![6. 88 lakh cusecs of Godavari water from Dhavaleswaram into Kadali](/styles/webp/s3/article_images/2024/08/9/godavari_0.jpg.webp?itok=n-ygtFad)
ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.96 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
ధవళేశ్వరం నుంచి 6.88 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు కడలిలోకి
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.
ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.
నాగార్జున సాగర్‌లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్‌వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.
గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.
మిడతపాట్లు
వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి..
Comments
Please login to add a commentAdd a comment