సాక్షి, అమరావతి: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. దీంతో గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 10.13 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు డెల్టా రైతులు సిద్ధమయ్యారు. నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి ప్రవాహం మొదలవడంతో అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. వంశధారలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించి.. గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలకు సాగు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నీటి లభ్యతను బట్టి ఇతర ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ సమావేశాలలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా గతేడాది గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో 1,050 టీఎంసీలను వినియోగించుకుని ఖరీఫ్, రబీలలో 1.34 కోట్ల ఎకరాలకు సర్కార్ నీటిని సరఫరా చేసింది. ఇందులో ఒక్క ఖరీఫ్‌లోనే కోటి ఎకరాలకు నీళ్లందించడం గమనార్హం. దాంతో రికార్డు స్థాయిలో వరి దిగుబడులు వచ్చాయి. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో వరద నీటిని గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి ఆయకట్టుకు నీళ్లందించి, రైతులకు దన్నుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్నీ మంచి శకునములే..
► గోదావరి నదిలో ఈనెల 7 నుంచే వరద ప్రవాహం మొదలైంది. అదే రోజున ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు.
► కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా నీటి సంవత్సరం ప్రారంభంలోనే ఆల్మట్టి జలాశయంలోకి ఈనెల 5వ తేదీన 12,761 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది. ఈనెల 5 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ 7 టీఎంసీలు ఆల్మట్టి జలాశయంలోకి చేరాయి.
► ప్రస్తుతం ఆల్మట్టిలో 35.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ కృష్ణాలో వరద ప్రవాహం మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
► పులిచింతల ప్రాజెక్టులో 5.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలో 2.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరిలో నీటిమట్టం 17 అడుగులకు చేరిన అనంతరం వరద జలాలను కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్లించి.. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని జల వనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.
► నెలాఖరులోగా డెల్టాకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. డెల్టాలో 13.08 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు.
► నాగావళి నదిలోనూ నీటి సంవత్సరం ప్రారంభంలోనే వరద ప్రారంభమైంది. తోటపల్లి బ్యారేజీలో నీటి నిల్వ 2.015 టీఎంసీలకు చేరడంతో అధికారులు పంటల సాగుకు కాలువలకు నీటిని విడుదల చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తోటపల్లి బ్యారేజీ కింద 1,59,822 ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు.
► ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వంశధార నదిలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. గొట్టా బ్యారేజీ బ్యారేజీ నుంచి శనివారం 624 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. శాసనభ సమావేశాలు ముగిసిన తర్వాత ఐఏబీ సమావేశం నిర్వహించి.. ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటి విడుదల..
► శ్రీశైలం జలాశయానికి గత ఏడాది మాదిరిగానే వరద ప్రవాహం వస్తే దానిపై ఆధారపడిన తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు.
► నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం చేరడం.. నీటి లభ్యత ఆధారంగా కుడి కాలువ, ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదలపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.
► సోమశిలలో 26.6, కండలేరులో 23.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా, పెన్నా నదుల్లో నీటి లభ్యత ఆధారంగా సోమశిల, కండేరు, పెన్నా డెల్టా కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకుంటారు.
► తుంగభద్రలో వరద ప్రవాహం సుంకేశుల బ్యారేజీకి చేరాక.. ఐఏబీ సమావేశం నిర్వహించి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment