టీడీపీ ఎమ్మెల్యే జుగుప్సాకర వ్యాఖ్యలు..
►‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కిన మాజీ మంత్రి
►ఎమ్మెల్యే రోజాపై బూతుల పంచాగం
►జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
విశాఖపట్నం: మూడుసార్లు ఎమ్మెల్యే చేశారు.. పైగా మంత్రిగా పనిచేశారు... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల జుగుప్సాకరమైన రీతిలో చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రికల్లో రాయలేని భాషను వాడుతూ నీచాతినీచంగా ఆయన మాట్లాడుతున్న తీరు సొంత పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారు. ఇటీవలే రాజ్యసభసభ్యుడు వి. విజయసాయిరెడ్డిపై నోటి కొచ్చినట్టు నానాదుర్భాషలాడిన బండారు తన బండారాన్ని ఉతికి ఆరేస్తున్న ‘సాక్షి’పై బుధవారం తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై కూడా ఒంటికాలిపై లేస్తూ అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల వ్యాన్‌లో టీడీపీ స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకోగా ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ గృహకల్ప లబ్ధిదారుల అవగాహనా సదస్సుకు వచ్చిన ఎమ్మెల్యే బండారు దీనిపై స్పందిస్తూ మరోసారి తన బూతుల పంచాంగాన్ని విప్పారు.
హెరిటేజ్ కంపెనీ వ్యాన్‌ను స్మగ్లర్లు దొంగ స్టిక్కర్లు అంటించుకుని వాడుకున్నారని చెబుతూ ఈ విçషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ పత్రిక, టీవీలపై అక్కసు వెళ్లగక్కారు. నోటికి వచ్చినట్టుగా తిట్ల పురాణం లంకించుకున్నారు. ‘సాక్షి’ పత్రిక, టీవీలను బ్యాన్ చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. మహిళా లబ్ధిదారులు, పార్టీ మహిళానేతల సమక్షంలోనే ఎమ్మెల్యే రోజా పట్ల రాయలేని భాషలో జుగుప్సాకరంగా మాట్లాడడంతో వారు నివ్వెరపోయారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.
బండారు దిష్టిబొమ్మ దహనం
ఎమ్మెల్యే ఆర్కే రోజాపై పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బండారు దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.