సాక్షి, అమరావతి: ఎందుకేడుస్తున్నావురా అంటే.. ఏదో ఒకటి ఏడవాలిగా.. అన్నాడటొకడు. కరెంటు కోసం కొనే విదేశీ బొగ్గుపై ఓ కథ అచ్చేసిన ఈనాడు తీరూ ఇలానే ఉంది. వాస్తవాలతో పని లేకుండా, ఏదో ఒకటి బురద జల్లడమే పనిగా ఈనాడు మరో తప్పుడు కథనం అచ్చేసింది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ సమకూరుస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బరద జల్లే ప్రయత్నం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ విదేశీ బొగ్గును అడ్డగోలుగా కొన్న విషయాన్ని మరుగున పెట్టింది.
ఇప్పుడు వీలైనంత తక్కువ ధరతో అత్యంత నాణ్యమైన హైగ్రేడ్ విదేశీ బొగ్గు కొంటుంటే అదే తప్పయినట్లు ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. పైపెచ్చు 4 శాతం విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడాలని కేంద్రం కూడా నిబంధన విధించింది. చంద్రబాబు హయాంలో ఇలాంటి కేంద్ర నిబంధనలేమీ లేకపోయినా విదేశీ బొగ్గు కొన్నప్పటికీ, రామోజీ కిమ్మనలేదు. రామోజీ ఈ కుట్రపూరిత రాతలను రాష్ట్ర ఇంధన శాఖ, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్), ఏపీజెన్‌కో ఖండించాయి. వాస్తవాలను ‘సాక్షి’కి వివరించాయి.
విదేశీ బొగ్గు తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అన్నీ 4 శాతం విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడాలని ఈ నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు జనవరి నెలలో కూడా 6 శాతం విదేశీ బొగ్గు కొనాలంటూ కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను కాదని ముందుకు వెళ్లే అవకాశం రాష్ట్రాలకు లేదు. ఎందుకంటే.. స్వదేశీ బొగ్గు సరఫరా అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. స్వదేశీ బొగ్గు ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలో కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది.
కేంద్రం చెప్పిన మేరకు విదేశీ బొగ్గు కొనకపోతే స్వదేశీ బొగ్గులో కోత విధిస్తుంది. బయట కూడా కొనలేం. అదే జరిగితే రాష్ట్రానికి వచ్చే బొగ్గు తగ్గిపోయి, విద్యుత్ ఉత్పత్తి పడిపోతుంది. పైగా, దేశీయ బొగ్గుకు కూడా కొరత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సరిపడినంత బొగ్గు దొరకకపోతే రాష్ట్రం అంధకారమే అవుతుంది. ఇలా రాష్ట్రానికి అన్ని విధాలా నష్టమే కలుగుతుంది. మన రాష్ట్రమే కాదు.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎనీ్టపీసీ, ప్రైవేటు సంస్థలు కూడా కేంద్రం ఆదేశాలను పాటించి విదేశీ బొగ్గు కొంటున్నాయి. అయితే, ఈనాడుకు, టీడీపీకి విద్యుత్ ఉత్పత్తికంటే రాష్ట్రంలో అంధకారం నెలకొనడమే ఇష్టంలా ఉంది. అందుకే ఓ విషపు కథనాన్ని ఈనాడు అచ్చేసింది.
చంద్రబాబు ప్రభుత్వంలో అడ్డగోలుగా కొనుగోళ్లు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇటువంటి నిబంధనలేమీ లేకుండానే భారీ మొత్తంలో విదేశీ బొగ్గు కొనుగోలు చేశారు. ఇష్టానుసారం టెండర్లు పిలిచి, సరఫరా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల అప్పట్లో తక్కువ ధరకు బొగ్గు లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఎక్కువ ధరకే బొగ్గు కొన్నారు. 2015–16 నుంచి 2018–19 మధ్య రివర్స్ టెండరింగ్ లేకుండానే ఏపీపీడీసీఎల్ విదేశీ బొగ్గు కొనుగోలు చేసింది.
2015–16లో 1,24,361 టన్నులు, 2016–17లో 7,67,505 టన్నులు, 2017–18లో 3,80,049 టన్నులు, 2018–19లో 8,31,632 టన్నులు.. ఇలా మొత్తంగా ఆ ఐదేళ్లలో 21.03 లక్షల టన్నుల విదేశీ బొగ్గును బాబు ప్రభుత్వం కొన్నది. ఈ కొనుగోళ్లలో ఎక్కడా పారదర్శకత అన్నది లేదు. రివర్స్ టెండరింగ్ లేదు. దొంగ లెక్కలతో ఇష్టానుసారం టెండర్లు పిలిచి, ఇష్టమొచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. తక్కువ ధరకు బొగ్గు లభించే అవకాశమున్నా, ఎక్కువ ధర చెల్లించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది.
కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్‌కు విదేశీ బొగ్గు తప్పనిసరి
రాష్ట్రంలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ –1 కింద నిర్మించిన రెండు యూనిట్లకు విదేశీ బొగ్గునే వాడాలి. 70:30 నిష్పత్తిలో స్వదేశీ, విదేశీ హైగ్రేడ్ బొగ్గు వాడాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ రెండు యూనిట్లకు ఇది తప్పనిసరి. అందువల్లే హైగ్రేడ్ విదేశీ బొగ్గు కోసం ఏపీపీడీసీఎల్ టెండర్లు పిలిచింది.
విదేశీ బొగ్గుతో ప్రజలకూ లాభమే
ముడి సరకుల ధరలు పెరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం, సరఫరా ఖర్చులు పెరిగితే ఆ భారాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సు ప్రకారమే ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దేశీయ బొగ్గుతో పోల్చితే విదేశీ బొగ్గు ధర ఎక్కువ ఉండవచ్చు.
కానీ దేశీయ బొగ్గుకు విదేశీ హైగ్రేడ్ బొగ్గు 70:30 నిష్పత్తిలో కలపడంవల్ల అధిక ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ. 3.14 మాత్రమే అవుతుంది. బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే ఇది సగం కూడా ఉండదు. చాలాసార్లు మూడో వంతు మాత్రమే. విదేశీ బొగ్గు వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు సరఫరా చేస్తారు. ఆమేరకు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనాల్సిన భారం తగ్గి ప్రజలకు అంతిమంగా లాభమే చేకూరుతుంది.
తెలంగాణతో పోలికేమిటి?
తెలంగాణ ప్రభుత్వానికి సొంతంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. అందువల్ల ఆ రాష్టానికి విదేశీ బొగ్గు అవసరం లేదు. బొగ్గు గనులు లేని ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణతో పోల్చడానికి వీలు లేదు.
ఈ తేడా చూడండి
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ విధానంతో తక్కువ ధరకు విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా సరఫరా సంస్థలకు ప్రాధా న్యత ఇవ్వడంలేదు. దొంగ రేట్లు నిర్ణయించడంలేదు. కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది విదేశీ బొగ్గు కోసం పిలిచిన టెండర్లను నాలుగు సార్లు రద్దు చేయడమే ఇందుకు నిదర్శనం. 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం ఏపీపీడీసీఎల్ ఈ ఏడాది టెండర్లు పిలిచింది.
ధర ఎక్కువగా ఉండటంతో నాలు గు సార్లు వాటిని రద్దు చేసింది. అయిదోసారి తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు లభిస్తుండటంతో ఆ టెండర్లు ఖరారు చేసింది. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా మరింత తక్కువ ధరతో హైగ్రేడ్ విదేశీ బొగ్గు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అన్నీ కలుపుకొని ప్లాంటు వరకు చేర్చేలా టన్నుకు రూ. 13,219 చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇదే హైగ్రేడ్ విదేశీ బొగ్గుకు ఎనీ్టపీసీ రూ.18,509కి కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నాణ్యమైన బొగ్గును ఎంత తక్కువ ధరకు కొంటోందో, ఎంత ఆదా చేస్తోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. దీనిద్వారా ఉత్పత్తి వ్యయమూ తగ్గి, వినియోగదారులకు లాభమూ కలుగుతుంది.
ఎవరైనా టెండర్లు వేయొచ్చు
7.5 లక్షల టన్నుల హ్రైగ్రేడ్ విదేశీ బొగ్గు సరఫరా చేసే సంస్థలు బిడ్లు దాఖలు చేయాలంటూ ఏపీపీడీసీఎల్ అత్యంత పారదర్శకంగా గ్లోబల్ టెండర్లు పిలిచింది. నిబంధనల ప్రకారం ఏ సంస్థ అయినా టెండర్లలో పాల్గొని బిడ్లు వేసి కాంట్రాక్టు దక్కించుకోవచ్చు. అత్యంత నాణ్యమైన హైగ్రేడ్ బొగ్గు సరఫరా చేయవచ్చు. ఇందులో ప్రత్యేకంగా అదానీ సంస్థకు ప్రయోజనం కలిగించే ప్రశ్నే ఉత్పన్నమవదు.
టెండర్లలో హడావుడి ఏముంది?
ఈ ఏడాది జనవరిలో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు సరఫరాకు ఏపీపీడీసీఎల్ టెండరు ఖరారు చేసింది. అందులో ఇప్పటికే 6.30 లక్షల టన్నులు సరఫరా అయింది. రావాల్సింది 1.20 లక్షల టన్నులు మాత్రమే. ప్రస్తుత అవసరాల్లో అది స్వల్ప పరిమాణమే. అందువల్లే మళ్లీ టెండర్లు పిలిచింది. టెండరు ఖరారు అనేది సుదీర్ఘ ప్రక్రియ. నోటిఫికేషన్ జారీ నుంచి రివర్స్ టెండరింగ్, సంప్రదింపుల ద్వారా ధర తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
ఇదంతా సవ్యంగా పూర్తయ్యాకే ఒప్పందం చేసుకోవాలి. అందువల్ల హడావుడిగా టెండర్లు పిలిచిందనడంలో ఏమాత్రం వాస్తవంలేదు. టెండర్లలో అర్హత ఉన్న ఏ సంస్థలైనా పాల్గొనవచ్చు. ఏ సంస్థలు పాల్గొంటాయన్నది ఎవరూ ముందుగా చెప్పలేరు. ఒకవేళ ఏ సంస్థా టెండర్లలో పాల్గొనలేదంటే లాభదాయకం కాదని అర్థం. అలాంటప్పుడు ఏదో ఒక సంస్థకు ప్రయోజనమని ఎలా చెప్పగలం? టెండరు నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ సంస్థలైనా బిడ్లు దాఖలు చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment