అలా చెప్పుకోవడానికి సిగ్గులేదా?
నదుల అనుసంధానమని గొప్పలా?
సీఎంను నిలదీసిన జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్: నదుల అనుసంధానం తానే చేశానని గొప్పలు చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబుకు సిగ్గులేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానమనేది చంద్రబాబు చిరకాల కోరికని సాగునీటిశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటపుడు తన తొమ్మిదేళ్ల పాలన(1995-2004)లో సీఎం కనీసం ఆలోచనలు కూడా చేయలేదెందుకని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు చెప్పి రాష్ట్రప్రజల్ని మభ్య పెట్టేయత్నం చేస్తున్నారని విమర్శించారు.
చరిత్ర పుటల్లోకి వెళ్లిచూడండి..
చరిత్ర పుటల్లోకి వెళితే ఆర్థర్ కాటన్ నిర్మించిన గోదావరి బ్యారేజీ కాలువకు, కృష్ణా బ్యారేజీ కాలువ ఏలూరు వద్ద కలుస్తుందని, ఆ కాలువ చాలా రోజులపాటు నావికా అవసరాలకు ఉపయోగపడిందని నెహ్రూ తెలిపారు. 1978లో జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా-చిత్రావతి-కుందూలను కలుపుతూ పెన్నానది అనుసంధానానికిగాను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ సోమశిల, కండలేరును కలుపుకుని తెలుగుగంగ అని పేరు పెట్టారన్నారు. దివంగత వైఎస్ హయాంలో చాలాభాగం పనులు పూర్తయి ఈరోజు సోమశిల డ్యాంలోకి నీరు వస్తోందని తెలిపారు. ఇదంతా నదుల అనుసంధానంతోనే సాధ్యమైందనే విషయం టీడీపీ నేతలకు తెలిసి కూడా ఇప్పుడే చేసినట్లు చెప్పుకోవడం, ఎమ్మెల్యేలు డ్యాన్సులు చేసి డప్పులు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
తాడిపూడిని పూర్తిచేసింది వైఎస్..
తాడిపూడి పథకానికి చంద్రబాబు శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా వదిలేస్తే భారీగా నిధులిచ్చి నిర్మాణం పూర్తిచేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని నెహ్రూ తెలిపారు. ఈ పని చంద్రబాబు చేశానని చెప్పుకోవడానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు.