మంత్రి యనమలపై ఫిర్యాదు చేస్తాం: విశ్వేశ్వరరెడ్డి
నంద్యాల: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. 30 ఏళ్ల సర్వీసుకే ఉద్యోగులను ఇంటికి పంపించేలా జీవోలు తయారు చేయడం దారుణమన్నారు. నంద్యాలలోని శిల్పామోహన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఉద్యోగాలను తగ్గించే కుట్రకు ఏపీ ప్రభుత్వం తెరతీయడాన్ని సాక్షి పేపర్ ఆధారాలతో బయటపెట్టినా ప్రభుత్వ వైఖరిలో మాత్రం మార్పు రాలేదన్నారు. మరోవైపు ‘సాక్షి’పై మంత్రి యనమల రామకృష్ణుడు అసత్య ప్రచారం చేస్తున్నారని, యనమల వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.
వారి కుట్రను ఆధారాలతో బయటపెట్టిన తర్వాత కూడా తమ తప్పును తెలుసుకుని జీవో నిర్ణయంపై క్షమాపణ చెప్పకపోగా ప్రభుత్వం అదే ధోరణితో నడుచుకుంటున్నారు. ఏపీలో ఖాళీగా ఉన్న 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రస్తుత ఉద్యోగులపైనే భారం వేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, ఉద్యోగుల పట్ల, వారి పోరాటల పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటుంటూ ప్రభుత్వం వారిని అణిచివేయడంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన తీవ్రమవుతుందని చెప్పారు. ప్రస్తుతం తీసుకురానున్న జీవోలపై కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మా వద్ద ఆధారాలు ఉన్నా కూడా టీడీపీ ప్రభుత్వం మాత్రం తప్పును తెలుసుకోకుండా ఇంకా బుకాయించాలని చూస్తోందన్నారు. 50 ఏళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ ఆఖరికి ఉద్యోగులపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.