- కబ్జాదారులే భూములు పంచామని చెప్పుకోవడం దారుణం
- విశాఖ టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ ఫైర్
విశాఖపట్నం: పదవుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారే తత్వం తెలుగుదేశం పార్టీ నాయకులదని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. భూకుంభకోణం సూత్రధారి అయిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కేవలం మంత్రి పదవి కోసం ప్రతిపక్ష పార్టీపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత ఇసుమంతైనా లేని టీడీపీ నాయకులకు వైఎస్సార్‌సీపీని మాట అనే అర్హతే లేదని ఆగ్రహించారు. పార్టీ నేతలతో కలిసి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
‘‘విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందని స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడే ఒప్పుకున్నారు. అలాంటిది ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తానేదో గొప్పవాడినని చెప్పుకోవడం సిగ్గుచేటు. వినోభాబావే పిలుపుతో తాము పేదలకు భూములిచ్చామని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి బండారు కుటుంబ ఉమ్మడి ఆస్తి 11 ఎకరాలు మాత్రమే. భూములు పంచలేదని ఆయన సోదరులే చెబుతున్నారు. దీన్ని బట్టి బండారుకు మతిభ్రమించిందని అర్థమవుతోంది. ఇప్పుడాయన ముదపాక రైతుల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది’’ అని అమర్‌నాథ్ అన్నారు.
అవినీతి ఊబిలో ఊరుకుపోయిన బండారు సత్యనారాయణ లాంటి వాళ్లు వైఎస్సార్‌సీపీపై, వైఎస్ జగన్‌పై అవాకులు చెవాకులు పేలితే ఊరుకోబోమని గుడివాడ హెచ్చరించారు. ‘‘సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే ఢీకొట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. 30 సంవత్సరాల టీడీపీని అడ్డుకోవడం ఒక లెక్కకాదు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఆపై అక్రమార్కులైన టీడీపీ నేతలు శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎమ్మెల్యే బండారుకు మతి భ్రమించింది
Published Mon, Sep 4 2017 7:02 PM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM
Advertisement