Kadapa YS Avinash Reddy Letter To CBI Director Praveen Sood Over Reason Behind YS Viveka Case Murder - Sakshi
Sakshi News home page

YS Viveka Case: వివేకా హత్య కుటుంబ ఆస్తి కోసమే.. సీబీఐకి ఎంపీ అవినాష్‌ లేఖ

Published Mon, Jul 24 2023 3:56 AM | Last Updated on Mon, Jul 24 2023 8:36 AM

YS Avinash Reddy letter to CBI Director Praveen Sood - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కుటుంబ ఆస్తి వివాదాలే ప్రధాన కారణమని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర­రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ హత్య చేయించారని ఆధారాలతో సహా వివరించారు. వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడి పేరిట రాసిన నోటరీ వీలునామాను నిందితులు నర్రెడ్డి కుటుంబానికి అందచేశారని తెలిపారు. షమీ­మ్‌కు వాటా ఇవ్వకుండా వివేకా ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్‌ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్‌ దురుద్దేశపూరితంగా ఈ అంశాలపై దర్యాప్తు చేయకుండా పక్కదారి పట్టించారన్నారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించటానికి మూడున్నర నెలల ముందు నుంచే రాంసింగ్‌ దర్యాప్తు చేపట్టడం, సాక్షులు చెప్పినదానికి భిన్నంగా వాంగ్మూలాలను నమోదు చేయడాన్ని ప్రస్తావించారు. ఈమేరకు ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు సవివరంగా రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలు, అనంతర పరిణామాలను లేఖలో వివరించారు.

హత్యలో పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఇప్పించిన వాంగ్మూలం పూర్తిగా అసత్యాల పుట్ట అని స్పష్టం చేశారు. వివేకా బాత్‌రూమ్‌లో లభ్యమైన గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివి? అనే విషయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడాన్ని ఎంపీ అవినాశ్‌ లేఖలో ప్రస్తావించారు. కడప ఎంపీ టికెట్‌పై ఎలాంటి సందిగ్దత లేదని స్పష్టం చేస్తూ హత్యకు ముందు రోజు వరకు ఎంపీగా తన గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాంసింగ్‌ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశాలను పునఃసమీక్షించి ఐపీసీ 457, 460, 394, 398, 302 సెక్షన్ల కింద సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు.

వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్‌ 30 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐకి గడువు నిర్దేశించింది. అంటే అప్పటిలోగా సీబీఐ తుది చార్జీషీట్‌ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూన్‌ 19న సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి ఈ లేఖను రాశారు. సీబీఐ నమోదు చేసి న్యాయస్థానానికి సమర్పించిన సాక్షుల వాంగ్మూలాలు, అంతకు ముందు ఛార్జ్‌షీట్లలో పేర్కొన్న అంశాలను విశ్లేషించిన అనంతరం తాను సహేతుకంగా ఈ సందేహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీబీఐ గత గత ఛార్జ్‌ షీట్ల లో విస్మరించిన కీలక అంశాలను పునసమీక్షించి సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయలని కోరారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి లేఖలో ప్రస్తావించిన ప్రధానాంశాలు సంక్షిప్తంగా...

పక్కదారి పట్టించిన రాంసింగ్‌
రాంసింగ్‌ దర్యాప్తు అధికారిగా 2021 నవంబరు 9న అధికారికంగా బాధ్యతలు స్వీకరించగా అప్పటికి మూడున్నర నెలల ముందే సీఆర్‌పీసీ నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబరు 2నే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. నాతోపాటు నా తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే సాక్షుల పేరిట వాంగ్మూలాలు నమోదు చేశారు. సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసి తన కింది అధికారులతో వాటిపై సంతకాలు చేయించారు.

సీఐ శంకరయ్య, అభిషేక్‌రెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్లుగా రాంసింగ్‌ ఏకపక్షంగా వాంగ్మూలాలను నమోదు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శంకరయ్య కడప ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. తాను చెప్పినట్లు అబద్ధాలు చెప్పాలని ఉదయకుమార్‌రెడ్డిని రాంసింగ్‌ చిత్రహింసలకు గురి చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021 నవంబర్‌ 9వరకు రాంసింగ్‌ దర్యాప్తు కొనసాగించి రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. వివేకా రెండో వివాహం అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. 

బెంగళూరు భూవివాదం కట్టుకథే
దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి రాంసింగ్‌ ఇప్పించిన వాంగ్మూలంలోని అంశాలు పూర్తి అవాస్తవమని సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. బెంగళూరులోని ఓ భూవివాదానికి సంబంధించి డబ్బుల కోసం వివేకాను హత్య చేయమని, తనకు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సహకారం ఉందని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. బెంగళూరు భూవివాదానికి సంబంధించి 10 మందిని సీబీఐ విచారించింది.

ఆ భూమికి సంబంధించిన పత్రాలు నకిలీవని తేలడంతో వాటిని బెంగళూరుకు చెందిన వై.వెంకట ప్రసాద్‌కు అప్పటికే అప్పగించేసినట్టు వెల్లడైంది. అంటే వివేకా హత్యకు చాలా నెలల ముందే బెంగళూరు భూవివాదం సమసిపోయింది. దస్తగిరి వాంగ్మూలం పూర్తిగా అవాస్తవమని స్పష్టమైంది. ఆ వాంగ్మూలం ఆధారంగా రాంసింగ్‌ దర్యాప్తు చేయడం దురుద్దేశపూరితమే. 

చెక్‌ పవర్‌ రద్దుతో ఆర్థిక ఇబ్బందులు..
కుటుంబ సభ్యులు తన చెక్‌ పవర్‌ రద్దు చేయడంతో వివేకా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విపరీతంగా మద్యానికి బానిసయ్యారు. మోసగాడైన సునీల్‌ యాదవ్‌ చెప్పిన వజ్రాల కథను విశ్వసించారు. వాటిని విక్రయించి డబ్బులు ఇప్పించాలని సునీల్‌ యాదవ్‌ కోరడంతో తన వాహనాన్ని ఇవ్వడంతోపాటు అతడితో కలసి పలు ప్రాంతాలు తిరిగారు.

తరువాత సునీల్‌ యాదవ్‌ చెప్పినదంతా కట్టుకథేనని ఎర్ర గంగిరెడ్డి గ్రహించాడు. అప్పటి నుంచి సునీల్‌ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వివేకా ఇంటికి రావడం మానేశారు. వారిద్దరి కుటుంబాల్లో మహిళలతో వివేకాకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో వారిద్దరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివేకాపై దాడి చేసిన తరువాత ఆయన మర్మాంగంపై సునీల్‌ యాదవ్‌ కాలితో తన్ని తీవ్రంగా దూషించారు. 

నర్రెడ్డి కుటుంబానిదే ఆ కుట్ర
కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకానందరెడ్డిని హత్య చేశారు. ఆ  హత్య వెనుక వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఇతర నర్రెడ్డి కుటుంబ సభ్యులున్నారు. ఎందుకంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడు షెహన్‌షాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చలేకపోయారు. తన కుమారుడి విద్యాభ్యాసం, భవిష్యత్‌ కోసం తన ఆస్తిలో కొంత వాటా రాసివ్వాలనుకున్నారు. కుటుంబ ఉమ్మడి ఆస్తిలో తన పేరిట ఉన్న 25 శాతం వాటాను షమీమ్, ఆమె కుమారుడి పేరిట ఆయన నోటరైజ్డ్‌ వీలునామా రాసినట్లు తెలిసింది. దీన్ని ఆయన మొదటి భార్య, కుమార్తె, అల్లుడు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో వివేకా హత్య జరిగింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలతో ఎర్ర గంగిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ద్వారానే వారు వివేకా హత్యకు పన్నాగం పన్ని ఉంటారు. తమ కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వివేకాపై ఆగ్రహంతో ఉన్న సునీల్‌ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిల సహకారంతో ఎర్ర గంగిరెడ్డి ఈ హత్యకు పథకం వేశాడు. డబ్బు ఆశ చూపించి దస్తగిరిని కూడా పాత్రధారిని చేశారు. వివేకా హత్య తరువాత ఆ ఇంట్లో కొన్ని  పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, ఇతర నిందితులు గాలించారు.

హత్యలో పాలు పంచుకున్న దస్తగిరితోపాటు వాచ్‌మెన్‌ రంగయ్య కూడా తన వాంగ్మూలంలో ఇదే విషయాన్ని చెప్పారు. బెంగళూరు భూవివాదం లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు కాబట్టి వారు వెతికింది వివేకా రాసిన నోటరీ వీలునామా గురించే అని స్పష్టమవుతోంది. నోటరీ వీలునామాను ఎర్ర గంగిరెడ్డి వివేకా కుమార్తె, అల్లుడికి ఇచ్చి ఉంటారు. అంటే కుటుంబ ఆస్తి కోసమే వివేకాను హత్య చేశారు. వివేకా హత్య తరువాత ఆ కుటుంబ ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్‌ ద్వారా మార్పించుకోవడం గమనార్హం. షమీమ్‌కు ఎలాంటి ఆస్తి దక్కలేదు.  

ఆస్తి కోసమే వివేకాను ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హత్య చేయించారని ఈ కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ సమీప బంధువైన భరత్‌ యాదవ్‌ తన వాంగ్మూలంలో చెప్పాడు. తాము చెప్పినట్లు సీబీఐకి అవాస్తవాలు చెప్పకుంటే ఈ కేసులో ఇరికిస్తామని వివేకా పీఏ కృష్ణారెడ్డిని సునీత బెదిరించారు. ఈ వాస్తవాలన్నీ వివేకా హత్య వెనుక నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. సీబీఐ ఈ కోణంలో అసలు దర్యాప్తు చేయలేదు. 

ఆ వేలిముద్రలు ఎవరివి?
వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని కడప పోలీసుల క్లూస్‌ టీమ్‌ పరిశీలించి బాత్రూమ్‌ గోడలు, తలుపు వెనుక ఉన్న వేలిముద్రలను సేకరించింది. ఆ వేలిముద్రల్లో కొన్ని నలుగురు నిందితుల వేలిముద్రలతో సరిపోలేదు. అంటే హత్య జరిగిన రోజు రాత్రి ఆ నలుగురు నిందితులే కాకుండా ఆ ఇంట్లో మరెవరో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

సీబీఐ అప్రూవర్‌గా మార్చిన దస్తగిరి ఆ వ్యక్తి పేరును వెల్లడించలేదు. ఆ వేలి ముద్రలు ఎవరివి? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. ఎవరినో రక్షించేందుకే ఆ వేలి ముద్రలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని స్పష్టమవుతోంది. ఆ వేలి ముద్రలు ఎవరివన్న కోణంలో దర్యాప్తు చేస్తే ఈ హత్య వెనుక అసలు కుట్ర బయటపడుతుంది. 

ఆ తరువాత మాట మార్చిన సునీత
కడప ఎంపీ టికెట్‌ కోసమే వివేకాను హత్య చేశారని రాంసింగ్‌ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం. అప్పటికే సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న నన్నే (అవినాష్‌రెడ్డి) 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. నా గెలుపు కోసం పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వివేకానందరెడ్డి ఉన్నారు. ఆయన చనిపోయే ముందు రోజు వరకూ నా గెలుపు కోసం కృషి చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డితో కలసి ప్రచారం కూడా చేశారు.

సీబీఐ ఈ విషయాలపై ఏమాత్రం దృష్టి సారించలేదు. కనీసం రఘురామిరెడ్డినిగానీ పార్టీ నేతలను గానీ సంప్రదించలేదు. వివేకా హత్య తరువాత తొలుత సునీత కూడా మీడియాకు ఇదే విషయాలను చెప్పారు. తన తండ్రి చివరి వరకు అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం పని చేశారని వెల్లడించారు. 2019 అక్టోబరు తరువాత ఆమె మాట మార్చి నాపై, మా పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.  

ఇదీ చదవండి: వివేకా కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement