సమావేశంలో మాట్లాడుతున్న నాగిరెడ్డి తదితరులు
సాక్షి, రాజమహేంద్రవరం: పంటలకు నీరందక గోదావరి డెల్టాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా ప్రాంతంలో ఎకరం పంట ఎండినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రబీలో 8 టీఎంసీల నీటి కొరత ఉంటుందని అధికారులు ముందుగా అంచనా వేసినా, ప్రత్యామ్నాయ చర్యలు వేగంగా చేపట్టడం లేదని మండిపడ్డారు. గోదావరి కరకట్ట వెంబడి అధికార పార్టీ నేతల ఇసుక తవ్వకాల వల్ల వరదల సమయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం గోదావరి ఎగువన అనుమతి లేకుండా కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తున్నా.. ఓటుకు కోట్లు కేసు భయంతో చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీలో మంత్రి ఉమామహేశ్వరావు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ‘‘రాసిపెట్టుకో జగన్. 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరిస్తాం’’ అన్నారని, ఇప్పుడు ఆ మంత్రి ఎక్కడ ఉన్నారో బయటకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. నిన్నటివరకూ టీడీపీ భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీలు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై చేస్తున్న ఆరోపణలపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకుని సీఎం తన నిజాయితీని నిరూపించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, పార్టీ నేతలు రౌతు సూర్యప్రకాశరావు, కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, మేడపాటి షర్మిలారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల రైతు విభాగాల అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment