ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించిన కూటమి ప్రభుత్వం
ఆ స్థాయిలో పోలవరంలో నిల్వ ఉండేది 115.44 టీఎంసీలే
కుడి, ఎడమ కాలువల ద్వారా సామర్థ్యం మేరకు నీటి సరఫరా అసాధ్యం
కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందవు
కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం కాదు
గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల్లో రెండో పంట సవాలే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.
రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఆ ప్రాజెక్టు చుక్కాని అయిన పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి. ఈ డిజైన్ ప్రకారమే స్పిల్ వేను 55 మీటర్ల ఎత్తుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాంను పూర్తి స్థాయిలో నిర్మించి, నిర్వాసితులకు పునరావాసం కల్పించి 194.6 టీఎంసీలను నిల్వ చేయాలి.
కానీ.. ప్రాజెక్టు నీటిని నిల్వ చేసే మట్టాన్ని 41.15 మీటర్లకే తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేవలం 115.44 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడిది ధవళేశ్వరం బ్యారేజి తరహాలోనే మారిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలు. గోదావరిలో ప్రవాహం ఉంటేనే గోదావరి డెల్టా ఆయకట్టుకు ఈ బ్యారేజ్ ద్వారా నీటిని మళ్లిస్తారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుంది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కలే..
పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి 63.20 టీఎంసీలను తరలించి ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారు. అందుకే పోలవరం ఎడమ కాలువను 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారు. కానీ.. పోలవరం ప్రాజెక్టును కుదించడం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నీళ్లందించడం కూటమి ప్రభుత్వం కలగా మార్చేసిందని నిపుణులు మండిపడుతున్నారు.
గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకం
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కుడి కాలువ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పోలవరం జలాశయాన్ని కుడి కాలువతో అనుసంధానం చేసే జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతి కోరుతూ 2022, మే 4న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించింది.
కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్‌కు తరలించే గోదావరి జలాల్లో రెండు టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్ (వెలిగొండ) మీదుగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నీటిని సోమశిల మీదుగా కావేరికి తరలించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడంతో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమైంది.
తాగు నీటికి, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బందే
కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో.. నీటి పారుదల విభాగానికి అయ్యే నిధులిస్తే చాలని 2016 సెప్టెంబరు 7న అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. దాంతో తాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సాగు నీటితోపాటే తాగునీటినీ తీసుకెళ్తాం కాబట్టి తాగు నీటి విభాగానికి అయ్యే నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది.
పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 28.50 లక్షల మంది దాహార్తి తీర్చడంతోపాటు విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీల సరఫరాకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు కుదించడంతో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొందని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీరుగారిపోనున్న ప్రాజెక్టు లక్ష్యాలు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించడం ద్వారా 41.15 మీటర్లలో 115.44 టీఎంసీలు నీరే నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలే నీరుగారిపోతాయి.
» నీటి మట్టం 41.15 మీటర్లకంటే ఎగువన ఉంటేనే కుడి, ఎడమ కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ రెండు కాలువల ద్వారా నీరందక 7.20 లక్షల ఎకరాలకు నీరందని దుస్థితి.
» కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. ఇందుకు 80.09 టీఎంసీలు అవసరం. ఇదే కాలువ ద్వారా కృష్ణా డెల్టాలో 13.18 లక్షల ఎకరాల స్థిరీకరణకు 84.70 టీఎంసీలు మళ్లించాలి. అంటే.. కుడి కాలువ ద్వారానే 164.79 టీఎంసీలు మళ్లించాలి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి 84.80 టీఎంసీలు అవసరం. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు మళ్లించాలి. అంటే ఎడమ కాలువకు 108.24 టీఎంసీలు అవసరం.
» కుడి, ఎడమ కాలువల ద్వారా పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీళ్లందిస్తున్న 2.98 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అంటే.. ప్రాజెక్టు కింద నిర్దేశించిన మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు, గోదావరి డెల్టాలో రెండో పంటకు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం.
» పోలవరానికి ఎగువన తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోస్తారు. గోదావరి ఉప నదులపై ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరానికి వరద వచ్చే రోజులు కూడా తగ్గనున్నాయి. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును తగ్గించడంతో ఆయకట్టుకు నీళ్లందించం సవాలే అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment