బాబు పాలన గంజాయి ఖజానా | Central Home Department praised AP Govt | Sakshi
Sakshi News home page

బాబు పాలన గంజాయి ఖజానా

Published Sun, Mar 24 2024 2:51 AM | Last Updated on Sun, Mar 24 2024 2:51 AM

Central Home Department praised AP Govt - Sakshi

ఏవోబీలో వేలాది ఎకరాల్లో దర్జాగా గంజాయి సాగు 

చంద్రబాబు కోటరీ ఆధ్వర్యంలోనే మాఫియా  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే  దందాకు అడ్డుకట్ట 

సీఎం జగన్‌ పట్టుదలతో ప్రత్యేకంగా ఎస్‌ఈబీ ఏర్పాటు  

ఆపరేషన్‌ పరివర్తన్‌తో గంజాయి సాగు సమూలంగా ధ్వంసం 

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర హోం శాఖ 

చంద్రబాబు అక్రమాలను కడుపులో పెట్టుకుని దాచుకోవడంలో రామోజీ సిద్ధహస్తుడు. బాబు ఓటమి రామోజీ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుంటే...ఆ మనోవేదనలో చిత్తచాంచల్యపు రాతలతో జగన్‌ ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు. చంద్రబాబు పాలనలో గంజాయి దందాను సాక్షాత్తూ టీడీపీ నేతలే సాగించినా, ఆ సమయంలో ఏ రోజునా ఈ అక్రమాల గురించి రామోజీ రాయలేదు.

నర్సీపట్నం కేంద్రంగా బాబుకు సన్నిహితులైన టీడీపీ నేతలు బరితెగించి, అంతర్‌ రాష్ట్ర సిండికేట్‌ నడిపారు. బాబు హయాంలో అక్రమాలను రాయడానికి రామోజీ లేని చత్వారాన్ని, బధిరత్వాన్ని అరువు తెచ్చుకుని, పెన్ను మూసుక్కూర్చున్నారు...వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి  దందాలపై ఉక్కు పాదం మోపుతోంది.

అన్ని మార్గాల్లోనూ గంజాయి దందాలకు చెక్‌ పెట్టి, దాని ఆనవాళ్లు లేకుండా చేయాలని నిరంతరం దాడులు చేస్తుంటే ఆ నేరనిరోధ చర్యలు రామోజీకి నచ్చడం లేదు... పనిలో పనిగా గంజాయి సాగును అరికట్టే క్రమంలో సంస్కరణలు సైతం చేపట్టింది. ఆపరేషన్‌ పరివర్తన్‌ కింద గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఆపరేషన్‌ నవోదయం పథకాన్ని తీసుకొచ్చింది. ఇలా సంస్కరణలనే ఆయుధంగా చేసుకుని, గిరిజన జీవితాల్లో వెలుగురేఖలు నింపుతోంది. 

సాక్షి, అమరావతి: రాబోయే ఎన్నికల్లో టీడీపికి మరోసారి ఓటమి ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు ఈనాడు రామోజీరావుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్‌ శివారులోని ఫిల్మ్‌ సిటీ కొండపైన అక్రమంగా కట్టుకున్న కోటవంటి భవంతిలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న రామోజీలో పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి దందా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని పిచ్చపిచ్చగా పచ్చ రాతలతో విరుచుకుపడుతున్నారు. ఏదో విధంగా రోజూ ఈనాడు పత్రిక నిండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయందే రామోజీకి తిన్న ఆ కాస్త ముద్ద అరిగేలా అనిపించడం లేదు.

ఆ పైత్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. చంద్రబాబు హయాంలో విశృంఖలంగా నడిచిన గంజాయి మాఫియాను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చూశారు... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగును ధ్వంసం చేసిన ఆపరేషన్‌ పరివర్తన్‌ విజయవంతం కావడాన్నీ గుర్తించారు. మీ ఒక్కరే వీటిని గుర్తించనట్లు నటిస్తున్నారు రామోజీ... మీ నిద్రలేమి సమస్యకు... కడుపు మంటకు ఏదైనా డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది.... కట్టుకథలతో ఈనాడు పత్రికను నింపేస్తే చిరిగేది మీ చాటేనని చెప్పేందుకే ఈ ఫ్యాక్ట్‌ చెక్‌...  

చంద్రబాబు హయాంలోనే గంజాయి మాఫియా... 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో  గంజాయి మాఫియా రాజ్యమేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ... 2014లో విభజన అనంతరం 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న కాలంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్చగా సాగింది. జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలోనూ గంజాయి దందాకు  ఏపీ కేంద్ర బిందువుగా మారింది. అంటే అదంతా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబుకు  సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం  కేంద్రంగా అంతర్రాష్ట్రస్థాయిలో గంజాయి సిండికేట్‌ను నిర్వహించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల అండతో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేయించారు.

2014 తరువాత అప్పట్లో ఉమ్మడి విశాఖపట్నం రూరల్‌ జిల్లా పోలీసు ఉన్నతాధికారిగా నియమితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడి సమీప బంధువే ఈ దందాకు సూత్రధారిగా వ్యవహరించారు. గంజాయి సాగు కోసం విశాఖ ఏజెన్సీలో ఓ వ్యవస్థను సృష్టించారు. సాగును ధ్వంసం చేస్తే గిరిజనులు మావోయిస్టులకు సన్నిహితమయ్యే ప్రమాదముందని ఓ కట్టుకథను అధికారికంగా తెరపైకి తెచ్చారు. ఆ సాకుతో సాగును చూసీచూడనట్టు వదిలేయాలని టీడీపీ ప్రభుత్వం అధికారికంగా విధాన నిర్ణయం తీసుకుంది. ఇదే అదనుగా టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోయింది.

వేలాది ఎకరాల్లో దర్జాగా సాగు చేస్తూ... నర్సీపట్నం గుండా అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు, ఇటు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా స్మగ్లింగ్‌ చేస్తూ బరితెగించి మరీ అక్రమాలకు పాల్పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా ద్వారా చంద్రబాబు కోటరీ వేల కోట్ల రూపాయలు ఆర్జించింది.   

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే నవోదయం 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో డ్రగ్స్‌ దందాను నిర్మూలించేందుకు విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది గంజాయి సాగును ధ్వంసం చేయడం. రాష్ట్రంలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన గంజాయి సాగును అడ్డుకోలేమని పలువురు అభిప్రాయపడినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ససేమిరా అన్నారు. యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న ఈ మత్తు పంటను తుదముట్టించాల్సిందేనని విస్పష్టంగా ప్రకటించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను సమూలంగా తుడిచిపెట్టడానికి ప్రత్యేకంగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను ఏర్పాటు చేసి, ఈ బ్యూరోకు విస్తృత అధికారాలు కల్పించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ‘సెబ్‌’ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ కార్యక్రమాన్ని రెండు దశల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అందుకోసం గిరిజనుల్లో చైతన్యం కలిగించి వారి సహకారం తీసుకోవడం వ్యూహాత్మకంగా సత్ఫలితాలనిచ్చింది. గంజాయి సాగు వల్ల అనర్థాల గురించి ప్రభుత్వం ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించింది. పోలీసు, రెవెన్యూ, సెబ్, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ పంట సాగు నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు.

శాటిలైట్‌ ఫొటోలతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంత్రాన్ని జియో మ్యాపింగ్‌ చేశారు. అనంతరం ప్రత్యేక యంత్రాలతో రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి సాగు లేనేలేదు. ఆ విషయాన్ని స్వయంగా కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగును నిర్మూలించినప్పటికీ సరిహద్దు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సాగు కొనసాగుతోంది. ఆ రాష్ట్రాల్లో పండించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్‌ మీదుగా సాగుతున్న అక్రమ రవాణానూ అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.

అందుకోసం ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు, ఇతర చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజా­యిని స్వాదీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’కు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం 
దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం రూ.144 కోట్లతో ఆపరేషన్‌ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్‌ ఫ్రూట్‌ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఈ–క్రాపింగ్‌ ద్వారా అన్నిరకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement