ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
కడలిలోకి 10.33 లక్షల కూసెక్కులు
సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురి సౌత్: కాటన్ బ్యారేజీ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. ఇక్కడ శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం రాత్రి 7 గంటలకు మరింత తగ్గుతూ నీటిమట్టం 12.10 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,33,672 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు.
ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద శనివారం పూర్తిగా ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించే అవకాశమున్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32.440 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 9.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.40 అడుగులకు చేరుకుంది.
తేరుకుంటున్న కోనసీమ లంకలు
మరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ లంకలు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. కానీ, జిల్లాలో ప్రధాన కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి.దీంతో ఆయా ప్రాంతాల లంకవాసులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, శనివారం ఉదయం ముంపు మరింత తగ్గే అవకాశమున్నందున ఆదివారం నుంచి లంక గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది.
శ్రీశైలానికీ తగ్గుతున్న వరద..
ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికీ ఎగువ నుంచి వచ్చే వరద తగ్గింది. ఇక్కడకు గురువారం నుంచి శుక్రవారం వరకు 1,25,938 క్యూసెక్కుల నీరు రాగా.. శ్రీశైలం నుంచి దిగువకు 1,20,367 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 211.457 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి వచ్చే నీటి చేరిక తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment