టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు
జాతీయ భద్రత చట్టాన్ని ఉల్లంఘించి మరీ కొన్న చంద్రబాబు
అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సూత్రధారిగా కుట్ర
ఐటీ గ్రిడ్స్, ఏబీ కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన పాత్ర
వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్.. రాష్ట్ర ఓటర్ల డేటా చౌర్యం
నిగ్గు తేల్చిన శాసన సభ ఉపసంఘం
చంద్రబాబు పెగసస్ సాఫ్ట్‌వేర్ కొన్నారని చెప్పిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉండగా కూడా చంద్రబాబుది ఇదే తంతు
అప్పటి ప్రతిపక్ష నేత, విపక్ష అభ్యర్థుల ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ అధికారీ ఇజ్రాయెల్ వెళ్లలేదు
ఫోన్ల ట్యాపింగ్‌కు ఏ సాఫ్ట్‌వేరూ కొనలేదు
అయినా ఫోన్ల ట్యాపింగ్.. అంటూ రామోజీ కట్టుకథలు
టీడీపీ ఓడిపోతుందన్న భయంతో ఇప్పుడే కుంటిసాకులు
సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ ఓటమికి ఇప్పటి నుంచే కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందంటూ చిత్తకార్తి రాతలు రాస్తూ వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచార కుట్రకు తెరతీశారు. పచ్చ పైత్యం సోకి రామోజీరావుకు ఉద్దేశపూర్వక మతిమరుపు వచ్చిందేమోగానీ... రాష్ట్ర ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి.
రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడటం, ఓటర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి బరితెగించడం అంతా ప్రజలకు గుర్తుంది. ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెళ్లి మరీ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొన్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు బాగోతాన్ని శాసన సభ ఉప సంఘం కూడా నిగ్గు తేల్చింది.
మరోవైపు చంద్రబాబు పెగసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే స్వయంగా ఆ రాష్ట్ర శాసన సభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ పోలీసు అధికారీ ఇజ్రాయెల్ వెళ్లలేదు. ఎలాంటి సాఫ్ట్‌వేర్ కొనలేదు. వీటన్నింటినీ మరుగున పరుస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ధ్యేయంగా ఈనాడులో ఓ కట్టుకథ రాశారు. అసలు వాస్తవాలేమిటంటే...
ట్యాపింగ్ చరిత్ర బాబుదే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ అనే జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ కీలక అధికారిని, మరో పోలీసు ఉన్నతాధికారిని అందుకోసం ప్రత్యేకంగా నియమించారు. ప్రతిపక్ష నేత నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వరకూ అందరి ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ఆ కుట్రలో భాగస్వామి అయిన ఆ పోలీసు ఉన్నతాధికారికి 2014లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాష్ట్ర పోలీస్ బాస్‌గా పోస్టింగ్ ఇచ్చారు కూడా.
భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ పెగసస్ సాఫ్ట్‌వేర్ కొన్న చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారంలో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూచంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చేశారు. ఇక్కడ ఆయన మరోసారి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి సారించారు. అందుకోసం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. పెగసస్ సంస్థతో సంప్రదింపులు జరిపింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ
కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ కొనాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ ఉగ్రవాద సంస్థలకు చిక్కితే దేశంలో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల దేశ భద్రత దృష్ట్యా ఈ నిబంధన విధించారు. కానీ, జాతీయ భద్రత చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే పెగసస్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంది. అందుకోసం నిధులు కూడా చెల్లించింది.
రూ.25 కోట్లతోచంద్రబాబు పెగసస్ సాఫ్ట్‌వేర్ కొన్నారు: మమత
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించారని వెల్లడించారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని మమతా బెనర్జీ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. వీటిని ఏనాడూ ప్రశ్నించని రామోజీరావు.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడకపోయినా, ఓ అసత్య కథనాన్ని ప్రజల్లోకి వదిలి, టీడీపీ ఓటమికి ఓ కుంటిసాకును సిద్ధం చేసుకున్నారు.
యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్..35 లక్షల మందిడేటా చౌర్యం
అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్‌సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్‌సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల డేటా (సమాచారం) మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌కు అనుసంధానించారు. రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది.
నిగ్గు తేల్చిన శాసనసభ ఉప సంఘం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ డేటా చౌర్యంపై విచారణకు సభా సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది.
అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌నకు బదిలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసనసభకు సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment