సాక్షి, అమరావతి: మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం..ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు వంటి ఉప నదులు పొంగిపొర్లుతుండటంతో గోదావరి కడలి వైపు పరుగులు పెడుతోంది. గడచిన 24 గంటల్లో 26.20 టీఎంసీల గోదావరి జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. మొత్తమ్మీద ఈ సీజన్‌లో ఇప్పటికే 61.646 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి.
గురువారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం ఆనకట్టకు ఉన్న 175 గేట్లను 0.70 మీటర్లు ఎత్తులేపి 3,06,840 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండంతో గోదావరి వరద ఉధృతి రెండు రోజుల పాటు ఇదేలా కొనసాగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
గోదావరి ఎగువన కాళేశ్వరం వద్ద నీటిమట్టం 7.18 మీటర్లు ఉండగా.. పేరూరు వద్ద 8.95 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 8.95 మీటర్లు, కూనవరం 10.22 మీటర్లు, కుంట వద్ద 5.40 మీటర్లు, కొయిదా వద్ద 13.22 మీటర్లు, పోలవరం వద్ద 8.91 మీటర్లు, రోడ్డు కం రైలు వంతెన వద్ద 14.33 మీటర్లకు చేరింది. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న తూర్పు డెల్టాకు సాగునీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రామగుండంకు సమీపంలోని ఎల్లంపల్లి జలాశయం ఎగువన వర్షాభావ పరిస్థితుల వల్ల గోదావరి వెలవెలబోతుండడం గమనార్హం.
ఆల్మట్టి జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు..
మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి జలాశయంలోకి కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. 63,465 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గురువారం నాటికి ఆల్మట్టిలో నీటి నిల్వ 69.8 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టికి దిగువన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో.. నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోకి జలాలు చేరడం లేదు. అయితే స్థానికంగా కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌లోకి 1,558 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ 312 టీఎంసీల నిల్వకు గానూ 133.37 టీఎంసీల నిల్వ ఉంది.
తుంగభద్రకు పెరుగుతున్న వరద..
తుంగభద్రలో వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారంతో పోల్చితే.. గురువారం వరద ప్రవాహం పెరిగింది. 49,796 క్యూసెక్కులు చేరడంతో తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 54.34 టీఎంసీలకు చేరుకుంది. మొత్తంగా గోదావరి దిగువన ఉప్పొంగుతుంటే.. ఎగువన వెలవెలబోతోంది. కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహంతో జీవకళ ఉట్టి పడుతుంటే.. దిగువన నీటి చుక్క జాడ లేక కళ తప్పింది.
మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి నెట్‌వర్క్: ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి నైరుతి వైపునకు వంగి ఉంది. వీట ప్రభావంతో ఇప్పటికే కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.
శుక్రవారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రపై చురుగ్గా ఉండడంతో దక్షిణ కోస్తాలో గంటకు 50–55, ఉత్తరకోస్తాలో 45–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో అలజడి ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
కాగా 19న ఉత్తర బంగాళాఖాతంలోనే మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో 7, భీమడోలులో 6, తణుకు, పాలకోడేరు, విజయవాడ, కైకలూరు, నూజివీడుల్లో 5, ప్రత్తిపాడు, ఏలూరు, తిరువూరు, అమలాపురం, భీమవరం, మాచెర్లల్లో 4సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కృష్ణా జిల్లా సగటు వర్షపాతం 29.3గా నమోదైంది. మచిలీపట్నం బస్టాండ్, జెడ్పీ సెంటర్లు జలమయమయ్యాయి. కైకలూరులో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పామర్రు బస్టాండ్‌లో నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పాపికొండల బోట్లు నిలిపివేత
వీఆర్‌పురం (రంపచోడవరం): పాపికొండల పర్యాటకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బోట్ యూనియన్ సభ్యులు ప్రకటించారు. గోదావరిలో భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో తామే బోట్లను నిలుపుదల చేసినట్టు తెలిపారు.
‘ముసురు’ పట్టిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాన్ని ముసురు కమ్మేసింది. నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కురుస్తూనే ఉంది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు సరాసరిన 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment