60 వేల ఎకరాలకు నీరు కట్ | water cut to 60 thousand acres | Sakshi
Sakshi News home page

60 వేల ఎకరాలకు నీరు కట్

Published Sun, Dec 27 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

water cut to 60 thousand acres

అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ సాగు ప్రారంభమయ్యూక జిల్లా యంత్రాంగం విపరీత నిర్ణయం తీసుకుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున డెల్టాలో మెరక ప్రాంతాలకు నీరివ్వలేమని, డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూర్తి చేసిన చేలకు మాత్రమే నీరివ్వాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయశాఖాధికారులు కాకినాడలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. తద్వారా మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలన్న జిల్లా సాగునీటి పారుదల శాఖ సలహా మండలి (ఐఏబీ) నిర్ణయాన్ని ధిక్కరించారు. ముందు నీరిస్తామనడంతో సాగు సన్నాహాల్లో నిమగ్నమైన ఆయూ ఆయకట్ల అన్నదాతల్లో అనేకులు.. ఇప్పుడు కోత పెట్టాలనుకోవడంతో హతాశులవుతున్నారు.
 
 డెల్టాలో పూర్తి ఆయకట్టులో సాగుకు 12 టీఎంసీల నీటి కొరత ఉందని అధికారులకు ముందే తెలుసు. ఇదే విషయాన్ని ఐఏబీ సమావేశానికి ముందే ‘ఆయకట్టు అంతటికీ నీరు కత్తిమీద సామే’ ‘సీలేరుపైనే ఆధారం’ కథనాలతో ‘సాక్షి’ ఎత్తి చూపింది. జిల్లా ప్రజాప్రతినిధులు ఈ లెక్కలతో సంబంధం లేదని, మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల కోసం ఏదైనా చేస్తాం, ఎంతైనా ఖర్చుపెడతాం. అవసరమైతే ఒడిశాకు విద్యుత్ ఇచ్చి జోలాపుట్ రిజర్వాయర్ నుంచి కావాల్సిన 12 టీఎంసీలను తెప్పించగలరు’ అని అధికారపార్టీ ఎమ్మెల్యేలు ధీమాగా చెప్పారు. ఇప్పుడు జోలాపుట్ నుంచి నీరు రాదని తేలిపోయింది. వేసవిలో విద్యుత్ కొరత దృష్ట్యా సీలేరు నుంచి వచ్చే నీటినే పూర్తిస్థాయిలో ఇవ్వలేమని జెన్‌కో అధికారులు తేల్చేశారు. మరోవైపు గోదావరికి సహజ జలాలు తగ్గాయి. డెల్టాలో అన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లే ఆరంభం కాకపోయినా.. సీలేరు నుంచి బైపాస్ పద్ధతిలో రోజుకు 1,500 క్యూసెక్కుల నీటిని సేకరించాల్సి వస్తోంది. ఇంత చేసినా శివార్లకు నీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ స్థితిలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 16 వేలు, తూర్పుడెల్టాలో 27 వేలు, మధ్యడెల్టాలో 17 వేల ఎకరాల్లో రబీ సాగుకు కోత పెట్టాని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయించారు.
 
 కొందరికిచ్చి.. కొందరికి ఎగనామమా!
 రబీలో మొత్తం ఆయకట్టుకు నీరిస్తామని, మధ్యలో కొరత అంటూ అన్ని ప్రాంతాల్లో మెరక, శివారు ఆయకట్లకు ఇవ్వలేమనడంపై రైతులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడా సాగు ఆరంభమైంది. ఒకే కాలువ మీద కొందరికి నీరిచ్చి, మిగిలిన వారికి ఇవ్వకుంటే అన్యాయమంటున్నారు.  చాలా మంది డిసెంబరు 20 తరువాత కూడా నారుమళ్లు వేయగా జనవరి పది తరువాత కూడా నాట్లు పడే అవకాశముంది. అధికారులు డిసెంబరు 31 నాటికి నాట్లు పడ్డ చేలకు మాత్రమే నీరిస్తామనడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.  
 
 ఈ మౌనమేల వర్మ గారూ!
 ‘గోదావరికి, ఏలేరుకు నీటి కొరత వచ్చినప్పుడల్లా పిఠాపురం నియోజకవర్గ ఆయకట్టుకు కోతపెడుతున్నారు. మీరు ఎలా తెస్తారో అనవసరం మా పీబీసీ ఆయకట్టుకంతా నీరివ్వాల్సిందే’ అని ఐఏబీలో పట్టుబట్టిన ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ సమక్షంలోనే ఇప్పుడు పీబీసీలో 16 వేల ఎకరాల ఆయకట్టుకు జిల్లాయంత్రాంగం కోతపెట్టింది. అయినా ఆయన మౌనం వహించడం పట్ల రైతులు భగ్గుమంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement