Fact Check: నమ్మక ద్రోహం నారా బాబుదే! | FactCheck: Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt Crop Insurance, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: నమ్మక ద్రోహం నారా బాబుదే!

Published Tue, Dec 26 2023 4:43 AM | Last Updated on Tue, Dec 26 2023 9:38 AM

Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt Crop Insurance - Sakshi

సాక్షి, అమరావతి:  దేశంలో మరెక్కడా లేని విధంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్సల్‌ కవరేజ్‌ కల్పిస్తూ రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. లబ్ధి పొందిన రైతుల సంఖ్యను చూసినా, అందుకున్న పరిహారాన్ని పరిశీలించినా టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నది రామోజీకి మింగుడు పడకున్నా కాదనలేని సత్యం.

అర్హులైన ప్రతి ఒక్కరికీ వెతికి మరీ పరిహారాన్ని అందిస్తూ పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను స్ఫూర్తిగా తీసుకొని మెజార్టీ రాష్ట్రాలు ఇదే బాట పట్టాయి. చాలా రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయంటే అది బాగున్నట్లే కదా! చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది అన్నదాతలకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బీమా పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది. నిత్యం బాబు భజనలో మునిగి తేలుతున్న రామోజీ మాత్రం బాబోయ్‌ అన్నదాతలకు ద్రోహం చేస్తున్నారంటూ, ఉచిత పంటల బీమా పేరుతో కోతలు వేస్తున్నారంటూ గావు కేకలు పెడుతున్నారు!! 

రైతులపై పైసా భారం లేకుండా.. 
పంటల బీమా సీజన్‌వారీగా నోటిఫై చేసిన పంటలకు మాత్రమే వర్తిస్తుంది. గతంలో పీఎంఎఫ్‌బీవై కింద బ్యాంకు రుణం తీసుకున్న రైతులతోపాటు కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా ప్రీమి­యం చెల్లించిన ఇతర అన్నదాతలకు మాత్రమే బీమాను వర్తింపచేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది.

ఈ క్రాప్‌ డేటా ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు, సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్‌ కవరేజ్‌తో బీమా రక్షణ కల్పిస్తోంది. 2019–20లో పీఎంఎఫ్‌బీవైతో కలిసి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయగా  2020–21, 2021–22 సీజన్లలో పరిహారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఈ క్రాప్‌ డేటాతో యూనివర్సల్‌ కవరేజ్‌ కల్పించేందుకు కేంద్రం అంగీకరించడంతో 2022–­23 సీజన్‌ నుంచి పీఎంఎఫ్‌బీవైతో ఉచిత పంటల బీమాను అనుసంధానించి అమలు చేస్తున్నారు. 

హేతుబద్ధీకరణ కోసం.. 
బీమా పరిహారం తగ్గిన సందర్భాల్లో అధిక ప్రీమి­యం వసూలుతో వచ్చే ఆదాయం ద్వారా బీమా కంపెనీలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయని గుర్తిం­చిన కేంద్ర ప్రభుత్వం ప్రీమియం రేట్ల హేతు­బద్ధీకరణకు రిస్క్‌ షేరింగ్‌ మోడళ్లను ప్రతిపాదించింది. వీటిలో ఒకటైన కప్‌ అండ్‌ క్యాప్‌ 80–110 మోడ­ల్‌­కు ప్రయోగాత్మకంగా తొలుత మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో 2020–21లో శ్రీకారం చుట్టగా తర్వాత పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ మోడల్‌ను ఉచిత పంటల బీమా కింద 2023 – 24 వ్యవసాయ సీజన్‌ నుంచి దిగుబడి ఆధారిత çపంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కప్‌ అండ్‌ క్యాప్‌ (80–110) బీడ్‌ మోడల్‌ ద్వారా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమి­యం హేతుబద్ధీకరిస్తారేగానీ రైతులకు చెల్లించాల్సి­న బీమా పరిహారంలో ఎలాంటి కోతలు ఉండవు.

కోతలు పెట్టడానికి చాన్స్‌ లేదు 
రాష్ట్రంలోని 9 క్లస్టర్ల పరిధిలో దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 110 శాతం కన్నా ఎక్కువ నష్టం సంభవించిన సందర్భాల్లో ఆ అదనపు పరిహారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ రైతులకు పూర్తి బీమా పరిహారాన్ని చెల్లిస్తుంది. 

ఇది పూర్తిగా బీమా కంపెనీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విధానపరంగా జరిగే వ్యవహారమే కానీ రైతులకు చెల్లించే బీమా పరిహారానికి సంబంధించింది కాదన్న విషయం రామోజీకి తెలియదు కాబోలు! ఇదంతా బీమా కంపెనీలకు అదనపు ప్రయోజనాన్ని నివారించే చర్యే తప్ప ఇందులో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదు.

ఖరీఫ్‌లో 70.80 లక్షల ఎకరాలకు కవరేజ్‌
2023 ఖరీఫ్‌లో 15 పంటలను దిగుబడి ఆధారంగా, ఆరు పంటలను వాతావరణ ఆధారంగా నోటిఫై చేసి ఉచిత బీమా వర్తింప చేశారు. 2023 – 24 రబీలో 13 పంటలను దిగుబడి ఆధారంగా, నాలుగు పంటలను వాతావరణ ఆధారంగా అక్టోబర్‌లో నోటిఫై చేసి ఉచిత బీమా వర్తింప చేశారు. 2023 ఖరీఫ్‌లో 93 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి 70.80 లక్షల ఎకరాల్లో సాగైన వాటికి బీమా వర్తింప చేశారు. తద్వారా 34.70 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందారు.

జాబితాలను అక్టోబర్‌ 31 నాటికి కేంద్రానికి కూడా పంపించారు. వీటిని నేషనల్‌ క్రాప్‌ ఇన్సూరెన్సు పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత రైతులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన ప్రీమియం వాటాలను నిర్ధారిస్తారు. ఆ మేరకు రైతుల వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను కలిపి బీమా కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ తర్వాత కేంద్రం తమ వాటా జమ చేస్తుంది. తద్వారా బీమా కంపెనీలు అర్హత కలిగిన రైతుల ఖాతాలకు పరిహారం చెల్లిస్తాయి. 

ఇదే విధానాన్ని 2022 – 23లో అనుసరించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తదుపరి సంవత్సరం అదే సీజన్‌ ముగిసే నాటికి బీమా పరిహారం చెల్లిస్తున్నారు.

ఏపీ బాటలోనే పలు రాష్ట్రాలు 
దిగుబడి ఆధారిత పంటల కోసం రిస్క్‌ షేరింగ్‌ మోడల్‌ను తమిళనాడుతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాయి. కర్ణాటక ఇప్పటికే ఖరారైన టెండర్లను సైతం రద్దు చేసి వచ్చే రెండేళ్లకు  80 –110 మోడల్‌ ద్వారా కొత్తగా టెండర్లకు వెళ్లేందుకు సిద్ధపడింది.

పధకం అమలుకు సంబంధించి అన్ని వ్య­వహారాలు పోర్టల్‌ ద్వారా పారదర్శకంగా జరు­గుతాయి. మార్గదర్శకాలను అనుసరించి దిగుబడి ఆధారిత పంటలకు పంట కోత  ప్రయోగాల ద్వారా నమోదయ్యే వాస్తవ దిగుబడుల ఆధారంగా లెక్కించిన బీమా పరిహారాన్ని చెల్లిస్తారు. వాతావరణ ఆధారిత పంటలకు వాతావరణంలో హెచ్చు తగ్గులను ప్రామాణికంగా తీసుకుని బీమా పరిహారం లెక్కిస్తారు. 
 
అలాగైతే ఉచితంగా ఎందుకిస్తుంది?  
వాతావరణ ఆధారిత పంటలకు పాత పద్ధతిలోనే టెండర్లను ఖరారు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం  వాతావరణ ఆధారిత బీమా పధకంలో రిస్క్‌ షేరింగ్‌ మోడల్‌ను అమలు చేయడం లేదు. ఇక రామోజీ చెబుతున్నట్లుగా ఆర్థిక భారం తగ్గించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమైతే.. అసలు ఉచిత పంటల బీమా పథకం అమలు ద్వారా యూనివర్సల్‌ కవరేజీ దిశగా అడుగులు వేసేదే కాదు.

టీడీపీ హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు పరిహారం మాత్రమే ఇవ్వగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు  54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు పరిహారం అందచేసింది. గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు అదనంగా 23.63 లక్షల మంది లబ్ధి పొందగా పరిహారం పరంగా రూ.4,390.85 కోట్ల మేర అదనంగా రైతన్నలకు ప్రయోజనం చేకూరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement