పేట్రేగుతున్న మట్టి మాఫియా | Sand Mining In East Godavari | Sakshi
Sakshi News home page

పేట్రేగుతున్న మట్టి మాఫియా

Published Mon, May 20 2019 9:37 AM | Last Updated on Mon, May 20 2019 9:38 AM

Sand Mining In East Godavari - Sakshi

అమలాపురం: గోదావరి డెల్టా పరిధిలో వేసవిలో రైతులు పొలాల్లో మట్టి తవ్వకాలు చేయడం సర్వసాధారణం. పొలంలో పేరుకుపోయిన మెరక ప్రాంతంలో మట్టిని తొలగించి లోతట్టు ప్రాంతంలో వేయడం, గట్లు పటిష్టం చేస్తుంటారు. మట్టిని తొలగించినప్పటికీ అది సాగునీరు చేలల్లో చేరకుండా చేయడం కాని, నీరు నిల్వ ఉండకుండా చూసుకునేవారు. అయితే క్రమేపీ మట్టి తవ్వకాలలో రైతులు సైతం ఈ నిబంధనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. గడిచిన ఐదేళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది. పట్టణాలతో పాటు ఒక మేజర్‌ పంచాయతీలు, ఒక మోస్తరు పంచాయతీల్లో కూడా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్నారు. వెంచర్లు అన్నీ చేలు, కొబ్బరితోటల్లో వేస్తున్నారు. ఇక్కడ భూమి ఎత్తు తక్కువ కావడంతో భారీగా మట్టి సేకరించాల్సి వస్తోంది. దీంతో రియా ల్టర్ల కన్ను పొలాలపై పండింది. జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం, ఆలమూరు తదితర వ్యవసాయ సబ్‌ డివిజన్లలో మట్టి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

రోజూ వేలాది ట్రాక్టర్ల మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ గ్రామాల్లో స్థానికులను, రియాల్టర్లు సొంతంగా ప్రతినిధులను ఏర్పాటు చేసి మట్టి సేకరణలో పడ్డారు. వరి చేలల్లో నిబంధనలను తుంగలో తొక్కి మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాల వల్ల పొలాలు దెబ్బతినే ప్రమాదమున్నా.. చాలా మంది రైతులు ఎంతో కొంత ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో తవ్వకాలకు అంగీకరిస్తున్నారు. ఇంతా చేసి రైతుకు ఒక ట్రాక్టరు మట్టికి దక్కేది రూ.100 నుంచి రూ.200 మాత్రమే. అయితే మాఫియా మాత్రం దూరాన్ని బట్టి ట్రాక్టరుకు రూ.800 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తోంది. రైతులు సొంత పొలాల అవసరాలకు మట్టి తవ్వకాల వరకు అనుమతి ఉంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. కాని ఇప్పుడు వాటిని పట్టించునే వారే లేరు. అధికారులు సైతం ఎన్నికలు, కౌంటింగ్‌ హడావుడిలో ఉండడం.. మట్టి మాఫియాకు వరంగా మారింది. రైతు ఎకరం పొలంలో సుమారు 5 నుంచి 10 ట్రాక్టర్ల మట్టిని సేకరిస్తున్నారు. లోతుగా తవ్వకాలు చేయడం వల్ల భవిష్యత్తులో రైతులు సాగు పరమైన ఇబ్బందులను ఎదుర్కొనున్నారు.


చెరువులుగా మారుతున్న పొలాలు
ఇదే సమయంలో కొంతమంది చేల్లో భారీగా మట్టి అమ్మకాలు చేసి చెరువులుగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలు ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, ముమ్మిడివరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెరువులు మారుతున్నాయి. అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న జనుపల్లి, సమనస, సవరప్పాలెం, రోళ్లపాలెం, కామనగరువు వంటి ప్రాంతాల్లో మట్టి తవ్వకాల దందా అంతా ఇంతా కాదు. తువ్వ మట్టి దొరికితే మట్టి మాఫియాకు పండగే.. పండగ. ఇటీవల ఇసుక ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు పునాదుల్లో ఇసుకకు బదులు తువ్వ మట్టిని ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా దీని ధర సైతం ఎక్కువగానే ఉంది. ట్రాక్టరు తువ్వ మట్టి రూ.1,500 వరకు ధర పలుకుతోంది. ఈ మట్టి ధర మరింత పెరిగే అవకాశముందని తెలిసి మాఫియా నాయకులు పలుచోట్ల పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇంత భారీగా మట్టి తవ్వకాలు సాగుతున్నా రెవెన్యూ అధికారులు అటు కనీసం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement