‘ఎత్తిపోతల’కు వ్యతిరేకంగా పోరుబాట
14న పోలవరం, పట్టిసీమల వద్ద భారీ హోమం
అవసరమైతే దీర్ఘకాల కార్యాచరణకు సన్నద్ధం
ముఖ్యనేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నిర్ణయం
కాకినాడ : గోదావరి డెల్టా రైతులకు అపారనష్టాన్ని కలిగించేలా పట్టిసీమ వద్ద ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమబాట పట్టనుంది. ఉభయగోదావరి జిల్లాల రైతాంగాన్ని భాగస్వాముల్ని చేస్తూ పోలవరం సాధనే లక్ష్యంగా కార్యాచరణకు సమాయత్తమవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన గురువారం సాయంత్రం కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంలో ముఖ్యనేతలంతా సమావేశమయ్యూరు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేలా స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 14న ఉదయం పోలవరంపై ప్రభుత్వాలకు సద్భుద్ధి ప్రసాదించి రైతులకు మంచి జరగాలని కాంక్షిస్తూ పోలవరం వద్ద భారీ హోమం చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పట్టిసీమకు పాదయాత్ర చేసి అక్కడ కూడా హోమం చేయనున్నారు. అనంతరం జరిగే సభలో రైతులు, ప్రజలు, పార్టీ నేతల సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుకు అక్కడే కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కేవలం స్వల్పకాలిక ఆందోళనలే కాక దీర్ఘకాల కార్యాచరణ చేపట్టాలన్న ప్రతిపాదనపై కూడా నేతలు చర్చించారు.
అంకితభావం గల కార్యకర్తలకు జిల్లా కమిటీలో అవకాశం
కాగా పార్టీ జిల్లా కమిటీ నియామకంపై చర్చించిన నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను గుర్తించి జిల్లా కమిటీలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరి ఆమోదంతో జిల్లా కార్యవర్గాన్ని రూపొందించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో త్వరలోనే ప్రకటించాలని నిర్ణయించారు. మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, చెల్లుబోయిన వేణు, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, పెట్టా శ్రీనివాస్, సిరిపురపు శ్రీనివాసరావు, అప్పన్నదొర, మార్గాని గంగాధర్, మట్టపర్తి మురళీకృష్ణ, సీహెచ్ రామకృష్ణ, ఎస్.నూకరాజు, అబ్దుల్‌బషీరుద్దీన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, సుదర్శన్‌బాబు, జి.వి.రమణ, రావు చిన్నారావు, వట్టికూటి రాజశేఖరం, నక్కా రాజబాబు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు.