఉంది. అయితే, ఆయన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఈనెల 20వ తేదీ నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తోంది. అవినాశ్‌ దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 27 తర్వాత హాజరవుతానని అవినాశ్‌ సీబీఐ అధికారులకు లేఖ పంపారు. అయినప్పటికీ, సీబీఐ అధికారులు సోమవారం ఉదయం కర్నూలు వచ్చారు.

స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. దీనినే అవకాశంగా తీసుకున్న ఎల్లో మీడి యా వెంటనే తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ప్రారంభించింది. అవినాశ్‌ను అరెస్టు చేయడానికే సీబీఐ అధికారులు వచ్చారంటూ అసత్య ప్రచారం మొదలెట్టింది. వారు పోలీసు అధికారులను కలిసినట్లు, అవినాశ్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారంటూ స్క్రోలింగ్‌లు, చర్చలు ప్రారంభించింది.

అవినాశ్‌ను అరెస్టు చేయకపోవడంతో నిరాశ చెందిన ఈ మీడియా.. కొత్త వ్యూహా న్ని రచించింది. సీబీఐ అధికారులు పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారని, ఎప్పుడైనా అరెస్టు జరగవచ్చని మరో ప్రచారం మొదలెట్టింది. ముఖ్యంగా టీవీ–5, ఏబీఎన్‌ తప్పుడు కథనాలు, చర్చలతో హోరెత్తించాయి. 
విశ్వభారతి హాస్పిటల్‌ వద్ద పోలీసు బందోబస్తు  

సీబీఐని కూడా ప్రభావితం చేస్తారా? 
సీబీఐ బృందం కర్నూలుకు రాగానే ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలైంది. సీబీఐ అధికారులు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. నేరుగా స్టేట్‌ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి అక్కడే బస చేశారు. అయినా, పచ్చ మీడియా సీబీఐ వెంటనే అవినాశ్‌ను అరెస్టు చేసేస్తోందంటూ ప్రచారం మొదలెట్టింది. టీవీ చర్చల్లో తమకు అను కూలురను కూర్చోబెట్టి, అధికారులను ప్రభావితం చేసేలా చర్చలు సాగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మీడియా ట్రయల్‌ పేరిట వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు  వస్తున్నాయి. 

తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు 
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని చూసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉద యం నుంచే కర్నూలుకు తరలివచ్చారు. డిప్యుటీ సీఎం అంజాద్‌బాష,వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, శ్రీదేవి, ఆర్థర్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఉదయాన్నే ఆస్పత్రికి చేరుకున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కడప మేయర్‌ సురేశ్‌బాబు, శాప్‌చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు.

కర్నూలుతోపాటు పులివెందుల, కడప, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆస్పత్రి పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. డీఎస్పీ విజయశేఖర్‌ ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో మరిన్ని బలగాలు సోమవారం రాత్రికి కర్నూలుకు చేరుకున్నాయి. 

ఆస్పత్రి ముందు కార్యకర్తల నిరసన 
ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రి ముందు బైఠాయించారు. ‘తండ్రిని అకారణంగా జైలుకు పంపారు. తల్లి అనారోగ్యంతో ఉంటే బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌ను వెంటాడి, వేధించడం ఏంటని’ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 

అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబాటు 
వందలాది రోగులు, వారి సహాయకులు ఉండే ఆస్పత్రిలోకి మీడియా పదే పదే జొరబడటంపై సీనియర్‌ విలేకరులే మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబుకు ఏదో మేలు చేయాలన్న తపనతోనే ఎల్లో మీడియా పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో ఆస్పత్రి పరిసరాల్లో ఆదివారం అర్ధరాత్రి, ఎల్లో మీడియా హంగామా చేసింది. రాత్రి 11గంటల తర్వాత ఎల్లో మీడియా ప్రతినిధి ఒకరు తాను పనిచేస్తున్న సంస్థ పేరు కాకుండా మరో పేరు చెప్పి ఆస్పత్రిలోకి వెళ్లారు.

శ్రీలక్ష్మి ఉన్న ఐసీయూ సమీపంలో ఓ కానిస్టేబుల్‌ అతన్ని నిలువరించారు. తప్పుడు పేరు చెప్పి రావాల్సిన అవసరం ఏముందని అక్కడున్న వారు కూడా గట్టిగా నిలదీశారు. దీంతో మీడియా ప్రతినిధి ఆస్పత్రి గేటు వద్దకు వచ్చి అవినాశ్‌ అనుచరులపై దుందుడుకుగా వ్యవహరించారు. ఇదంతా మిగతా ఎల్లో మీడియా ప్రతినిధులు వీడియో తీయబోయారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. 

శ్రీలక్ష్మిని పరామర్శించిన వైఎస్‌ విజయమ్మ 
వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ సోమవారం సాయంత్రం విశ్వభారతి ఆస్పత్రికి వచ్చి ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మి ని పరామర్శించారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్‌ను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అంతా 
మంచే జరుగుతుందని కాంక్షించారు. 

ఆందోళనకరంగానే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి 
అవినాశ్‌ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై విశ్వభారతి ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేసింది. ఆమెకు నాన్‌ ఎస్టీ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్ఫారేక్షన్‌ (గుండె పోటు) ఉందని పేర్కొంది. యాంజియోగ్రామ్‌ చేశామని, రెండు రక్తనాళాల్లో బ్లాక్‌లు గుర్తించామన్నా రు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వైద్యుల బృందం   పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆమెకు రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉండటంతో అయానోట్రోపిక్‌ సపోర్ట్‌తో ఉన్నారని తెలిపారు. ఆది, సోమవారాల్లో ఆమె వాంతులు చేసుకున్నారని, అల్ట్రాసౌండ్‌ చేయాల్సి ఉందని తెలిపారు. మరికొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement