‘బాబు’కూ భాగస్వామ్యం | TDP MLA Revanth Reddy sent to jail in cash-for-vote scam | Sakshi
Sakshi News home page

‘బాబు’కూ భాగస్వామ్యం

Published Tue, Jun 2 2015 1:29 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

TDP MLA Revanth Reddy sent to jail in cash-for-vote scam

   రేవంత్‌రెడ్డి వెనకున్నది ఆయనే     వైఎస్సార్ సీపీ నేతల ఆరోపణ
  పార్టీ అధినేత, సీఎం పదవులకు రాజీనామా చేయూలని డిమాండ్

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి అక్కడి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రయత్నించిన వ్యవహారంలో తెరవెనుక సూత్రధారి అని ఏపీ సీఎం చంద్రబాబుపై వివిధ వర్గాల నుంచి నిరసన పెల్లుబుకుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు రాజకీయాలను అవినీతి మయంచేసిన బాబుపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సోమవారం రాత్రి కిర్లంపూడి మండలం ముక్కొల్లులో పార్టీ జిల్లా నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.

చంద్రబాబు తెరవెనుక ఉండి నడిపించిన మంత్రాంగంలో రేవంత్‌రెడ్డి పావుగానే ఏసీబీకి దొరికిపోయారని నేతలు అన్నారు. నెహ్రూ మాట్లాడుతూ   ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు అవినీతి నిర్మూలన అంటాడు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ అవినీతి రాజకీయాలన్నట్టు ఆయన వ్యవహారశైలి ఉంది’ అని ఆక్షేపించారు. చంద్రబాబు భాగస్వామ్యంతో రేవంత్‌రెడ్డి సాగించిన అవినీతి వ్యవహారాన్ని పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
 
 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
 ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అవినీతి రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయగా అందులో భాగస్వామి అయిన చంద్రబాబు పార్టీ పదవికి, సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తనకు తాను అన్నా హజారే వారసుడనని చెప్పుకునే చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ప్రత్యక్ష పాత్ర ఉందని, ఆయన సీఎంగా ఉండే అర్హత కోల్పోయారని అన్నారు. పార్టీ జిల్లా అధికారప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి వ్యవహారంలో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
  పార్టీ నేతలంతా టీడీపీ అవినీతి రాజకీయాలను ఎండగడుతూ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కాగా జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి రేవంత్‌రెడ్డి వ్యవహారంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏలేశ్వరం బస్టాండ్ సెంటర్లో పార్టీ నాయకుడు ఆలమండ చలమయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారంలో రేవంత్‌రెడ్డితో పాటు చంద్రబాబును కూడా బాధ్యుడిని చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు డిమాండ్ చేశారు.
 
 సమరదీక్షకు సన్నద్ధం : జ్యోతుల
 ప్రజలకిచ్చిన హామీలను తుంగలోతొక్కి ప్రజాకంటక పాలన సాగిస్తోన్న చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో చేపట్టనున్న సమరదీక్షకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం తెలియచేసేందుకు తరలివెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. జగన్ తలపెట్టిన రెండురోజుల సమరదీక్ష ఏర్పాట్లపై  ముక్కొల్లులో నెహ్రూ అధ్యక్షతన నేతలు చర్చించారు. జిల్లా నేతలు, పార్టీ శ్రేణులు రావులపాలెం మండలం గోపాలపురం నుంచి బయలుదేరాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం జగన్ దీక్ష చేపట్టే సరికి అక్కడకు వెళ్లి దీక్ష ముగిసే వరకు అక్కడే ఉండేలా నేతలంతా ఏర్పాట్లు చేసుకోవాలని నెహ్రూ, బోస్ విజ్ఞప్తి చేశారు.
 
 11న కొత్త కార్యవర్గం పరిచయం
 వైఎస్సార్‌సీపీ జిల్లా కొత్త కార్యవర్గం, రాష్ట్రపార్టీలో పదవులు వరించిన నేతల పరిచయ కార్యక్రమం ఈ నెల 11న కాకినాడ సూర్యకళామందిరంలో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబులను ఆహ్వానించామని నెహ్రూ చెప్పారు. పార్టీ పదవులు పొందిన నేతలంతా ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అదే కార్యక్రమంలో పార్టీ నేతలకు గుర్తింపు కార్డులు, పదవుల నియామకపత్రాలు అందజేస్తామన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, నియోజకవర్గాల కోఆర్డినేటర్‌లు చెల్లుబోయిన వేణు, గిరజాల వెంకటస్వామినాయుడు, తోట సుబ్బారావునాయుడు, గుత్తుల సాయి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, ఎం.వెంకటేష్,  సుంకర చిన్ని, మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయుడు, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్, మండపాక అప్పన్నదొర, శిరిపురపు శ్రీనివాస్,  ముమ్మిడివరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ కాశి మునికుమారి, అత్తులూరి సాయిబాబు, కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

 చంద్రబాబును ఎ-2గా చేయాలి
 ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డబ్బులు ముట్టచెబుతూ టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి పట్టుబడ్డ  కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును  ఎ-2గా చేయాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకపక్క శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొంటున్నారని చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండడం లేదని, నీతి, అవినీతిై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు.
 
 చంద్రబాబు నైజం బయటపడింది..
 మహానాడులో తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రత్యర్థులు ప్రలోభాలకు గురి చేసి సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నారన్న చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే పనికి పాల్పడడం ద్వారా అతని అసలు నైజం బయటపడిందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఎమ్మెల్యేలకు ఎరలు వేసిన రేవంత్‌రెడ్డితోపాటు అతడిని ప్రోత్సహించిన చంద్రబాబుపైనా కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
 
 ఇదేనా అన్నా హజారే వారసత్వం..?
 రేవంత్‌రెడ్డి వీడియోక్లిప్పింగ్‌లను చంద్రబాబు చూసి నైతిక బాధ్యత తీసుకుని తప్పును ఒప్పుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అన్నాహజారే వారసుడిగా చెప్పుకునే చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలన్నారు. సీఎం పదవికి బాబు అనర్హుడన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కూడబెట్టిన డబ్బులతోనే ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాలోనూ నామినేటెడ్ పదవులకు ఎరవేసిన  రేవంత్‌రెడ్డికి ఆంధ్రా అంటే అంత లోకువా అని ప్రశ్నించారు.
 
 టీడీపీ నైజం బయటపడింది..
 రేవంత్‌రెడ్డి వ్యవహారంతో టీడీపీ నైజం బయటపడిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు. అవినీతిపై మాట్లాడే చంద్రబాబు నాయుడు రే వంత్‌రెడ్డి విషయంలో దొరికిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉంటూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
 
 అది ఎర్రచందనం సొమ్మే..
 నీతుల వల్లించే చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయమని ప్రోత్సహించడం అవినీతి కాదా అని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి  రాజా ప్రశ్నించారు. తెలంగాణ లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఎర్రచందనం సొమ్మును ఉపయోగిస్తున్నారనడానికి రేవంత్‌రెడ్డి నిర్వాకమే నిదర్శనమన్నారు. మీడియా కథనాల ఆధారంగా చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు నీతిపరులో, అవినీతి పరులో రెండు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందన్నారు.
 
 చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది..
 డబ్బుతో రాజకీయాల్ని  శాసించడం, అక్రమమార్గాల్లో ఎన్నికల్లో గెలవడం చంద్రబాబుకు తెలిసినట్టు మరెవరికీ తెలియదని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిపోయిన రేవంత్‌తో పాటు ఈ వ్యవహారం మొత్తానికి బాధ్యుడైన చంద్రబాబును తక్షణం అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు అసలు రూపం బయటపడిందన్నారు.
 
 చంద్రబాబును అరెస్టు చేయాలి
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను డబ్బుతో కొనేందుకు ప్రయత్నించి దొరికిపోయిన రేవంత్‌రెడ్డితోపాటు అతని బాస్ చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ డిమాండ్ చేశారు. కుటిల రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారకుడయ్యారని ధ్వజమెత్తారు.
 
 చంద్రబాబుకూ భాగస్వామ్యముంది..
 రేవంత్‌రెడ్డి కుటిల రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి  భాగస్వామ్యం ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడంలో ఆరితేరిన చంద్రబాబు నైజం రేవంత్‌రెడ్డి వ్యవహారంతో  మరోసారి రుజువైందన్నారు. ఈ కేసులో బాబు పైనా అభియోగం మోపి, విచారించాలన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కుతంత్రాల బాబును వెనకేసుకొస్తున్న టీడీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
 
 చంద్రబాబే ‘ఏ-1’ ముద్దాయి..
 తెలంగాణ  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు యత్నించిన విషయంలో ఏ-1 ముద్దాయి చంద్రబాబేనని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌కు ముడుపులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడినా ఇందుకు ప్రోత్సహించింది చంద్రబాబేనన్నారు. జరిగినదానికి నైతిక బాధ్యత వహించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యేని డబ్బులతో కొనుగోలు చేయూలని ప్రయత్నించి ఏసీబీకి పట్టుబడ్డ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలి. ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేయాలి. చంద్రబాబు నీతిరహిత రాజకీయాలకు పాల్పడుతున్నారు.
 - జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట ఎమ్మెల్యే,
 వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement