Dhawaleshwaram
-
శాంతిస్తున్న ‘గోదావరి’
సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురి సౌత్: కాటన్ బ్యారేజీ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. ఇక్కడ శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం రాత్రి 7 గంటలకు మరింత తగ్గుతూ నీటిమట్టం 12.10 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,33,672 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద శనివారం పూర్తిగా ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించే అవకాశమున్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32.440 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 9.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.40 అడుగులకు చేరుకుంది.తేరుకుంటున్న కోనసీమ లంకలుమరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ లంకలు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. కానీ, జిల్లాలో ప్రధాన కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి.దీంతో ఆయా ప్రాంతాల లంకవాసులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, శనివారం ఉదయం ముంపు మరింత తగ్గే అవకాశమున్నందున ఆదివారం నుంచి లంక గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది.శ్రీశైలానికీ తగ్గుతున్న వరద..ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికీ ఎగువ నుంచి వచ్చే వరద తగ్గింది. ఇక్కడకు గురువారం నుంచి శుక్రవారం వరకు 1,25,938 క్యూసెక్కుల నీరు రాగా.. శ్రీశైలం నుంచి దిగువకు 1,20,367 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 211.457 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి వచ్చే నీటి చేరిక తగ్గింది. -
తగ్గిన వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)//: పరీవాహక ప్రాంతాల్లో వర్షాల విరామంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం ధవళేశ్వరం బ్యారేజీలో నీటి మట్టం 14.40 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 41.50 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరే వరద మరింతగా తగ్గనుంది. ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్న కృష్ణా ప్రవాహం కూడా తగ్గింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్‌లలోకి వరద తగ్గింది. శ్రీశైలం నుంచి 2 గేట్ల ద్వారా, నాగార్జునసాగర్ నుంచి 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 12,391 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 391 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 12 వేల క్యూసెక్కులను కడలిలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,500 క్యూసెక్కులు వస్తుండగా అదే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. ఏలేరు ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. -
ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
-
ధవళేశ్వరంలో కిడ్నాపైన ఇద్దరు బాలికలు
-
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి
-
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. దీని వల్ల ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 45-55 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. భారీ వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, పెరుగుతున్న వరద ప్రవాహం కారణంగా గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో, గోదావరి పరివాహక ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి 9,35,465 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరిలో నీటి మట్టం 9.8 అడుగులకు చేరుకుంది. 7 లక్షల 26 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ నుండి సముద్రంలోకి చేరుతోంది. డెల్టా కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: 9 నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు -
జలకళ.. ఖరీఫ్ భళా
సాక్షి, అమరావతి: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. దీంతో గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 10.13 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు డెల్టా రైతులు సిద్ధమయ్యారు. నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి ప్రవాహం మొదలవడంతో అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. వంశధారలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించి.. గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలకు సాగు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నీటి లభ్యతను బట్టి ఇతర ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ సమావేశాలలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా గతేడాది గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో 1,050 టీఎంసీలను వినియోగించుకుని ఖరీఫ్, రబీలలో 1.34 కోట్ల ఎకరాలకు సర్కార్ నీటిని సరఫరా చేసింది. ఇందులో ఒక్క ఖరీఫ్‌లోనే కోటి ఎకరాలకు నీళ్లందించడం గమనార్హం. దాంతో రికార్డు స్థాయిలో వరి దిగుబడులు వచ్చాయి. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో వరద నీటిని గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి ఆయకట్టుకు నీళ్లందించి, రైతులకు దన్నుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నీ మంచి శకునములే.. ► గోదావరి నదిలో ఈనెల 7 నుంచే వరద ప్రవాహం మొదలైంది. అదే రోజున ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. ► కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా నీటి సంవత్సరం ప్రారంభంలోనే ఆల్మట్టి జలాశయంలోకి ఈనెల 5వ తేదీన 12,761 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది. ఈనెల 5 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ 7 టీఎంసీలు ఆల్మట్టి జలాశయంలోకి చేరాయి. ► ప్రస్తుతం ఆల్మట్టిలో 35.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ కృష్ణాలో వరద ప్రవాహం మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులో 5.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలో 2.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరిలో నీటిమట్టం 17 అడుగులకు చేరిన అనంతరం వరద జలాలను కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్లించి.. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని జల వనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ► నెలాఖరులోగా డెల్టాకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. డెల్టాలో 13.08 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ► నాగావళి నదిలోనూ నీటి సంవత్సరం ప్రారంభంలోనే వరద ప్రారంభమైంది. తోటపల్లి బ్యారేజీలో నీటి నిల్వ 2.015 టీఎంసీలకు చేరడంతో అధికారులు పంటల సాగుకు కాలువలకు నీటిని విడుదల చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తోటపల్లి బ్యారేజీ కింద 1,59,822 ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ► ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వంశధార నదిలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. గొట్టా బ్యారేజీ బ్యారేజీ నుంచి శనివారం 624 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. శాసనభ సమావేశాలు ముగిసిన తర్వాత ఐఏబీ సమావేశం నిర్వహించి.. ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటి విడుదల.. ► శ్రీశైలం జలాశయానికి గత ఏడాది మాదిరిగానే వరద ప్రవాహం వస్తే దానిపై ఆధారపడిన తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. ► నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం చేరడం.. నీటి లభ్యత ఆధారంగా కుడి కాలువ, ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదలపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ► సోమశిలలో 26.6, కండలేరులో 23.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా, పెన్నా నదుల్లో నీటి లభ్యత ఆధారంగా సోమశిల, కండేరు, పెన్నా డెల్టా కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకుంటారు. ► తుంగభద్రలో వరద ప్రవాహం సుంకేశుల బ్యారేజీకి చేరాక.. ఐఏబీ సమావేశం నిర్వహించి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. -
గోదారి జలాలు కడలిపాలు
సాక్షి, అమరావతి: మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం..ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు వంటి ఉప నదులు పొంగిపొర్లుతుండటంతో గోదావరి కడలి వైపు పరుగులు పెడుతోంది. గడచిన 24 గంటల్లో 26.20 టీఎంసీల గోదావరి జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. మొత్తమ్మీద ఈ సీజన్లో ఇప్పటికే 61.646 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం ఆనకట్టకు ఉన్న 175 గేట్లను 0.70 మీటర్లు ఎత్తులేపి 3,06,840 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండంతో గోదావరి వరద ఉధృతి రెండు రోజుల పాటు ఇదేలా కొనసాగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. గోదావరి ఎగువన కాళేశ్వరం వద్ద నీటిమట్టం 7.18 మీటర్లు ఉండగా.. పేరూరు వద్ద 8.95 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 8.95 మీటర్లు, కూనవరం 10.22 మీటర్లు, కుంట వద్ద 5.40 మీటర్లు, కొయిదా వద్ద 13.22 మీటర్లు, పోలవరం వద్ద 8.91 మీటర్లు, రోడ్డు కం రైలు వంతెన వద్ద 14.33 మీటర్లకు చేరింది. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న తూర్పు డెల్టాకు సాగునీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రామగుండంకు సమీపంలోని ఎల్లంపల్లి జలాశయం ఎగువన వర్షాభావ పరిస్థితుల వల్ల గోదావరి వెలవెలబోతుండడం గమనార్హం. ఆల్మట్టి జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు.. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి జలాశయంలోకి కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. 63,465 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గురువారం నాటికి ఆల్మట్టిలో నీటి నిల్వ 69.8 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టికి దిగువన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో.. నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోకి జలాలు చేరడం లేదు. అయితే స్థానికంగా కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌లోకి 1,558 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ 312 టీఎంసీల నిల్వకు గానూ 133.37 టీఎంసీల నిల్వ ఉంది. తుంగభద్రకు పెరుగుతున్న వరద.. తుంగభద్రలో వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారంతో పోల్చితే.. గురువారం వరద ప్రవాహం పెరిగింది. 49,796 క్యూసెక్కులు చేరడంతో తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 54.34 టీఎంసీలకు చేరుకుంది. మొత్తంగా గోదావరి దిగువన ఉప్పొంగుతుంటే.. ఎగువన వెలవెలబోతోంది. కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహంతో జీవకళ ఉట్టి పడుతుంటే.. దిగువన నీటి చుక్క జాడ లేక కళ తప్పింది. మరో రెండు రోజులు వర్షాలు సాక్షి నెట్వర్క్: ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి నైరుతి వైపునకు వంగి ఉంది. వీట ప్రభావంతో ఇప్పటికే కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. శుక్రవారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రపై చురుగ్గా ఉండడంతో దక్షిణ కోస్తాలో గంటకు 50–55, ఉత్తరకోస్తాలో 45–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో అలజడి ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. కాగా 19న ఉత్తర బంగాళాఖాతంలోనే మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో 7, భీమడోలులో 6, తణుకు, పాలకోడేరు, విజయవాడ, కైకలూరు, నూజివీడుల్లో 5, ప్రత్తిపాడు, ఏలూరు, తిరువూరు, అమలాపురం, భీమవరం, మాచెర్లల్లో 4సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కృష్ణా జిల్లా సగటు వర్షపాతం 29.3గా నమోదైంది. మచిలీపట్నం బస్టాండ్, జెడ్పీ సెంటర్లు జలమయమయ్యాయి. కైకలూరులో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పామర్రు బస్టాండ్‌లో నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పాపికొండల బోట్లు నిలిపివేత వీఆర్‌పురం (రంపచోడవరం): పాపికొండల పర్యాటకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బోట్ యూనియన్ సభ్యులు ప్రకటించారు. గోదావరిలో భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో తామే బోట్లను నిలుపుదల చేసినట్టు తెలిపారు. ‘ముసురు’ పట్టిన హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాన్ని ముసురు కమ్మేసింది. నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కురుస్తూనే ఉంది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు సరాసరిన 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ధవళేశ్వరం బంద్ విజయవంతం
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : ఏకపక్షంగా ధవళేశ్వరం నుంచి సెంట్రల్ డివిజన్ కార్యాలయం అమలాపురం తరలించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకులు వీర్రాజు ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్ కారణంగా గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. తొలుత ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పలు ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. ఆకుల వీర్రాజు ఇరిగేషన్ కార్యాలయాలకు వెళ్లి బంద్‌కు సంఘీభావం తెలపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ కార్యాలయాల బంద్ కారణంగా వరుసగా రెండో రోజు కూడా మూతపడ్డట్టు అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకులు వీర్రాజు మాట్లాడుతూ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలిస్తే మైనర్ ఇరిగేషన్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. అమలాపురం వెళ్లాలంటే వంద కిలోమీటర్లు పైబడి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులకు కూడా తెలియకుండా కార్యాలయాన్ని మార్చడం పలు అనుమానాలకు బలం చేకూరుతుందన్నారు. వాస్తవ పరిస్థితులు చూడకుండా కార్యాలయ మార్పునకు అధికారులు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధుల మెప్పుకోసం ఇరిగేషన్ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం తగదన్నారు. ధవళేశ్వరంలోనే సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ఉంచాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నగర పాలకసంస్థ కార్పొరేటర్ మింది నాగేంద్ర, మాజీ ఎంపీటీసీ సాధనాల చంద్రశేఖర్(శివ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ముద్దాల అను, ఏజీఆర్ నాయుడు, షట్టర్ భాషా, బర్రి కామేశ్వరరావు, రామరాజు, మోహన్‌బాబు, గపూర్, సత్యం వెంకటరమణ, ముత్యాల జాన్, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, కురుమళ్ల ఆంజనేయులు, బోడపాటి సత్యనారాయణ, బోడపాటి మూర్తి, బొబ్బిలి భాస్కరరావు, అయితిరెడ్డి అయ్యప్ప పాల్గొన్నారు. కాటన్ ఆశయాలకు తూట్లు పొడవద్దు వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధవళేశ్వరం : సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి తరలించి కాటన్ ఆశయాలకు తూట్లు పొడవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. ధవళేశ్వరం నుంచి సెంట్రల్ డివిజన్కార్యాలయాన్ని తరలిస్తే సహించేది లేదన్నారు. వందేళ్ల క్రితం కాటన్ నెలకొల్పిన కార్యాలయాలను వేరేచోటకు తరలించి ఆయన అపార అనుభవాన్ని అవమానించవద్దని జక్కంపూడి విజయలక్ష్మీ పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగింది కోనసీమలోనే అన్నారు. రైతాంగానికి మేలు చేసే చర్యలు చేపట్టకుండా ఉన్న వాటిని తూట్లు పొడవడం దారుణమన్నారు. సెంట్రల్ డివిజన్ ఈఈ కోనసీమలోని డెల్టా రైతాంగానికి క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. అటు డెల్టా రైతాంగానికి ఇటు మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. కనీసం కార్యాలయ సిబ్బందికి కూడా తెలయకుండా కార్యాలయ మార్పుకు ప్రయత్నించడం ఏమిటని జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారుల తీరు ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏ విధమైన జీవో రానప్పటికీ 1988 నాటి జీవోను తెరమీదకు తీసుకురావడం వెనుక ఇరిగేషన్ అధికారలు అత్యుత్సాహం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల మెప్పుకోసం రైతులను ,ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయవద్దని జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు.