godavari delta
-
పోలవరం ఇక ఉత్త బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఆ ప్రాజెక్టు చుక్కాని అయిన పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి. ఈ డిజైన్ ప్రకారమే స్పిల్ వేను 55 మీటర్ల ఎత్తుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాంను పూర్తి స్థాయిలో నిర్మించి, నిర్వాసితులకు పునరావాసం కల్పించి 194.6 టీఎంసీలను నిల్వ చేయాలి.కానీ.. ప్రాజెక్టు నీటిని నిల్వ చేసే మట్టాన్ని 41.15 మీటర్లకే తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేవలం 115.44 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడిది ధవళేశ్వరం బ్యారేజి తరహాలోనే మారిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలు. గోదావరిలో ప్రవాహం ఉంటేనే గోదావరి డెల్టా ఆయకట్టుకు ఈ బ్యారేజ్ ద్వారా నీటిని మళ్లిస్తారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుంది.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కలే..పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి 63.20 టీఎంసీలను తరలించి ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారు. అందుకే పోలవరం ఎడమ కాలువను 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారు. కానీ.. పోలవరం ప్రాజెక్టును కుదించడం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నీళ్లందించడం కూటమి ప్రభుత్వం కలగా మార్చేసిందని నిపుణులు మండిపడుతున్నారు. గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకంపోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కుడి కాలువ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పోలవరం జలాశయాన్ని కుడి కాలువతో అనుసంధానం చేసే జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతి కోరుతూ 2022, మే 4న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించింది. కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్‌కు తరలించే గోదావరి జలాల్లో రెండు టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్ (వెలిగొండ) మీదుగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నీటిని సోమశిల మీదుగా కావేరికి తరలించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడంతో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమైంది. తాగు నీటికి, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బందేకమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో.. నీటి పారుదల విభాగానికి అయ్యే నిధులిస్తే చాలని 2016 సెప్టెంబరు 7న అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. దాంతో తాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సాగు నీటితోపాటే తాగునీటినీ తీసుకెళ్తాం కాబట్టి తాగు నీటి విభాగానికి అయ్యే నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 28.50 లక్షల మంది దాహార్తి తీర్చడంతోపాటు విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీల సరఫరాకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు కుదించడంతో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొందని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నీరుగారిపోనున్న ప్రాజెక్టు లక్ష్యాలుపోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించడం ద్వారా 41.15 మీటర్లలో 115.44 టీఎంసీలు నీరే నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలే నీరుగారిపోతాయి.» నీటి మట్టం 41.15 మీటర్లకంటే ఎగువన ఉంటేనే కుడి, ఎడమ కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ రెండు కాలువల ద్వారా నీరందక 7.20 లక్షల ఎకరాలకు నీరందని దుస్థితి.» కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. ఇందుకు 80.09 టీఎంసీలు అవసరం. ఇదే కాలువ ద్వారా కృష్ణా డెల్టాలో 13.18 లక్షల ఎకరాల స్థిరీకరణకు 84.70 టీఎంసీలు మళ్లించాలి. అంటే.. కుడి కాలువ ద్వారానే 164.79 టీఎంసీలు మళ్లించాలి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి 84.80 టీఎంసీలు అవసరం. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు మళ్లించాలి. అంటే ఎడమ కాలువకు 108.24 టీఎంసీలు అవసరం. » కుడి, ఎడమ కాలువల ద్వారా పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీళ్లందిస్తున్న 2.98 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అంటే.. ప్రాజెక్టు కింద నిర్దేశించిన మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు, గోదావరి డెల్టాలో రెండో పంటకు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం. » పోలవరానికి ఎగువన తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోస్తారు. గోదావరి ఉప నదులపై ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరానికి వరద వచ్చే రోజులు కూడా తగ్గనున్నాయి. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును తగ్గించడంతో ఆయకట్టుకు నీళ్లందించం సవాలే అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం జగన్ ఆదేశాలు.. గోదావరి డెల్టాకు రబీకి సాగు నీరు..
-
దిగుబడి వరిస్తోంది
సాక్షి అమలాపురం: వర్షాభావ పరిస్థితులు.. గోదావరి నదిలో అరకొరగా వచ్చిన ప్రవాహ జలాలు గోదావరి డెల్టాల్లో ఖరీఫ్‌కు కలిసొచ్చింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోంది. వర్షాలు లేకున్నా ప్రభుత్వ యంత్రాంగం గోదావరి కాలువలకు సంవృద్ధిగా సాగునీరు అందించడంతో డెల్టాల్లో ప్రాంతాన్ని బట్టి 34 బస్తాలు (బస్తా 75 కేజీలు) నుంచి 48 బస్తాల వరకు దిగుబడి లభిస్తోంది. ఇప్పటికే కోతలు మొదలైన తూర్పు డెల్టాలోని రాయవరం, మండపేట, పశ్చిమ డెల్టా పరిధిలోని నిడదవోలు వంటి మండలాల్లో కొన్నిచోట్ల 48 బస్తాల వరకు దిగుబడిగా వస్తుండటంతో రైతులు సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈశాన్యం వల్ల భారీ వర్షాలు, వాయుగుండాలు, తుపానులు రాకుండా ఉంటే ఈ ఖరీఫ్‌లో లాభాలు కళ్లజూస్తామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ‘తూర్పు’లో 3.90 లక్షల ఎకరాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం 3.90 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉంది. కోనసీమ జిల్లాలో 1.58 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. అధికారుల అంచనా ప్రకారం ఇక్కడ 3.80 లక్షల టన్నులు. వ్యవసాయ శాఖ గణంకాల ప్రకారం డెల్టాలో ఖరీఫ్ దిగుబడి సగటున 28 బస్తాలు. కానీ.. కోనసీమ జిల్లాలో ఇక్కడ ఎకరాకు సగటున 32.50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అధికారుల చెబుతున్నారు. వాస్తవానికి ఈ జిల్లా పరిధిలో అంచనాలకు మించి దిగుబడి వస్తోంది. జిల్లాలోని ఆత్రేయపురంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో ఎకరాకు సగటు 34 బస్తాల దిగుబడిగా తేలింది. రాయవరం మండలంలో వరి కోతలు ప్రారంభం కాగా.. ఇక్కడ 42 నుంచి 46 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో 32 బస్తాల నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అంచనా. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పరిధిలో వరి కోతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సగటున 35 బస్తాల దిగుబడిగా వస్తుండగా.. పశ్చిమ డెల్టా పరిధిలోని పెరవలి మండలంలో 38 నుంచి 42 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం పరిధిలో ప్రాంతాన్ని బట్టి 32 నుంచి 40 బస్తాల వరకు పండింది. గత కొన్నేళ్లుగా ఖరీఫ్ సాగు అనుకున్న స్థాయిలో దిగుబడి రావడం లేదు. పంట కోతకు వచ్చే సమయంలో భారీ వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. పంట పండినా దిగుబడి రావడం లేదు. కోనసీమ జిల్లాలో గత ఖరీఫ్ కొన్ని ప్రాంతాల్లో 24 బస్తాలు మించి పండలేదు. వర్షాభావం కలిసొచ్చింది ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటం వల్ల డెల్టాలో మంచి దిగుబడి వస్తోంది. ఎండల వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగటం దిగుబడి పెరగడానికి కారణమైంది. మండపేట, రాయవరం వంటి మండలాల్లో నిర్వహించిన పంట కోత ప్రయోగాలలో సగటు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. – బోసుబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
గోదావరి డెల్టాకు భరోసా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి డెల్టా ఆధునికీ కరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిర్వహించేలా సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 11 నియోజకవర్గాల్లో రూ.163.06 కోట్లతో 95 పనుల కోసం సాంకేతికపరమైన అనుమతులు పొందారు. వచ్చే ఏడాది రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు. వీటిలో రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, కాలువల మరమ్మతులు, స్లూయిజ్ గేట్ల మరమ్మతులు వంటి కీలక పనులు ఉన్నాయి. 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గోదావరి జలాలతో పాటు మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోంది. ఏటా రబీ సీజన్ ప్రారంభంలో వీటికి వార్షిక మరమ్మతులు చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ క్రమంలో జిల్లాలో సీజన్ ప్రారంభానికి ముందే రూ.22.54 కోట్లతో 180 పనులను ప్రతిపాదించగా 121 పనులకు టెండర్ల ఖరారై వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా వచ్చే రబీ నాటికి శాశ్వత ప్రాతిపదికన గోదావరి డెల్టాలో కీలక పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి సంబంధించి సాంకేతికపరమైన, పరిపాలనా అనుమతులు వచ్చాయి. ప్రభుత్వ ఆమోదంతో కొద్ది నెలల్లో టెండర్ల దశకు పనులు చేరుకోనున్నాయి. వీటిలో ప్రధానంగా మేజర్ డ్రెయిన్లలో మరమ్మత్తులు, కొన్నిచోట్ల రిటైనింగ్‌వాల్ నిర్మాణాలు, స్లూయిజ్ గేట్ల మరమ్మత్తులు, ఎర్త్ వర్క్స్‌తో పాటు పూడికతీత పనులు ఉన్నాయి. పశ్చిమగోదావరిలో.. ఆచంట నియోజకవర్గంలో రూ.3.68 కోట్లతో 5 పనులు నరసాపురం నియోజకవర్గంలో రూ.28.22 కోట్లతో 2 పనులు పాలకొల్లు నియోజకవర్గంలో రూ.19.01 కోట్లతో 5 పనులు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూ.6.41 కోట్లతో 21 పనులు ఉండి నియోజకవర్గంలో రూ.38.25 కోట్లతో 18 పనులు తణుకు నియోజకవర్గంలో రూ.7.49 కోట్లతో 12 పనులు భీమవరం నియోకవర్గంలో రూ.30.14 కోట్లతో 13 పనులు ఏలూరు జిల్లాలో.. దెందులూరు నియోజకవర్గంలో రూ.14.40 కోట్లతో ఒక పని ఉంగుటూరు నియోజకవర్గంలో రూ.8.35 కోట్లతో 3 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో.. గోపాలపురం నియోజకవర్గంలో రూ.4.71 కోట్లతో 11 పనులు నిడదవోలు నియోజకవర్గంలో రూ.2.37 కోట్లతో 4 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో మొండికోడు మేజర్ డ్రెయిన్‌కు 2.50 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం, భీమవరంలో పశ్చిమ డెల్టా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ పనులు, తణుకులో ఎర్రకోడు మీడియం డ్రెయిన్, ఉండిలో కోరుకొల్లు మైనర్ డ్రెయిన్, ఇతర మరమ్మతులు ఇలా 95 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో పాలకొల్లులో రూ.8.10 కోట్ల వ్యయంతో నక్కల మేజర్ డ్రెయిన్‌పై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. -
పంటలు కాపాడుకునేందుకే ముందుగా సాగునీరు
సాక్షి, అమరావతి: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయకట్టుకు సాగునీటిని ముందుగా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారమే గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశామని గతంలో ఇది ఎప్పుడూ జరగలేదన్నారు. తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం స్పందన సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ... షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల.. జూన్ 10న కృష్ణాడెల్టాకు, గుంటూరు చానల్‌కు, గండికోట కింద, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు కింద పంట భూములకు సాగునీరు ఇస్తున్నాం. ఎస్సార్బీసీ కింద గోరకల్లు, అవుకుకు జూన్ 30న సాగునీరు ఇస్తున్నాం. ఎన్ఎస్పీ కింద జూలై 15న నీటిని విడుదల చేస్తున్నాం. ఈ షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ సలహా మండళ్లు... వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఆర్బీకే స్థాయిలో తొలి శుక్రవారం, మండలస్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం సమావేశాలు తప్పనిసరిగా జరగాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కృషి చేయాలి. పంటల ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి. పారదర్శకంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాల పంపిణీ పారదర్శకంగా జరగాలి. నాణ్యతకు మనం భరోసాగా ఉండాలి. పరీక్షించి రైతులకు అందించాలి. జూన్, జూలైలో ఎక్కువ ఎరువులు అవసరం అవుతాయి. ఆమేరకు అందుబాటులో ఉంచాలి. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి నెలా బ్యాంకర్ల సమావేశాలు ప్రతి నెలా జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించాలి. రైతులకు రుణాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌లో దాదాపు రూ.92 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ మేరకు అందించాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి కౌలురైతు సీసీఆర్సీ కార్డులు పొందాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలి. సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తమ సాగు విధానాలపై ఐరాసకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)తో ఒప్పందం చేసుకుంది. సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించాలి. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలోనే తొలిసారి సహజ పద్ధతుల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ చేపట్టాం. జాతీయ రహదారులకు వేగంగా భూ సేకరణ.. రాష్ట్రంలో పలు రహదారుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానిస్తూ 2,400 కి.మీ. మేర రోడ్లకు రూ.6,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 3,079 కి.మీ.కి సంబంధించి రూ.29,249 కోట్ల విలువైన మరో 99 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. 2,367 కి.మీ.కి సంబంధించి రూ.29,573 కోట్లతో మరో 45 ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. బెంగళూరు –విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి 332 కి.మీ రోడ్ల నిర్మాణ పనులను రూ.17,500 కోట్లతో చేపడుతున్నాం. భూ సేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దాదాపు రూ.80 వేల కోట్లకు పైబడి పనులు చేపడుతున్నాం. ఈ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర జీఎస్డీపీ గణనీయంగా పెరగుతుంది. వీలైనంత త్వరగా భూములను కలెక్టర్లు సేకరించాలి. అత్యంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. రోడ్ల వివరాలతో ఫొటో గ్యాలరీలు.. రూ.2,500 కోట్లతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ రోడ్ల కోసం సుమారు రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం రూ.1,400 కోట్లు కూడా ఇవ్వలేదు. నాడు– నేడు కింద అభివృద్ధి చేసిన రోడ్ల వివరాలను ప్రజలకు తెలియచేస్తూ ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూ సేకరణ, ఆర్అండ్ఆర్పై కార్యాచరణ సిద్ధం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.ప్రాధాన్యత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. -
ఆ..! పీకావులే బొచ్చు’.. ఈ ‘బొచ్చు’ విషయంలో మాత్రం కాదు..
సాక్షి, అమలాపురం: ‘ఆ..! పీకావులే బొచ్చు’ అంటూ తేలిగ్గా తీసి పారేస్తారు. ఈ మాట బొచ్చు (వెంట్రుకలు) విషయంలో నిజమే కానీ.. ఈ ‘బొచ్చు’ విషయంలో మాత్రం కాదు. గోదావరి డెల్టా కాలువల్లో బొచ్చ (దీనినే వాడుకలో ‘బొచ్చు’ అని కూడా అంటారు), శీలావతి, మోసు, ఎర్రమోసు వంటి చేపలు విరివిరిగా దొరుకుతుంటాయి. మహా అయితే ఇవి అర కేజీ, కేజీకి మించి బరువుండవు. గోదావరి నది నుంచి నీరు వచ్చినా పెద్ద చేపలు వచ్చే అవకాశం తక్కువ. చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. అటువంటిది అమలాపురం-చల్లపల్లి పంట కాలువలో చల్లపల్లి వద్ద ఏకంగా ఏడు, ఆరు కేజీల చొప్పున బొచ్చు చేపలు దొరకడం విశేషం. పంట కాలువలు కట్టివేయడంతో ఉన్న కొద్దిపాటి నీటిలో ఇవి ఉన్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానానికి చెందిన చేపల వ్యాపారి బొమ్మిడి వెంకటరాజుకు ఏడు కేజీల చేప దొరకగా, మరో గ్రామానికి చెందిన వ్యక్తి ఆరు కేజీల చేప పట్టుకుని వెళ్లాడు. దీనిని అమలాపురం మార్కెట్లో విక్రయిస్తే రూ.1,500 పైబడి వస్తుందని వెంకటరాజు ‘సాక్షి’కి చెప్పారు. -
AP: సాగు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమయ్యే నాటికి గోదావరి డెల్టా రైతుల నీటి కష్టాలను కడతేర్చే దిశగా ముందస్తు కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.43 కోట్లపై చిలుకు విలువైన 275 పనులకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఏటా రబీ సీజన్ ముగియగానే కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా పంట కాలువలకు నీటిని నిలుపు చేస్తారు. తిరిగి ఖరీఫ్ సాగుకు నీటి సరఫరాను ప్రారంభిస్తారు. కాలువలు మూసివేసి, తిరిగి తెరిచే లోగా వాటి పటిష్టత, పూడికతీత, ఔట్‌ఫాల్ స్లూయిజ్‌ల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులు చేపడుతుంటారు. వీటిని క్లోజర్ పనులని అంటారు. ఈ పనుల ద్వారా ఖరీఫ్ సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూస్తారు. గతంలో పంట కాలువలు మూసేసినప్పటికీ సకాలంలో ఆమోదించకపోవడం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో క్లోజర్ పనులు పూర్తయ్యేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ అధికారులు క్లోజర్ పనులపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోనసీమ జిల్లాలో అత్యధికం ఈసారి మొత్తం క్లోజర్ పనుల్లో మూడు వంతులు పైగా కోనసీమ జిల్లాలోనే చేపట్టనున్నారు. అక్కడే ఆయకట్టు ఎక్కువగా ఉండటంతో అందుకు తగ్గట్టు పనులు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటికీ కలిపి రూ.43,09,77,000 మంజూరు చేస్తే ఇందులో కోనసీమ జిల్లాకు అత్యధికంగా రూ.34,93,32,000 కోట్లు కేటాయించారు. మిగిలినది తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు కేటాయించారు. అమలాపురం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో బెండా కెనాల్, జనుపల్లి హెడ్ స్లూయీజ్‌కు నడిపూడి గ్రామ పరిధిలో మరమ్మతులు చేపట్టనున్నారు. చెయ్యేరు చానల్ – గున్నేపల్లి బ్రాంచి కెనాల్స్, అల్లవరం చానల్, కౌశిక చానల్, అమలాపురం చానల్ నుంచి చిందాడగరువు చానల్, పి.గన్నవరం కెనాల్ నుంచి అమలాపురం కెనాల్ వరకు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పలు కాలువలను అభివృద్ధి చేయనున్నారు. కోనసీమలో అత్యధికంగా రాజోలు నియోజకవర్గంలో 52 పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనుల టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాం. దీనిపై అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు వేగవంతం చేస్తాం. – బి.రాంబాబు, ఎస్ఈ,ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ రైతులకు లబ్ధి డెల్టా కాలువలకు నీటిని నిలిపివేసిన అనంతరం చేపట్టే ఓ అండ్ ఎం పనులతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడికతీతతో పాటు గేట్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టడం ద్వారా శివారు ప్రాంతాలకు కూడా ఇబ్బందులు లేకుండా నీరు చేరుతుంది. ఈ పనులకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిలిచింది. – జిన్నూరి వెంకటేశ్వరరావు,వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పు గోదావరి -
కోటి ఎకరాలకు జలధారలు
సాక్షి, అమరావతి: ఈసారి రబీలో 31.10 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా జలవనరుల శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా వృథాకు అడ్డుకట్ట వేసి శివారు భూములకు సైతం జలసిరులు అందించాలని దిశానిర్దేశం చేసింది. ఖరీఫ్‌లో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 70 లక్షల ఎకరాలకు నీళ్లందించిన నేపథ్యంలో రబీతో కలిపి మొత్తం 1.11 కోట్ల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. 2019–20, 2020–21లోనూ ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకు నీళ్లందించారు. వరుసగా మూడో ఏడాది కోటి ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తుండటం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ వరుసగా మూడేళ్ల పాటు కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళితో పాటు వాగులు, వంకలు ఉరకలెత్తాయి. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు కళకళలాడుతుండటంతో మూడేళ్లుగా ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకు నీళ్లందించేందుకు మార్గం సుగమమైంది. కృష్ణా డెల్టాలో మొదటిసారి... కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు విస్తరించింది. ఇప్పటివరకూ ఖరీఫ్‌లో మాత్రమే కృష్ణా డెల్టా ఆయకట్టుకు అధికారికంగా నీళ్లందిస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా రబీలోనూ కృష్ణా డెల్టా ఆయకట్టుకు అధికారికంగా నీళ్లందిస్తుండటం గమనార్హం. 2019–20లో 1.10 లక్షలు, 2020–21లో 2.50 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లందించడానికి సిద్ధమైంది. డెల్టా చరిత్రలో రబీలో ఇంత భారీగా నీళ్లందిస్తుండటం ఇదే తొలిసారి. ఈసారి రికార్డు స్థాయిలో పులిచింతల ప్రాజెక్టులో ఏకంగా 40.44 టీఎంసీలను నిల్వ చేశారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం వల్లే కృష్ణా డెల్టాలో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీరు అందుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వంశధార నుంచి చిత్రావతి దాకా.. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న అన్ని జలాశయాల కింద రబీలో ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధారతోపాటు మధ్యతరహా ప్రాజెక్టైన మడ్డువలస ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టాకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తోంది. పశ్చిమ గోదావరిలో ఎర్రకాల్వ, తమ్మిలేరు ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. ప్రకాశం జిల్లాలో సాగర్ కుడి కాలువ, కృష్ణా డెల్టాతోపాటు మధ్యతరహా ప్రాజెక్టులైన రాళ్లపాడు, మోపాడు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెన్నా డెల్టాలో ఆలస్యంగా సాగు చేపట్టిన ఖరీఫ్ పంటలకు నీటిని సరఫరా చేస్తోంది. కర్నూలు జిల్లా పరిధిలో కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టడం వల్ల తెలుగుగంగ ఆయకట్టుకు రబీలో నీటిని విడుదల చేయడం లేదు. ఎస్సార్బీసీ, తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుగంగ, గండికోట ఎత్తిపోతల, గాలేరు–నగరి తొలిదశ, చిత్రావతి, పులివెందుల బ్రాంచ్ కెనాల్, హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. లభ్యత ఆధారంగా రబీకి నీటి విడుదల ప్రభుత్వ ఆదేశాల మేరకు లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తాం. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందిస్తాం. పులిచింతలలో ప్రభుత్వం దూరదృష్టితో 40.44 టీఎంసీలను నిల్వ చేయడం వల్లే కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో రబీ పంటలకు నీళ్లందించగలుగుతున్నాం. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వి/æ్ఞప్తి చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు
సాక్షి, తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా ప్రధాన కాల్వకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ మంగళవారం సాగునీరు విడుదల చేశారు. దీంతో పోలవరం స్పిల్‌వే మీదుగా మొదటిసారి గోదావరి జిల్లాలకు సాగునీరు అందనుంది. చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత! -
15 నుంచి గోదావరి డెల్టాకు నీరు
కాకినాడ రూరల్: గోదావరి డెల్టా ఆయకట్టుకు ఈ నెల 15 నుంచి కాలువల ద్వారా నీరు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. జలవనరులశాఖ మంత్రి సమక్షంలో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతులతో చర్చించి నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులు నష్టపోకుండా తొలిసారిగా పంటల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో గిరాకీ ఉన్న వరి వంగడాలనే వచ్చే ఖరీఫ్‌లో పండించాలని రైతులకు సూచించారు. ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా విశాఖపట్నంలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ తూరంగి, జగన్నాథపురం వద్ద కొత్తగా రైతుబజార్లు మంజూరు చేశామని చెప్పారు. మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. రూ.212 కోట్లతో మార్కెట్ యార్డుల అభివృద్ధి వ్యవసాయ మార్కెట్ యార్డుల ఆధునికీకరణకు నాడు–నేడు పథకం ద్వారా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తొలిదశలో రూ.212 కోట్లతో మార్కెట్ యార్డులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రబీలో 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లో రైతు ఖాతాకు సొమ్ము జమచేస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా మార్చి, అక్కడ పేరు నమోదు చేసుకున్న రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో బొండాలు రకం ధాన్యాన్ని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలియడంతో సీఎం ఆదేశాల మేరకు కనీస మద్దతు ధర అమలయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. -
ఏపీ: జూన్ 15 నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల
సాక్షి, అమరావతి: గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగు కోసం జూన్ 15 నుంచి నీటిని విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు చింతా అనురాధ, మార్గాని భరత్, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో గురువారం ఆయన వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. చదవండి: కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే -
Godavari Delta: గోదావరి డెల్టాకు భరోసా
సాక్షి, అమరావతి: గోదావరి డెల్టాలో నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు శివారు భూములకు నీళ్లందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆధునికీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డెల్టాలో ఖరీఫ్‌కు జూన్.. రబీకి డిసెంబర్లో నీటిని విడుదల చేస్తారు. ఏడాది మొత్తంలో కేవలం రెండు నెలలు మాత్రమే డెల్టాలో పంటలు సాగు చేయరు. ఆ రెండు నెలల్లోనే కాలువల ఆధునికీకరణ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. రబీ పంట కాలం పూర్తయి, ఖరీఫ్ పంట సాగు ప్రారంభించే లోగా కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టి పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. గత ఏడాదిలో రెండు నెలలు, ప్రస్తుత రబీ పంట పూర్తయినప్పటి నుంచి డెల్టా ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.148.04 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులను భారీ ఎత్తున చేపట్టింది. సర్ ఆర్థర్ కాటన్ హయాంలో నిర్మించిన పురాతనమైన కాలువలు అస్తవ్యస్థంగా మారడంతో డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. దీంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో గోదావరి డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. కాలువలు, రెగ్యులేటర్లు ఆధునికీకరణకు రూ.802.59 కోట్లు వ్యయం చేశారు. ఆయన మరణం తర్వాత డెల్టా ఆధునికీకరణ పనులను టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. బ్యారేజీని పటిష్టం చేసేలా.. గోదావరి డెల్టాకు నీటిని సరఫరా చేసే ధవళేశ్వరం బ్యారేజీని మరింత పటిష్టం చేసే పనులపైనా దృష్టి పెట్టిన అధికారులు.. మరోవైపు బ్యారేజీలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసే పనులను చేపడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. గోదావరికి వచ్చే భారీ వరద ప్రవాహంతో పెద్దఎత్తున ఇసుక కొట్టుకొచ్చి ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేస్తోంది. ఇటీవల జల వనరుల శాఖ అధికారులు నిర్వహించిన బ్యాథమెట్రిక్ సర్వేలో సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు వేసినట్టు గుర్తించారు. దీనిని డ్రెడ్జింగ్ ద్వారా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బ్యారేజీలో ఇసుక పూడికను తొలగించి.. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం ద్వారా 10.13 లక్షల ఎకరాల గోదావరి డెల్టా ఆయకట్టుకు మరింత సమర్థవంతంగా నీళ్లందించాలని నిర్ణయించారు. డిజైన్ మేరకు నీరు ప్రవహించేలా.. అత్యంత ఆధునాతన ఏడీసీపీ (అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) పరికరం ద్వారా ప్రస్తుతం కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని అధికారులు కొలుస్తున్నారు. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యం తగ్గితే, దాన్ని పెంచేలా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. డెల్టాలోని 713.20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలను ఇదే రీతిలో ఆధునికీకరిస్తున్నారు. డి్రస్టిబ్యూటరీలను అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టారు. -
జలకళ.. ఖరీఫ్ భళా
సాక్షి, అమరావతి: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. దీంతో గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 10.13 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు డెల్టా రైతులు సిద్ధమయ్యారు. నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి ప్రవాహం మొదలవడంతో అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. వంశధారలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించి.. గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలకు సాగు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నీటి లభ్యతను బట్టి ఇతర ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ సమావేశాలలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా గతేడాది గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో 1,050 టీఎంసీలను వినియోగించుకుని ఖరీఫ్, రబీలలో 1.34 కోట్ల ఎకరాలకు సర్కార్ నీటిని సరఫరా చేసింది. ఇందులో ఒక్క ఖరీఫ్‌లోనే కోటి ఎకరాలకు నీళ్లందించడం గమనార్హం. దాంతో రికార్డు స్థాయిలో వరి దిగుబడులు వచ్చాయి. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో వరద నీటిని గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి ఆయకట్టుకు నీళ్లందించి, రైతులకు దన్నుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నీ మంచి శకునములే.. ► గోదావరి నదిలో ఈనెల 7 నుంచే వరద ప్రవాహం మొదలైంది. అదే రోజున ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. ► కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా నీటి సంవత్సరం ప్రారంభంలోనే ఆల్మట్టి జలాశయంలోకి ఈనెల 5వ తేదీన 12,761 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది. ఈనెల 5 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ 7 టీఎంసీలు ఆల్మట్టి జలాశయంలోకి చేరాయి. ► ప్రస్తుతం ఆల్మట్టిలో 35.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ కృష్ణాలో వరద ప్రవాహం మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులో 5.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలో 2.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరిలో నీటిమట్టం 17 అడుగులకు చేరిన అనంతరం వరద జలాలను కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్లించి.. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని జల వనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ► నెలాఖరులోగా డెల్టాకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. డెల్టాలో 13.08 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ► నాగావళి నదిలోనూ నీటి సంవత్సరం ప్రారంభంలోనే వరద ప్రారంభమైంది. తోటపల్లి బ్యారేజీలో నీటి నిల్వ 2.015 టీఎంసీలకు చేరడంతో అధికారులు పంటల సాగుకు కాలువలకు నీటిని విడుదల చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తోటపల్లి బ్యారేజీ కింద 1,59,822 ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ► ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వంశధార నదిలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. గొట్టా బ్యారేజీ బ్యారేజీ నుంచి శనివారం 624 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. శాసనభ సమావేశాలు ముగిసిన తర్వాత ఐఏబీ సమావేశం నిర్వహించి.. ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటి విడుదల.. ► శ్రీశైలం జలాశయానికి గత ఏడాది మాదిరిగానే వరద ప్రవాహం వస్తే దానిపై ఆధారపడిన తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. ► నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం చేరడం.. నీటి లభ్యత ఆధారంగా కుడి కాలువ, ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదలపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ► సోమశిలలో 26.6, కండలేరులో 23.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా, పెన్నా నదుల్లో నీటి లభ్యత ఆధారంగా సోమశిల, కండేరు, పెన్నా డెల్టా కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకుంటారు. ► తుంగభద్రలో వరద ప్రవాహం సుంకేశుల బ్యారేజీకి చేరాక.. ఐఏబీ సమావేశం నిర్వహించి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. -
ఆపదలో ‘అన్నపూర్ణ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణ’గా భాసిల్లడానికి కారణమైన గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఆకలి దప్పులు తప్పడం లేదు. ఈ రెండు డెల్టాలతోపాటు పెన్నా డెల్టాలోనూ సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ముంచుకొస్తోంది. డెల్టాలు ఉప్పునీటి కయ్యలుగా, సాగుకు పనికి రాని భూములుగా మారుతున్నాయి. ఈ కఠోర వాస్తవాన్ని సాక్షాత్తు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదిక బట్టబయలు చేసింది. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో భూములు శరవేగంగా చౌడుబారుతుండటం.. సాగుకు పనికి రాకుండా పోతుండటం.. పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుండటానికి కారణాలను అన్వేషించి.. పరిస్థితిని చక్కదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2014 జూన్ 19న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీడబ్ల్యూసీని ఆదేశించారు. నాలుగేళ్లపాటు సమగ్ర అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశానికి తూర్పు, పశ్చిమ తీర రేఖలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లతో కలిపి 7,516.6 కిలోమీటర్ల పొడవునా తీరం విస్తరించి ఉంది. దీవుల తీర రేఖను మినహాయిస్తే.. దేశానికి తూర్పు, పశ్చిమాన 5,422.6 కిలోమీటర్ల పొడవున తీర రేఖ ఉంది. దేశం నుంచి ప్రవహిస్తున్న 102కు పైగా నదులు తూర్పు, పశ్చిమ తీర రేఖల మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రానికి 973.7 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఇది విస్తరించి ఉంది. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్యన ప్రవహిస్తున్న కృష్ణా నది, ఉభయ గోదావరి జిల్లాల నడుమ ప్రవహిస్తున్న గోదావరి, నెల్లూరు మీదుగా ప్రవహించే పెన్నా, స్వర్ణముఖి, కండలేరు, శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవహించే వంశధార నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎల్‌నినో, లానినో ప్రభావం వల్ల సముద్ర మట్టం ఎత్తు కనిష్టంగా 0.6 మీటర్ల నుంచి గరిష్టంగా రెండు మీటర్ల వరకు పెరిగింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 903.2 మిల్లీమీటర్లు కురవాలి. ప్రకాశం జిల్లాలో కనిష్టంగా 757 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరిలో గరిష్టంగా 1,139 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో ప్రవాహం ఏడాది పొడవునా ఉండటం లేదు. సముద్ర మట్టం ఎత్తు పెరగడం.. నదుల్లో ఏడాది పొడవున ప్రవాహం లేకపోవడం వల్ల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోకి నదులు, డ్రెయిన్ల ముఖద్వారాల మీదుగా సముద్రపు నీరు ఎగదన్నుతోందని.. ఇది భూమిని చౌడుబారేలా చేస్తుందని సీడబ్ల్యూసీ తేల్చింది. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు.. తీర ప్రాంతంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భూగర్భ జలాలు ఉప్పు బారిపోవడం ఖాయమని, అప్పుడు డెల్టాల్లో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీరు కూడా కష్టమవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. భూమి చౌడుబారడం వల్ల సాగుకు పనికి రాకుండా పోతుందని.. పంట దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని.. దీనివల్ల ఆకలికేకలు తప్పవని అభిప్రాయపడింది. నదులు, డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లను నిర్మించి.. ఉప్పునీళ్లు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మడ అడవులను భారీ ఎత్తున పెంచి, తీరంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని పేర్కొంది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలని.. భూగర్భం నుంచి తోడేసిన నీటిని.. వర్షకాలం అయినా రీఛార్జ్ చేయాలని.. దీనివల్ల ఉప్పు నీరు పైకి ఉబికి వచ్చే అవకాశం ఉండదని నివేదికలో పేర్కొంది. నదుల్లో ఏడాది పొడవునా ప్రవాహాలు కనిష్ట స్థాయిలోనైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చేపల చెరువుల సాగును తగ్గించాలని.. రసాయన, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని కనిష్ట స్థాయికి చేర్చాలని సూచించింది. రక్షణ చర్యలు తీసుకోకపోతే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కావడం ఖాయమని స్పష్టం చేసింది. భూగర్భ జలాలు తోడేయడంతో.. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో సాగునీటితోపాటు చేపల చెరువుల సాగుకు, తాగునీటి కోసం భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోతోంది. బోరుబావుల ద్వారా తోడిన మంచినీటి స్థానంలోకి ఉప్పునీరు చేరుతోందని సీడబ్ల్యూసీ గుర్తించింది. చేపల చెరువుల ప్రభావం వల్ల భూమి శరవేగంగా చౌడుబారుతోందని తేల్చింది. 2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. మడ అడవులను నరికేయడం.. సునామీ దెబ్బకు తీర ప్రాంతం బలహీనపడటం వల్ల సముద్రపు నీరు ఉపరితలానికి బాగా ఎగదన్నింది. వీటి ప్రభావం వల్ల తీర ప్రాంతంలో 38 మండలాలు పూర్తిగానూ.. 26 మండలాల్లో భూములు పాక్షికంగానూ చౌడుబారాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది, పశ్చిమగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 13, గుంటూరులో 12, ప్రకాశంలో 13, నెల్లూరు జిల్లాలో రెండు మండలాల్లో భూములు చౌడుబారినట్టు లెక్క తేల్చారు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో 75.92 లక్షల ఎకరాల భూమి చౌడుబారిపోతే.. రాష్ట్రంలో 9.61 లక్షల ఎకరాల భూమి చౌడుబారి సాగుకు పనికి రాకుండా పోయింది. మిగతా ప్రాంతాల్లోనూ నేల చౌడు (క్షార) స్వభావం శరవేగంగా పెరుగుతోంది. ఇది కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఏటా సగటున ఐదు శాతం చొప్పున దిగుబడి తగ్గుతోందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. తీర ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం 50 శాతం అధికంగా ఉందని, ఇది నేల స్వభావం శరవేగంగా మారడానికి దారితీస్తోందని తేల్చింది. -
పేట్రేగుతున్న మట్టి మాఫియా
అమలాపురం: గోదావరి డెల్టా పరిధిలో వేసవిలో రైతులు పొలాల్లో మట్టి తవ్వకాలు చేయడం సర్వసాధారణం. పొలంలో పేరుకుపోయిన మెరక ప్రాంతంలో మట్టిని తొలగించి లోతట్టు ప్రాంతంలో వేయడం, గట్లు పటిష్టం చేస్తుంటారు. మట్టిని తొలగించినప్పటికీ అది సాగునీరు చేలల్లో చేరకుండా చేయడం కాని, నీరు నిల్వ ఉండకుండా చూసుకునేవారు. అయితే క్రమేపీ మట్టి తవ్వకాలలో రైతులు సైతం ఈ నిబంధనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. గడిచిన ఐదేళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది. పట్టణాలతో పాటు ఒక మేజర్ పంచాయతీలు, ఒక మోస్తరు పంచాయతీల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారు. వెంచర్లు అన్నీ చేలు, కొబ్బరితోటల్లో వేస్తున్నారు. ఇక్కడ భూమి ఎత్తు తక్కువ కావడంతో భారీగా మట్టి సేకరించాల్సి వస్తోంది. దీంతో రియా ల్టర్ల కన్ను పొలాలపై పండింది. జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం, ఆలమూరు తదితర వ్యవసాయ సబ్ డివిజన్లలో మట్టి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రోజూ వేలాది ట్రాక్టర్ల మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ గ్రామాల్లో స్థానికులను, రియాల్టర్లు సొంతంగా ప్రతినిధులను ఏర్పాటు చేసి మట్టి సేకరణలో పడ్డారు. వరి చేలల్లో నిబంధనలను తుంగలో తొక్కి మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాల వల్ల పొలాలు దెబ్బతినే ప్రమాదమున్నా.. చాలా మంది రైతులు ఎంతో కొంత ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో తవ్వకాలకు అంగీకరిస్తున్నారు. ఇంతా చేసి రైతుకు ఒక ట్రాక్టరు మట్టికి దక్కేది రూ.100 నుంచి రూ.200 మాత్రమే. అయితే మాఫియా మాత్రం దూరాన్ని బట్టి ట్రాక్టరుకు రూ.800 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తోంది. రైతులు సొంత పొలాల అవసరాలకు మట్టి తవ్వకాల వరకు అనుమతి ఉంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. కాని ఇప్పుడు వాటిని పట్టించునే వారే లేరు. అధికారులు సైతం ఎన్నికలు, కౌంటింగ్ హడావుడిలో ఉండడం.. మట్టి మాఫియాకు వరంగా మారింది. రైతు ఎకరం పొలంలో సుమారు 5 నుంచి 10 ట్రాక్టర్ల మట్టిని సేకరిస్తున్నారు. లోతుగా తవ్వకాలు చేయడం వల్ల భవిష్యత్తులో రైతులు సాగు పరమైన ఇబ్బందులను ఎదుర్కొనున్నారు. చెరువులుగా మారుతున్న పొలాలు ఇదే సమయంలో కొంతమంది చేల్లో భారీగా మట్టి అమ్మకాలు చేసి చెరువులుగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలు ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, ముమ్మిడివరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెరువులు మారుతున్నాయి. అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న జనుపల్లి, సమనస, సవరప్పాలెం, రోళ్లపాలెం, కామనగరువు వంటి ప్రాంతాల్లో మట్టి తవ్వకాల దందా అంతా ఇంతా కాదు. తువ్వ మట్టి దొరికితే మట్టి మాఫియాకు పండగే.. పండగ. ఇటీవల ఇసుక ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు పునాదుల్లో ఇసుకకు బదులు తువ్వ మట్టిని ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా దీని ధర సైతం ఎక్కువగానే ఉంది. ట్రాక్టరు తువ్వ మట్టి రూ.1,500 వరకు ధర పలుకుతోంది. ఈ మట్టి ధర మరింత పెరిగే అవకాశముందని తెలిసి మాఫియా నాయకులు పలుచోట్ల పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇంత భారీగా మట్టి తవ్వకాలు సాగుతున్నా రెవెన్యూ అధికారులు అటు కనీసం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
నీటి పిల్లులు, మరో ఐదు క్షీరదాలు గుర్తింపు
కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం, ఇతర గోదావరి డెల్టా ప్రాంతంలోని మడ అడవుల్లో 115 నీటి పిల్లులను మరో ఐదు రకాల క్షీరదాలను గుర్తించారని కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో సోమవారం రాష్ట్ర అటవీశాఖ వన్యమృగ సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోదావరి డెల్టా మడ అడవుల్లో నీటి పిల్లులు, ఇతర క్షీరదాలపై చేపట్టిన పరిశోధన పత్రాన్ని ఆయన విడుదల చేశారు. కార్తికేయమిశ్రా మాట్లాడుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా గోదావరి డెల్టాలోని మడ అడవుల్లో క్షీరదాలపై పరిశోధన జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న మడ అడవులు దేశంలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని, ఈ పరిశోధన ద్వారా అంతరించిపోతున్న వన్యమృగ సంరక్షణకు వీలవుతుందని తెలిపారు. ఈ పరిశోధనను 2018 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కోరింగ వన్య మృగ సంరక్షణ ప్రాంతం, ఇతర మడ అడవుల్లో చేపట్టారన్నారు. ఈ పరిశోధన కోసం 94 కెమెరా పాయింట్లలో అధిక నాణ్యత ఉన్న కెమెరాలను వినియోగించారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరించారు. 115 నీటి పిల్లులతోపాటు ఇండియన్ గోల్డెన్ జాకాల్, ర్విసెస్, మాకాక్యూ, స్మూత్ కోటెడ్ ఓటర్, జంగిల్ క్యాట్, మంగూస్ వంటి క్షీరదాలను గుర్తించారన్నారు. వీటిలో గుర్తించిన జాకల్ (నక్క) సంతతి సాధారణంగా మెట్ట ప్రాంతంలో ఉంటుందని, ఇవి తీర ప్రాంతంలోనూ సంచరిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా పరిశోధనకు శ్రీకారం చుట్టిన వన్యమృగ విభాగం, డీఎఫ్‌వో అనంతశంకర్ను కలెక్టర్ కార్తికేయ మిశ్రా అభినందించారు. జేసీ–2 సీహెచ్ సత్తిబాబు, డీఆర్వో ఎంవీ గోవిందరాజులు పాల్గొన్నారు. -
గోదావరి డెల్టాలో కొత్త వివాదం
-
ఎకరం ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి, రాజమహేంద్రవరం: పంటలకు నీరందక గోదావరి డెల్టాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా ప్రాంతంలో ఎకరం పంట ఎండినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రబీలో 8 టీఎంసీల నీటి కొరత ఉంటుందని అధికారులు ముందుగా అంచనా వేసినా, ప్రత్యామ్నాయ చర్యలు వేగంగా చేపట్టడం లేదని మండిపడ్డారు. గోదావరి కరకట్ట వెంబడి అధికార పార్టీ నేతల ఇసుక తవ్వకాల వల్ల వరదల సమయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం గోదావరి ఎగువన అనుమతి లేకుండా కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తున్నా.. ఓటుకు కోట్లు కేసు భయంతో చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీలో మంత్రి ఉమామహేశ్వరావు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ‘‘రాసిపెట్టుకో జగన్. 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరిస్తాం’’ అన్నారని, ఇప్పుడు ఆ మంత్రి ఎక్కడ ఉన్నారో బయటకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. నిన్నటివరకూ టీడీపీ భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీలు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై చేస్తున్న ఆరోపణలపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకుని సీఎం తన నిజాయితీని నిరూపించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, పార్టీ నేతలు రౌతు సూర్యప్రకాశరావు, కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, మేడపాటి షర్మిలారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల రైతు విభాగాల అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
పణంగా గోదావరి డెల్టా?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతలతో మరోసారి గోదావరి డెల్టాను పణంగా పెట్టనున్నారా? పశ్చిమగోదావరి నీటిపారుదల సలహామండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం లేదు. గోదావరిలో ఇన్‌ఫ్లోలు తగ్గిపోయినా ఇంకా ఎందుకు పట్టిసీమ నుంచి నీటిని నిలిపివేయడంలో తర్జనభర్జన పడుతున్నారు. ఎవరి వత్తిళ్లు అధికారులపై పని చేస్తున్నాయి. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల మాటకు విలువ లేదా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. గత నెల 31న ఏలూరు కలెక్టరేట్లో జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో కృష్ణా ఆయకట్టు కోసం మరోసారి గోదావరి డెల్టా రైతాంగాన్ని పణంగా పెట్టవద్దని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. గోదావరి నుంచి ఇన్‌ఫ్లోలు తగ్గే సమయంలోనే పట్టిసీమ నుంచి నీటిని నిలిపివేయాలని, లేనిపక్షంలో గోదావరి డెల్టాలో రబీ సాగు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మంత్రి పితాని సత్యనారాయణ సూచించారు. 2015లో డెడ్‌స్టోరేజి వరకూ తోడివేయడంతో రబీ సాగుకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన విషయం ఆయన గుర్తు చేశారు. ఇన్‌ఫ్లో 18 వేల క్యూసెక్కులకు రాగానే నీటిని నిలిపివేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. 14 మీటర్ల కన్నా ఎక్కువ నీటి మట్టం ఉన్నప్పుడే పట్టిసీమకు నీరు ఇస్తామని తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో, వ్యవసాయ శాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారుల్లో కూడా పలు అనుమానాలు ఉన్నాయని అందరు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రబీ పంటకు నీటి లభ్యత 72 శాతమే ఉందని వంతుల వారీ విధానంలో నీటిని విడుదల చేద్దామని ఒకవైపు ప్రణాళిక రూపొందించుకుంటూనే మరోవైపు గోదావరిలో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 13 వేలకు పడిపోయినా ఇంకా పట్టిసీమను ఆపకుండా కొనసాగించడం విమర్శలకు దారి తీస్తోంది. గత ఏడాది ఆరు నెలల కాలంలో 55.60 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు విడుదల చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ 98.70 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం పట్టిసీమ వద్ద నీటిమట్టం 14.2 మీటర్లు ఉంది. 14 మీటర్ల వరకే పట్టిసీమకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొద్ది రోజులుగా నీటిమట్టంలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. దీంతో కొన్ని మోటార్లను తగ్గించడం, పెంచడం ద్వారా నీటిని నిరాటంకంగా పట్టిసీమ ద్వారా విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే నీటి మట్టం తగ్గిపోయినప్పటికీ ఈ నెల 16న ఎమ్మెల్యేల పర్యటన ఉండటంతో వారికి చూపించడం కోసం 16 వరకూ నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత దశలవారీగా పట్టిసీమను నిలుపుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది వరదనీటి ప్రవాహం గోదావరిలో 17 టీఎంసీలు మాత్రమే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 50 టీఎంసీల వరకూ సీలేరు జలాలను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం నీటిమట్టం పడిపోతుండటంతో రబీకి ఈసారి సమస్యలు తప్పవనే అందోళన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం 12 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉండటంతో ఏడు వేలు పట్టిసీమకు, మూడువేలు డెల్టాకు ఇచ్చి రెండువేల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. వస్తున్న నీటిని డెల్టాకు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ మిగులు జలాలు ఉన్నట్లు చూపించడం కోసం ప్రతిరోజూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు సమాచారం. -
'మరో ప్రాజెక్టు కడితే గోదావరి డెల్టా ఎడారే'
కాకినాడ: గోదావరి డెల్టాను ఎడారి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పట్టిసీమ మాదిరిగానే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని విమర్శించారు. బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన కురసాల.. ఇప్పటికే పట్టిసీమ వల్ల గోదావరి డెల్టా అన్యాయమయ్యే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇక గోదావరి నదిపై మరో ప్రాజెక్టు కడితే డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్న టీడీపీ మళ్లీ ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి డెల్టాను ఎడారిగా చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుందని కురసాల కన్నబాబు అన్నారు. -
పశ్చిమ డెల్టాకి నీటి విడుదల కుదింపు
కొవ్వూరు :జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలో ఉన్న పశ్చిమ డెల్టా కాలువకి ఆదివారం నీటి విడుదల వెయ్యి క్యూసెక్కులు తగ్గించారు. శనివారం 6,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టిన అధికారులు ఆదివారం సాయంత్రం నుంచి 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఏలూరు కాలువకి 1,133 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,826, నరసాపురం(కాకరపర్రు) 1,983, జీఅండ్‌వీ(గోస్తనీ) 636, అత్తిలి(గొడిచర్ల)కాలువకి 677 క్యూసెక్కుల చొప్పున నీటిని విడిచి పెడుతున్నట్టు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. సముద్రంలో 1.72 లక్షల క్యూసెక్కులు గోదావరి నుంచి 1,72,420 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 10.70 అడుగులుగా నమోదైంది. ధవళేశ్వరం, మద్దురూ ఆర్మ్‌లలో గేట్లను 0.40, విజ్జేశ్వరం, ర్యాలీ ఆర్మ్ గేట్లను 0.30 మీటర్లు ఎత్తులేపి వరదనీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. -
గోదావరి డెల్టాలో రబీ ప్రశ్నార్థకమే!
- రీడిజైన్ పేరుతో గోదావరిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ - రోజుకు సగటున 68,132 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ప్రణాళిక - డెల్టాలో ఖరీఫ్ చివరి దశలో నీటికి కటకటే.. ఇక రబీ సాగు ప్రశ్నార్థకమే సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైన్ పూర్తయితే.. డెల్టాలో రబీ సాగు ప్రశ్నార్థకమవుతుందని సాగునీటి నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. రబీ పంట వరి సాగు చేయకపోతే భూగర్భ జలమట్టం తగ్గుతుందని.. ఉప్పు నీళ్లు పైకి ఉబికి రావడం వల్ల డెల్టా మొత్తం ఉప్పునీటి కయ్యలుగా రూపాంతరం చెంది, బంజరుగా మారడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నా సీఎం చంద్రబాబునాయుడు నోరుమెదపడం లేదు. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడుతున్నారు. - మహారాష్ట్రలో గోదావరి పురుడు పోసుకునే నాసిక్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ నిర్మించిన 18 ప్రాజెక్టులు నిండాలంటే 174 టీఎంసీలు అవసరం. తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లిలు నిండాలంటే మరో 110 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్లు నిండాలంటే 35 టీఎంసీల నీళ్లు అవసరం. - తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్ల నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజుకు 33,600 క్యూసెక్కులు, ఆ తర్వాత దేవాదుల ద్వారా 11,200 క్యూసెక్కులు, తుపాకులగూడెం ద్వారా 18,666 క్యూసెక్కులు, సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా 4,666 క్యూసెక్కులు వెరసి 68,132 క్యూసెక్కుల నీటిని తెలంగాణ వాడుకోనుంది. - గోదావరి నది పరీవాహక ప్రాంతంలో జూన్‌లో కురిసిన వర్షాలకు ప్రస్తుతం వరద నీళ్లు రాష్ట్రానికి చేరుతున్నాయి. కానీ.. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే వరద నీళ్లు రాష్ట్రానికి చేరడం కనీసం నెల ఆలస్యమవుతుంది. గోదావరి డెల్టాలో జూన్ నుంచి నవంబర్ 15 వరకూ ఖరీఫ్, డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ వరకూ రబీ పంటలను సాగు చేస్తారు. - జూన్ నుంచి అక్టోబరు వరకూ సగటున 60 రోజులపాటూ గోదావరికి భారీ ఎత్తున వరద వస్తుంది. అక్టోబరు తర్వాత ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల ద్వారా గోదావరిలోకి వచ్చే నీళ్లే డెల్టాకు ఆధారం. 2015, అక్టోబరు నుంచి 2016, ఏప్రిల్ వరకూ సీలేరు, బలిమెల రిజర్వాయర్లలో జల విద్యుదుత్పత్తి చేసి విడుదల చేసిన వాటితో కలిపి ధవళేశ్వరం బ్యారేజీకి సగటున ఏడు వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం రాలేదు. - ఒక్క గోదావరి డెల్టాకే రబీలో కనీసం 16 వేల క్యూసెక్కుల నీళ్లు అవసరం. పుష్కర, చాగల్నాడు, వెంకటనగరం, తాడిపూడి, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు మరో 20 వేల క్యూసెక్కులు అవసరం. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. అక్టోబరు తర్వాత గోదావరి నుంచి చుక్క నీరు కూడా రాష్ట్రానికి చేరదు. అప్పుడు శబరి, సీలేరుల నీళ్లే ఆధారం. సీలేరు, శబరిల ద్వారా ఏడు వేల క్యూసెక్కులకు మించి లభించవు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే డెల్టాలో రబీ సాగు అసాధ్యమని సాగునీటి నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. - 194.6 టీఎంసీల నిల్వ.. 301 టీఎంసీలు వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తే ఇబ్బందులను అధిగమించవచ్చు. కానీ.. చంద్రబాబు కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టి పోలవరం ప్రాజెక్టును నీరుగార్చారు. ఇప్పుడు తెలంగాణ అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా నోరుమెదపడం లేదు. - జూన్ 1, 2015 నుంచి నవంబర్ 30, 2015 వరకూ ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా 1609 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు. పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే.. ఇందులో కనీసం 301 టీఎంసీలను వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రజల తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండేవి కాదు. -
పాలకంకులకు.. చాలని నీళ్లు
గోదావరి డెల్టాలో రబీ వరిచేలు కంకులు వేసి, పాలుపోసుకుంటున్నాయి. సాధారణంగా ఈ దశలోనే చేలకు నీటి అవసరం ఎక్కువ. తదనుగుణంగా పంట కాలువలకు విడుదల చేసే నీటి పరిమాణాన్నీ పెంచాలి. అయితే ఇరిగేషన్ అధికారులు చాలీచాలని పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తూ, తమవల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. దీంతో పైర్లకు తడి పెట్టేందుకు రైతులు నానా పాట్టూ పడుతున్నారు. అమలాపురం : డెల్టాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. సాగు ఆరంభం నుంచి కాలువల ద్వారా చాలీచాలకుండానే నీరు సరఫరా చేస్తున్నా రైతులు నానా తంటాలు పడుతూనే పంటను కాపాడుకుంటూ కంకులు పాలు పోసుకునే దశకు తెచ్చారు. ఏదేమైనా తూర్పు, మధ్య డెల్టాల్లో శివార్లలో, మెరకల్లో నీరందక సుమారు లక్ష ఎకరాల్లో పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకూ చేసిన కృషి ఒకఎత్తు అయితే.. ఈ దశలో చాలినంత తడిని అందించి కంకులు పాలు పోసుకుని, గట్టిపడేలా చేయడం మరొక ఎత్తు. అయితే ఈ కీలక తరుణంలోనూ అధికారులు నీటి విడుదల పరిమాణాన్ని స్వల్పంగా పెంచి చేతులు దులుపుకోన్నారు. వారం రోజుల క్రితం మూడు డెల్టాలకు కలిపి 6,700 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, ప్రస్తుతం తూర్పు డెల్టాకు రెండు వేలు, మధ్యడెల్టా 1,420, పశ్చిమ డెల్టాకు 3,830 క్యూసెక్కుల చొప్పున రెండు జిల్లాలోని డెల్టా కాలువలకు 7,250 క్యూసెక్కుల నీరు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇది కాక మన జిల్లాలో పంపింగ్ ద్వారా మరో 30 క్యూసెక్కుల నీరు చేలకు చేరుతోంది. గతంలో 130 డ్యూటీ (ఒక క్యూసెక్కు 130 ఎకరాల చొప్పున) ఇవ్వగా, ఇప్పుడు దీనిని 120 చేశారు. వాస్తవానికి ఈ సమయంలో కాలువలకు 90 డ్యూటీ చొప్పున సాగునీరు పంపిణీ చేయాల్సి ఉంది. కనీసం 100 డ్యూటీలో అయినా ఇస్తే రైతులకు కొంత ఊరటగా ఉండేది. అయితే నీరు అందుబాటులో లేదంటూ.. అధికారులు చేతులు ఎత్తివేశారు. 90 డ్యూటీలో నీరు అనుమానమే.. అధికారులు చెబుతున్న ఆయకట్టుకు తగ్గట్టు.. చేలు పాలుపోసుకునే దశలో మూడు డెల్టాలకు 90 డ్యూటీలో నీరు పంపిణీ చేయాలంటే 9,667 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలి. కనీసం 9 వేల క్యూసెక్కులు పంపిణీ చేసినా కొంత ఊరటగా ఉండేది. బలిమెల నుంచి డొంకరాయి జలాశయం ద్వారా అదనంగా వెరుు్య క్యూసెక్కుల నీరు తెప్పిస్తున్నా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి నిల్వ లేకపోవడం, గోదావరి సహజ జలాలు 750 క్యూసెక్కులు కూడా లేకపోవడం వల్ల కాలువలకు నీటి విడుదల పెంచలేకపోతున్నారు. ఇప్పటికే నీరందక శివారు, మెరక ప్రాంతాల్లోనే కాక పంట కాలువలు, చానళ్లను ఆనుకున్న ఎగువ ఆయకట్టులో సైతం మోటార్లతో నీరు తోడక తప్పని పరిస్థితి నెలకొంది. బలిమెల నీరు గోదావరికి చేరినా 90 డ్యూటీలో కాలువలకు నీటి విడుదల సాధ్యం కాకపోవచ్చు. ‘సాక్షి’ కథనంతో అదనపు నీరు డొంకరాయి జలాశయం పవర్ కెనాల్‌కు 4 వేల క్యూసెక్కులు, బైపాస్ పద్ధతిలో అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీరు గోదావరిలో చేరేలా విడుదల చేసేవారు. ఇక్కడ నీటి నిల్వలు తరిగిపోతున్నందున ముందుముందు నీటి ఇబ్బంది తప్పదని గత నెల 24న ‘జల సంక్షోభం’ అనే కథనం ద్వారా ‘సాక్షి’ హెచ్చరించింది. దీనితో కదలిక వచ్చిన అధికారులు బలిమెల రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని పవర్ జనరేషన్ ద్వారా వచ్చేలా ఒడిశా అధికారులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును మన రాష్ట్రంతోపాటు ఒడిశా ఉమ్మడిగా నిర్వహిస్తోంది. వేసవిలో విద్యుత్ వాడకాన్ని తగ్గించుకుంటామని, డెల్టాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న దృష్ట్యా బలిమెల నుంచి వెయ్యి క్యూసెక్కులు పవర్ జనరేషన్ ద్వారా తెప్పించేందుకు అక్కడి అధికారులను ఒప్పించారు. ఇలా అదనంగా నీరు వస్తున్నందున డొంకరాయి జలాశయం నుంచి రెండు వేల క్యూసెక్కుల నీటిని బైపాస్ పద్ధతిలో అధికారులు డెల్టాకు ఇవ్వగలుగుతున్నారు. -
క్యాష్ బండ్లు..!
డెల్టాలో రబీని గట్టెక్కించడానికి అడ్డుకట్టలు రూ.5.51 కోట్లతో 560 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదన సొమ్ము చేసుకునేందుకు నీటి సంఘాల ప్రతినిధి పథకం తన సామాజికవర్గం కాంట్రాక్టర్ బినామీగా పనులు తాడోపేడో తేల్చుకుంటామంటున్న మిగిలిన ప్రతినిధులు అమలాపురం : నీటి సంఘాల ఏలుబడి మొదలైందో, లేదో.. రైతుల పేరు చెప్పి దోపిడీకి రంగం సిద్ధమైంది. జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో రబీకి నీటి ఎద్దడి ఏర్పడడం వల్ల పంట పండుతుందో లేదో అన్న భయం రైతులను వెన్నాడుతుండగా.. తమకు మాత్రం కాసుల పంట పండుతుందని నీటి సంఘాల ప్రతినిధుల్లో కొందరు ఆశలు పెట్టుకున్నారు. అయితే సంఘాల్లో కీలక ప్రతినిధి వారి ఆశలపై నీళ్లు జల్లారు. నీటి ఎద్దడి నివారణకు అడ్డుకట్ట( క్రాస్‌బండ్)ల ఏర్పాటును గోదావరి డెల్టావ్యాప్తంగా ఒకే కాంట్రాక్టరుకు అప్పగించడం ద్వారా భారీగా సొమ్ములు వెనకేసుకునేందుకు సమాయత్తమయ్యూరు. మురుగునీటి క్రాస్బండ్ల నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోవద్దని, మొత్తం క్రాస్బండ్లన్నీ తానే వేస్తానని తేల్చిచెప్పేశారు. తన సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్‌ను బినామీగా పెట్టుకుని పనులు చేసుకుంటున్నారు. తూర్పు, మధ్య డెల్టాల్లో చిన్నా, పెద్దా కలిపి 560 వరకు క్రాస్బండ్లు వేయాల్సి ఉంది. ఇందుకు రూ.5.51 కోట్ల మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ పంపించింది. వాటికి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (క్యాడ్) అనుమతి లభించగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఎద్దడి నేపథ్యంలో అత్యవసరంగా నిర్మించాలని ఇప్పటికే పనులు ఆరంభించి 156 వరకు క్రాస్బండ్లు వేశారు. చిన్న క్రాస్బండ్ల వ్యయం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండగా, పెద్ద క్రాస్బండ్లకు రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు ఖర్చవుతోందని అంచనా. ఈ పనులన్నీ ఒకే కాంట్రాక్టరుకు అప్పగించడంపై ఆయా ప్రాంతాల్లోని డీసీలు, నీటి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. సంఘాలకు ఎంపికైనా ఏమి లాభం? గత నీటి సంఘాల హయాంలో టీడీపీ ఏలుబడిలో ప్రాజెక్టు కమిటీ, మెజారిటీ డీసీలు ఉండేవి. కాంగ్రెస్‌కు చెందిన డీసీలు, నీటి సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కూడా ఇటువంటి పనులు, నీటితీరువాతో చేపట్టే పనులు వారికే వదిలేశారు. ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ రైతు సభల ద్వారా సంఘాల ఎంపిక పేరుతో మొత్తం అన్నీ తమ పార్టీకి దక్కేలా చేసింది. అయినా పనులు దక్కకపోవడం చూసి డీసీల ప్రతినిధులు లబోదిబోమంటున్నారు. గత ఎన్నికల సమయంలో తాము కూడా ఎమ్మెల్యేలకు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల చొప్పున ఇచ్చి పదవులు తెచ్చుకున్నామని, కనీసం చిన్నచిన్న పనులు కూడా ఇవ్వకపోతే ఎలా అని డీసీలు, నీటి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. డీసీ ప్రతినిధుల్లో కొందరు ఈ విషయాన్ని తమ ఎమ్మెల్యేల దృష్టి తీసుకు వెళ్లారు. త్వరలో దీనిపై పంచాయతీ పెట్టి తాడోపేడో తేల్చుకుంటామని నీటి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. -
'గోదావరి డెల్టా ఎండిపోవడానికి చంద్రబాబే కారణం'
ఏలూరు : గోదావరి డెల్టా ఎండిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని గ్రామాల్లోని పొలాలను వారిద్దరు పరిశీలించారు. అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు, మేకా శేషుబాబు మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలు ఎండిపోతాయన్న తాము ఆనాడు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యం కారణంగానే గోదావరి జిల్లాల్లో సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రేపు పాలకొల్లులో రైతు గర్జన నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. -
60 వేల ఎకరాలకు నీరు కట్
అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ సాగు ప్రారంభమయ్యూక జిల్లా యంత్రాంగం విపరీత నిర్ణయం తీసుకుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున డెల్టాలో మెరక ప్రాంతాలకు నీరివ్వలేమని, డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూర్తి చేసిన చేలకు మాత్రమే నీరివ్వాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయశాఖాధికారులు కాకినాడలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. తద్వారా మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలన్న జిల్లా సాగునీటి పారుదల శాఖ సలహా మండలి (ఐఏబీ) నిర్ణయాన్ని ధిక్కరించారు. ముందు నీరిస్తామనడంతో సాగు సన్నాహాల్లో నిమగ్నమైన ఆయూ ఆయకట్ల అన్నదాతల్లో అనేకులు.. ఇప్పుడు కోత పెట్టాలనుకోవడంతో హతాశులవుతున్నారు. డెల్టాలో పూర్తి ఆయకట్టులో సాగుకు 12 టీఎంసీల నీటి కొరత ఉందని అధికారులకు ముందే తెలుసు. ఇదే విషయాన్ని ఐఏబీ సమావేశానికి ముందే ‘ఆయకట్టు అంతటికీ నీరు కత్తిమీద సామే’ ‘సీలేరుపైనే ఆధారం’ కథనాలతో ‘సాక్షి’ ఎత్తి చూపింది. జిల్లా ప్రజాప్రతినిధులు ఈ లెక్కలతో సంబంధం లేదని, మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల కోసం ఏదైనా చేస్తాం, ఎంతైనా ఖర్చుపెడతాం. అవసరమైతే ఒడిశాకు విద్యుత్ ఇచ్చి జోలాపుట్ రిజర్వాయర్ నుంచి కావాల్సిన 12 టీఎంసీలను తెప్పించగలరు’ అని అధికారపార్టీ ఎమ్మెల్యేలు ధీమాగా చెప్పారు. ఇప్పుడు జోలాపుట్ నుంచి నీరు రాదని తేలిపోయింది. వేసవిలో విద్యుత్ కొరత దృష్ట్యా సీలేరు నుంచి వచ్చే నీటినే పూర్తిస్థాయిలో ఇవ్వలేమని జెన్కో అధికారులు తేల్చేశారు. మరోవైపు గోదావరికి సహజ జలాలు తగ్గాయి. డెల్టాలో అన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లే ఆరంభం కాకపోయినా.. సీలేరు నుంచి బైపాస్ పద్ధతిలో రోజుకు 1,500 క్యూసెక్కుల నీటిని సేకరించాల్సి వస్తోంది. ఇంత చేసినా శివార్లకు నీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ స్థితిలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 16 వేలు, తూర్పుడెల్టాలో 27 వేలు, మధ్యడెల్టాలో 17 వేల ఎకరాల్లో రబీ సాగుకు కోత పెట్టాని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయించారు. కొందరికిచ్చి.. కొందరికి ఎగనామమా! రబీలో మొత్తం ఆయకట్టుకు నీరిస్తామని, మధ్యలో కొరత అంటూ అన్ని ప్రాంతాల్లో మెరక, శివారు ఆయకట్లకు ఇవ్వలేమనడంపై రైతులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడా సాగు ఆరంభమైంది. ఒకే కాలువ మీద కొందరికి నీరిచ్చి, మిగిలిన వారికి ఇవ్వకుంటే అన్యాయమంటున్నారు. చాలా మంది డిసెంబరు 20 తరువాత కూడా నారుమళ్లు వేయగా జనవరి పది తరువాత కూడా నాట్లు పడే అవకాశముంది. అధికారులు డిసెంబరు 31 నాటికి నాట్లు పడ్డ చేలకు మాత్రమే నీరిస్తామనడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మౌనమేల వర్మ గారూ! ‘గోదావరికి, ఏలేరుకు నీటి కొరత వచ్చినప్పుడల్లా పిఠాపురం నియోజకవర్గ ఆయకట్టుకు కోతపెడుతున్నారు. మీరు ఎలా తెస్తారో అనవసరం మా పీబీసీ ఆయకట్టుకంతా నీరివ్వాల్సిందే’ అని ఐఏబీలో పట్టుబట్టిన ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ సమక్షంలోనే ఇప్పుడు పీబీసీలో 16 వేల ఎకరాల ఆయకట్టుకు జిల్లాయంత్రాంగం కోతపెట్టింది. అయినా ఆయన మౌనం వహించడం పట్ల రైతులు భగ్గుమంటున్నారు. -
గడువు పెంపు!
అమలాపురం :గోదావరి డెల్టా పంట కాలువల మూసివేత గడువు పెంచనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 31 నుంచి కాలువలు మూసివేయాల్సి ఉంది. కానీ డెల్టాలో రబీ సాగు ఆలస్యం అవుతున్నందున ఏప్రిల్ 10 వరకూ సాగునీరు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఈమేరకు గడువు పెంచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని తూర్పు, మధ్యడెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ) పరిధిలోని సుమారు 3.30 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోంది. గోదావరిలో నీటి ఎద్దడి ఉన్నందున డిసెంబరు 31 నాటికి నాట్లు పూర్తి చేయాలని, మార్చి 31 నాటికి కాలువలు మూసివేస్తామని అధికారులు తొలి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇలా చేస్తేనే డెల్టా ఆధునికీకరణ పనులు ఎంతోకొంత పూర్తవుతాయని వారంటున్నారు. రబీ సాగుకు ముందు కాకినాడలో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు తగినట్టుగా ఈ నెల 31 నాటికి కాలువలు మూసివేయాలని ఇటీవల కాకినాడలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఇరిగేషన్ శాఖ సమావేశంలో నిర్ణయించారు. అయితే డెల్టాలో ఫిబ్రవరి మొదటివారంలో కూడా నాట్లు పడినందున కాలువలకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకూ సాగునీరు ఇవ్వాల్సి వస్తుందని వివరిస్తూ ‘అసాధ్యమని తెలిసి కూడా అదేపాట’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఏప్రిల్ 10 వరకూ - మిగతా 2లోఠ డెల్టా కాలువలకు నీరు ఇవ్వక తప్పదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సీలేరు పవర్ జనరేషన్ ద్వారా వస్తున్న నీటినే కాకుండా బైపాస్ పద్ధతిలో మరో 15 రోజుల పాటు అదనపు నీటిని రప్పించాలని శుక్రవారం నిర్ణయించారు. అంటే ఈ నెల 28 వరకూ బైపాస్ పద్ధతిలో నీరందుతుందన్నమాట. సీలేరు నుంచి వదిలే నీరు ధవళేశ్వరం బ్యారేజికి చేరేసరికి వారం రోజులు పడుతోంది. అంటే బైపాస్ పద్ధతిలో ఏప్రిల్ 5 వరకూ బ్యారేజికి నీరు వస్తుంది. కోతలకు వారం రోజుల ముందు నుంచి పొలానికి నీరు పెట్టకుండా ఆరబెట్టే అకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 10 వరకూ సాగునీరు పంపిణీ చేయాలని, తద్వారా రబీ సాగుకు పూర్తిగా నీరందించినట్టవుతుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. త్వరలో కలెక్టర్, ప్రజాప్రతినిధులకు ఈ విషయం తెలిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగానే మార్చి 31 నాటికి కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. అయితే బడ్జెట్లో ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల్లో నిరుత్సాహం చోటుచేసుకుంది. ఈ నిధులతో కాలువలపై చిన్నచిన్న మరమ్మతులు మినహా భారీ పనులు చేసే అవకాశం లేదు. నిధులు తక్కువగా కేటాయించడం కూడా కాలువల మూసివేత గడువు పెంచడానికి కారణమైంది. -
‘ఎత్తిపోతల’కు వ్యతిరేకంగా పోరుబాట
14న పోలవరం, పట్టిసీమల వద్ద భారీ హోమం అవసరమైతే దీర్ఘకాల కార్యాచరణకు సన్నద్ధం ముఖ్యనేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నిర్ణయం కాకినాడ : గోదావరి డెల్టా రైతులకు అపారనష్టాన్ని కలిగించేలా పట్టిసీమ వద్ద ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమబాట పట్టనుంది. ఉభయగోదావరి జిల్లాల రైతాంగాన్ని భాగస్వాముల్ని చేస్తూ పోలవరం సాధనే లక్ష్యంగా కార్యాచరణకు సమాయత్తమవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన గురువారం సాయంత్రం కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంలో ముఖ్యనేతలంతా సమావేశమయ్యూరు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేలా స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 14న ఉదయం పోలవరంపై ప్రభుత్వాలకు సద్భుద్ధి ప్రసాదించి రైతులకు మంచి జరగాలని కాంక్షిస్తూ పోలవరం వద్ద భారీ హోమం చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పట్టిసీమకు పాదయాత్ర చేసి అక్కడ కూడా హోమం చేయనున్నారు. అనంతరం జరిగే సభలో రైతులు, ప్రజలు, పార్టీ నేతల సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుకు అక్కడే కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కేవలం స్వల్పకాలిక ఆందోళనలే కాక దీర్ఘకాల కార్యాచరణ చేపట్టాలన్న ప్రతిపాదనపై కూడా నేతలు చర్చించారు. అంకితభావం గల కార్యకర్తలకు జిల్లా కమిటీలో అవకాశం కాగా పార్టీ జిల్లా కమిటీ నియామకంపై చర్చించిన నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను గుర్తించి జిల్లా కమిటీలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరి ఆమోదంతో జిల్లా కార్యవర్గాన్ని రూపొందించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో త్వరలోనే ప్రకటించాలని నిర్ణయించారు. మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, చెల్లుబోయిన వేణు, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, పెట్టా శ్రీనివాస్, సిరిపురపు శ్రీనివాసరావు, అప్పన్నదొర, మార్గాని గంగాధర్, మట్టపర్తి మురళీకృష్ణ, సీహెచ్ రామకృష్ణ, ఎస్.నూకరాజు, అబ్దుల్‌బషీరుద్దీన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, సుదర్శన్‌బాబు, జి.వి.రమణ, రావు చిన్నారావు, వట్టికూటి రాజశేఖరం, నక్కా రాజబాబు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వసూళ్లు వారెవ్వ..పనులు హవ్వ
అమలాపురం :రైతుల ముక్కుపిండి మరీ నీటి తీరువా వసూలుచేస్తున్న ప్రభుత్వం ఆ నిధులను అన్నదాతల ప్రయోజనాల కోసం ఖర్చుచేయడం లేదు. ప్రతిఏటా ప్రతీ ఏటా ఖర్చు చేయాల్సిన నీటి తీరువా నిధుల్లో సగానికి పైగా కోతపెడుతోంది. రైతుల నోట మన్నుకొడుతోంది. ప్రస్తుతం డెల్టా, మెట్ట ప్రాంతాల్లో పంట కాలువలు, మురుగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయంటే అందుకు నీటి తీరువా నిధులు ఖర్చు చేయకపోవడమే ప్రధాన కారణమనే విమరశలు వినవస్తున్నాయి.జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో సుమారు 4,82,199 ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పుడెల్టాలో 2,45,333 ఎకరాలు, మధ్యడెల్టాలో 2,01,896 ఎకరాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)లో 35,970 ఆయకట్టు ఉంది. వీటిలో సుమారు 50 వేల ఎకరాలు చెరువులుగా, రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోయాయి. ఖరీఫ్‌లో వరిచేలు, ఇతర పంటలకు నీటితీరువా రూ.150 కాగా, రబీలో రూ.200 వరకు వసూలు చేస్తారు. అదే చేపల చెరువుకు అయితే రూ.500 నీటి తీరువా రూపంలో వసూలు చేస్తారు. ఇలా గోదావరి డెల్టాలోనే సుమారు రూ.15 కోట్ల వరకు నీటితీరువా వసూలు అవుతోంది. ఇక ఏలేరు పరిధిలో 53,017 ఆయకట్టు ఉండగా ఇక్కడ రెండు పంటలు సాగు చేసేది తక్కువ ఆయకట్టు పరిధిలోనే. అలాగే చాగల్నాడు, ఏజెన్సీలోని ఇతర ప్రాజెక్టుల పరిధిలో ఒక పంటకు నీటి తీరువా వసూలు చేస్తారు. ఇలా మొత్తం మీద జిల్లాలో సుమారు రూ.18 కోట్ల మేర తీరువా వసూలు అవుతోంది. కొంతమంది రైతులు ఒక ఏడాది చెల్లించకున్నా తరువాత ఏడాది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోంది. రెవెన్యూ అధికారులు స్పెషల్ డ్రైవ్ పెట్టి మరీ వసూలు చేస్తుంటారు. 2011లో కోనసీమ రైతులు సుమారు 90 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయలేదు. అయినా రెవెన్యూ అధికారులు నీటితీరువా వసూలు చేశారు. ఏ ప్రాజెక్టు పరిధిలో వసూలైన నీటి తీరువాను అక్కడే రైతుప్రయోజన పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. వసూలైన నీటి తీరువాను నీటి సంఘాలకు 55 శాతం, డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు 20 శాతం, ప్రాజెక్టులకు 20 శాతం, పంచాయతీలకు ఐదు శాతం చొప్పున పంపిణీ చేయాలి. గతంలో వసూలైన నీటి తీరువాను ఆయా సంఘాలకు చెక్కుల రూపంలో అందించేవారు. ఈ నిధులతో పంట కాలువల్లో పూడిక తొలగింపు, లాకులు, లాకుల షటర్లు వంటి ఆధునికీకరణ పనులు చేసేవారు. ఈ కారణంగా శివారు భూములకు సాగునీటి ఇబ్బందులు పెద్దగా ఉండేవి కావు. మైనర్, మీడియం మురుగునీటి కాలువల్లో పూడిక, గుర్రుపుడెక్క తొలగింపు పనుల వల్ల ముంపు తీవ్రత పెద్దగా ఉండేది కాదు. నిధులతో చేపట్టాల్సిన పనులను ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ స్థాయి అధికారి అనుమతి సరిపోయేది. అయితే నిధులు నేరుగా కేటాయించడం వల్ల అవినీతి జరుగుతుందని, నిధులను ట్రెజరీల ద్వారా చెల్లించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎస్ఈ స్థాయి అధికారి కాకుండా ఇరిగేషన్ కమాండ్ ఏరియా డవలప్మెంట్ అథారిటీ (కడా), ఇరిగేషన్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అనుమతులు తప్పని సరి చేసింది. దీని వల్ల పనులకు అనుమతి రావడం తీవ్ర ఆలస్యం కావడం, చేసిన పనులకు నిధులు రాకపోవడం ఆరంభమైంది. దీనితో ఏటా రూ.ఆరేడు కోట్ల నిధులు కూడా ఖర్చు కావడం లేదు. మిగిలిన నిధులను ప్రభుత్వం ఇతర పనులకు కేటాయించడం ఆరంభించింది. దీంతో గత నాలుగైదేళ్ల నుంచి ఏటా రూ.పది కోట్లకుపైగా నీటి తరువాత సొమ్ము ప్రభుత్వం జమ చేసుకుంటున్నట్టయింది. అలాగే ఆయా సంఘాలకు రూ.ఏడు కోట్లకుపైగా బకాయి సొమ్ములు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం నీటి సంఘాలు ఏలుబడిలో లేనప్పటికీ ప్రత్యేకాధిరుల వ్యవస్థ ఉన్నందున వాటి ఆధ్వర్యంలో పనులు చేయించే సౌలభ్యం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని పాత విధానంలో నిధులు మంజూరు చేయాలని, ఎస్ఈ స్థాయిలో పనులకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ కొంత కాలంగా వినిపిస్తోంది. గత జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు లేవనెత్తారు. నేరుగా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అదే జరిగితే నీటి తీరువా నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసుకునే అవకాశముంటుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుత గోదావరి డెల్టాలో రబీ నీటి ఎద్దడి పొంచి ఉంది. పంట బోదెలు, చానళ్లు వంటివే కాకుండా ప్రధాన కాలువలూ పూడుకుపోవడంతో శివారుకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సేకరించేందుకు రూ.పది కోట్ల వరకు నిధులవసరమని అధికారులు తేల్చిచెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిధులను నీటి తీరువా నిధుల నుంచి కేటాయించే అవకాశముందని సమచారం. అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి నీటి తీరువా నిధులతో వచ్చే క్లోజర్లో కాలువలపై మరమ్మతు పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
వెలుగుల జలసిరి
తూర్పు కనుమల పేరు వినగానే గుర్తొచ్చేవి సహజసిద్ధమైన గెడ్డలు, ఉప్పొంగే జలాలు. అవి ప్రస్తుతం ఎందరికో వెలుగునిస్తున్నవి. మరెందరో రైతులకు అండగా నిలుస్తున్నాయి. కాకులుదూరని కారడవుల నుంచి గోదావరి తీరం వరకు కొండ అంచుల వెంబడి ఒంపు సొంపుల మార్గంలో వేల కిలోమీటర్లు సాగే ఈ ప్రవాహం పర్యాటకులను ఆకట్టుకుంటూనే.. మార్గమధ్యలో ఉన్న విద్యుత్ కేంద్రాలు అన్నింటా సాగి రాష్ట్రంలో వెలుగులు నింపుతోంది. ఉభయగోదావరి జిల్లాల రైతుల పంటలకు ఆసరాగా నిలుస్తోంది. గోదావరికి డెల్టాకు ఇలా... ఏటా సీలేరు నుంచి గోదావరి జిల్లాల్లో రబీ పంటకు 50 టీఎంసీల నీరు విడుదల చేస్తుంటారు. డొంకరాయి, మోతుగూడెంలలో విద్యుదుత్పత్తి అనంతరం నీటిని విడుదల చేస్తారు. డిసెంబరు 25 నుంచి ఆంధ్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రస్తుతం విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శబరిలో కలుస్తున్న నీరు నేరుగా గోదావరిలోకి చేరుతుంది. అదంతా మోతుగూడెం విద్యుత్ కేంద్రం నుంచి గోదావరిలోకి కలిసేటప్పటికి సుమారు 5 రోజులు పడుతుంది. ఇది కాక సరిహద్దులోని మాచ్‌ఖండ్ 6 యూనిట్లలో 120 మెగావాట్లు, అనంతరం సీలేరులో 4 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి అనంతరం ఈ ప్రవాహం 30కిలోమీటర్లు కెనాల్ ద్వారా డొంకరాయి డ్యాంకు చేరుకుంటుంది. అక్కడ ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్లు విద్యుదుత్పత్తి అవుతుంది. ఒక్కోసారి ఈ విద్యుత్ కేంద్రం మూతపడితే ఖమ్మం జిల్లా మోతుగూడెం విద్యుత్ కేంద్రానికి నీరు విడుదల చేస్తారు. -
కత్తిమీద సాము!
* నీరుగారుతున్న నీటి నిర్వహణ * సగానికి పైగా లష్కర్ పోస్టులు ఖాళీ * మనుగడలో లేని నీటిసంఘాలు * రబీ వంతుల సమయంలో ఇబ్బందులు * ఔట్‌సోర్సింగ్‌లోనైనా భర్తీ చేయకుంటే ఇక్కట్లే అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ షెడ్యూల్ డిసెంబర్ ఒకటిన ఆరంభమై మార్చి 31తో పూర్తి కావాలి. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల్లో మొత్తం ఆయకట్టు 8.89 లక్షల ఎకరాలు. దీనంతటికీ సాగునీరు సరఫరా చేయాలంటే 83 టీఎంసీల నీరు అవసరం. ధవళేశ్వరం బ్యారేజి వద్ద రబీ కాలంలో కేవలం 67 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంటుందని అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. మిగిలిన 16 టీఎంసీలను ప్రత్యామ్నాయ మార్గాల్లో సేకరించాలి. ఇందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతోపాటు, రైతులు కూడా సకాలంలో సాగు పూర్తి చేయాల్సి ఉంటుంది. డెల్టాలో ఖరీఫ్ సాగు జరిగిన తీరు చూస్తే మార్చి 31 నాటికి రబీ పూర్తి కావడం అసాధ్యం. ఇరిగేషన్ అధికారులు వీటన్నింటినీ పరిశీలించి తొలి రోజుల నుంచి నీటి పొదుపు చర్యలు చేపట్టాల్సి ఉంది. లాకులవారీగా వంతులవారీ విధానం అమలు చేయడం ద్వారా నీటి వృథాను కొంతవరకూ అరికట్టవచ్చని భావిస్తున్నారు. నిర్వీర్యమైన లష్కర్ వ్యవస్థ వంతులవారీ విధానం మంచిదే. కానీ లాకుల వద్ద నీటి యాజమాన్యం చేయడానికి అవసరమైన లష్కర్ వ్యవస్థ ఇరిగేషన్ శాఖలో నిర్వీర్యమైంది. గోదావరి డెల్టాల పరిధిలో ఉభ య గోదావరి జిల్లాల్లో 1760 మంది లష్కర్లు పని చేయాల్సి ఉండగా, కేవలం 850 మంది మాత్రమే ఉన్నారు. అమలాపురం ఇరిగేషన్ డివి జన్‌లో ఒకప్పుడు 185 మంది లష్కర్లు ఉండగా, ప్రస్తుతం 36మంది మాత్రమే ఉన్నారంటే పరి స్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీ అయిన లష్కర్ పోస్టుల భర్తీని 1986 నుంచి అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం నిలిపివేసింది. కొన్నాళ్లు కనీసం కారుణ్య నియామకాలైనా జరిగేవి. తరువాత వాటిని కూడా నిలిపివేశారు. ‘ఎవరైనా లష్కర్ రిటైరైనా, మృతి చెందినా ఆ స్థానం ఖాళీగా ఉండిపోతోంది. ఇదిలాగే కొనసాగితే 2020 నాటికి నీటిపారుదల శాఖలో ఐదు శాతం కూడా లష్కర్లు ఉండరు’ అని జిల్లా లష్కర్ల అసోసియేషన్ కార్యదర్శి ఎం.సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి యాజమాన్యంలో వారి పాత్రే కీలకం కాలువలపై నీటి యాజమాన్యం చేయడంలో లష్కర్ల పాత్ర అత్యంత కీలకం. పంటబోదెలు, చానళ్లవారీగా ఉన్న ఆయకట్టుకు ఎంత నీరివ్వాలి? ఏ సమయంలో ఎంత నీరు పెంచాలనేది అధికారుల సూచనలకు అనుగుణంగా వీరే చూస్తారు. డెరైక్ట్ పైప్(డీపీ)లు, చానల్స్ హెడ్ రెగ్యులేటర్లను ఎత్తడం, దించడం, లీకులు అరికట్టడం, లాకులవద్ద నీటిమట్టాలు పరిశీలించడం వంటి పనులు కూడా లష్కర్లే చేస్తారు. ప్రతి ప్రధాన లాకు వద్ద లాకు సూపరింటెండెంట్, నలుగురైదుగురు లష్కర్లు బాధ్యతలు నిర్వహించేవారు. ‘ఇప్పుడు కొన్ని ప్రధాన లాకుల వద్ద ఒక్క లష్కర్ కూడా లేడు. పక్క లాకు పరిధిలో ఉన్న ఒకరు లేదా ఇద్దరు లష్కర్లను ఇన్చార్జిగా వేస్తున్నారు. ఐదారుగురు చేసే పని ఒకరు చేయాల్సి వస్తోంది’ అని అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అర్జునుడు చెప్పారు. ఈ లోపాలవల్ల నీటి యాజమాన్య నిర్వహణ విఫలమవుతోంది. వచ్చే రబీలో ఆయకట్టు అవసరాలకు దృష్ట్యా సాగునీరు పంపిణీ చేయకుంటే రైతులు కొట్లాడుకునే ప్రమాదముంది. ఔట్సోర్సింగ్ నియామకాలు జరిగేనా? లాకులపై లష్కర్లు లేకుండా నీటి యాజమాన్యం చేయడం కష్టమని ఇటీవల కాకినాడలో జరిగిన ఐఏబీ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన గోదావరి డెల్టా సీఈ హరిబాబు.. ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. వాస్తవానికి లష్కర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలన్న ప్రతిపాదన రెండేళ్లుగా ప్రభుత్వం వద్ద ఉంది. కోర్టు తీర్పును అనుసరించి అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌కు అంగీకరించింది. అప్పటినుంచీ ఆర్థిక శాఖ అనుమతి రాక, ఇది ఆచరణకు నోచుకోలేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఔట్సోర్సింగ్ నియా మకాలు ఎలా సాధ్యమన్నది ప్రశ్న. రెండేళ్లుగా ఎన్నికలు జరగక నీటిసంఘాలు మనుగడలో లేవు. లష్కర్ వ్యవస్థ నిర్వీర్యమైనా, సంఘాలున్న సమయంలో రైతులకు నీటి ఇబ్బంది రాకుండా అధికారులతో కలిసి సమన్వయంతో పని చేసేవారు. ఎగువ ప్రాంతాల రైతులు అవసరం లేకుండా నీటి చౌర్యానికి పాల్పడితే సంఘాలు జోక్యం చేసుకుని దిగువ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడేవి. ఇప్పుడు వారు కూడా లేకపోవడంతో వచ్చే రబీలో నోరున్నవాడికే నీరు దక్కే అవకాశముంది. -
రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి
కాకినాడ: వచ్చే రబీ సీజన్ లో గోదావరి డెల్టా పరిధి కింద ఉన్న 8 లక్షల 96 వేల 533 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు తీర్మానించింది. రబీకి గోదావరి ద్వారా 65 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బోర్డు తెలిపింది. మరో 16 టీఎంసీల నీరు కొరత ఉన్న నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించింది. ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు రబీలో పూర్తిస్థాయిలో నీరు అందించాలని, విశాఖపట్నంకు తాగునీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. -
ముగిసిన ప్రహసనం
అమలాపురం :గోదావరి డెల్టా ప్రధాన పంట కాలువలకు అధికారులు అన్న సమయానికే నీరు విడుదల చేశారు. ఇక రైతులు ఖరీఫ్‌కు నారుమడులు వేయడమే ఆలస్యం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడున్న పంట, మురుగు కాలువల పరిస్థితి చూస్తుంటే ఒకవైపు పొలాలకు నీరు సక్రమంగా అందే అవకాశం లేకపోగా, మరోవైపు ముంపునీరు దిగే పరిస్థితి కనిపించడం లేదు. కోట్లాది రూపాయలతో చేపట్టిన ఆధునికీకరణ పనులు ఈ ఏడాది కూడా నామమాత్రంగానే జరగడంతో శివారు భూములకు సాగు, ముంపునీరు ఇక్కట్లు తప్పేటట్టు లేవు. జిల్లాలో గోదావరి డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు సుమారు రూ.1,160 కోట్లతో జరగాల్సి ఉంది. గడచిన ఆరేళ్లలో ఇంతవరకు రూ.250 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది రూ.150 కోట్లతో పనులు చేపడతామని ప్రకటించిన అధికారులు వాటిని కేవలం రూ.50 కోట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీనిలో మురుగునీటి కాలువలకు రూ.30 కోట్లు, తూర్పు, మధ్యడెల్టాల్లో పంట కాలువలకు రూ.పది కోట్ల చొప్పున పనులు చేశారు. డ్రైన్లలో పూడికతీత పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కాలువలపై చేపట్టిన కొద్దిపాటి పనులు కూడా ఇంకా పూర్తికాకున్నా క్లోజర్ సమయం పూర్తయ్యిందని చెప్పి అధికారులు నీరు విడుదల చేసేశారు. ఉపాధి పనులే దిక్కు గోదావరి డెల్టాలో ప్రధాన పంట కాలువలు, చానల్స్, పంటె బోదెలు పూడుకుపోయి శివారుకు సాగునీరందని పరిస్థితి ఉంది. చాలాచోట్ల కాలువలు మట్టితో పూడుకుపోయాయి. వీటిలో పూడిక తొలగించలేదు. 2009లోనే ఈ పనులు పూర్తి చేసినందున కొత్తగా చేపట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో పూడికతీత పనుల్లో చోటు చేసుకున్న అవినీతి పుణ్యమాని రెండేళ్లకే కాలువలు పూర్వపు స్థితికి చేరుకున్నాయి. కేవలం ఉపాధి నిధులతోనే అక్కడక్కడా చేపడుతున్న నామమాత్ర పనులే దిక్కయ్యాయి. ఇప్పుడు చేస్తున్న ఆధునికీకరణ పనులు కూడా డీపీ (డెరైక్టు పైప్)లు, కల్వర్టులు వంటి చిన్నచిన్న నిర్మాణాలే. ఈ నిర్మాణాల వల్ల నీటిఎద్దడి తీరే అవకాశం లేదు. చేసింది స్వల్పమే డెల్టా ఆధునికీకరణ పనులను తొమ్మిది ప్యాకేజీలుగా విభజిస్తే ఇప్పటి వరకు కేవలం ఐదు ప్యాకేజీల్లో పనులకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. మిగిలిన పనులను 16 చిన్న ప్యాకేజీలుగా చేయగా రెండు పనులకు మాత్రమే టెండర్లు పడ్డాయి. సుమారు రూ.650 కోట్ల పనులకు టెండర్లు ఖరారు కాగా, రూ.250 కోట్ల పనులు కూడా పూర్తి కాలేదు. ఈ ఏడాది తొలుత రూ.150 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపడతామన్న అధికారులు ఆ పనులను కేవలం రూ.50 కోట్లకే పరిమితం చేశారు. చిత్తశుద్ధి లేకనే ఇరిగేషన్ అధికారులకు చిత్తశుద్ధి లేకనే ఆధునికీకరణ పనులు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రబీకి క్రాప్ హాలీడే ప్రకటించి లాంగ్ క్లోజర్ ఇస్తే (ఆరు నెలలు) ఆధునికీకరణ పనులు చేయడానికి వీలవుతుందని ప్రతిఏటా అధికారులు వాదిస్తూ వస్తున్నారు. అయితే డెల్టా ఆధునికీకరణ పనుల నుంచి లాకులు, వంతెనల నిర్మాణం వంటి పనులు మినహాయించారు. నిర్మాణానికి సంబంధించి డీపీలు, రిటైనింగ్ వాల్స్ వంటి పనులు మాత్రమే ఉన్నాయి. ఆ పనులకు లాంగ్‌క్లోజర్ ప్రకటించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ‘కాలువలపై చేపట్టే నిర్మాణాలు ఎఫ్ఎస్ఎల్ (ఫుల్ సప్లయి లెవెల్) వరకు కట్టుకుంటే తరువాత సాగునీరు విడుదల చేసినా వాటిపై పనులు పూర్తి చేసే అవకాశముంది’అని రిటైర్డ్ ఈఈ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. ఇందుకు షార్ట్క్లోజర్ 45 రోజుల సమయం ఎక్కువేనని ఆయన చెబుతున్నారు. కోనసీమ తీర ప్రాంత మండలాల్లో నిత్యం నీరు పారాలి.. లేకుంటే అవి చౌడుబారిపోతాయి. ఇటువంటి చోట్ల లాంగ్‌క్లోజర్ ప్రకటించే అవకాశం కూడా లేదనే విషయాన్ని అధికారులు గుర్తించి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కాంక్రీట్ నిర్మాణ పనుల్లో పెద్దగా మిగిలే అవకాశం లేనందున ఈ పనులను అటు కాంట్రాక్టర్లు, ఇటు ఇరిగేషన్ అధికారులు పక్కనబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పెట్టుబడి అదనం...రైతులపై భారం
అమలాపురం, న్యూస్‌లైన్ : రబీ వరిసాగుకు పెడుతున్న పెట్టుబడి అంచనాలకుమించి పెరుగుతోంది. మోటార్లతో నీటి తోడకం.. ఎలుకలు నివారణ.. పురుగు మందుల వాడకం.. ఆపై కూలి ఖర్చులు... ఇలా చెప్పుకుంటూ పోతే రబీ సాగు ఆరంభం నుంచి రైతులు వేల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. గోదావరి డెల్టా రబీ కీలక దశకు చేరుకుంది. తూర్పు డెల్టాలో పదిపదిహేను రోజుల్లో కోతలు ఆరంభమయ్యే అవకాశముంది. ఇదే డెల్టాలో శివారుల్లోను, మధ్యడెల్టాలోని అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు పాలుపోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. ఈ సమయంలో రైతులు పొలాల్లో ఎక్కువగా నీరు పెడుతుంటారు. పంట కాలువల నిండుగా నీరున్నా పంటబోదెలు, చానల్స్ శివారు పొలాలకు చేరడం లేదు. ఇన్‌ఫ్లోలు ఆశాజనకంగా ఉండడంతో అధికారులు నీటి విడుదలను పెంచారు. ప్రస్తుతం రెండు డెల్టాల్లో 100 డ్యూటీ (ఒక క్యూసెక్కు 100 ఎకరాల) చొప్పున పంపిణీ చేస్తున్నారు. అయితే ఎండల వండ డిమాండ్ పెరగడం పెంచిన నీరు సరిపోవడం లేదు. దీనితో రైతులు మోటార్లతో నీరు తోడాల్సి వస్తుంది. మొదట్లో ప్రతీ 15 రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోయేది. అయితే ఎండలు పెరగడంతో వారం, పది రోజులకు ఒకసారి సాగునీరు పెట్టాల్సి ఉంది. ‘ఎకరాకు నీరు పెట్టాలంటే మూడు గంటల సమయం పడుతుంది. గంటకు రెండు లీటర్లు చొప్పున ఆరు లీటర్లు, మెటార్లు అద్దె కలిపి తడవకు రూ.800 వరకు ఖర్చు అవుతుందని’ ఉప్పలగుప్తం రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపా రు. పంట పూర్తయ్యే సమయానికి మరోరెండు,మూడు తడవలు నీరు పెట్టాల్సి ఉంది. ఈ విధంగా చూస్తే సాగునీటికే రూ.మూడు, నాలుగు వేలు అదనంగా పెట్టుబడి పెట్టాలని రైతులు వాపోతున్నారు.వాతావరణ మార్పుల వల్ల రైతులు తెగుళ్ల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. మార్చి నాలుగవ వారంలో కూడా రాత్రులు మంచు కురుస్తుండడం, ఉదయం ఎండలు కారణంగా ఆకు ముడత, మండి తెగులు రాకుండా రైతులు అధికంగా మందులు వినియోగించాల్సి వస్తుంది. ఈనిన చేలల్లో మెడవిరుపు రాకుండా కూడా మందులు వాడుతున్నారు. సాధారణంగా రబీలో ఎరువులు, పురుగుమందుల వినియోగం ఎక్కువుగా ఉంటుంది. ఆ వినియోగం కన్నా అదనంగా పురుగు మందులు వాడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. నీటి ఎద్దడి కారణంగా చేలల్లో నై తీశాయి. నాట్లు వేసిన పది రోజుల నుంచి కలుపు విపరీతంగా పెరగడం, పెద్ద సంఖ్యలో కూలీలను వినియోగించి తొలగించడం రైతులకు భారంగా మారింది. ఇప్పటికే చాలా మంది రైతులు రెండు,మూడుసార్లు కలుపు తీయించారు. దీనికితోడు ఎలుకల నిర్మూలనకు సైతం రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఏ విధంగా చూసినా ఈసారి రబీలో ఎకరాకు అదనంగా రూ.ఐదారు వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆధునీకరణ జరిగితే ముంపు తప్పేది
* ‘పశ్చిమ’ పర్యటనలో విజయమ్మ * వైఎస్ జీవించి ఉంటే ఆ పనులు పూర్తయ్యేవి * ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకనే మరణాలు * పునరావాస కేంద్రాల్లోనూ రక్షణ లేదు * పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్ జీవించి ఉంటే గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తయి ఉండేవని, అవి జరగకపోవడం వల్లే లక్షలాది ఎకరాలు నీట మునిగి రైతులు నష్టపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా తణుకులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య కార్యాలయంలో విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. ఆధునీకరణలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని డ్రెయిన్ల ప్రక్షాళనకు రూ. 416 కోట్లను వైఎస్ కేటాయించారని ఆమె గుర్తు చేశారు. ఆయన మరణానంతరం ఆధునీకరణను ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని, ఆధునీకరణ జరిగి ఉంటే ముప్పు తప్పేదని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ పెంచి ఇవ్వాలని, రంగు మారిన ధాన్యాన్ని.. పత్తి, మొక్కజొన్న ఇతర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. ఈ దిశగా ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తెస్తుందన్నారు. అన్నివిధాలుగా నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కూలిపోయిన, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి బాధిత కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని విజయమ్మ డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లో కూడా సరైన రక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకోలేకపోయిందని, విద్యుత్ షాక్‌తో శిబిరంలో ఒకరు చనిపోయారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల కుటుంబాలకు వలలు, బియ్యం ఇచ్చి ఆదుకోవాలన్నారు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, త్వరలోనే జగన్ సీఎం అవుతారని, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూ పుతారని చెప్పారు. కౌలు రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర వ్యవసాయ శాఖకు వివరించి రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. పరిశీలిస్తూ, ధైర్యం చెబుతూ.. విజయమ్మ ఉంగుటూరు మండలం నారాయణపురంలో నీళ్లలో నడిచి వెళ్లి మునిగిన పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నాచుగుంట వద్ద పొలాలను చూసి రైతుల గోడు విన్నారు. డెల్టా ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న నందమూరు అక్విడెక్టును పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. తణుకు నియోజకవర్గంలోని దువ్వ, ఇరగవరం మండలం గోటేరు, కంతేరు, ఆచంట నియోజకవర్గంలోని మినిమించిలిపాడు, ఆచంట వేమవరంలో పూర్తిగా మునిగిన పొలాలను పరిశీలించి.. రైతులను ఓదార్చారు. అనంతరం సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. విజయమ్మ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్, తానేటి వనిత, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వ్యవసాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి తదితరులు ఉన్నారు. వరద మృతుల కుటుంబాలకు పరామర్శ సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో వరదల్లో మృతి చెందినవారి కుటుంబాలను విజయమ్మ సోమవారం పరామర్శించారు. విజయవాడలోని పునరావాస కేంద్రంలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన పందేటి రాము (21) మృతదేహాన్ని సందర్శించారు. అక్కడే ఉన్న ఆయన తల్లిదండ్రులు రవి, కనకదుర్గను ఓదార్చి, సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గన్నవరం మండలం ముస్తాబాద వెళ్లారు. పెద్దచెరువులో వరదనీటి ఉధృతికి ప్రాణాలు కోల్పోయిన షేక్ మస్తాన్, ఆయన కుమార్తె పర్వీన్ కుటుంబాన్ని పరామర్శించారు. ముస్తాబాదలోని ప్రమాదస్థలి వద్దకు వెళ్లిన విజయమ్మ మస్తాన్ భార్య నగీనా, తల్లి సిరాజున్నీసా, కుమారుడు మజీద్ సహా వారి బంధువులను ఓదార్చారు. విజయమ్మ వెంట పార్టీ నేతలు తలశిల రఘురాం, సామినేని ఉదయభాను, నాయకులు వంగవీటి రాధాకృష్ణ, గౌతమ్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన, కొడాలి నాని తదితరులున్నారు. -
రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు నీటి కష్టాలు :హెచ్చరిస్తున్న ఇంజినీర్లు
కొవ్వూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో గోదావరి డెల్టాకు జరిగే నష్టాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఇంజనీరింగ్ జేఏసీ అధికారులు రూపొందిం చిన కరపత్రం అందరిని ఆకట్టుకుంటోంది. కొవ్వూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన మహాధర్నాలో భాగంగా ఇంజనీరింగ్ జేఏసీ అధికారులు ఈ కరపత్రాన్ని విడుదల చేశారు. గోదావరి డెల్టాలో 1956 నుంచి 2013 వరకు ఉన్న పరిస్థితిని, విభజన జరిగితే 2020 తరువాత ఏర్పడే సంక్షోభ పరిస్థితులను వివరించారు. తెలంగాణ ప్రాం తంలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు పూర్తయితే సెప్టెంబర్ 15 తరువాత ఎగువ నుంచి చుక్కనీరు కూడా దిగువకు వచ్చే పరిస్థితి లేదని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్‌లో గోదావరిలో 30 క్యూసెక్కుల నీరు మాత్రమే ఉంటుందని, తద్వారా ఖరీఫ్ చివరిలో నీటి ఎద్దడి ఏర్పడుతుందంటున్నారు. గోదావరి డెల్టాతోపాటు కృష్ణా డెల్టాలకు సాగునీటి ఎద్దడిని నివారించాలంటే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రాంత నాయకులు పోలవరం ప్రాజెక్టును వివాదాల్లోకి లాగి అవాంతరాలు సృష్టిస్తూ వారి ప్రాంతంలో శరవేగంగా ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోతే భవిష్యత్‌లో కృష్ణా, గోదావరి డెల్టాతోపాటు సీమాంధ్ర ప్రాంతంలో 40 లక్షల ఎకరాలు బీళ్లుగా మారతాయంటున్నారు. సీమాంధ్రలో 540 మెట్ట గ్రామాలకు, 30 లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం కలుగుతుందని పేర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కోస్తాతోపాటు రాయలసీమకు తాగునీరుతోపాటు సాగునీరు అందే అవకాశం ఉందని వారు కరపత్రంలో వివరించారు.